సాహితీవనం - వేంకట వరప్రసాదరావు

saahiteevanam
అల్లసానిపెద్దనవిరచిత 'స్వారోచిషమనుసంభవము'

(గతసంచిక తరువాయి) 

భయముతో ఆవేదనతో తన సుకుమారమైన తనూలత చలించిపోతుండగా మనోరమ తన దీన గాథను స్వరోచికి వినిపిస్తున్నది. కరుణ నిండిన హృదయంతో జాలిగా ఆ కథను స్వరోచి వింటున్నాడు.నా స్నేహితురాళ్ళకు భయంకరమైన వ్యాధి వెంటనే సంక్రమించింది ఆ ముసలి వగ్గు శాప కారణంగా.నన్ను మూడు వారాలనుండీ ఒక భయంకర రాక్షసుడు వెన్నంటి తరుముతున్నాడు. నన్ను రక్షించడానికి,ఆ భయంకర రాక్షసుడితో యుద్ధ చేసి గెలవడానికి ఉపయోగకరంగా ఉండే అస్త్ర హృదయ విద్యను నీకు ఉపదేశం చేస్తాను మహారాజా!

ఇచ్చెద నీ కస్త్ర హృదయంబు నివ్విద్య / నరనాథ! మున్ను పినాకపాణి 
యగు రుద్రుఁ డిచ్చె స్వాయంభువ మనువున / కతఁ డిచ్చె మరి వశిష్ఠాఖ్యమునికి
నతఁ డిచ్చెఁ గరుణఁ జిత్రాయుధుం డను పేరఁ / దనరు మదీయ మాతామహునకు
నతఁ డిచ్చెఁ బెండి యౌనపు డరణంబుగా / మా తండ్రి  కతఁ డిచ్చె మమత నాకు

సకలరిపునాశకము యశస్కరమునైన
దీని వేవేగ నాచేఁ బ్రతిగ్రహించి 
యడఁపుమా దైత్యు వీరు వా రనఁగ వలవ
దనఘ! సద్విద్య యెందున్నఁ గొనగఁవలయు

నరనాథా! పూర్వము ఈ విద్యను పినాకపాణి ఐన రుద్రుడు స్వాయంభువ మనువుకు ఇచ్చాడు, నేర్పాడు,ఉపదేశం చేశాడు. పినాకము అనేది శివుని ధనుస్సుకు పేరు. శార్జ్గం అనేది విష్ణువు ధనుస్సుకు పేరు.ఆ స్వాయంభువమనువు వశిష్ఠమహామునికి ఈ విద్యను ఉపదేశించాడు. ఆ వశిష్ఠమహాముని ఈ విద్యను చిత్రాయుధుడు అనే పేరు కలిగిన నా తాతకు, మా అమ్మగారి నాన్నకు ఉపదేశించాడు. మా తాత మా అమ్మ పెళ్లి సమయములో అరణముగా ఈ విద్యను నా తల్లికి ఇచ్చాడు. (కుమార్తెను కాపురానికి పంపే సమయములో దాసదాసీ జనులను, ధనమును, కుమార్తెకు అవసరాల నిమిత్తము అల్లుడికి కానుకగా ఇవ్వడాన్ని అరణము అంటారు. కొత్తగా వెళ్ళే చోట కొత్త పెళ్లి కూతురుకి మొగమాటం ఉంటుంది, బిడియం ఉంటుంది, ధనము, సేవకుల అవసరము ఉంటుంది. అమ్మ, నాన్నల లాగా గారాబంగా అడిగిందే తడవు అందించే సహ్రుదయుడే లభించాలని లేదు కనుక, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడం కోసం మొదలైన ఈ అరణాలు లేదా కట్నాలు రాను రానూ అనేక రణాలకు కారణాలు కావడం రాను రానూ మానవునిలో పెరుగుతున్న స్వార్ధానికి, దుర్మార్గానికి సంబంధించినవి. చిన్నప్పటినుండీ వెంట ఉన్న సేవకులకు యజమానురాలి అవసరాలు అభిరుచులు తెలుస్తాయి కనుక సౌకర్యంగా ఉంటుంది అని పరిచారికలను కూడా ఇవ్వడం. అంటే ఒకరకంగా వరకట్నమే, కానీ కుమార్తె కోసం ఉపయోగించడానికి ప్రధానంగా ఇస్తారు తల్లిదండ్రులు) అలా అరణంగా తనకు లభించిన విద్యను నా తండ్రి నాకు ఉపదేశించాడు.సమస్త శత్రువులనూ నాశనము చేసేది, తద్వారా లోకంలో కీర్తిని ప్రసాదించేదీ ఐన ఈ విద్యను వెంటనే నువ్వు నా వద్ద నేర్చుకుని ఈ విద్య సహాయముతో ఆ రాక్షసుడిని సంహరించి నన్ను రక్షించు. స్త్రీ వద్ద నేర్చుకోవడం ఏమిటి అనుకోవద్దు. వీరు, వారు అనుకోకుండా సద్విద్య ఎవరివద్ద ఉన్నా దానిని నేర్చుకొనవచ్చు. కనుక వెంటనే ఈ విద్యను నా వద్దనుండి స్వీకరించి దీని సహాయముతో ఆ రాక్షసుడిని చంపి నన్ను రక్షించు అని 
ప్రాధేయపడింది మనోరమ.ఇక్కడ ఒక మర్మం మనము గ్రహించాల్సింది ఏమిటంటే ఆ విద్యను తాను నేర్చుకున్నది తన తండ్రితోనే 
ఆ విద్య అంతమై పోకుండా ఉండడం కోసం, అర్హుడైనవాడు కనబడినప్పుడు దానిని బోధించి, తన తర్వాతి విద్యార్థికి ఆ విద్యను అప్పజెప్పడం కోసం మాత్రమే. శివునితో మొదలై మానవ లోకానికి ఆ విద్య వచ్చింది, ఏ విద్య అయినా పరమేశ్వర తత్త్వమే. పరమేశ్వర ప్రసాదముగానే అర్హులైనవారికి లభిస్తుంది. వారి ద్వారా అర్హులైనవారికి ఒకరి తర్వాత ఒకరికి లభిస్తుంది, లభించాలి, ఎందుకంటే ఏ విద్యకైనా లక్ష్యం శిష్ట రక్షణ,

దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ. కనుక ఏ విద్య ఉన్నవారైనా, ఎప్పుడైనా, తమతోనే ఆ విద్య అంతరించిపోకుండా మానవ కళ్యాణార్ధం ప్రపంచానికి అందిస్తూనే ఉండాలి. ఆ రకంగా మనోరమ వరకూ వచ్చింది ఆ అస్త్రహృదయవిద్య.స్త్రీలు ఉపనయన సంస్కారానికి అర్హులు కారు కనుక మంత్ర శాస్త్ర పూర్వకంగా ఆ విద్యను ఉపయోగించే అర్హత లేదు కనుక, స్వరోచికి ఉపదేశించి ఆ విద్య ద్వారా రక్షణ పొందడం. ఆ యుగ ధర్మం అది. వేర్వేరు కాలాలో వేర్వేరు యుగాలలో ఆయా యుగధర్మములను అనుసరించి వేదవిద్య, మంత్ర శాస్త్రం నేర్చుకున్న మహిళామణులు 
ఎందఱో ఉన్నారు, స్వారోచిష మన్వంతరపు కథ కనుక అప్పటికి ఇలా నియమం ఉంది అనుకోవాలి. లేదూ ముందు ముందు వచ్చే కథను బట్టి స్వరోచికి మాత్రమే ఆ అస్త్రహృదయవిద్యను ఉపయోగించే ప్రాప్తం ఉంది అనుకోవాలి, విమర్శనాత్మకంగా కథను పరిశీలిస్తే. శాపగ్రస్తులైనవారు మంత్రపూర్వక విద్యను వారు స్వయంగా ఉపయోగించకుండా, ఇతరులకు ఉపదేశించి తద్వారా ఉపయోగం పొందడం అనేక సందర్భాలలో గమనింపవచ్చు.శిక్షపడి జైలులో ఉన్నవాడు తన సొమ్మును కూడా తాను ఉపయోగించుకుని సుఖిన్చాలేడు కదా, ప్రభుత్వపు  అనుమతి కావాలికదా, కనుక కూడా స్వరోచికి ఉపదేశించవలసిన అవసరం ఏర్పడింది అనుకోవాలి. ఉద్యోగం చేసినా చేయకున్నా స్త్రీ విద్యావంతురాలు కావాలి, తన పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసమైనా, అని మనము అనుకుంటున్నట్టు, తాను ఉపయోగించే అవకాశము లేకున్నా ఒక సజ్జనుడికి, అర్హునికి నేర్పడం కోసమే మనోరమకు ఆమె తండ్రి ఆ విద్యను అందించాడు అనుకోవాలి. ఎవరికీ ఎలా నచ్చితే అలా అనుకుని సాహిత్యాన్ని ఆనందిద్దాము

ఏదేమైతేనేం మనోరమ తన అస్త్రహృదయవిద్యను స్వరోచికి ఉపదేశించడానికి నిశ్చయించుకుంది.

అనుటయు శుచియై నిలిచిన
జననాథునకుం బ్రయోగ సంహారంబుల్ 
వనిత రహస్యంబుగఁ జె
ప్పిన నాతఁడు నెరిఁగె నంత భీషణభంగిన్

మనోరమ ఆవిధంగా పల్కగానే స్వరోచి శుచియైనాడు. అంటే మానసికంగా ఏ శంకలూ లేనివాడైనాడు.అడవి కనుక ఏ విమలమైన సెలయేటిలో స్నానంచేసి వచ్చాడో, లేక ' అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్పున్డరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ' (పవిత్రత, అపవిత్రత అనేది లేకుండా ఏ స్థితిలోఉన్నప్పటికీ పుండరీకాక్ష అని మూడుసార్లు స్మరించుకుంటే చాలు ఆంతరంగిక, బహిరంగ పవిత్రత 
చేకూరుతుంది ) అన్నట్టు పరమాత్ముడిని పరిపూర్ణమైన మనస్సుతో ధ్యానించుకున్నాడో, శుచియైనాడు! అప్పుడు అతనికి ప్రయోగ ఉపసంహారములను మంత్రపూర్వకంగా చేసే విధానాన్ని మనోరమ 'రహస్యం'గా ఉపదేశించింది. రహస్యంగా అంటే ఎవరూ చూడకుండా, ఎవరికీ తెలియకుండా అని మాత్రమే కాదు.ఏకాంతములోనే ఏ మంత్రమునైనా, ఏ విద్యనైనా ఉపదేశించాలి, బోధించేవాడికీ, వినేవాడికీ ఏకాగ్రత ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యిది ఒక కారణం అయితే, ఉపదేశమును పొందినవాడు దానిని అనుభవపూర్వకంగా వినియోగించడం తెలుసుకునేదాకా ఆ విద్య రహస్యంగానే తెరమాటునే ఉంటుందని అర్థం. థియరీకి ప్రాక్టికల్ కి ఉన్న తేడా అన్నమాట. స్వరోచి ఆ అస్త్రహృదయవిద్యను యిలా గ్రహించాడో లేదో, భీకరంగా అలా వచ్చిపడ్డాడు, మనోరమ ఎవరిగురించి చెప్పిందో, ఆ రాక్షసుడు! 

(కొనసాగింపు వచ్చేసంచికలో)         
        
 

***వేంకట వరప్రసాదరావు

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి