బాక్సింగులో అవేవో ‘పంచింగ్ బ్యాగ్స్ ‘ అని ఉంటాయిట. ఓ ద్వారబంధానికో,ఇంకోదానికో వేళ్ళాడతీసి, దానిమీద ఎడా పెడా బాదుతూ ప్రాక్టీసు చేస్తారుట ! అలాగ ఉన్నదానికీ, లేనిదానికీ పిల్లల “ పంచ్ “ లు భరించేవాళ్ళు తల్లితండ్రులు.
ఆ మధ్యన హిందీలో 3 Idiots, తెలుగులో " బొమ్మరిల్లు" సినిమాలొచ్చాయి. ఏదో నాకు తెలిసినవి ఇవి మాత్రమే. ఇంకా చాలా నే ఉండుండొచ్చు. తెలిస్తే చెప్పండి. నాకు జ్ఞానబోధ చేసిన వారవుతారు. ఆ రెండు సినిమాల్లోనూ theme అయితే దాదాపు ఒక్కటే. తల్లితండ్రులు, పిల్లలకి వాక్స్వాంతంత్రం ఇవ్వకుండా, తమకి ఇష్టమైనదే చేయమంటారని. ఎంత చెప్పినా ఈ రోజుల్లో ప్రతీ అమ్మాయికీ, అబ్బాయికీ ఈ topic చాలా ఇష్టమైనది కావడంతో ఈ రెండు సినిమాలూ సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి. హిందీలో ఎలాగూ అయింది కదా అని, దర్శకుడు శంకర్ దాన్ని తెలుగులో "స్నేహితుడు" అని కూడా తీశాడు. ఇప్పుడు ఈ వ్యాసం తెలుగులోంచి, హిందీలోకీ, హిందీలోంచి తెలుగులోకీ తీసే సినిమాల గురించి కాదు. అయినా వాటిగురించి చెప్పేదేమిటిలెండి, ఓ హిందీ సినిమా వచ్చిందంటే, దానిని హిందీ లోకి డబ్ చేసి అదే నటీనటులతో ఓ వెర్షనూ, మళ్ళీ ఎవడికో నచ్చిందని, ఆ సినిమా రైట్లు కొనేసి, మళ్ళీ హిందీలోనూ అదే కథా, మక్కికిమక్కీ అవే సీన్లతోనూ, మహ అయితే ఓ ఐటం సాంగో, రేప్ సీనో added attraction గా పెట్టేసి ఓ ఏడాది లోపల హిందీ సినిమాకూడా చూసేస్తున్నాము. పైగా మన చానెళ్ళలో కూడా, ఈ మూడు రకాల సినిమా ( original, dubbed and hindi version) లు ఒకే రోజున మన తెలుగు చానెల్లోనూ, అదేదో UTV ట, దాంట్లోనూ, SET MAX, Star Gold ట దాంట్లోనూ కూడా చూసే దౌర్భాగ్యం కూడా అనుభవిస్తున్నాము. అది మన దురదృష్టం !!
ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే పైన చెప్పిన రెండు సినిమాల్లోనూ కూడా థీమ్ ఏమిటీ, మళ్ళీ చెప్పడం ఎందుకులెండి? ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి, ఈ ప్రక్రియ- " తల్లితండ్రులకే ఇష్టమైనవి తమ తమ పిల్లల మీద రుద్దుతున్నారూ.." అన్నది ఈవేళ్టికీవేళ వచ్చిందేమీ కాదు. యుగయుగాలనుండీ జరుగుతున్నదే. ఇదివరకటి వారికి చెప్పే ధైర్యం ఉండేది కాదు, ఇప్పటివారికి తల్లితండ్రులు ఇచ్చిన so called freedom వల్ల చెప్పుకోకలుగుతున్నారూ, దానికి సాయం ఈ సినిమాలూ, సీరియళ్ళూ తోడోటి.That simply is the difference.కానీ ఆ విషయం ఒప్పుకోడానికి రెడీగా లేరే ఇప్పటి వారు!
అసలు చదువు అనేది ఎందుకు చెప్పిస్తున్నారూ, ఏదో నాలుగాకులు చదివి, వాడి పొట్ట వాడు పోషించుకుంటాడనే కదా. ఇదివరకటి రోజుల్లో, మహ అయితే ఓ మామూలు డిగ్రీ ఉండేది. దానికీ ఓపికలేకపోతే ఓ డిప్లొమా. ఓ డిగ్రీ చేతబట్టుకుంటే, ఓ తాలూకాఫీసులో గుమాస్తాగానో, నగరాల్లో ఏజీ ఆఫీసుల్లోనూ చేరేవారు. ఇంతకాలమూ, మనం ఎలాగూ పాట్లు పడ్డాము కదా, మళ్ళీ పిల్లాడిక్కూడా ఈ తిప్పలెందుకూ , ఇంతకంటే మంచి ఉద్యోగం లోనే బాగుపడతాడూ, అని మనసారా కోరుకుని, తల తాకట్టు పెట్టి, అప్పులు చేసి చదివించేవారు. నూటికి యాభై మంది ఇలా పైకి వచ్చిన వారే. కారణం ఆ రోజుల్లో ఓ బోర్డు స్కూల్లో సెకండరీ గ్రేడ్ , పి.టి, తెలుగు పండిట్ etc..etc.. లాటివే కదా ఉద్యోగాలూ. జీతాలా అంతంత మాత్రం, ఇంటినిండా పిల్లలూ, చుట్టాల ఒత్తిళ్ళు, ఎక్కడ చూసినా ఇవే కదా పరిస్థితులూ? ఏదో డాక్టరీ, ఇంజనీరింగు కే మొదటిపీట వేసేవారు. పైగా ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని faculty, లు కూడా ఎక్కడుండేవి? ఇప్పుడు జీవితంలో ఎటువంటి దానికైనా ఓ డిగ్రీ/ డిప్లొమా వచ్చేశాయి.అదేమిటో ఎవణ్ణి చూసినా అదేదో subject లో డిగ్రీ చేశాననేవాడే. పైగా వాటికీ ఓ వరసా వావీ లేవు. ఈ స్పీడు చూస్తూంటే, ఎప్పుడో ఒకప్పుడు...Degree in Hoarding, Diploma in Smuggling, Post Graduation in Kidnapping, Short Term Course in Rape. Full time Degree in Extortion and Black Mailing అనేవి వచ్చినా ఆశ్చర్యపడఖ్ఖర్లేదు... ఎవడిష్టం వచ్చిన వాటిలో వాడిని చదువుకోమనండి. కాదూ కూడదూ అనుకుంటే వాళ్ళ పిల్లల్ని చదివించుకోమనండి
ఇంజనీరింగులూ, మెడికల్ ఎడ్యుకేషనూ అంత అవసరం లేదనుకుంటే, మరి వీధి వీధికీ అన్నేసి కాలేజీలెందుకుట? అవేవో ఎంశాట్లూ, ఇంకోశాట్లూ, సీఈటీ లూ ఎందుకుట. పైగా వీటన్నిటికీ కోచింగులంటూ అన్నేసి ఆదిత్యలూ, నారాయణలూ, చైతన్యలూ ఎందుకుట? దీనివల్ల తేలిందేమిటయ్యా అంటే, ఎన్నేసి సినిమాలు వచ్చినా bottom line ఏమిటీ అంటే, చదువుకునే ప్రతీ వాడూ మొదటి ప్రిఫరెన్స్ వీటికే ఇస్తాడూ అనే కదా. మరి ఈమాత్రం దానికి, పాపం ఆ తల్లితండ్రుల్ని day in and day out ఆడిపోసుకోడం ఎందుకూ అంట?
ఇంక కొంతమందుంటారు, అసలు నాకు ఫలానాది చదవాలని లేదండీ, ఏదో అమ్మా నాన్నా చెప్పారు కదా అని చేరిపోయానూ, అసలు నా ఇంటరెస్ట్ ఫలానాదండి.I love music, I love cricket, I love సింగినాదం జీలకర్ర... అంటూ passion ల గురించి హోరెత్తించేయడం. కానీ ఇన్నిటిలోనూ, వాళ్ళ తల్లితండ్రులకి కూడా ఓ passion ఉందీ, That is nothing but to see their offspring shine in life.. అనేది అన్న విషయం మర్చిపోతున్నారు. తేరగా దొరికేది తల్లితండ్రులే కదా. పాపం వాళ్ళేమో.." నిజమే కాబోసు అనవసరంగా వాణ్ణి ఇంజనీరింగు చదివించాము, వాడిక్కవల్సిందేదో చదివించినా పోయేది." అనేఓ అనవసరమైన guilty feeling లోకి దించేస్తున్నారు.
Passion అనేదుండకూడదనడం లేదు. ప్రతీ వాడికీ ఆ passioనే లేకపోతే, జీవితంలో పైకి రానే లేడు. కానీ దానికి తల్లితండ్రులే బాధ్యులూ అనడం మాత్రం భావ్యంగా లేదు. ఈమధ్యన కొంతమంది తల్లితండ్రుల్నీ చూస్తున్నాము, కొడుకు చదవనన్నాడనో, లేక ఇంకో కారణం చేతో మొత్తానికి ఇంజనీరింగూ, మెడిసినూ కాకుండా ఇంకోదాంట్లో చేర్పిస్తున్నారు. ఇది బయటకి కనబడే picture . తెరవెనక్కాల జరిగిన భాగవతమూ, పిల్లాడితో జరిగిన arguemenటూ, మొత్తుకోడాలూ , వగైరాలు బయటకి రావనుకోండి.పైకి మాత్రం ideal parent గా ఓ పోజెట్టేసికోవచ్చు.పైగా అడిగినవాడికీ, అడగనివాడికీ చెప్పుకోడం.. final choice. వాడికే ఇచ్చేసేమండి అంటూ... This is the biggest joke of the century.. ఏ తండ్రీ కొడుకు చదువు విషయంలో.." రా నాన్నా, నీకే కోర్సులో చేరాలనుకుంటే దాంట్లోనే చేరు, ఏ కోర్స్సులోనూ చేరనూ అంటావా, పోనీ ఓ క్రికెట్టో, హాకీయో ఆడుకుంటూండూ, వగైరా..వగైరా.." లు, కూతురు పెళ్ళి విషయంలో.." అలాగా అమ్మా, ఆ పిల్లాడంటే అంత ఇష్టమా తల్లీ, పోన్లే వాణ్ణే చేసుకో తల్లీ..." అని అంటారనుకోడం, సినిమాల్లోనూ, సీరియళ్ళలోనే జరుగుతాయి, అంతేకానీ నిజ జీవితాల్లో కాదు. ప్రతీ తండ్రీ ముందు ఓ రాయి వేస్తాడు, convince చేయడానికి ప్రయత్నమూ చేస్తాడు. చివరకి ఏదారీ లేక నోరుమూసుకుని ఒప్పుకుంటాడు.
వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఈ రోజుల్లో పిల్లలు అడిగినట్టు చేయకపోతే, ఏ అఘాయిత్యం చేస్తారో అనే ఒక ‘ అభద్రతా భావం ‘ ఒకటీ. ఒప్పుకున్నా తప్పే, ఒప్పుకోకపోయినా తప్పే.. చివరకి ప్రతీవాడికీ ఆ పిల్లలతో సహా తేరగా దొరికేది పాపం తల్లితండ్రులే...