వచ్చిన తంటా అంతా ఎక్కడంటే........ - భమిడిపాటి ఫణిబాబు

vacchina tantaa anthaa ekkadante

 కొంతకాలం అంటే ఎప్పుడో ద్వాపరయుగమూ, త్రేతా యుగమూ కాదు, ఓ పదిహేనూ, ఇరవై ఏళ్ళ క్రితం, అంటే అవేవో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టేదాకా అన్న మాట, సాధారణ మానవుడికి ఓ “సంతృప్తి” అనేది ఉండేది. ఏదో చదువుకోవడం, పెళ్ళి చేసికుని, పిల్లలని కని, వారిని పెంచి పెద్దచేసి, ఓ ఇంటివారిని చేయగలిగి, అదే పనిలో ఓ కొంప కూడా సమకూర్చుకోగలిగితే, తన బాధ్యత నిర్వర్తించినట్టే అనుకుని సంతృప్తి పడేవాడు. ఉద్యోగంలోంచి రిటైరయిన తరువాత మనవలూ, మనవరాళ్ళతోనూ హాయిగా గడపడమే ఓ పరమావధిగా భావించి, రామా కృష్ణా అనుకుంటూ ఉండడమే జీవితానికి ఓ ultimate goal గా ఉండేది. దానికి సాయం, ఈ పనులన్నీ పూర్తిచేసికోలేనివారు, వీళ్ళని చూసి, “ మీకేమిటి మాస్టారూ.. హాయిగా గట్టెక్కేశారు..” అనడంకూడా చూసేవాళ్ళం. కానీ రోజులన్నీ ఒకలా ఉండవుగా...

కొత్తగా వచ్చిన ఆర్ధికసంస్కరణల ధర్మమా అని, కొన్నేమిటి, చాలా మార్పులే వచ్చాయి, మన జీవితాల్లో. ఆ మార్పులు మంచివా, చెడువా అని చెప్పడం, మనదృష్టికోణాన్ని బట్టి ఉంటుంది.  ఇదివరకటి రోజుల్లో మన వారికి  విదేశీ వస్తువుల మీద మోజులాటిది ఉన్నప్పటికీ, దేశంలో దొరికేవికావు. దానితో, ఎవరైనా విదేశాలకి వెళ్ళినప్పుడు వాళ్ళని కాకా పట్టి తెప్పించుకోవడమో లేదా ఏ స్మగ్లింగు వాళ్ళ దగ్గరో రసీదు లేకుండానో కొనుక్కోవాల్సొచ్చేది. ఈ Economic Reforms కారణంగా, ఏవస్తువైనా సరే, బయటి దేశాల్లో తయారయిన అతి కొద్ది కాలంలోనే మన దేశంలో కూడా లభించడం ప్రారంభం అయింది.ఏదో దొరకనంతకాలమూ ఉగ్గబట్టుకుని కూర్చున్న జనం, తీరా ఎక్కడ పడితే అక్కడే దొరకడంతో వాటితోనే లోకం అనుకోవడం మొదలెట్టారు. దానికి సాయం, కలర్ టీవీ ప్రసారాలూ, వాటితోపాటు శాటిలైట్  టీవీలూ, దానితోపాటు వ్యాపారప్రకటనలూ, ఇలా ఒకటేమిటి ప్రతీ విషయంలోనూ మన “ఇష్టాలు” కూడా మారిపోయాయి.

దీనికి సాయం అప్పటిదాకా “Customer satisfaction”  అన్న కంపెనీలన్నీ “ Customer Delight” లోకి మారిపోయాయి. వచ్చిన గొడవల్లా ఏమిటంటే, మనం కూడా అలాగే మారిపోయాము. కంపెనీలంటే వారి అభివృధ్ధికి ఏవేవో చెప్తారు. కానీ సామాన్య జనం కొద్దిగా ఆలోచించుకోవాలిగా. అయినా ఈరోజుల్లో ఆలోచించడానికి టైమెక్కడిదీ? వాడెవడో చెప్పాడు, ఫలానా వస్తువు మార్కెట్ లోకి వచ్చిందీ అని, మరు క్షణం ఆ వస్తువు మనింట్లో ఉండాల్సిందే. పనికొస్తుందా లేదా అన్నదానితో పనిలేదు ! ఉదాహరణకి ఇదివరకటిరోజుల్లో స్థోమతని బట్టి ఓ సైకిలో, ఓ స్కూటరో, ఓ మోటారు సైకిలో, లేదా ఓ “ మారుతి” కారో కొనుక్కునేవారు, దేనికీ- ఆఫీసుకి వెళ్ళడానికి. ఆమాత్రందానికి ఉపయోగిస్తే చాలు, రోజెళ్ళిపోయినట్టే. కానీ మార్కెట్ లో రోజురోజుకీ కొత్త కొత్త కారులూ, బైక్కులూ రావడం మొదలెట్టాయి. దానితోపాటే మన కోరికలూ పెరగడం మొదలయింది. వాడెవడిదగ్గరో లేటెస్ట్ వోక్స్ వాగనో, షెవర్లేయో,  ఇంకోటో ఉంది, మనదగ్గర కూడా అలాటిదో, ఇంకొంత మెరుగైనదో లేకపోతే, ఎంత తలవంపూ అనే ఓ భావన రావడం, మరి ఆ పాత కారు ఏంచేయడం అన్నదానికి, పోనిద్దూ పిల్లల స్కూలుకో, ఊళ్ళోనే ఉన్న తల్లితండ్రులకో ఉపయొగిస్తుంది లెద్దూ అనుకోవడం. అంతటితో ఆగుతుందా, భార్యగారి ఆఫీసుకి వెళ్ళడానికి ఇంకో కారు... అలా ఇదివరకటి రోజుల్లో ఒక్క కారుతో సరిపోయేది, ఇప్పుడు మూడు కార్లకి “ అవసరాలు” పెరిగేయి.

అలాగే ఇళ్ళ సంగతీనూ, అప్పటిదాకా రెండు బెడ్రూమ్ములు, హాలూ కిచెను లోనూ హాయిగా ఉండేవారు, ఇప్పుడు ఆ ఫ్లాట్ కాస్తా ఇరుకైపోయింది.ఏ నాలుగు బెడ్రూమ్ముల ఫ్లాట్టో బుక్ చేయడం. అలాగే టీవీ లూ, మిగిలిన ఎలక్ట్రానిక్ వస్తువులూనూ. వాడెవడికో 36” టివీ ఉంటే, మనింట్లో కనీసం 72” LED TV  ఉండాల్సిందే, ఇంకా అడిగితే ప్రతీ రూమ్ములోనూ ఒక్కో టీవీ, హొటళ్ళలోలాగ.

ఇంక మొబైలు ఫోన్లంటారా ఇంట్లో ఉండే ప్రతీవారికీ ఓ స్మార్టు ఫోను కంపల్సరీగా ఉండాల్సిందే, వీటికి సాయం అవేవో ఐపోడ్లూ అవీ సరదాగా ఉండాలే.

ఇంక బట్టల విషయం అడగక్కర్లేదు, ఏ వారాంతంలోనో ఏదో మాల్ కి వెళ్ళడం, కళ్ళకి ఏది నచ్చితే అది తీసికోవడం, వాటి అవసరం ఉందా లేదా అనేది అనవసరం.

ఇలా చెప్పుకుంటూ పోతే అంతెక్కడ? జీవితంలో “సంతృప్తి” అనేది అటకెక్కేసింది. ఎంత ఉన్నా, ఇంకేదో లేదనే భావం రావాలే కానీ, అది వచ్చినతరువాత దాంట్లోంచి బయటపడడం చాలా కష్టం. ఇంట్లో ఉండే పెద్దవారు పోనీ ఓసారి చెప్పిచూద్దామా అనుకున్నా, వారికీ తెలుసు వచ్చే సమాధానమేమిటో. ఎందుకొచ్చిన గొడవా అనుకుని వారు కూడా , నిశ్శబ్దంగా జరుగుతున్న మార్పులు చూస్తూ ఊరుకుంటారు.

వీటన్నిటికీ ముఖ్య కారణం, చేతికి వస్తూన్న డబ్బు. ఈరోజుల్లో పేకమిషన్ల ధర్మాన ప్రభుత్వోద్యోగులు కూడా బాగానే ఉంటున్నారు. ఐటీ రంగం అయితే అడగఖ్ఖర్లేదు.  అయినా ఇదివరకటిరోజులా ఏమిటీ, మార్కెట్ లో ఉండే ఏవస్తువైనా కొనాలనుకోవడం తరవాయి, “సులభ వాయిదాలపధ్ధతి” కి సంబంధించిన ఏ ఫైనాన్సు వాడో హాజరూ. లేకపోతే క్రెడిట్ కార్డులు ఉండనే ఉన్నాయి. ఇదివరకటి రోజుల్లో ఇంట్లోకి ఓ వస్తువు తేవాలంటే, కొన్ని సంవత్సరాలు పట్టేది, ఎందుకంటే ఏ బ్యాంకువాడూ అప్పిచ్చేవాడు కాదు.

ఈరోజుల్లో చేసే ప్రతీ ఖర్చుకీ ఒక explanation రెడీ గా ఉంటుంది. ప్రతీదీ ఒక “అవసరం” అయిపోయింది. ఒకానొకప్పటి “విలాస” వస్తువులు కాస్తా ఇప్పుడు “ అవసరాల” లోకి  మారిపోయాయి. అవిలేకపోతే జీవితమే దుర్భరం అయిపోయినట్టు మాట్టాడతారు. తల్లితండ్రులని చూసే వారి పిల్లలూనూ. కనీసం తల్లితండ్రులు చాలామంది దిగువ మధ్యతరగతినుండి వచ్చినవారే, ఎక్కడో అక్కడక్కడ తప్పించి, కానీ వారి పిల్లలమాటేమిటి, వాళ్ళు పుట్టడమే చేతిలో రిమోట్టూ, సెల్ ఫోనూ తో పుట్టారు, వీటికి సాయం  శలవలొచ్చాయంటే ఎక్కడికో అక్కడకి హాలిడే టూర్ లూ, మల్టీప్లెక్స్ లు తప్పించి, సినిమాలు చూసే ఓపిక లేదు,  విమానాల్లో తప్ప, ట్రైన్లలో ప్రయాణాలే తెలియదు, బస్సులంటారా అడగొద్దు. ఇలాటి “సుఖాలు” తమ పిల్లలకి ఇవ్వొద్దనడం లేదు, కన్న తరువాత ఇవ్వాలి. కానీ వాటికీ ఓ “హద్దు” ఉండాలి.  కానీ ఈ “విలాసాల” తో పాటుగా, “లేకపోవడం” కూడా అలవాటు చేయాలి. ఇదివరకటి రోజుల్లో ఉద్యోగాల్లో జీతాలంటే అంత ఎక్కువగా వచ్చేవి కాదు కానీ, ఉద్యోగానికి ఏమీ ధోకా ఉండేది కాదు. ముఫై ఏళ్ళయినా, నలభై ఏళ్ళయినా హాయిగా చేసికునేవారు, ఓ ప్లాన్ ప్రకారం పన్లన్నీ పూర్తిచేసికునేవారు.  ఈరోజుల్లో ఉద్యోగాలంటారా, తుమ్మితే ఊడిపోయే ముక్కు లాటివి, ఎంత సీనియర్ పొజిషన్ లో ఉన్నా, కంపెనీవాడు ఎప్పుడు “ పింక్ స్లిప్” ఇస్తాడో చెప్పలేని రోజులు. ఈరోజుల్లో ఎక్కడ చూసినా, “ ఏం చేస్తున్నారూ..” అంటే “ ప్రస్తుతం బెంచ్ మీద ఉన్నానండీ, కొత్త ప్రాజెక్టు ఎప్పుడు వస్తే అప్పుడు ఇస్తానన్నారండీ..” అనేవాళ్ళే. తెలివైనవారు కొత్త కంపెనీల్లో చేరుతున్నారు, అర్భకులు తాము అప్పుచేసి కొనుక్కున్న మూడో ఫ్లాట్ పదో అంతస్థునుండి దూకి ఆత్మహత్యలు చేసికుంటున్నారు. పోయినవాళ్ళెలాగూ పోయారు, సుఖపడ్డారు కానీ ఆ మిగిలిన కుటుంబ సభ్యుల మాటేమిటీ?  వీటన్నిటికీ మూల కారణం ఏమిటంటారు ? మన జీవితావసరాలు “  Satisfaction / Contentment” లోంచి “Delight” లోకి మారడం వలనే, ఔనంటారా కాదంటారా?

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి