గజల్స్ గాన కళాప్రపూర్ణుడు - టీవీయస్. శాస్త్రి

ghazal gaana kalaa prapoornudu ghazal srinivas

జల్ శ్రీనివాస్ గారి పేరు వినని వారుండరు. శ్రీనివాస్ అసలు పేరు కేశిరాజు శ్రీనివాస్.పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలోనైనా, పెరిగింది అంతా పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు ప్రాంతంలోనే! తెలుగులో గజల్స్ ను తన సొంత బాణీలో పాడుతూ, ఆ గానవాహినిని ప్రపంచమంతా ప్రవహింపచేసిన ఈ గంధర్వుడిని గురించిన కొన్ని విషయాలు గర్వంగా చెప్పుకుందాం!గర్వం ఎందుకంటే, ఇతను మన తెలుగుతల్లి ముద్దు బిడ్డ కావటం వల్ల. గాంధీయిజం మీద 125 ప్రపంచ భాషల్లో పాటలుపాడి అరుదైన లిమ్కాబుక్ రికార్డును సొంతం చేసుకున్నారు ఈ శ్రీనివాసుడు.

అంతకు ముందు రెండుసార్లు గిన్నిస్ బుక్ లో ఎక్కి దేశానికే వన్నెతెచ్చారు. తాతయ్య కేశిరాజు వెంకట నర్సింహం పంతులు స్వాతంత్య్ర సమరయోధులు. అందుచేత శ్రీనివాస్ చిన్నతనం నుంచే  క్రమశిక్షణలో పెరిగారు. వీరి తండ్రి నరసింహారావు గారు ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో తిరిగి పాలకొల్లులో స్థిరపడ్డారు. అమ్మ రత్నావళి గృహిణి. సత్యసాయి భక్తురాలు. శ్రీనివాస్ బాల్యంలో అమ్మతోపాటు నగర సంకీర్తనకు వెళ్లేవాడు. సెలవురోజుల్లో నారాయణసేవ చేసేవారు. యావత్ ప్రపంచాన్నే తన గజల్స్ తో ఉర్రూతలూగిస్తూ ఆ గజల్స్ నే ఇంటిపేరుగా మలుచుకున్న ఘనుడు గజల్ శ్రీనివాస్. సంగీత, సాహిత్యాలపై పెద్దగా అవగాహనలేని మధ్యతరగతి కుటుంబం వీరిది . భీమవరంలో కొద్దిరోజులు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. తండ్రి బదిలీల కారణంగా ఎక్కడా పూర్తిగా నేర్చుకునే అవకాశం లభించలేదు. పాఠశాలలో, కాలేజీలో పాటల పోటీల్లో పాల్గొనేవాడు .బాల్యం చదువులు పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం, పాలకొల్లులోనే సాగాయి. ఆంధ్రావిశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ శాస్త్రంలో బి.ఏ.చేసి ఆ తర్వాత మద్రాస్ యూనివర్సిటీ ద్వారా లైబ్రేరియన్ గా కోర్సు పూర్తిచేసారు. పదిసంవత్సరాలపాటు భీమవరం, కోరుకొండ విద్యాలయాలలో లైబ్రేరియన్ గా పనిచేసారు. సినిమా పాటలు పాడి అనేక బహుమతులు గెలుచుకున్నాడు. కానీ, అది ఆయన మనస్సుకు తృప్తి నివ్వలేదు.

అనుకరణం, అనుసరణం అనేవి లేకుండా తనదైన ముద్ర వేసుకోవడానికి వాటిని ఆటంకంగా గుర్తించాడు. కొత్తదనం కోసం పరితపించాడు . సినిమా పాటలు పాడటం మానేసాడు. అదే సమయంలో డాక్టర్ సి. నారాయణరెడ్డి గారు రచించి, గానం చేసిన గజల్స్ విన్నాడు. ఆ ప్రేరణతో 1986లో మొదటిసారిగా ఆయన రాసిన గజల్స్ ను పాడాడు. కంజీరా సహాయంతో గజల్ పాడుతుంటే శ్రోతల హర్షధ్వానాలు మిన్నుముట్టేవి . గజల్ ను తెలుగుపాటగా, సాహితీప్రక్రియగా మార్చడం సంగీత ప్రియులు కూడా స్వాగతించారు, ఆదరించారు, అభినందించారు. ఆయన అభిమానించే జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డిగారితో 1993లో పరిచయమయ్యింది. శ్రీనివాస్ పాడే శైలి గమనించిన ఆయన శ్రీనివాస్ శైలికి అనుగుణంగా గజల్స్ రాయడం శ్రీనివాస్ కు ఎంతో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. అంతే కాకుండా పదాలను ఎలా పలకాలో, భావవ్యక్తీకరణ ఎలా ఉండాలో నేర్పించారు నారాయణరెడ్డి గారు. విజయనగరంలో 1995లో జరిగిన బహిరంగసభలో సినారె ఈయనను తన మానసపుత్రుడిగా ప్రకటించడం శ్రీనివాస్ కు నోబెల్ బహుమతి అందుకున్నంత ఆనందాన్ని ఇచ్చింది. గజల్ ప్రక్రియకు గుర్తింపు తీసుకురావడంతో పాటు 200లకు పైగా గజల్స్ రాసి, అందులో కొన్నింటిని గానం చేసిన ఆయన  అభినందించడం, గజల్ గాన ప్రక్రియకు ఆద్యుడిగా పేర్కొనడం  ఆయనకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తన మాతృమూర్తి పుట్టినరోజు (ఫిబ్రవరి3)న ఆమె ముందు ఉంటాడు ఈయన.

జన్మనిచ్చిన తల్లి జన్మించిన రోజే పండుగ రోజు ఆయనకు. తల్లిని  మించిన దైవం, సొంతఊరును మించిన స్వర్గం, భార్యను మించిన స్నేహితుడు, బిడ్డలను మించిన అనుబంధం, వినయాన్ని మించిన కృతజ్ఞత వేరెక్కడా ఉండవని చాలా గొప్పగా చెబుతుంటారు ఈయన. ఆయన సాధించిన విజయంలో భార్య భాగస్వామి అని భావించి, ఆయన సాధించిన మూడు గిన్నిస్ రికార్డులను ఆమెకు అంకితమిచ్చాడు. ఆయన వారసురాలి పేరు సంస్కృతి. ఈ చిరుత పాడిన ఒక ఆల్బం కూడా ఈ మధ్యనే విడుదలయ్యింది. ఆదినుంచీ శ్రీనివాస్ కు మన సంస్కృతి, సంప్రదాయాలంటే ప్రాణం. అందునా గాంధీ సిద్ధాంతాలంటే ఆయనకు ఎనలేని ప్రాణం. అందుకే ఆయన పాటల్లో ఎక్కువగా మన సంస్కృతి, సాంప్రదాయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే దేశవిదేశాలలో కలిపి ఆరువేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. కంజీరాను చేతపట్టుకుని లయబద్దంగా దరువేస్తుంటే శ్రోతలు మైమరచిపోయేవారు. తానే సొంతంగా బాణీలు సమకూర్చి అనేక పాటలు పాడారు. చెవులకి ఇంపయినది ఏదయినా సంగీతమే అంటారు ఆయన. అందుకే శ్రీనివాస్ గారు, “పాట కర్ణపేయంగా ఉండి సామాన్యునికి అర్ధమయ్యేలా ఉండాలి” అంటారు.

బాపూజీ సిద్ధాంతాలపై తెలుగు, ఆంగ్లంతో పాటు మొత్తం 56 భారతీయ భాషల్లోనూ, 44 విదేశీ భాషల్లోనూ అదే గేయాన్ని, అదే స్వరంతో గానంచేసి దిగ్విజయంగా ముగించారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం రికార్డు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు కూడా పంపారు. గజల్ శ్రీనివాస్ ఒక్కొక్క భాషలో ప్రముఖులైన గేయ రచయితల చేత ఈ గేయాన్ని రాయించుకుని ఆ భాషకు గల సహజత్వం కోల్పోకుండా అన్నింటినీ ఒకే స్వరంలో పాడి చూపించారు శ్రీనివాస్. గజల్ ప్రక్రియను మరింత విసృత్తం చేయడానికి గజల్ ఛారిటబుల్ ట్రస్ట్ ను 2005లో ప్రారంభించారు. ఆయన గజల్స్ ఒక స్థాయివారికే పరిమితమని చాలామంది విమర్శించారు. నిజమే! మమతానుబంధాల విలువలు చెప్పే ఆయన పాటలు అక్షరాస్యులై విలువలు మరిచిపోతున్న వారికే! సమాజంలో మార్పు తీసుకువచ్చేలా,సందేశాత్మకంగా ఉండేలా గజల్స్ ఉండాలన్నదే ఆయన ఆశ,ఆశయం. గుర్తింపు కోసం ఇన్నాళ్లు గజల్స్ పాడిన ఆయన  ఇప్పుడు మార్పుకోసం గజల్స్ పాడుతున్నానని అంటారు.ఆయన జీవితాశయాలను ఆయన మాటల్లోనే విందాం! " కీర్తిని, సంపదను,కోట్లాదిమంది అభిమానాన్ని, అనేక పదవులను గజల్ నాకు ఇచ్చింది. వేలాది సంవత్సరాల చరిత్రగల తెలుగు సాహిత్య వనంలో గజల్ మరుపురాని, మధురమైన భావంగా నిలిచిపోయేలా మ్యూజియం ఏర్పాటుచేస్తాను.

ఇప్పటివరకు గజల్ ప్రాచుర్యం కోసం కృషి చేసిన వారి జీవిత విశేషాలు, వారు రచించిన గజల్స్,పుస్తకాలు అన్నీ ఇక్కడ ఉంటాయి. రానున్న శతాబ్దాల్లో పరిశోధనాలయంగా ఇది ఉంటుంది.మన సంస్కృతిని, ధర్మాన్ని మనం మరచిపోతున్నాం. అవి గుర్తుకు చేయడానికే ఇప్పుడు దేవాలయాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నాను. ఆలయానికి పాపభీతితోనే వెళతారు అన్న భావన చాలా మందిలో ఉంది. ఇది చాలా తప్పు. అమ్మ ఒడిలోనూ.. బడిలోనూ నేర్చుకున్న విధంగానే గుడిలోనూ అనేక విషయాలను మనం నేర్చుకుంటాం. క్రమశిక్షణ, సేవాభావం, నైతికత, మానవత ఇలా అనేక అంశాలు గుడిలో నేర్చుకుంటాం. అందుకే ప్రతిఒక్కరూ గుడికి విధిగా వెళ్లాలి. మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను తీసుకోవాలి. ఆలయవాణి వెబ్ రేడియో ద్వారా సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతి, ఆలయాల పరిరక్షణ, గోపూజ, పర్యావరణం వంటి అనేక కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నాం. కృష్ణాష్టమిని గోపూజ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వానికి ఒక వినతిపత్రం ఇచ్చాం. అంతే కాకుండా స్వచ్ఛంద సంస్థలు బీడువారిన దేవాదాయ భూముల్లో వట్టిపోయిన ఆవులతో గోశాలలు ఏర్పాటుచేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతున్నాం. దేవాదాయ భూముల వివరాలు కంప్యూటరైజేషన్ చేయడంతో పాటు వందలాది సంవత్సరాల చరిత్రగల ఆలయసంపదను పరిరక్షించుకోవాలని ఎన్ఆర్ఐలను కోరుతున్నాం.

ప్రభుత్వ, ఎన్ఆర్ఐల సహాయంతో అనేక దేవాలయాలను పరిరక్షించే చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ సహకారంలో ఎన్నో ఆలయాలను పరిరక్షించే బాధ్యతను తీసుకుంటున్నాం. వకుళమాత దేవాలయాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం." తన గజల్ గానంతో సాంస్కృతిక రాయబారిగా మారిన ఈ గాన గంధర్వుడు ఈ మధ్యనే ఆఫ్ఘనిస్తాన్ లో శాంతియాత్ర చేసారు. మైవాండ్ బ్యాంకు అఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఆహ్వానం మేరకు 25 ఏప్రిల్ నుండి1మే వరకు ఆ దేశంలో శాంతియాత్ర చేసి,ఆ యాత్రలో భాగంగా ఆయన రూపొందించిన ఉర్దూ గజల్ ఆల్బం "రుబరు"( ముఖాముఖీ ) ను ఒక కరుడుకట్టిన మాజీ తాలిబాన్ చేత ఆవిష్కరింపచేసారు. సదాశయాలతో ముందుకు వెళుతున్న ఈ గజల్ గాన గంధర్వుడు అన్నివిధాలా అభినందనీయుడు!


 

 

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి