నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!
______________________________________________________________________
ఫ్లోరిడాలోని పొంపాన్ బీచ్ లోని రాయ్ వేలీ దగ్గరకి ఓ ముసుగు దొంగ వచ్చి తుపాకీ చూపించి, అతని బంగారు వాచీని, అలారం క్లాక్ ని, టీవీ, రేడియోలని , స్టీరియోని 30 డాలర్ల నగదుని దోచుకెళ్ళాడు. విచిత్రం ఏమిటంటే రాయ్ వేలీ ఉన్నది జైల్లోని సెల్ లో! అతని మంచి ప్రవర్తన వల్ల ఆ వస్తువులని ఉంచుకోవడానికి జైలు సూపరిండెంట్ బేరీ అహింగర్ రాయ్ కి అనుమతి ఇచ్చాడు. రెండు నెలల క్రితం ఆ జైలు నుంచి విడుదలైన ఇంకో దొంగ పని అది అని వేలిముద్రలని బట్టి తేలింది.
సిసిలీ లోని పాలెర్మో అనే ఊరికి చెందిన ఎర్నెస్టో కారునుంచి ఎయిర్ ఫ్రెషనర్స్ వాసన దంచేస్తుంటే, బ్రిటన్ లోని డోవర్ లో ఆగిన ఆ కారుని అనుమానంగా వెదికారు కస్టంస్ అధికారులు. లక్షనర్నీర పౌండ్ల విలువచేసే డ్రగ్స్ ఆ కారులో వాళ్ళకి దొరికాయి. వాసన చూసి వాటిని పట్టుకునే కుక్కలకి దొరక్కూడదని ఎర్నెస్టో కారునిండా ఎయిర్ ఫ్రెషనర్లని వుంచుకున్నాడట!