పుస్తక సమీక్ష: ఎపిక్స్ అండ్ ఎథిక్స్ - సిరాశ్రీ

Book Review : Epics and Ethics

పుస్తకం: ఎపిక్స్ అండ్ ఎథిక్స్
రచన: ప్రయాగ రామకృష్ణ
వెల: 125/-
ప్రతులకు: 9849990107, [email protected]

"ఆకాశవాణి.. వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ". ఎప్పుడో పాతికేళ్ల క్రితం రేడియోలో విన్న ఈ పేరు ఈ మధ్య రెండు వారాల క్రితం ఈ పుస్తకం కవర్ పేజీ మీద కంటపడింది. టైటిల్ కూడా చూడకుండా, పుస్తకాన్ని తీసుకుని పేజీలు తిప్పాను. అప్రయత్నంగా ఆఖరి వ్యాసం టైటిల్ చదివాను. "మనసే ఒక రేడియో" అని ఉంది. దాంతో నేననుకున్న ప్రయాగ రామకృష్ణ, ఈయన ఒకరే అని ఇంకాస్త బలం చేకూరింది. ఆ ఆఖరి కథనం చదివితే క్లుప్తత, గాఢత రెండూ ఉన్నాయి. మిగతా పేజీలు ఇంకొన్ని అక్కడికక్కడే చదివాను. తాను తన జీవితంలో విన్నవి, కన్నవి, తెలుసుకున్నవి కలగలిపి కథలు, వ్యాసాల రూపంలో మన ముందుంచారు.

ఇవన్నీ పిల్లలు, పెద్దలు కలిసి చదవాల్సినవి అనిపించింది. మనిషికి జీవితంలో విద్య ఎంత అవసరమో, భక్తి, కర్మ జ్ఞానం కూడా అంతే అవసరమని చెప్తుంది ఈ పుస్తకం. కేవలం కథలు కాకుండా కొన్ని ప్రముఖల జీవితలాలతో ముడిపడి జరిగిన సంఘటనలు కూడా ఇందులో పొందుపరిచారు. అవి చదువుతుంటే కర్మ సిధ్ధాంతంపైన నమ్మకం బలపడుతుంది. "చేసిన పుణ్యం చెడని పదార్థం" అందుకు ఉదాహరణ. చదివి తీరాలి. అలాగే "దేవుడి జోలికి పోకండి" అనే కథ నేటి రాజకీయ నాయకులు, అధికారులు చదవాల్సినది. అలాగే "అనువ్రతాలు అద్భుత ఫలాలు" అనే కథ సిగ్గుకి-దురాశకి, ధైర్యానికి-భయానికి, ఆరోగ్యానికి-వ్యాధికి, బుధ్ధికి-కోపానికి గల సంబంధాన్ని శాస్త్రీయంగా చెబుతుంది. చక్కటి కథ.

 

మొత్తం 162 పేజీల్లో ఉన్న 42 కథలూ/వ్యాసాలు దేనికదే గొప్పగా ఉంది. దేనినీ తక్కువ చేయలేం. కథలన్నీ రెండు మూడు పేజీల్లో పూర్తయిపోవడం వల్ల పాఠకుడిని పరుగెత్తిస్తాయి. ఒక పూట ఏ పనీ పెట్టుకోకపోతే ఇందులో కథలన్నీ ఆశ్వాదిస్తూ చదివేయొచ్చు. శాశ్వతంగా గుర్తుపెట్టుకోదగ్గ సరుకు ఉంది కనుక పనిగట్టుకుని మరిచిపోకుండా నెలకోసారైనా పునశ్చరణం చేసుకోవాలి. 

అసలీ పుస్తకానికి ఈ టైటిల్ పెట్టడంలోనే ఔచిత్యం ఉంది. రామాయణం, భారతం, మార్కండేయ పురాణం...లాంటి ఎపిక్స్ తో పాటూ మానవేతిహాసాలు, స్వానుభవాలు కూడా కనిపిస్తాయిందులో. అన్నింటిలోంచి ఏదో ఒక ఎథిక్ దర్శనమిస్తుంది. ఈ కథనాల్లో కనీసం ఒక్క కథనం అయినా ప్రతీ పాఠకుడిని కదిలిస్తుంది. అది ఎంతలా కదిలిస్తుందంటే జీవితాన్ని ప్రభావితం చేసేంత.

దీనికి చక్కని ఉప శీర్షిక కూడా తగిలించారు. "అన్ని కాలాలలో..అందరికీ.." అని. అది సరిగ్గా సరిపోయింది. ఈ కథనాలు కాలదోషం పట్టనివి. "20 ఏళ్ల జ్ఞానులూ ఉంటారు, 90 ఏళ్ల మూర్ఖులూ ఉంటారు" అని ఎవరో అన్నట్టు వయసుకు, వ్యక్తిత్వానికి సంబంధం పెద్దగా ఉండదు. ఏ వయసులోని వారికైనా మూర్ఖత్వాన్ని కరగ్గొట్టే వెచ్చదనం ఈ కథనాల్లో ఉంది.

ఇంతకన్నా విపులంగా చెప్పడం అనవసరం. ఈ పుస్తకాన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా చదవడం ఒక్కటే అవసరం. ఉపశీర్షిక ప్రకారం "అన్ని కాలాలలొ.." చదవదగ్గది కాబట్టి అసలంటూ తెచ్చి పెట్టుకుంటే కాలాక్షేపంకోసం చదవడం మొదలెట్టినా కాలం చేసే లోపు ఆత్మోన్నతికి కోసం ఎంతో కొంత జ్ఞానం సంపాదించొచ్చు. జిజ్ఞాసువులు త్వరపడండి

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి