ప్రభుత్వానికి పట్టని వైనాలు - వేదుల మూర్తి

government

పూర్వం రాజుల పాలన వుండేటపుడు, వాళ్లు మారువేషాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని, చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి సారించేవారు. ఇప్పుడు ప్రజాస్వామ్య యుగం నడుస్తోంది. విదేశాల్లో చాలా చిన్న చిన్న విషయాలపై ప్రభుత్వాలు దృష్టిసారిస్తాయి. రోడ్డుపై చెత్తపోయడం, రోడ్డ పక్కన మూత్ర విసర్జన చేయడం లాంటివి. కానీ మన దేశంలో మాత్రం ప్రభుత్వాలు చిన్న చిన్న విషయాలను అస్సలు పట్టించుకోవు. వాటిని చూసీ చూడనట్ల వదిలేస్తాయి. గతవారం విద్యా సంస్ణలు-పర్యటనలపై భద్రం కొడుకో..అంటూ రాసినపుడు మిత్రులు చాలా మంది ఫోన్లు చేసి వారి అభిప్రాయాలు పంచుకున్నారు. తమిళనాట ఇలాంటి పర్యటనలపై నిషేధం వుందని, మన ప్రభుత్వం ఇలా ఎందుకు చేయదని ఒకరు ప్రశ్నించారు.

నిజమే ప్రభుత్వం అంటే మరీ భారీ విషయాలే కాదు చిన్న చిన్న సంగతులు కూడా చూడాలి. ఇప్పుడు కొత్తగా ఎక్కడిక్కడ కాలనీలు వస్తున్నాయి. ఈ కాలనీల్లో ఎవరి ఇళ్ల ముందు వారి వారి క్షేమం కోసం ఇష్టం వచ్చినట్లు స్పీడ్ బ్రేకర్లు కట్టేస్తున్నారు. వీటికి నిబంధనల ప్రకారం కొలతలు వుండవు.. అటు ఇటు తెల్లగీతలు వుండవు. చాలా చాలా చిన్న విషయం. కానీ చీకట్లో ఎన్ని ప్రమాదాలో..కానీ ఏ అధికారీ పట్టించుకోరు. ప్రభుత్వ శాఖలు తప్ప వేరేవేరు స్పీడ్ బ్రేకర్లు వేయకూడదు అని నిబంధన వుండదు.

సరే, విద్యాసంస్థల విషయానికి వద్దాం. ఇవ్వాళ కాన్వెంట్లు, స్కూళ్లు, కాలేజీలు ఎన్ని విధాల దోపిడి చేస్తున్నాయో ప్రతి తల్లి తండ్రికి తెలిసిందే. ముఖ్యంగా ఈ పర్యటనలు, ఏడాదికి రెండు మూడు ఫంక్షన్లు చాలు దోచుకోవడానికి. పిల్ల, పిల్లాడిని ఏదో ఒక కార్యక్రమంలో ఇరికించడం, దానికి ఈ డ్రెస్ కావాలి..ఆ డ్రెస్ కావాలి..అని వందలు, వేలు గుంజేయడం. మళ్లీ అవి ఇస్తారా అంటే, కొన్ని సంస్థలు ఇస్తాయి..కొన్ని ఇవ్వవు. ఇచ్చినా ఆ చెమ్కీలు, డిజైన్ లు పిల్లల బయట ధరించడానికి పనికారావు. తల్లి తండ్రుల జేబుకు ఏడాదికి రెండు సార్లు ఈ తరహా చిల్లు పడుతుంది.

ఇంజీనీరింగ్ కాలేజీల్లో కాషన్ డిపాజిట్ అనేది ఒకటి వుంటుంది. ఇది కనీసం వెయ్యి రూపాయిలు. కొత్తగా కాలేజీ పెట్టారనుకోండి..కనీసం 600 నుంచి 1000 మంది విద్యార్థులు. అంటే పది లక్షలు వస్తుంది. కాలేజీ నుంచి వెళ్లిపోయేటపుడు తిరిగి ఇస్తామంటారు. నాలుగేళ్లు పూర్తయ్యాక  కానీ తొలి బ్యాచ్ బయటకు వెళ్లదు. అంటే అంటే యాభై లక్షలు పోగయ్యాక, పది లక్షలు వెనక్కు ఇస్తారు. అక్కడి నుంచి ప్రతి ఏటా వస్తుంటాయి..ఇస్తుంటారు. ఈ మొదటి నలభై లక్షలు మాత్రం కాలేజీకి వడ్డీ లేని అప్పు. లేదా బ్యాంకులో వేసుకుంటే, సగటున నాలుగైదు లక్షల వడ్డీ. తిరగి ఇచ్చేటపుడు వడ్డీతో స్టూడెంట్ కు ఇవ్వాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయించదు. పోనీ తిరిగి వెనక్కు సక్రమంగా ఇస్తాయా అంటే, పాత విద్యార్థుల సంఘం పెడతాం. అయిదువందలు డొనేషన్ అంటే. సగం కొసేసే కాలేజీలు ఎన్నో. విద్యార్థులు సంఘం పెట్టుకోవాలి కానీ, కాలేజీ యాజమాన్యం పెట్టడం ఏమిటి? అని ఎవరూ అడిగే పరిస్థితి వుండదు. ప్రభుత్వం ఇలాంటి చిలక్కడులాంటి దోపిడీలు అస్సలు పట్టించుకోదు.

విద్యాసంస్థల్లో ఈ విహార యాత్రలను నిషేధించాలి. ఎందుకంటే ఎవరి పిల్లలను వాళ్ల తల్లితండ్రులు ఎటో అటు తీసుకెళ్లలేరా? స్తోమత వుంటే తీసుకెళ్తారు..లేకుంటే లేదు. ఈ బలవంతపు బ్రాహ్మణార్థం ఎందుకు? ఇప్పుడు హాయ్ లాండో,. రామోజీ ఫిల్మ్ సిటీనో పిల్లలకు చూపించకపోతే, వారికి వచ్చిన విద్యకు లోటేమిటో? టీచర్లను వివిధ విహార సంస్థలు కూడా ప్రలోభాలకు గురిచేస్తున్నాయన్నది వాస్తవం. విద్యాసంస్థలకు పుస్తకాల దుకాణాలు, యూనిఫారమ్ ల షాపుల మాదిరిగా ఈ విహార సంస్థలు కూడా కమిషన్లు చెల్లిస్తాయని, లేదా ఆఫర్లు ఇస్తాయని వార్తలు వినవస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి వాటిపై ఎందుకు దృష్టి సారించదు. ఇలాంటి అన్ని వ్యవహారాల వల్ల చదువులు ఖరీదైపోతున్నాయి అని ప్రభుత్వం ఎందుకు గుర్తించదు. మన ఖర్మ ఏమిటంటే, ప్రభుత్వం అసలు కీలకమైన ఫీజులే నియంత్రించదు..ఇక ఇలా చిన్న చిన్న విషయాలు ఎందుకు పట్టించుకుంటుంది?

చిత్రంగా స్కూళ్లు చేసే ఇలాంటి వ్యవహారాలన్నీ మీడియా కూడా పట్టించుకోవడం మానేసింది. ఏదో ఏడాదికోసారి మొక్కుబడిగా ఒకటో అరో వార్తలు రాయడం తప్ప మరింకేమీ జరగదు. ఎందుకంటే, ఇవ్వాళ విద్యాసంస్థల ప్రచారపు ఖర్చు వందల కోట్లు దాటిపోయింది. ఫుల్ పేజీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అసలు ప్రభుత్వం ఎందుకు విద్యాసంస్థల ప్రకటనల ఖర్చుపై సీలింగ్ విధించదు. వెనకటికి పెళ్లిళ్ల ఖర్చు తగ్గించాలలని, విలాసాలు తగ్గించాలని ప్రతిపానలు వచ్చాయి. అదే మాదిరిగా అసలు ఒక్కో విద్యా సంస్థ ప్రకటనలపై ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఆ విద్యా సంస్థలో ఆ ఏడాది చదివిన విద్యార్థులెందరు? సగటున ఒక్క విద్యార్థికి ఎంత ఖర్చు చేసారు అన్న దానిపై బహిరంగంగా వివరాలు ప్రకటించాలి అని ప్రభుత్వం ఆదేశించింది అనుకోండి, అప్పుడు విద్యా సంస్థలు ఎందుకు పాటించవు. ఆ మేరకు ప్రకటనల ఖర్చు తగ్గించి, విద్యార్థులపై భారం తగ్గింమని ప్రభుత్వం ఆదేశించవచ్చు కదా.

ప్రభుత్వం ఇలా చేయాలి. అలా చేయాలి అని ఎక్కడా లేదు. ప్రజా క్షేమం కొసం ప్రభుత్వాలు ఏమైనా చేయచ్చు..వాటిని ఏ కోర్టులు తప్పు పట్టవు కూడా. కానీ మన దగ్గర సమస్య ఏమిటంటే, వ్యాపారాలకు, రాజకీయనాయకులకు తేడా లేకుండా పోయింది. నిన్నటి దాకా వ్యాపారులు రాజకీయనాయకులకు మామూళ్లు ఇచ్చి, పని కానిచ్చేవారు. కానీ ఇప్పుడు వారే రాజకీయాల్లోకి వచ్చి, అధికారంలో కూర్చుంటున్నారు. ఇక ఎవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు?

అందుకే కులు మనాలి లాంటి సమస్యలు వచ్చినపుడు మూలాల్లోకి పోకుండా, పైపైన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం పని చేస్తోందని ప్రజులు అనుకోనేందుకు. అంతకు మంచి రుగ్మత తుదలంటా మానేందుకు  మాత్రం చర్యలు తీసుకోరు. ఎందుకంటే అది వారికే నష్టం కనుక. దీనికి ఒకటే విరుగుడు. ప్రజులు సొషల్ వెబ్ సైట్లలో పదే పదే చర్చించి, ప్రభుత్వం దృష్టి ఇటువంటి సమస్యలపైకి వచ్చేలా చేయడం. ఆ పార్టీ తరపునో, ఈ పార్టీ తరపునో సోషల్ నెట్ వర్క్ ల్లో పోస్టింగ్ లు చేసే  బదులు, మన సమస్యలను ముందు మనం పదేపదే ప్రస్తావిస్తూ, తోటి జనంలో చైతన్యం తీసుకురావాలి. అప్పుడు కాస్తన్నా ఫలితం వుంటుంది.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి