ఓం నమో భగవతే శ్రీ రమణాయ.
(నాలుగవ భాగం తరువాయి)
శ్రీ రమణులు బడుగువర్గాల వారిని కూడా ఆదరించేవారు. ఒక ఉదాహరణని, శ్రీ రమణులు, ఆ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత సూరి నాగమ్మ గారికి ఇలా వివరించారు. అది "మేము కొండ మీద ఉన్న రోజులలో, అథమ కులస్థ స్త్రీలు, విశ్రాంతి తీసుకోవటానికి నెత్తి మీద పెద్ద గడ్డి మోపులతో దప్పికతో అల్లాడిపొతుండేవారు . కాని వారిని నుయ్యి సమీపానికి ఎవ్వరూ రానిచ్చే వారు కారు. నేను మాత్రం బావి దగ్గర నిలబడి, నీరు తోడి, వాళ్ళ దోసిళ్ళలో పొసేవాణ్ణి. ఎంతో సంతృప్తి చెందేవారు. వాళ్ళు త్వరత్వరగా ఇళ్ళకి పోయి, పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరముండేది. పాపం వాళ్ళు మా దగ్గరికి ఆశతో వస్తూండేవారు" అని చెప్పారు శ్రీ భగవాన్.
శ్రీ భగవాన్ మౌనమునిగా ప్రఖ్యాతిగాంచారు. "భోజనం చేసేవాణ్ణి కాను - అందువల్ల నేను 'ఉపవాసమునిని' అనేవారు. నేను మాట్లాడేవాణ్ణి కాను - అందువల్ల నన్ను 'మౌని' అనేవారు అని చెప్పారు. శ్రీ భగవాన్. శ్రీ మహర్షి మౌన వ్యాఖ్యానమునకు నిదర్శనముగా మేజర్ ఎ. డబ్ల్యు. చాడ్విక్ ఇట్లా వ్రాసారు. ఎ. డబ్ల్యు. చాడ్విక్ బ్రిటీష్ సైనికాధికారిగా దక్షిణ అమెరికాలో ఉండేవారు. బ్రంటన్ రచించిన 'ఎ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా ' అన్న రచనను చదివి, ముగ్ధుడై తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, 1935 నవంబరులో శ్రీ రమణాశ్రమానికి వచ్చాడు. అక్కడే స్థిరపడిపోయాడు. సాధుఅరుణాచలం గా మారాడు. ఆశ్రమ ఆవరణలోనే ఖననం చేయబడ్డాడు.
కాశ్మీరు నుంచి ఒకాయన వచ్చారు. ఆయనతో పాటు ఆయన సహాయకుడు కూడా వచ్చాడు. ఇతనికి తన మాతృభాష కాశ్మీరం తప్ప వేరే ఏ భాషా రాదు. హాలులో ఒక మూల, చిన్న లాంతరు తప్ప వేరే వెలుగేదీ లేదు. చీకటిగా ఉంది. అప్పుడు ఇతను వచ్చి శ్రీ భగవాన్ ఎదుట సవినయంగా నిలబడి తన మాతృభాషలో ఏమేమో అతి వేగంగా మాట్లాడేశారు. శ్రీ భగవాన్ ఏమీ మాట్లాడకుండా అతని వైపే చూస్తూ జారగిలబడ్డాడు. కాస్సేపటి తర్వాత అతను శ్రీ భగవాన్ కి నమస్కరించి, హాలు దాటి బయటకు వెళ్ళిపోయాడు. మర్నాడు అతని యజమాని వచ్చి, "భగవాన్, మీకు కాశ్మీరం వచ్చని నాతో ఎప్పుడూ చెప్పనేలేదే, ఇది న్యాయమేనా" అని అడిగాడు. ఆయన ఇట్లా అనుకోవటానికి కారణమేమిటని శ్రీ భగవాన్ అడిగితే, "రాత్రి మా వాడు మీ వద్దకు వచ్చి, మా భాషలో ఎన్నో ప్రశ్నలు అడిగాడట, మీరు అదే భాషలో సమాధానాలు కూడా ఇచ్చారట. అతని సందేహాలన్నిటినీ తీర్చారట" అన్నారు. "నేను నోరు విప్పనేలేదే" అని శ్రీ భగవాన్ జవాబిచ్చారు.
టైలర్ దంపతులు అమెరికన్లు. టైలర్ పోస్టుమాష్టారు ఉద్యోగం నుండి విరమించుకున్నాడు. ఆ దంపతులకి శ్రీ భగవాన్ పట్ల ఎంతో మమకారం. ఒకనాడు ఆకస్మికంగా ఆయన భార్య, "భగవాన్, నాకు ఆత్మసాక్షాత్కారం కావాలి" అని అడిగారు. శ్రీ భగవాన్, "ఆగు, రావలసినప్పుడు వస్తుంది" అన్నారు. ఆమె "అట్లా కుదరదు. నాకు ఇక్కడే, ఇప్పుడే కావాలి" అన్నారు. శ్రీ భగవాన్ ఆమెకి నెమ్మదిగా ఆమె సిద్ధమైనప్పుడు దానంతట అదే వస్తుందని చెప్పారు. కానీ ఆమె పట్టువిడవక, తనకి సాక్షాత్కారాన్ని వెంటనే ఇప్పించే బాధ్యత శ్రీ భగవాన్ దే అన్నారు. శ్రీ భగవాన్ ఏమీ అనకుండా, ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా కొన్ని నిమిషాల పాటు చూసారు. ఆమె ఉన్నట్టుండి కళ్ళ వెంబడి నీరుకారుస్తూ హాలు నుంచి బయటకు గబగబా వెళ్ళిపోయారే గాని, ఏమి జరిగిందో ఎవ్వరికీ చెప్పలేదు.
"ఇతరులు ఏమనుకుంటున్నారో, ఏమి చేస్తున్నారో, పట్టించుకోవద్దు. నీకున్న సమస్యలు చాలు. మొదట నీలో పరివర్తన తెచ్చుకో, తరువాత ప్రపంచం సంగతి చూడటానికి కావలసినంత సమయముంటుంది. నిన్ను నీవు ఉద్ధరించుకోలేకపొతే, లోకాన్నేం ఉద్ధరించగలవు ?" అనేవారు శ్రీ భగవాన్. శ్రీ రమణులను భక్తులు శ్రీ భగవాన్ అనో, మహర్షి అనో, మరే ఇతర అవతారమూర్తి అనో ఆరాధించినా, మిగిలిన వాళ్ళకి వారు అతి సామాన్యుల వలె కనబడేవారు. కొన్ని వేలమంది నడుమ ఉన్నాకూడా, వారు తమ ఆత్మనిష్ఠలో నిలకడగా ఉండేవారు. ఆ స్థితినుంచి ఏ మాత్రము చలించేవారు కారు. ఒక పోలెండు దేశ వనిత శ్రీ భగవాన్ దర్శనానికి వచ్చింది. ఆమె అనుభవం ఇది. ఆమె ఒంటరిగా స్కందాశ్రామానికి వెళ్లిందొకసారి. తిరిగి వస్తుండగా ఆమెకి దాహంవేసింది. ఆ దప్పికని తీర్చుకోవటానికి మార్గం తెలియక, ఆమె, "శ్రీ భగవాన్ సర్వవ్యాప్తమన్నమాటే నిజమైతే ఆయన ఈ క్షణాన, ఇక్కడ నాకు కనబడి నా దప్పికని తీర్చకూదడా? అనుకుంది. మరుక్షణం శ్రీ భగవాన్ అక్కడ తన కమండలంలో నీటితో ప్రత్యక్షమై ఆమె దాహాన్ని తీర్చారు. ఇది జరుగుతుండగా శ్రీ భగవాన్ ఆశ్రమంలో తమ స్థానంలోనే కూర్చునేఉన్నారు, గిరిపైన జరుగుతున్న జగన్నాటకం గురించి ఏమీ తెలియనట్టుగా. ఆ పోలెండ్ యువతికి గొప్ప భక్తీ, ప్రేమా ఉన్నాయి. క్రిస్టియన్ కూడా. ఏసుక్రీస్తు వలె మహిమలని ప్రదర్శించగలగినవారు క్రీస్తువంటి వారేనని ఆమె నమ్మకం. ఆమె భక్తికి మెచ్చిన భగవాన్ ఆమె విస్వాసాన్ననుసరించే ఆమెకు దర్శనమిచ్చి ఆమె కోర్కెను తీర్చారు. ఇటువంటి సంఘటనల వల్ల భక్తుల నమ్మకమూ, భక్తీ ఎక్కువ అవుతాయి కాని, అతీంద్రియశక్తులను ప్రదర్శించే ప్రయత్నాలు చేయవద్దని శ్రీ భగవాన్ చెప్పేవారు. అన్నివేళలా ఆత్మని గుర్తుంచుకొమ్మని భక్తులను హెచ్చరించే వారు. విదేశీయుడొకరు, రామణాశ్రమములోని , భోజనశాల బయటపడిఉన్న విస్తళ్ళను ఊడుస్తూండటం చూసి, శ్రీ భగవాన్ "వాడేసిన విస్తళ్ళను ఊడ్వటం ముక్తికి మార్గమా? ఈ తపస్సు చేయటానికేనా ఇంత దూరం వచ్చింది? లోపలికి వెళ్ళు, మనస్సుని పరిశుద్ధం చేసుకోవటమనే పనిలో నిమగ్నమవు. అదే అన్నింటికంటె గొప్పసేవ. అదే నీకు మోక్షమివ్వగలదు" అన్నారు.
శ్రీ భగవాన్ దర్శనానికి వచ్చిన వారు కొందరు సాష్టాంగ నమస్కారం చేస్తుండేవారు. అటువంటి ఒక భక్తునితో, "గురువుకి నమస్కారం చేయటంవల్ల అహంకారం నిర్మూలమవుతుంది, అదే ఫలితం. ఆత్మసాక్షాత్కారం ఒళ్ళు వంచటం వల్ల కలుగదు. అహంకారాన్ని వంచాలి" అన్నారు. "లోపల ఉన్న శుద్ధమైన ఎరుకే దయామయమైన గురువు పాదాలు. వాటితో సంపర్కమే మోక్షాన్నివ్వగలదు" అని చెప్పారు.
1924లో ఒక రాత్రివేళ కొందరు దొంగలు ఆశ్రమానికి వచ్చి లోపలికి చొరబడదామని కిటికీల రెక్కలను పగులకొడ్తున్నారు. శ్రీ భగవాన్ , "ఆశ్రమంలోకి రావటానికి అంత శ్రమపడతారెందుకు? తలుపు తెరుస్తాం. మీకు కావలసినది తీసుకువెళ్ళవచ్చు" అన్నారట. తలుపుని తీయించారు కూడా. అయినా దొంగలు శ్రీ భగవాన్ ని భౌతికంగా గాయపరిచారు. ఒక భక్తుడు దీనిని సహించలేక వాళ్ళని తిరిగి కొట్టడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు శ్రీ భగవాన్ అడ్డుకొని, "శాంతం! శాంతం! ఇదేంపని? వాళ్ళు దొంగలు, వాళ్ళ వృత్తే దొంగతనం చేయటం. అందుకోసం ఏదైనా చెయ్యటానికి వాళ్ళు సిద్ధమే. మనమా సాధువులం. వాళ్ళు చేసిన చెడు పనులనే మనం కూడా చేస్తే వాళ్ళకీ, మనకీ తేడా ఏమిటి?" అన్నారు. ఆ భక్తుడు శాంతించాడు. తరువాత శ్రీ భగవాన్ "ఎట్టి పరిస్థితుల లోనూ, తమ సన్యాస ధర్మాన్ని సాధువులు విడవకూడదు" అని చెప్పారు.
భగవాన్ అందరికీ, అన్నివేళలా అందుబాటులో ఉండేవారు. వారిని దర్శించటానికి ఎవ్వరి అనుమతీ అవసరమయ్యేది కాదు. ప్రారంభదశలో భక్తులు వారి చుట్టూ పడుకొనేవారు. ఆయన రాత్రివేళల లేచి బయటికి వెళ్ళవలసివస్తే ఆ భక్తుల మధ్య నుంచి ఎంతో జాగ్రత్తగా వెళ్లేవారు. ఒక భక్తుడు ఇచ్చిన టార్చిలైటును ఎంతో బలవంతం మీద భగవాన్ తీసుకున్నారు. కానీ, ఆ టార్చిలైటుని ఎవ్వరికీ ఇబ్బంది కలుగకుండా వాడేవారు. రాత్రిళ్లు బయటకు వెళ్ళవలసివస్తే, ఆ లైటును నేలమీద పడేట్టు వేస్తే అక్కడ పడుకున్న వారికి నిద్రాభంగం కలుగుతుందని, పొట్టమీద పడేట్టు చేసుకునేవారు! ఇతరులంటే అంత శ్రద్ధ వారికి.
స్కందాశ్రమంలో ఒక నెమలి శ్రీ భగవాన్ వెంటే తిరుగుతూఉండేది. ఒకనాడు ఒక పెద్ద నల్లత్రాచు ఆశ్రమంలోకి వచ్చింది. నెమలి దాన్ని తీవ్రంగా ఎదుర్కొంది. త్రాచు పడగవిప్పింది. ఇక ఆ సహజ శత్రువులు భీకరపోరాటానికి సంసిద్ధమవుతున్నాయి. శ్రీ భగవాన్ పాము దగ్గరకు వెళ్లి, "ఎందుకు వచ్చావిక్కడికి? నెమలి నిన్ను చంపేస్తుంది, ఇక్కడనుంచి వెళ్ళిపో " అన్నారు. వెంటనే పాము తలదించుకుని వెళ్ళిపోయింది.
పెరూ (దక్షిణ అమెరికా) దేశ దంపతులు మహర్షి మహనీయత గురించి విని ఆశ్రమానికి వచ్చారు. ఒకనాడు వాళ్ళు శ్రీ భగవాన్ సన్నిధిలో ఉండగా, సంభాషణ పెరూ దేశంవైపు మళ్ళింది. వాళ్ళ ఊళ్లో ఉన్న 'బీచ్' గురించి ఆ దంపతులు చెప్తూండగా, శ్రీ భగవాన్ " మీ బీచ్ రోడ్డు మీద చలువరాతిని పరిచారుకదా, మార్గమధ్యలో కొబ్బరిచెట్లను నాటారు కదా? సముద్రానికి ఎదురుగా చలువరాతి బెంచీలున్నాయి కదా. వాటిల్లో ఐదవ దానిమీద తరచూ కూర్చునేవారు కదా?" అని భగవాన్ అడిగారు. ఆ దంపతులకెంతో ఆశ్చర్యం వేసింది, మహర్షికి అన్ని వివరాలెట్లా తెలిశాయా అని. వారినడుగగా, శ్రీ భగవాన్ చిరునవ్వుతో "నేనెట్లా చెప్పగలిగితేనేం? ఆత్మకి దేశ, కాల, మాన పరిమితులు లేవని మీరు తెలుసుకుంటే చాలు" అన్నారు.
టి. కె. ఎస్. అయ్యర్ ఎంతో దిగులుగా ఉన్నారు. ఊళ్లో ఎవరో మహర్షిని చులకన చేస్తూ మాట్లాడినప్పుడు, తాను తగిన సమాధానం చెప్పలేదే అని. ఆ తప్పుకు శిక్ష ఏమిటి అని భగవాన్ ని, వారు అడిగారు. భగవాన్ బదులుగా "ఓర్పు, ఇంకా ఓర్పు, సహనం, ఇంకా సహనం" అన్నారు.
ఒకరోజు, ఒక యువకుడు, శ్రీ భగవాన్ ని ఉద్దేశించి, "శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానందుని నిర్వికల్ప సమాధిస్థితికి తీసుకొని వెళ్ళగలిగారు కేవలం తాకటంవల్ల. శ్రీ భగవాన్, నాక్కూడా అట్లా చేయగలరా?" అని అడిగాడు. కాస్సేపు మౌనం తరువాత, నెమ్మదిగా ఇట్లా అన్నారు: "నీవు ఇంకొక వివేకానందుడివి అన్నమాట"! ఆ యువకుడు ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. శ్రీ భగవాన్ ఇలా చెప్పారు. "ఆత్మవిమర్శ, ఆత్మవివేచన, వీటి ఆవశ్యకత గుర్తించటం కష్టం. ఎవరికి వారే పరిపూర్ణులమనుకుంటారు. ఆ యువకునికి, నేను కూడా శ్రీ రామకృష్ణుని వలె శక్తిమంతుడనేనా అని పరీక్షించే కుతూహలం కలిగిందేకానీ, తాను పరిపూర్ణుడనని అనుకోవటంవల్ల కదా, ఆ అరుదైన అనుభూతిని రీ రామకృష్ణులు, ఒక్క వివేకానందునికే కలిగించటానికి కారణమ్. వివేకానందులు ఎంతో అరుదైన ఆధ్యాత్మికోన్నతిని కలిగి ఉండటమే" అని సెలవిచ్చారు.
(తరువాయి భాగం వచ్చే సంచికలో...)
శ్రీ రమణార్పణమస్తు