నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!
______________________________________________________________________
న్యూయార్క్ లోని ఓ బార్ లోకి వెళ్ళి తుపాకులు చూపించి, అక్కడ కస్టమర్స్ ని ఇద్దరు దొంగలు దోచుకున్నారు. అయితే పోలీసులకి కొద్ది నిమిషాల్లోనే వారి ఫోటోలు దొరికాయి. బార్ బయట పొలరాయిడ్ కెమేరాతో ఫోటోలు తీసే ఒకరితో ఆ ఇద్దరు దొంగలు ఫోటోలు తీయించుకుని లోపలికి రావడం అద్దాల కిటికీలోంచి ఓ కస్టమర్ చూసాడు. పోలీసులకావిషయం తెలీగానే ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరకి వెళ్తే, దొంగలు తమ ఫోటోలని తీసుకోవడం మర్చిపోయి వెళ్ళారు.
ఇటలీ లోని బొలొగ్నా అనే ఊరికి చెందిన ఓ ప్రభుత్వ కార్యాలయంలో పెన్షన్ మొత్తాన్ని చెల్లించడానికి ఉంచిన ఓ సేఫ్ వాల్ట్ ని కొందరు దొంగలు రాత్రి మందుగుండు ఉపయోగించి పేల్చేసారు. అయితే వాళ్ళకి ఎంత మందుగుండు పెట్టాలో తెలీలేదు. అది ఎక్కువవడంతో పేలగానే సీలింగ్ కూలి ఆ దొంగలు గాయపడ్డారు. పోలీసులొచ్చేదాక గాయపడ్డ ఆ దొంగలు అక్కడనించి కదల్లేకపోయారు.