సాహితీవనం - వేంకట వరప్రసాదరావు

sahiteevanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము

(గత సంచిక తరువాయి)

మనోరమ తన గాథను స్వరోచికి చెబుతున్నది.

'...అలా ఆ మునిని నేను పరిహాసమాడుతూ ఆయనను స్పృశించగానే, కనులు తెరిచి..'

ఓసి దురాత్మురాల గృహ మొల్లక సర్వ సుఖంబులున్ నిరా

యాసమునం దొఱంగి మిహిరాంశు మరుఛ్ఛద నీర నీరస

గ్రాసము దేహధారకముగా గుహలం దప మాచరించు మ

మ్మీ సరణిన్ స్పృశించి నగ నేమి ఫలం బొనగూడెఁ? జెప్పుమా!

ఓసి దురాత్మురాలా! ఇంటిని వదిలి, సర్వ సుఖాలనూ అవలీలగా తేలిగ్గా వదిలేసి, ఎండకూ గాలికీ నిలిచి,

నీరు, రసవిహీనమైన గడ్డీ గాదమూ తింటూ ఎక్కడో ఎవరికంటా పడకుండా గుహలలో తపస్సు చేసుకునే

మమ్మల్ని యిలా తాకి ఇకిలించడం వలన నీకేం ఫలితం వచ్చిపడింది చెప్పు?

తిమిరంపు వయసు గుబ్బల

కొమరాలవు, నీకుఁ దగిన గోవాళ్ళ మహిన్

నెమకి నగ రాదె? ముదిసిన

మముఁ జెనకిన నేమి కలదు? మద మేమిటికిన్

పిట పిటలాడే వయసు పొంగులతో అటమటమై పోతున్న యవ్వనవతివి, నీకు తగిన ఆంబోతు వెధవలను

వెతికి పట్టుకొని నవ్వరాదూ, ఏమన్నా ఫలితముంటుంది! అన్నీ ఉడిగి అడవుల్లో కంద మూలాలు

తింటూ తపస్సు చేసుకుంటున్న మమ్మల్ని కదిలిస్తే ఏం ఫలితముంటుంది? ఎందుకింత మదం? గోవాళ్ళు

అంటే వయసులో ఉన్న వాళ్ళు అని. మదించి ఉన్నావు, నీకు తగిన మదమెక్కినవాళ్ళను, వయసు కుర్రాళ్ళను పట్టుకుంటే లాభం కానీ మదం, ముదం అన్నీ ఉడిగిన నా లాంటి ముసలోళ్ళ వలన నీకేం దక్కుతుంది అని!

ముసురుకొను జరభరంబున

నసురుసు రై యున్న మమ్ము నడకించితి వి

ట్లుసురు మనఁ బట్టువడు మొక

యసురకు నీ వనుచుఁ బలికె నాగ్రహ మెసగన్

వృద్ధాప్యము కమ్ముకుంటున్న మమ్మల్ని, ప్రాణాలు కడబట్టిన మమ్మల్ని కదిలించి వేధించినందుకు

ఫలితంగా నువ్వు కూడా ఉస్సురుమంటూ ఆయాసపడుతూ ఒక అసురుడికి పట్టుబడెదవుగాక అని

ఆగ్రహంగా పలికాడు! అంతటితో ఆగలేదు.

జననాథ! యేమి చెప్పుదుఁ?

గనలుచు నవ్వగ్గుతపసి కటము లదరఁగాఁ

దనచేతి నాగబెత్తముఁ

గొని పసరముఁ గొట్టినట్టు గొట్టె నదయుఁడై

జననాథా! ఏం చెప్పను? కోపముతో మండిపడుతూ ఆ ముసలి తాపసి కణతలు అదురుతుండగా తన చేతిలో

ఉన్న నాగబెత్తమును తీసుకుని నన్ను పశువును బాదినట్టు బాదాడు.

కొట్టువడి యటకు మునుపే

తిట్టుం బడి యేడ్చు నాదు దెసఁ గని మదిలోఁ

గట్టలుక వొడమి నా సఖు

లి ట్టనిరి మునీంద్రుతోడ నెత్తినపెలుచన్

యిలా కొట్టబడి, అంతకుముందే తిట్టబడి ఏడుస్తూ ఉన్న నన్ను చూసి నా స్నేహితురాళ్ళు మనసులో కోపం వచ్చి,మిక్కిలి కోపంతో ఆ మునిని యిలా అన్నారు. ఇక్కడ పద్యము, సందర్భము చిన్నదే అయినా పెద్దన ప్రతిభ పెద్దగా కనిపిస్తుంది నిశితంగా పరిశీలిస్తే. ముందు తిట్టడం ప్రారంభించగానే అంతవరకూ ఎవ్వరితో ఒక్క మాటా పడనిది,గారాబంగా పెరిగింది కనుక ఏడవడం ప్రారంభించింది. (గంధర్వులు తమ తమ భుజాలకున్న భూషణాల మణులు రాలిపోయేట్లు రారాపిళ్ళు పడేట్టు ఎత్తుకునేవారు మరి, ముద్దుగా ఎత్తుకున్నప్పుడు పిల్లలు వదిలించుకోడానికి గింజుకుంటారు కనుక అలా గింజుకుని చంక దిగడానికి పెనుగులాడుతుంటే ఎత్తుకున్న వాళ్ళ భుజాలకున్న ఆభరణాలకున్న మణులు రాలిపడేవి!) యిది చూసిన స్నేహితురాళ్ళకు 'మనసులో' విపరీతంగా కోపం వచ్చింది ఆ ముసలోడు తమ యువరాణిని 'తిడుతున్నాడని'. ఆ తర్వాత పాముతల పిడిగా ఉన్న బెత్తం తీసుకుని ఏకంగా కొట్టడం ప్రారంభించాడు, అంతవరకూ 'పోనీలే మన దుడుకుపనులకు తిడుతున్నాడులే' అని ఊరుకున్నవాళ్ళుదాంతో లోపల రేగుతున్న కోపం బయటకొచ్చింది, నోరు చేసుకోడం, ఎదురు తిట్టడం ప్రారంభించారు. ఇంత సన్నిహితంగా పరిశీలించే ఓపిక లేకుంటే ' మనసులో విపరీతమైన కోపం వచ్చి, తీవ్రమైన కోపంతో తిట్టడం ప్రారంభించారు' అనే మాటలుగా అనిపించి, హన్నా! ఏమిటి, చెప్పిందే చెబుతున్నాడు పెద్దన్న? అని పొరబడే అవకాశం ఉంటుంది. మహాకవులు ఒక్క అక్షరం కూడా వృథాగా వ్రాయరు!

ఓయి దయావిహీనమతి! యూరక యీ పసిబిడ్డఁ గొట్టఁగాఁ

జేయెటు లాడె? నీకు నిది చేసిన దేమి? వృథా శపింతురే?

బోయవె? యాఁడుఁదోడునను బుట్టవె? శాపనిమిత్తమే తపం?

బీయెడ నున్న శాంతిపరు లే మనువా రిఁక నీ చరిత్రకున్?  

ఓయీ దయారహితుడా! ఉత్తి పుణ్యానికి పసిపిల్లను కొట్టడానికి ( నీ కంటే ఇంత చిన్నది, నీ బిడ్డ వయసున్నది,కనుక పసిపిల్ల ) నీకు చేతులెలా వచ్చాయి? నీ పిల్లలు ఏదో, ఇలా చిలిపిగా అల్లరిచేస్తే యిలాగే కొడతావా?నీకేం అపకారం చేసింది? వృథాగా ఇలా శపిస్తారా? బోయవాడివా? బోయవాడు జింకలను, పిట్టలను పట్టుకుంటాడు, అది వాడి వృత్తి, ప్రవృత్తి. నీ వృత్తి ప్రవృత్తి శాంతగుణం దయాగుణం కాదా, ఇంకేం తాపసివి నువ్వు, తామసివి తప్ప! యిది జింకకన్నుల్లాంటి కన్నులు అల్లల్లాడుతుండగా ఎలా విలపిస్తున్నదో చూడు! పిట్టలా ఎలా 
వణికిపోతున్నదో చూడు! నీకు అక్కలూ చెల్లెళ్ళూ లేరా? వుంటే తెలుస్తుంది ఆడపిల్లలు పుట్టింట్లో ఎంత ముద్దుగా, గారాబంగా పెరుగుతారో, వాళ్ళను ఎలా సున్నితంగా చూసుకోవాలో! హ్హుఁ! తపస్సు చేసుకోవడం శాపాలు పెట్టడానికా? నీ ప్రవర్తను చూసి, ఈ చుట్టుప్రక్కలున్న శాంత స్వభావులైన మునులు ఏమంటారు? అని నా స్నేహితురాళ్ళు ఆ మునిని కుడి ఎడమల దడదడలాడించారు, ఎడాపెడా వాయించారు.

 
(కొనసాగింపు తరువాయి సంచికలో)           
                        

 

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి