సాహితీవనం - వేంకట వరప్రసాదరావు

saahiteevanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిషమనుసంభవము
( గతసంచిక తరువాయి )


నుచరిత్రముగా ప్రసిద్ధమైన స్వారోచిష మనుసంభవము నిజానికి పెద్దన స్వీయకల్పితమైన గాథ కాదు అనేది తెలిసినదే, యిది స్వతంత్ర గాథ కాదు. కానీ అడుగడుగునా తన స్వతంత్ర కల్పన, వర్ణన, వ్యుత్పత్తులతో స్వతంత్ర గాథకన్నా ఎక్కువ ప్రసిద్ధంగా, ప్రశస్తంగా తీర్చిదిద్దాడు. కొన్నిచోట్ల అంతర్లీనముగా అద్భుతమైన సాహిత్య, ఆధ్యాత్మిక రహస్యాలను పొదిగాడు. వాటిని అక్కడక్కడ సమయానుకూలముగా మనము చర్చించుకుంటున్నాము.

ప్రస్తుత సందర్భములో శకునాలను చూసే ఒక పండితుని సూచన విన్నతర్వాత స్వరోచి కూడా కొన్ని సూచనలను గమనించాడు అని సూచించి, చివరికి తన స్వీయ ఆలోచనా పరిణతితో చివరికి ఏదైనా మంచే జరుగుతుంది అని 'ఊరడిల్లాడు' అని అద్భుతమైన ఒక ధీరనాయక లక్షణాన్ని ఆరోపించాడు స్వరోచికి. యిదే పాజిటివ్ థింకింగ్ అని ఆధునిక పరిభాషలో చెప్పుకునే ఆశావహ ఆలోచనా విధానము. భారతదేశాన్ని ఏలిన మహాచక్రవర్తులలో ఒకడైన హర్షుడి సోదరుడిని, బావను (సోదరి భర్త) చంపి, ఆతని సోదరిని సామాన్య ఖైదీగా అవమానకరముగా ఖైదు చేసిన గౌడ రాజుపై దండయాత్రకు బయలుదేరినపుడు హర్షుడి రాజముద్రిక జారి క్రిందపడిపోయింది. మంత్రులు, పురోహితులు, సేనాధిపతులు అందరూ 'యిది అపసూచకం' అని భయపెట్టారు. కానీ హర్షుడు చిరునవ్వు నవ్వి ' నేలతల్లి నా రాజముద్రికను ముద్దాడింది, అంటే ఆశీర్వదించింది, అంటే ఈ రాజముద్రికకు ఈ నేల అంతా వశమవుతుంది అని అర్ధం, సందేహించ పనిలేదు' అని దండయాత్రను కొనసాగించి తూర్పున బెంగాలు, ఉత్తరాన నేపాలు మొదలుకొని యిటు మగధవరకూ దాదాపు సగం భారత దేశాన్ని జయించాడు! యిక్కడ స్వరోచి కూడా ఆవిధముగానే ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాడు.

ఆవిపినాంతరమున 'హా!
హా! వనిత ననాథ నబల నార్త విపన్నం
గావరె, యీపుణ్యమునం
బోవరె' యని పలుకు నాఁడు మొఱ వినఁబడియెన్

అలా ముందుకు సాగుతున్న స్వరోచికి 'అయ్యో! స్త్రీని, అబలను, ఆర్తురాలిని, సంకట స్థితిలో ఉన్న నన్ను రక్షించండి, పుణ్యం కట్టుకోండి' అని ఎవరో స్త్రీ చేసిన హాహాకారాలు వినిపించాయి.

ఆమొఱ వేమఱుఁ జెవి నిడి
భూమండలభర్త కరుణ పొడమఁగ నయ్యో!
యేమానిని కెవ్వనిచే
నేమాయెనొ! యనుచు నచటు వీక్షించు తఱిన్

ఆ మొర పలుమార్లు చెవినబడి, ఆ భూమండల భర్త ఐన స్వరోచికి కరుణ పొంగింది. అయ్యో పాపం! ఏ స్త్రీకి ఏ ముష్కరుడివలన ఏ ఆపద వాటిల్లిందో కదా అని అక్కడ కలయజూశాడు. అలా చూస్తుండగా,

మట్టెల్ మ్రోయఁగ,గబ్బిచన్నుఁగవ కంపం బంద, వేణీభరం
బట్టిట్టై కటిఁ జిమ్మచీకటులు గా, నశ్రువ్రజం బోడిక
ల్గట్టం జూపులు చిమ్మిరేఁగి దివి రోలంబాళిఁ గల్పింపఁగా
మిట్టాడంగ నరుండు లేనియడవిన్ మీనాక్షి దీనాకృతిన్

కాలి అందియలు ధ్వనులుచేస్తుండగా, బరువైన వక్షోజములు కంపించిపోతుండగా, తలకట్టు చెదిరి నడుముమీద చీకట్లలాగా పరుచుకుంటూ ఉండగా, కంటినీరు ధారలై ప్రవహిస్తూ,  విలపిస్తూ, తుమ్మెదలబారులవంటి కంటిచూపులు భయంతో నలుదిశలా ప్రసరిస్తుండగా మనుషుల అలికిడి లేని ఆ అడవిలో ఒక చిన్నది, చాప కన్నులున్నది, దీనత్వము మూర్తీభవించినట్లున్నది కనబడింది. భయముతో, శోకముతో వడలిపోయి, మేనిసౌందర్యలక్ష్మి శోభ సడలిపోయి, వణుకుతూ రాజుముందుకు వచ్చింది. సన్నని మేలిముసుగు చాటునుండి మేలిమికాంతులు ప్రసరిస్తున్న వదనముతో, పాపిటిపై చేతులు జోడించి, పంచదారవంటి పలుకులు పలికింది. చక్కనమ్మ చిక్కినా అందమే, సన్నచీర నలిగినా అందమే కనుక, అంతటి దీనావస్థలో కూడా ఆ పడతి పలుకులు పంచదార పలుకుల్లా ఉన్నాయన్నాడు పెద్దన!

ఓ రాజన్యమహేంద్ర! యో మణిగణ ప్రోతాసివాతాశన
ప్రారజ్యత్కటిచక్ర! యో ముఖర శార్జ్గ క్రూర బాహార్గళా!
యో రుక్మాచలకల్ప! యో కవచిత వ్యూఢాంగ! కావంగదే
యో రాహుత్త శిరోమణీ! నిరవధి ప్రోద్యత్ప్రపారణీ!

ఓ రాజమహేంద్రా! మణులు తాపడంచేసిన ఖడ్గము కాలనాగులా నడుముకు వ్రేలాడుతున్నవాడా! క్రూరమైన, నిశితమైన బాణసమూహాన్ని, ధనుస్సునూ ధరించిన విశాలమైన బాహువులను కలిగినవాడా! ఓ (మహేంద్రగిరి) బంగారు కొండా! కఠినమైన కవచాన్ని ధరించిన యోధుడా! అశ్వికులలో మణివంటివాడా! క్షణకాలంలోనే ప్రతాపజ్వాలలను రగిలించే అరణి వంటివాడా! నన్ను రక్షించుమంటూ ఆ రమణి ప్రాధేయపడింది. భయంకరమైన యుద్ధము సంభవింపనున్నది అన్న శకునసూచనలను ప్రతిధ్వనిస్తూ, భయంకరమైన సంగ్రామానికి సర్వవిధాలా శక్తిమంతుడైన యోధుడా! అని ఆ అతివ ప్రాధేయపడడం తెలియజేస్తున్నాడు పెద్దన!

అనినఁ దలంపున నింపిన
యనుకంప నిలింప చంపకామోదసుతుం
డనునయ మొప్పఁగ నోడకు
మని నిజవృత్తాంత మడుగ నది యి ట్లనియెన్

ఆ స్త్రీ అలా ప్రాధేయపడగానే మనసులో కరుణ కలిగి, దేవతాస్త్రీల చేత పొగడబడిన కుమారుడైన ఆ స్వరోచి అనునయముగా ' భయపడకు, ఏమిటి నీ కథ? ' అని అడిగాడు. ఆ స్త్రీ తన కథను చెప్పడం ప్రారంభించింది. సుమనస్సులు అంటే పూవులు అనీ, దేవతలు అని కూడా అర్ధము. 'నిలింప- చంపక- ఆమోద సుతుడు' అనడంలో దేవతలను, పూబంతివంటి వరూథినిని, వారి చేత, ఆమెచేత పొగడబడిన సుతుడు ఐన స్వరోచిని ఉద్దేశించాడు పెద్దన.

(కొనసాగింపు వచ్చే సంచికలో)

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి