అల్లసాని పెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము
(గతసంచిక తరువాయి)
మనోరమ తన కథను స్వరోచికి కొనసాగిస్తున్నది. ప్రభూ! నా స్నేహితురాళ్ళు అలా ఆ మునిని ఎదురుతిరిగి
నిందించడం, వాదించడం మొదలెట్టారు.
పాము కడు ముదిసి కడపట
గా మగుచందమున వార్ధకంబునఁ గ్రోధం
బేమియు మానక మండెడు
నా ముని మునియే? తలంప నదియుం దపమే?
గాము అంటే (క్రూర) గ్రహము, పిశాచము అని అర్ధాలున్నాయి. పాము ముదిరి గాము ఐనట్టు, ముసలితనానికి క్రోధాన్ని చంపుకోకుండా అందరిమీదా మండిపడే ముని కూడా ఒక మునియేనా? ఆ తపస్సూ ఒక తపస్సేనా?
పరుల యపరాధగతులకుఁ
గెరలక తనుఁ బొగడుచోటఁ గీ డాడెడుచోఁ
బరితోషము రోషము నెదఁ
జొరనీని తపస్వి సుమ్ము సుకృతి ధరిత్రిన్
తనకు పరులు చేసిన అపరాధమునకు కినుక చెందనివాడు, తనకు చేసిన పొగడ్తలకు మురిసి బోర్లపడనివాడు, వాడే కదా సుకర్మలు చేసేవాడు, సజ్జనుడు, శాంతుడు, ముని అంటే! ' సమం
సర్వేషు భూతేషు తథా మానావమానయోః' అన్న గీత లోని పలుకులను, దుఖేష్వనుద్విగ్నమనః
సుఖేషు విగత స్ప్రుహః వీత రాగ భయ క్రోధః స్థిత ధీర్ముని రుచ్యతే.. అన్న గీతలోని పలుకులను,
సర్వ భూతములయందు సమదృష్టి కలిగినవాడు, మానావమానములయందు సమభావన కలిగినవాడు,
దుఃఖము కలిగినప్పుడు ఉద్విగ్నుడు కానివాడు, సుఖము, సంతోషము కలిగినప్పుడు మైమరచిపోనివాడు,
రాగము, భయము, క్రోధములేనివాడు, స్థిరమైన, చలించని మనసు కలిగినవాడు ముని అనబడతాడు
అన్న పలుకులను ధ్వనిస్తూ, ఈ లక్షణాలేమీ లేనివాడివి నువ్వేం మునివి? నీదేం తపస్సు? అని
ఆ స్నేహితురాళ్ళు అంటున్నారు' అంటున్నాడు పెద్దన!
ఒండొకఁడవైన నిపుడ నీ పిండి యిడమె?
బ్రాహ్మణుఁడ వౌట మాచేత బ్రదుకు గంటి
తడవఁ బనిలేదు నిన్ను గౌతముని గోవ
వనుచు వాదించి విడిచిన నాగ్రహించి
బ్రాహ్మణుడివి(జ్ఞానివి) కనుక బ్రతికిపోయావు గానీ, వేరే ఎవరన్నా ఐ వుంటే నీకిప్పుడే మూడేది. సందేహించాల్సిన పనేమీ లేదు, నువ్వు గౌతముని గోవువంటి గోవువి! అని వారు అనేప్పటికి ఆ మునికి ఆగ్రహం వచ్చింది. ఒకానొక సమయంలో చాలా తీవ్రమైన కరువు వచ్చింది. ఎక్కడా ఏమీ తినడానికి, తాగడానికి లేకుండా పోయి జనులు అల్లల్లాడుతున్నపుడు గౌతముడు తన తపశ్శక్తితో తన వద్ద ఉన్న ధేనువు అనుగ్రహంతో అందరినీ పోషించి, ప్రాణదానం చేసి మహా కీర్తిని పొందాడు. మిగిలిన మునులకు అసూయ జనించి ఆ ధేనువును దానం అడిగినా ఇవ్వకపోయేప్పటికి, మరింత కోపంతో ఒక మాయా గోవును సృష్టించి గౌతముని మునివాటికలోకి, ఆతని ఫలపుష్పభరితమైన వనంలోకి తోలారు. గౌతముడు ఆ గోవును ఒక గడ్డిపరకతో అదిలించగా ఆ మాయ గోవు మరణించింది. ఇంకేం, గౌతముడు దుర్మార్గుడు, గోహత్య చేశాడు అని అపవాదు లేవదీశారు, ఆ మాయగోవుకు గౌతముని గోవు అని పేరొచ్చింది. అంటే గోవు కాదు, గోమాయువు. అంటే నక్క, దొంగ జిత్తుల జీవి కపటి అని అర్ధం. నువ్వలాంటి గౌతముని గోవువి, కపట మునివి అని అతడిని తిట్టారు మనోరమస్నేహితురాళ్ళు.
ముసలి శపియించె నపు డ
య్యసితాబ్జేక్షణల రాజయక్ష్మ క్షోభం
బెసఁగ నశియింప నగు న
ద్దెసఁ బాఱుఁడు సుగుడి గామి తెల్లమియ కదా
ఆ ముసలి తపస్వి అప్పుడు ఆ నల్లని కన్నుల (అసితాబ్జేక్షణలు) అన్నుల మిన్నలను మీకు రాజయక్ష్మ(క్షయ)
వ్యాధి వస్తుంది, మీరు దాంతో నశించి పోతారు అని శపించాడు. ఆ బాపడు సరసుడు, సంతోషాని కలిగించేవాడు
(సుగుడి/సుగుణి) కాదనే సంగతి తెలిసిందే కదా!
ఆ రుజ యప్పుడ యయ్యం
భోరుహ లోచనలఁ బొందె భూవర! నన్నున్
వారత్రయముననుండియు
దారుణగతి నొక్క యసుర తఱిమెడు వెంటన్
ఆ పద్మాక్షులను, నా స్నేహితురాళ్ళను అప్పుడే, వెంటనే ఆ భయంకరమైన క్షయ రోగం అలుముకుంది.
నన్ను కూడా మూడు వారాలనుండి ఒక భయంకర రాక్షసుడు దారుణంగా వెంటబడి తరుముతున్నాడు అని
మనోరమ తన దీన గాథను వినిపిస్తుంటే జాలిగా వింటున్నాడు స్వరోచి.
(కొనసాగింపు వచ్చేసంచికలో)