భద్రం.కొడుకో! - వేదుల మూర్తి

take care
కాలం మారింది..మారుతోంది..ఇంకా మారుతుంది..ఇది అనివార్యం. నిన్నలా నేడు వుండదు..నేటిలా రేపు వుండదు. కానీ మన పూర్వీకులు మహానుభావులు. అనల్పమైన జీవిత సారాన్ని, అతి స్వల్పమైన మాటల్లో పొందు పరిచి, పద్యాలుగా, నానుడిలుగా, సామెతలుగా మన ముందు ఓ విజ్ఞాన సర్వస్వాన్నే వుంచారు. కానీ మన ఖర్మ కాలి, డిజిటల్ చదువులు వచ్చాయి. మూడో ఏటే స్కూలుకు వెళ్లడం, అయిదో ఏటనే కంప్యూటర్ పట్టుకోవడం. బాగానే వుంది ప్రగతి. అవసరమే కూడా. కానీ దాంతో పాటు వ్యావహారిక జ్ఞానం ఎక్కడ అబ్బుతోంది?

వినదగు నెవ్వరు చెప్పిన...అన్నాడు సుమతీకారుడు. అలా అని ఎవరు ఏమి చెబితే అది వినేసి, తొందర పడి నిర్ణయాలు తీసుకోమనలేదు. మళ్లీ ఆ పద్యకారుడే..అదే పద్యంలో వినినంతెన వేగపడక..అని కూడా చెప్పాడు. విషయం ఏదైనా వినాలి..విన్నాక, తొందరపడక, అది మంచిదా చెడ్డదా అని విశ్లేషించుకోవాలి.  ఇదంతా ఎందుకు చెప్పడం అంటే, మొన్నటికి మొన్నే పాతికి నిండు ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి. కుర్రాళ్లు..నూనూగుమీసాల వాళ్లు, అమ్మాయిలు..ఆశల్ని కళ్లలో నింపేసుకున్నవాళ్లు..మృత్యువాత పడిపోయారు. కొత్త ప్రాంతాలు చూస్తున్నామనే ఆనందం..అంతలోనే ఆవిరైపోయింది. ఇరవై ఏళ్ల పాటు అరచేతుల్లో పెట్టి పెంచుకున్న తల్లితండ్రుల ఆప్యాయత,అభిమానం, అనురాగం, గంగపాలైపోయింది. ఎవరు తప్పు చేసారు.ఏం జరిగిందిన్నది తరువాత.

నాకు ఈ సంఘటన తెలిసిన తరువాత గుర్తుకొచ్చిన నానుడి కీడెంచి మేలెంచు..మన పెద్దలు ఎంత చక్కగా చెప్పారు.ఇది పిరికి మందు నూరిపోయడం కాదు. పాజిటివ్ థింకింగ్ ను వెనక్కులాగడం కాదు. కాస్త జాగ్రత్త చెప్పడం. అవును. కీడెంచి మేలెంచు అంటే అంతకన్నా మరేమీ కాదు. నీళ్లు లేని నది..రాళ్లు తేలిన నది..అందులో దిగే ముందు..ఏమో ఏ పామైనా వుంటుదేమో..డ్యామ్ నుంచి నీళ్లు వదుల్తారేమో అని ఒక్కసారి ఆలోచించి వుంటే? ఏ ఒక్కరైనా అలా ఆలోచిస్తే..అదే పైకి చెబితే, ఈ కాలం కుర్రకారు, ఆ కుర్రాడ్ని పిరికివాడు అంటారు..భయపడుతున్నాడు అంటారు..గేలి చేస్తారు. అందుకే తన నెక్కడ హీరో కాదనుకుంటారో అని కొందరు..హీరోయిజం చూపాలని మరి కొందరు..తెగిస్తారు..తెలియని చోట సాహసాలు చేస్తారు..ఇలా గర్భశోకం మిగులుస్తారు.

ముందస్తు ప్రకటనలు చేయలేదు..ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సపోజ్..ఆ ముందు రోజు దినపత్రికలో రేపు నీళ్లు వదులుతాం అని వేసారనుకుందాం..అక్కడి లోకల్ పత్రికలు యాత్రీకులు చదువుతారా? మన పత్రికల్లో నిత్యం, కరెంట్ తీసి వేతకు సంబంధించి వార్తలు వస్తుంటాయి. ఇక్కడికి వచ్చిన యాత్రీకులు వాటిని పట్టించుకుంటారా? సరే అక్కడి రేడియోలో ప్రకటించారనుకుందాం..వాటిని మనం వినడం కుదురుతుందా..మన పర్యటన హడావుడిలో మనం వుంటాం.

అంటే మిగిలింది మన జాగ్రత్త..ఏమో అలా జరగచ్చేమో? రోడ్డంతా అందంగా వుంటుంది. దొరికింది కదా..అరవై నుంచి ఎనబైకి రైజ్..కానీ కాస్త ఆలోచన..ఎక్కడన్నా ఒక్క గులకరాయి వుంటుందేమో? చిన్న గొయ్యి వుంటుందేమో? సడెన్ గా ఏ మలుపులో నన్నా, ఏ భారీ వాహనమన్నా వస్తుందేమో అని? ఆ ఆలోచననే..మనవాళ్లు కీడెంచి మెలేంచు అన్నారు. అంతకన్నామరేం కాదు.

కానీ చిత్రంగా ఓ సంగతి చెప్పుకోవాలి. ఉద్యోగాలు రాగానే మనవాళ్లు ముందు చేసే పని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం.అది వైద్య భీమా కావచ్చు..ప్రయాణ భీమా కావచ్చు..జీవిత భీమా కావచ్చు..ఎందుకని..అలా జరుగుతుందేమో? అవసరం పడుతుందేమో? అన్న ఆలోచనతో. మరి ఈ తరహా ఆలోచన నిత్య జీవితంలో ఎందుకు వుండదు? బైక్, కారు నడిపేటపుడు, రోడ్ క్రాస్ చేసేటపుడు, తెలంగాణ పాటలో చెప్పినట్లు,,ఎక్కేకాడ..దిగేకాడ..మలుపుకాడ..భధ్రం కొడుకో..అని చెప్పాలి మన పిల్లలకి. అది పిరికి మందు నూరి పోయడం ఎంతమాత్రం కాదని గుర్తించాలి.  చాలా మంది బొమ్మరిల్లు సినిమా చూసి వుంటారు..అందులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ తో తమ తండ్రులను పోల్చుకుని ఆట పట్టించి వుంటారు. కానీ ఆ సినిమాలోనే ఓ గమ్మత్తయిన సీన్ వుంది. అది జస్ట్ అలా చూసి వదిలేసి వుంటారు. ఒక్కసారి గుర్తు చేస్తాను. ఓ సన్నివేశంలో హీరోయిన్ అర్థరాత్రి ఐస్ క్రీమ్ కావాలని వుందని అంటుంది. ఇప్పుడేంటి..నో అంటాడు హీరో. కానీ హీరోయిన్ వినదు. ఒంటరిగా వెళ్లిపోతుంది. ఆ సమయంలో పరుగున వెళ్లి హీరొ, ఆ అమ్మాయికి అర్థరాత్రి అండగా నిలుస్తాడు. ఇప్పుడు చెప్పండి..హీరో అర్థరాత్రి అమ్మాయిని ఎందుకు వెళ్లద్దు అన్నాడు..వెళ్లాక. తాను పరుగున వెళ్లి అండగా ఎందుకు నిలిచాడు. భయం..ప్రేమ..తన వాళ్లకు ఏమవుతుందో అన్న ఆత్రుత. అదే ఆంక్షలు తండ్రి పెడితే, అదే జాగ్రత్త తండ్రి తీసుకుంటే మరి ప్రకాష్ రాజ్ ఎలా అయ్యాడు..తప్పెలా అయింది? అంటే తనదాకా వస్తే కానీ తెలియదన్నమాట. ఈ మాట కూడా మన పెద్దలు చెప్పిన జీవితసత్యమే.

అందుకే కుర్రాళ్లకు..అమ్మాయిలకు ఒక్కటే మనవి. కాస్త జాగ్రత్త..మిమ్మల్ని కన్న మొదటి రోజు నుంచి కళ్లలో పెట్టుకుని పెంచారు. మీరు మొదటిసారి నవ్వినపుడు మురిసారు. మీరు మొదటి సారి నడిస్తే ఆనందించారు..ఇలా మీ ప్రతి అడుగు ఆస్వాదించారు. కానీ మీరు లేకుంటే నిలువునా నీరైపోతారు. అందుకే పిల్లల్లారా..జర భద్రం.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి