పుస్తకం: చీర పజ్యాలు
రచన: బ్నిం
ప్రతులకు: 9866107289, 040-27070169
తెలుగు పదాలకు కొత్త వన్నెలు అద్దుతూ సామాన్య పాఠకులకు చేరువగా తీసుకెళ్ళిన ఘనత బాపూ రమణలకు దక్కుతుంది. ఛందోబధ్ధ కవిత్వం వ్రాయగల కవిపండితులవడం చేత, విద్వాంసులను సైతం మైమరిపింపజేసిన పాండితీ ప్రకర్షను చూపడం చేత తెలుగు పదాలతో వీరు ఆడుకున్న ఆటలు శిష్ట వ్యవహారములుగా చెలామణీ అయిపోతూ వారికొక శైలిని తెచ్చిపెట్టాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, హనుమంతుడి గురించి చెప్పాలంటే సీతారాముల గురించి చెప్పకుండా కుదరదు కదా. ఇక్కడ హనుమంతుడు బ్నిం గారన్నమాట.
బాపు రమణ గార్ల బడి నుంచి వచ్చిన "బ్నిం" వారి పంథాలో నడుస్తూ, వారిని గుర్తు చేస్తూ, తెలుగు పదాలను, భావాలను కొత్తగా అందిస్తూ తనదైన శైలిని కూడా చాటుతున్నారు కొన్ని దశాబ్దాలుగా. గతంలో వారు వ్రాసిన "మిసెస్ అండర్ స్టాడింగ్" చదివాక వారి శక్తి నాకు బాగా అండర్స్టాండ్ అయ్యింది. సరదా మాటల్తో నవ్విస్తూ, మరిపిస్తూ చదివించడం వీరి స్టైల్. ఈ మధ్య కొత్తగా "చీర పజ్యాలు" (పద్యాలు అనకుండా పజ్యాలు అని బాపు రమణ స్కూల్ వాళ్లు అంటే పర్వాలేదు..లేకపోతే అచ్చుతప్పు అంటారు) వ్రాసి పుస్తకంగా వేసారని తెలిసి బజార్ల వెంట తిరిగాను. కాపీలు అయిపోయాయని కొందరు, వచ్చేవారం రమ్మని ఇంకొందరు అన్నారు. మొత్తానికి ఒక ఈ బుక్ సంపాదించా. ఆపకుండా చదివా.. కాదు చదివించాయి బ్నిం పజ్యాలు.
అనుకున్నట్టే ఈ పుస్తకాన్ని తొలి మూడు పద్యాల్లో బాపు రమణలకి అంకితం చేసేసారు బ్నిం.
"బాపూ రమణల సినిమాల్
చూపెట్టును తెలుగు తనము జూం షాట్లల్లో
ఆ పిక్చర్లలొ తరచుగ
ఓ పాటలొ..సీనులోనొ..ఒదుగును చీరే"
ఇది పజ్యాల్లో మొదటి పద్యం. ప్రతి కందపద్యాన్ని సొంపుగా సామాన్య పాఠకులకి అందే రీతిలో వ్రాయడం ఎంత కష్టమో పద్యాలు వ్రాసే అలవాటున్న వాడిగా నాకు తెలుసు. ఆ ఫీట్ చేసినందుకు బ్నిం గారి ఫీట్ కి దండం పెట్టాల్సిందే.
"ప్రతి యంగుళమపురూపము
అతి ఫ్యాషన్ డ్రెస్సులేయ ఆధ్వాన్నమెగా
అతివల అందము నిలుపగ
మితిమీరని చీరకన్న మీరదు ఏదీ!"
పద్యం ఇలా ఉంటే అర్థ తాత్పర్య వ్యాఖ్యానాల అవసరం ఏముంటుంది?!
"వెడలగ పోరుకు చీరను
నడుమును బిగియించి రోషనారై తోచున్
ఒడలొంచి పనులు చేయగ
ముడిచి, మడిచి నడుమగుచ్చు ముచ్చ్టలొలుకన్"!
చీరకట్టులో ఎంత అందం ఉంటుందో ఈ పద్యంలో కూడా అంతందమూ ఉంది.
ఇది చూడండి..
"ఇందిర మరి కస్తూరీ
గాంధీల్, సుష్మాస్వరాజు ఖద్దరు చీరల్
హుందానిచ్చే తీరును
అందరకున్ తెలియజెప్పెనదె దర్జయనన్"
ఇలా ఎవర్నీ వదల్లేదన్నమాట.
"శారీకిన్ డ్రస్సులకున్
తీరే వేరుండు కట్ట దీనిని దానిన్
చీరను వేసిన రోజున
నారిన్ నేనన్న తృప్తి నరముల తిరుగున్!"
"నేడీ మోడ్రన్ డ్రెస్సులు
లేడీసుల గ్లామరంత "లెస్" చేయుటకే
రౌడీల్లా పైటేయక
"చూడే నా సొగసనంగ" చూడరు జంట్సే?!"
అంటూ చీర గొప్పతనం చెప్పి పాశ్చాత్య వస్త్రాలను చీరేసారు బ్నిం.
తెలుగు పాఠకులకి పద్యంపై ప్రేమను పెంచే పుస్తకమిది. కారణం.. ఈ పద్యాలన్నీ ఆపకుండా పైకి చదివితే చందస్సు తెలియకపోయినా ఒక నాలుగు కంద పద్యాలు వ్రాసేసే ఫ్లో వచ్చే అవకాశముంది. భాషలో సరళత, ప్రస్తుతం తెలుగువారి వ్యవహారంలో ఉన్న ఇంగ్లీషు పదాలు వాడడం వల్ల పద్యం అంటే ఉండే భయం పాఠకులకి కలగదు.
చీర గురించి ఎంత చెప్పాలో అంతా చెప్పేసి, చీర గురించి కొత్తగా చెప్పడానికి వేరే కవులకి ఏమీ మిగల్చకుండా రాసేసారు.
"కానీ నా బ్రైనులొ ఊరించే చీర మడతలున్నాయింకన్".. అంటూ దీనికి సీక్వెల్ తీసుకొచ్చే ఆలోచనని స్ఫురింపచేసారు. అదైతే ఆహ్వానించాల్సిందే.
శృంగారం, చురక, అధిక్షేపం, పవిత్రత.. ఇలా ఒక్కో పద్యంలో ఒక్కో విషయం ధ్వనిస్తూ సాగింది ఈ సరదా శతకం. ఈ "చీర పజ్యాలు" నేటి తరం భర్తలు తమ భార్యలకు ఇవ్వదగ్గ పెళ్లి రోజు కానుక!