డొమీనియన్ ప్రతిపత్తి... - భమిడిపాటి ఫణిబాబు

domeenion pratipatti

 స్వతంత్రం వచ్చి అరవై ఏళ్ళపైన జరిగినా, ఇంకా ఎప్పుడో చరిత్రలోకి వెళ్ళిపోయిన “డొమీనియన్ ప్రతిపత్తి” గురించి ఈయనేమిటీ “బోరు” కొడుతున్నాడూ అనుకోకండి దయచేసి. అసలు ఆ పదానికి సరైన అర్ధం స్వాతంత్ర భారతదేశం లో పుట్టిన చాలా మందికి తెలియకపోవచ్చు. ఒకసారి “గూగులమ్మ” ని అడిగితే సరీ, ఆ ముచ్చటా తీరుతుంది. కానీ నేను వ్రాసింది చదివితే తప్పకుండా మీరు కూడా “ నిజమేనండీ.. ఏవిటో అనుభవిస్తున్నాము కానీ ..మాకూ తెలియదు సుమా..” అని ఒప్పుకోక మానరు...

స్వతంత్రం వచ్చినట్టే అనిపిస్తుంది కా..నీ...ఆ రెండక్షరాల్లోనే ఉంది అసలు విషయమంతా.. ఉదాహరణకి మన సంగతే తీసికోండి, చిన్నప్పుడల్లా అమ్మా నాన్నల ప్రాపకంలోనే పెరిగి పెద్దవుతాము. స్కూలు చదువు పూర్తయే సరికి, అందరితోనూ పెద్ద గొప్పగా చెప్పుకుంటారు—“మా వాడి choice  కే వదిలేశామండీ.. వాడిష్టం ఇంజనీరింగో, మెడిసినో వాడికేది నచ్చితే దాంట్లోనే చేరమన్నాం..” అంటారు. చూశారా అక్కడ రెండంటే రెండే options  పెట్టారు, అదన్నమాట అసలు మనజీవితంలో ఏదో స్వతంత్రం వచ్చిందనుకుంటాము కానీ,ఒక్క పనీ స్వతంత్రంగా చేయలేము ! వాళ్ళు చెప్పింది చేయకపోతే ఇంట్లో తీండీ, బట్టా ఎవరిస్తారు? దానితో చచ్చినట్టు నచ్చినా నచ్చకపోయినా, ఏదో ఒకదాంట్లో చేరి సరిపెట్టుకుంటాము. ఈరోజుల్లో పిల్లలు కొద్దిగా తెలివిమీరారు లెండి.. వాళ్ళకి ఇష్టమైన కోర్సుల్లోనే చేరుతున్నారు, వృధ్ధిలోకీ వస్తున్నారు. తాను ఎన్నుకున్న రంగంలో విజయం సాధించేసరికి ఆ తల్లితండ్రులు కూడా, అదేదో తామే సాధించినట్టుగా, ఇంకో పాట మొదలెడతారు.. “ అందరూ traditional courses  కే వెడితే ఎలాగండీ, మేమే వాడికి నచ్చచెప్పి, మొత్తానికి ఒప్పించేసరికి తలప్రాణం తోక్కొచ్చిందంటే నమ్మండి..”

ఈస్వతంత్రం ఎన్నాళ్ళూ..ఏదో తాను కోరుకున్న కోర్సులో చేరి ఓ నాలుగైదేళ్ళు ఉద్యోగం చేయడం వరకే.. ఇంక ఇంట్లో వారి “గొడవ” ప్రారంభం అవుతుంది—పెళ్ళిచేసుకోరా బాబూ.. --- అని. తెలివైనవాడైతే ఆ సంసారబంధనాల్లోకి అంత త్వరగా వెళ్ళడు,  తన స్నేహితుల సంసారాలు చూసి, ఇంకొద్దిరోజులు హాయిగా ఉంటే పోలేదూ, అనుకుని వాయిదా వేస్తాడు. మరీ ఎక్కువ ఆలశ్యం అయి, ఏ నలభైఏళ్ళదాకానో ఆగాడంటే మళ్ళీ అదో గొడవా. మొత్తానికి ఓ calculated risk  తీసేసికుని సరే అంటాడు. అసలు వచ్చిన చిక్కంతా ఇక్కడే..ఆ పెళ్ళి ముచ్చట్లలో “ కాశీ యాత్ర “ అని ఒకటుంటుంది. పెళ్ళికొడుకు ఓ గొడుగూ, పాంకోళ్ళూ వేసికుని కాశీ యాత్రకి పోతానంటాడు, కానీ విధిబలీయం... ఆ బావమరదో, వధువుకి సంబంధించిన ఓ సోదరుడో వచ్చి, గెడ్డం క్రింద బెల్లం ముక్క పెట్టి, “ అలా వెళ్ళిపోకండి బావగారూ.. మా చెల్లెల్నిచ్చి పెళ్ళిచేస్తామూ..” అని అనడం తరవాయి, ఒప్పేసికుంటాడు.ఇదిగో ఇక్కడే ఒంటిమీద తెలివిలేకుండా నిర్ణయాలు తీసికోవడమంటే. హాయిగా తన దారిన తను ఆ కాశీయో, ఋషీకేశమో వెళ్ళిపోతే హాయిగా స్వతంత్రంగా ఉండేవాడా, అబ్బే రాసిపెట్టుంటే అలా ఎందుకవుతుందీ?

పెళ్ళంటూ అయాక ఈ స్వాతంత్రం అనేది ఒక మిథ్య మాత్రమే. ఏదో కొత్తగా కాపరానికి వచ్చిన అమ్మాయి మొదటి ఒకటిరెండు సంవత్సరాలు, చెప్పిన మాట విన్నట్టు కనిపిస్తుంది.ఈయన గారి మనస్థత్వం ఏమిటో, ఏ కోపమేనా వస్తే దేశాలు పట్టిపోతాడేమో అనో భయం.అదెంత ఓ ఏడాదో. ఏణ్ణర్ధమో తరువాత, ఓ పిల్లో, పిల్లాడో పుట్టుకొచ్చేడా, అయిపోయిందే స్వతంత్రాలూ, సింగినాదాలూనూ. బయటివాళ్ళందరికీ అనిపిస్తుందీ.. “ అబ్బ ఎంత అదృష్టవంతుడో ఇంట్లో ఈయన మాటే చెల్లుతుందట.. “ అని ప్రతీ మగాడూ ఇంకో మగాడిని చూసి అనుకునే మాటే ఇది ! అసలు జరిగేది దీనికి పూర్తి విరుధ్ధంగా ఉంటుందనడంలో సందేహం లేదు. బయట చాలామంది దంపతులని చూస్తూంటాం—ఒకళ్ళకోసమే ఇంకోరు పుట్టారా అనుకున్నట్టు ప్రవర్తిస్తూంటారు, దానికి ముఖ్య కారణం ఇదిగో ఈ “డొమీనియన్ ప్రతిపత్తే..”. సంసారంలోని ముఖ్యమైన decisions అన్నీ ఆవిడే చూసుకుంటుంది. ఏదో బయట సామాన్లు తేవడమూ, ఇంటికి ఎవరైనా చుట్టాలో, స్నేహితులో వచ్చినప్పుడు. ఇంటిపెద్దగా వ్యవహరించడమూ లాటివన్నమాట ! మన దేశ రాష్ట్రపతిని చూడండి, దేశానికి First Citizen అంటారు, కానీ ఒక్కమాటైనా వినేవాడుంటాడా? కానీ ప్రతీదీ ఆయన పేరు మీదే జరుగుతూంటాయి. ఏదో భార్య మాట వినడం ఏదో మహాపాపమని కాదు, వినాలే , జీవితం సుఖంగా వెళ్ళిపోవాలంటే తప్పదు మరి. రేప్పొద్దుట ఏ మంచమో పడితే శ్రధ్ధగా చూసేది ఆవిడొక్కరే. మిగిలినవారు ఏదో lip sympathy కి మాత్రమే. తెలుసండి బాబూ, కానీ ఆ పేరుచెప్పుకుని జీవితాంతం డొమీనియన్ ప్రతిపత్తికే పరిమితమైపోతున్న “పక్షుల” గురించి ప్రపంచానికి తెలియొద్దు మరీ?

ఒక్క పనిలో స్వతంత్రం ఉండదు.బట్టలు వాళ్ళు చెప్పినట్టే ధరించాలి. పోనీ ఆ ఉన్న నాలుగుజతలకీ ఏమైనా  వార్డురోబ్బులూ అవీ ఉంటాయా అంటే, ఇంట్లో భార్య తన బట్టలు సద్దుకోగా, మిగిలిన నాలుగు కబ్బోర్డుల్లోనూ, నాలుగో దాంట్లో మిగిలిన ఒక్కటంటేఒక్క “ అర” మాత్రమే. పోనీ అందులోనైనా స్వతంత్రం ఉంటుందా అంటే, పక్కబట్టలూ, గలేబులూ లాటివాటిని అప్పుడప్పుడు భరిస్తూండాలి ! పోనీ ఈ ఇంటాయనకి  తన సంచీ, విడిచిన బట్టలూ వాటికి ఏదైనా ప్రత్యేక స్థలం ఉందా అంటే, ఎక్కడా, ఏ తలుపు వెనక్కాలో, ఎవరికీ కనిపించకుండా ఓ మేకు కొట్టి తగిలించుకోడం ! బయటివారికి తెలియకూడదుగా, మన మేస్టారి ప్రతిపత్తి ఏమిటో మరి.

ప్రపంచం అంతా అలాగే ఉందనికాదూ, ఎక్కువభాగం ఆ రకమే. అలాగని ఆడవారందరూ గయ్యాళిలనీ కాదు, ఏదో మంత్రం ఉపయోగించి మొత్తానికి తమమాటే చెల్లుబాటయ్యేటట్టు చూసుకుంటారు. ఒకలా చూస్తే అదే హాయేమోలెండి, చీకూ చింతా లేకుండా గడిపేయొచ్చు.  జీవితాంతం అలాగే ఉంటుందనీ కాదూ, సరీగ్గా జరుగుతున్నంతకాలం బాగానే ఉంటుంది, ఎక్కడైనా తేడా వస్తే మాత్రం, ఈ “ బక్కప్రాణి” ని—“ అదేవిటండీ, ఆమాత్రం చెప్పొద్దూ..ఫలానాది వద్దూ..అనీ..” అప్పుడుకూడా అక్షింతలు తప్పవు.పోనీ ధైర్యం చేసి, చొరవతీసికుందామా అంటే..” మీకేమీ తెలియదు. ఊరుకోండీ..” అంటూ “ వీటో” చేసేస్తూంటారు.అలాగని దేశంలోని భార్యలందరూ శత్రువులని కాదు, వాళ్ళకి కావాల్సింది, మన శ్రేయస్సే, కా...నీ... వారనుకునే పధ్ధతిలో...

మరి ఇన్నేసి గొడవలతో స్వతంత్రం వచ్చిందీ అంటే అయే పనేనా మరి?  ఏదో నాలుక్కాలాలపాటు హాయిగా ఉండాలంటే మరి ఈ డొమీనియన్ ప్రతిపత్తే హాయేమో కదూ

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి