మనం పిల్లలు అల్లరి చేస్తే పిల్లల్ని తిడతాం. నిజానికి పిల్లలుగా వున్నప్పుడు కాకుండా పెద్దయ్యాకా చేస్తారా? అలా అని అల్లరి చెయ్యకుండా కూర్చుంటే "ఏమైందమ్మా..." అంటూ పలకరిస్తాం. నిజానికి వాళ్ళు అల్లరి చేస్తేనే మనకి సరదా!
ఏ వయస్సులో చెయ్యాల్సింది ఆ వయసులో చేస్తేనే బాగుంటుంది. వయసున్నప్పుడే జీవితాన్ని అనుభవించాలి. 'ఆదా' చేసుకుని రిటైరయ్యాకా ఎంజాయ్ చేద్దామనుకుంటే ఆరోగ్యం సహకరించక మనం తినాలనుకున్నది తినలేము. తిరగాలనుకున్నా తిరగలేము. నేను ఇలా వుండుండాల్సింది... అలా వుండుండాల్సింది... అనుకున్నా ప్రయోజనం వుండదు. ఎందుకంటే వయసు తిరిగిరాదు.
నేను మొన్న గోవా వెళ్తున్నప్పుడొక 60-70 సంవత్సరాల అతను పెద్దటోపీ, జీన్స్ ఫ్యాంట్, పూల చొక్కా, నల్లకళ్ళద్దాలతో ఫ్లైట్ ఎక్కితే అందరూ అతన్నే చూస్తున్నారు. కొందరు చెవులు గొళుక్కుంటూ నవ్వుకోవటం గమనించాను. పాపం ఆయన వయసులో తీరని కోరిక ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. తప్పేంటి? అనిపించింది.
వయసు మనిషికి వుండొచ్చు.. కానీ మనసుకి లేదని నా అభిప్రాయం!