సాహితీవనం - వేంకట వరప్రసాదరావు

saahiteevanam
అల్లసాని పెద్దన విరచిత 'స్వారోచిషమనుసంభవము'

(గతసంచిక తరువాయి)

ఎగుచుకూఁతలు ముట్టె యెత్తి బి ట్టాలించి / గమికిఁ గన్నాకయి గాలి యరయు   
వడిఁ గుక్క లంటంగ వచ్చిన మెడ ద్రిప్పి / ఘుర్ఘురించుచు బయల కొమ్ముఁ జిమ్ము 
దారసించినచోట దారునఁ జొరఁ బాఱి / యొకటి రెంటిని దొబ్బ లురల నడుచుఁ 
బాలచేరులు వట్టి తూలింప బలిమి నీ / డ్చుకొని డొంకలఁ దూఱి చుట్లఁ బెట్టు

నీఁటె పోటులఁ బడి ప్రేవు లీఁదులాడఁ
బోయి పోలేక దగ దొట్టి పొదలు సొచ్చి 
బెండువడియును జొరనీదు పీఁటవెట్టి 
చూపులనె యేర్చుఁ బ్రజ నొక్క సూకరంబు 
 
ఇక అరణ్యంలోకి ప్రవేశించి వేట ప్రారంభించాడు స్వరోచి. ఒక పెను అడవిపంది కూతలు పెట్టి ముట్టె యెత్తి గాలిని వాసనచూసి, పరికించి చూసి, వేగంగా వచ్చి పడిన జాగిలాలను చూసి మెడలు త్రిప్పుతూ ఘుర్ఘురించి ముట్టెతో మట్టిని గడ్డిని చిమ్మింది. అకస్మాత్తుగా జాగిలాలు ఎదురైనప్పుడు తుప్పల్లోకి దూరినట్టే దూరి వెనుదిరిగి ఒకటి రెంటిని కుమ్మేసింది. కట్టెయ్యడానికి గొలుసులు, వలలు పట్టి చుట్టుముట్టి పడేస్తే డొంకలలోకి దూరి చుట్లు కొట్టి తిప్పింది.  చుట్టూ క్రమ్ముకొని ఈటెలతో పొడిచి పడేస్తే పేగులు వ్రేళ్ళాడుతుండగా పోలేక పోలేక పొదల్లోకి పోయి, భయంకరంగా కోరలుచూపిస్తూ అరుస్తూ పొదల్లోకి ఎవరూ జొరకుండా భయకంపితులను చేసేట్లు చూపులతోనే వేటగాళ్ళను బెదిరించింది.    
 
హరిణం బొక్కటి కుక్కతండముఁ బుళిం దానీకముం ద్రోచి యు
ర్వరఁ గా లూఁదక దాఁట నేటలవికిన్ వాహంబు నడ్డంబు నూఁ 
కి రసావల్లభుఁ డేసె  భల్లమును నింగిం గాళ్ళు జోడించుచో 
గొరిజల్ నాలుగుఁద్రెవ్వ సేన వొగడెం గోదండ పాండిత్యమున్   
 
జింక ఒకటి వేటకుక్కలను, వేటగాళ్ళను చూసి కాళ్ళు నేలకు తాకకుండా వేగంగా గెంతుతూ పారిపోతుంటే రాజు  ఒక పెను బాణమును ప్రయోగించి ఆకాశంలో నాలుగు కాళ్ళూ గిట్టలు తెగేట్లు వేయగా, వేటగాళ్ళ సేన అతని కోదండ పాండిత్యాన్ని గొప్పగా పొగిడింది. ఇక్కడ పెద్దన పరిశీలనా శక్తికి, చిన్నదే అయినా గొప్ప ఉదాహరణం దొరుకుతుంది. చెంగు చెంగున గంతులు వేస్తూ ఇంచుమించు గాలిలో ఎగురుతూ గంతులేస్తూ జింకలు  పరుగెడుతున్నప్పుడు గాలిలో ఉన్నప్పుడు నాలుగు కాళ్ళూ ఒక్కదగ్గరే ఉంటాయి, నేలమీద దూకి మరలా నాలుగు కాళ్ళమీద ఎగురుతుంది. గాలిలో ఉండగానే ఒకే బాణంతో నాలుగు కాళ్ళనూ ఖండించాడు స్వరోచి!
 
గవిలో బెబ్బులి డాఁగి గుడ్లు మెఱమంగాఁ గాంచి రా జేసె నే
య వడిన్ బాణము వెంటనే నిగిడి పైక ట్లేచి రా నేసె రెం
డవకాండంబుఁ దదస్త్రముం గొనక డాయన్ వచ్చి కౌక్షేయక
ప్రవిభిన్నం బయి నేలఁ గూలెఁ బవిధారాభిన్న శైలాక్రుతిన్
 
ఒక గుహలో దాగిన బెబ్బులి కనులు మెరుస్తుండగా దాన్ని గమనించిన రాజు ఒక బాణంతో కొట్టాడు దాన్ని.ఆ దెబ్బతగిలి అది రోషంతో భీకరంగా కుప్పించి పైకిలేచి మీదికి వస్తుండగా రెండవ బాణం వేశాడు. ఆ బాణం కూడా తగిలినా అలాగే ఎగురుతూ, సమీపించి, పొట్ట చీలి, వజ్రాయుధం తాకిడికి నేలకూలిన మహాపర్వతంలాగా కూలిపోయింది అది. యిలా విజ్రుమ్భించి క్రూరమృగాలను, పక్షులను వేటాడుతూ తన వేటగాళ్ళ బృందంతో కార్చిచ్చులాగా స్వరోచి చెలరేగుతున్న వేళలో ఉన్నట్టుండి అనేక అశుభ సూచనలు కనిపించాయి.ఉన్నట్టుండి అంతలోనే ఆకాశం రక్తవర్ణమును సంతరించుకుంది. దిక్కులు నల్లబారాయి. ఆకాశంలో మాలకాకుల గుంపులు చేరి అరవడం ప్రారంభించాయి. నక్కల ఊళలు వినిపించాయి. అంతటా పెద్ద ధూళి చెలరేగి సుడిగాలితో బ్రహ్మాండమంతా తల్లడిల్లిపోయింది.
 
ఆ కొఱగాములఁ గనుఁగొని
శాకునికుం డొకఁడు లేచి సంభ్రమ మొదవన్  
జ్యాకలిత శరాసనుఁడై
వీఁకను సైనికులఁ దిట్టి విభునితో ననియెన్ 
 
ఆ నష్టసూచకమైన అపశకునాలను చూసి, శకునములను చూడడం కోసం ప్రభువు నియమించుకున్న వాడు ఒకడు సంభ్రమంగా లేచి, రెచ్చిపోతున్న సైనికులను కోపంగా తిడుతూ రాజుతో యిలా అన్నాడు.
 
తఱచుగ మెకములఁ బొరిగొను 
మఱపున వచ్చితిమి, దవ్వు మనపొల మిట, కి
త్తఱి నగునిమిత్తములు నృప!
కొఱగా, విదె మనకుఁ బెద్ద గొడవగు ననినన్ 
 
తరచుగా ఎక్కువగా జంతువులు లభిస్తున్నాయని చాలా దూరం అడవిలోకి వచ్చేశాము ప్రభూ! మనము నశించిపోయే అపశకునములు కనబడుతున్నాయి. మనకేదో పెద్ద ఉపద్రవం, పెద్ద గొడవ వచ్చిపడేట్లుంది అన్నాడు. వివిధ ఆయుధాలను, వాడియైన బాణములను ధరించినవాడు, మహా అశ్వమును అధిరోహించినవాడు, నలుదిక్కులకు ప్రకాశవంతంగా కరుణ నిండిన చూపులను, మహాతేజస్సును వెలయించే ప్రభావశాలి ఐన స్వరోచి తన పుళింద భట సమూహంతో ప్రమథగణములతో ప్రచండ శివునిలా వెలుగొందుతూ తాను కొన్ని శుభశకునములను చూశాడు. ఈ శుభ, అశుభ సూచనలను గమనించిన సర్వజ్ఞుడు ఐన స్వరోచి, 'ప్రాణరక్షణ చేసికొనడం సంభవిస్తుందో లేదో అనేంత మహా యుద్ధక్షోభము కలుగనున్నది, ఐనప్పటికీ చివరకు అంతులేని జయమంగళములు కలుగుతాయి' అని మనసులో 
నిశ్చయించుకున్నాడు!
 
 
 

 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి