నేదురుమల్లితో - -

nedurumallito zedplus prayaanam
ఫిబ్రవరి 2011 లో శ్రీ వెంకయ్య నాయుడు గారి ఆహ్వానం మీద డా గజల్ శ్రీనివాస్ గారు, నేను కలిసి నెల్లూరు బయలుదేరాం. అక్కడున్న వారి స్వర్ణభారత్ ట్రస్ట్ కు సంబంధించి ఒక కార్యక్రమానికి హాజరుకావాలి. ఉదయాన్నే హైదరాబాదు నుంచి తిరుపతికి ఫ్లైట్ లో వెళ్ళి, అక్కడినుంచి వెంకయ్యనాయుడు గారు పంపే కారులో నెల్లూరు చేరుకోవలసి ఉంది. అయితే అనుకోకుండా ఫ్లైట్ ఎక్కిన కాసేపటికి ప్లాన్ మారింది. కారణం మా వెనుక సీట్లో మాజీ ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్దన రెడ్డి గారు వారి సహచరులతో కలిసి ఉండడం. గజల్ శ్రీనివాస్ గారికి శ్రీ నేదురుమల్లి గారితో ఉన్న చిరకాల అనుబంధం వల్ల కబుర్లు మొదలయ్యాయి. నన్ను కూడా వారికి పరిచయం చేసారు గజల్ శ్రీనివాస్. కవులన్నా, గాయకులన్నా జనార్దన రెడ్డి గారికి ప్రత్యేక అభిమానం, గౌరవం అని నాకు కాసేపటికే అర్థమయ్యింది. మా ప్రోగ్రాం మొత్తం తెలుసుకున్న రెడ్డి గారు, "నాయుడు గారి కారుని వాకాడు పొమ్మని చెప్పేది. మన కాన్వాయ్ ఉళ్లా...కలిసి పోదాం. వాకాడు నుంచి నెల్లూరు మీ ప్రయాణం. నాయుడు గారికి నేను చెప్తా", అన్నారు తమదైన స్వచ్చమైన నెల్లూరు యాసలో.

గతంలో నక్సలైట్లు ఒకసారి నేదురుమల్లిపై మందుపాతర దాడి చేయడంతో ప్రభుత్వం వీరికి "జెడ్ ప్లస్" సెక్యూరిటీ ఎర్పాటు చేసింది. దాని గురించి నేను వినడమే తప్ప పెద్దగా తెలీదు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఆగకుండా వెళ్లే ముఖ్యమంత్రుల కాన్వాయ్ లు చూసాను కాని, అందులో ఎక్కి ప్రయాణం చేసే అవకాసం వస్తుందని కూడా అనుకోలేదు. 
 
ఫ్లైట్ దిగిన వెంటనే ఎయిర్ పోర్ట్ లోపలే కాన్వాయ్ ఉంది. వరుసగా ఒకే రకం కార్లు, కమాండోలు, పోలీసులు...ఇలా దాదాపు 30 నుంచి 40 మంది సాయుధులై ఉన్నారు. ఒక్క రోజు ప్రయాణమే కనుక మా వద్ద లగేజ్ ఏమీ లేదు. జనార్దన రెడ్డిగారు ఎక్కమని సైగ చేయగానే ఎక్కేసాం. ఎక్కాక తెలిసింది అది బులెట్ ప్రూఫ్ కార్ అని. ముందు డ్రైవర్ పక్కన జనార్దన రెడ్డి గారు, ఆయన వెనుక గజల్ శ్రీనివాస్ గారు, వారి పక్కన నేను, ఇక మా వెనుక ఇద్దరు సాయుధులైన కమెండోలు. ముందెన్ని కార్లున్నాయో, వెనుక ఎన్నున్నాయో సరిగ్గా లెక్కపెట్టలేదు. వాకీ టాకీల్లో కమెండోలు ఒకరికొకరు సంకేతాలు అందజేసుకున్నారు. అన్ని కార్లూ ఒకేసారి బయలుదేరాయి. వెంటనే వేగం అందుకున్నాయి. ట్రాఫిక్ నిలవాల్సిన చోట నిలిచిపోయింది. రోడ్లపై అక్కడక్కడ ఉన్న పోలీసులు సల్యూట్లు కొడుతున్నారు. హైవే మీద టోల్ గేటు వస్తే ఆగకుండా వెళ్ళిపోవడానికి పక్కనుంచి దారి ఉంది. ఏ  మాత్రం వేగం తగ్గకుండా మహారాజ దర్పంతో కార్లన్నీ పరుగెడుతున్నాయి. 
 
ఇదంతా చూస్తూనే నేదురుమల్లిగారు చెప్పే కబుర్లు వింటున్నాం. వారి బాల్యం, వారి రాజకీయ ప్రవేశం, ముఖ్యమంత్రిగా చేసిన పనులు ఇలా ఎన్నో నెమరు వేసుకున్నారు. శ్రీనివాస్ గారిని అడిగి మరీ గజల్స్ పాడించుకుని విని ఆస్వాదించారు. ఇలా మాట్లాడుకుంటుండగా గతంలో నక్సల్స్ మందుపాతర పెట్టిన ప్రదేశం వచ్చింది. అక్కడ ఆపమన్నారు. కమెండోలు మళ్లీ ఒకళ్లతో ఒకరు సంప్రదించుకుని కాన్వాయ్ ని సరిగ్గా ఆ ప్రదేశంలో ఆపారు. ముందుగా కమెండోలు దిగి అందరూ నాలుగు దిక్కుల్లోను పొజిషన్స్ తీసుకున్నారు. వాళ్లు పోలీసులకి సిగ్నల్స్ ఇచ్చాక, పోలీసు ఆఫీసర్స్ మా కారు వద్దకు వచ్చి డోర్ తీసారు. జనార్దన రెడ్డిగారు ఆ సంఘటనని వివరిస్తూ ఆ ప్రదేశాన్ని చూపించారు. 
 

మళ్లీ బయలుదేరాం. వాకాడ చేరాం. అక్కడ నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారిని కలిసాం. జనార్దన రెడ్డిగారు కట్టించిన కాలేజీని దగ్గరుండి చూపించారు. కాసేపక్కడ ఉండి అల్పాహారం వగైరాలు అక్కడే పూర్తయ్యాక వెంకయ్య నాయుడు గారు పంపిన కారులో నెల్లూరు వెళ్లాం.

నేడు నేదురుమల్లి జనార్దన రెడ్డి గారి శరీరం విడిచారన్న వార్త వినగానే ఈ సంఘటనంతా కళ్ల ముందు తిరిగింది. వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.  

-సిరాశ్రీ

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి