సాహితీవనం - వేంకట వరప్రసాదరావు

saahiteevanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిషమనుసంభవము

(గతసంచిక తరువాయి)

భీకరముగా అట్టహాసం చేస్తూ పళ్ళు కొరుకుతూ చేతిలోని గదను విసురుగా సుడులు త్రిప్పుతూ మనోరమను వెంటాడుతున్న రాక్షసుడు వచ్చిపడ్డాడు.

దానవుఁ డద్ధరారమణుఁ దాఁకె నుదగ్ర పదాగ్ర ఘట్టన
గ్లాని సపాటమై యచటి కాన ఘరట్ట విఘట్టితాకృతిం
బూని చెడన్ గిరీశ గళ మూల హలాహల కాలకాంతితో
మేనరికంబు లాడు తన మేటి త్రిశూలముఁ బూని యుద్ధతిన్

ఆ దానవుడు తన భయంకర పద ఘట్టనలతో ఆ అడవి, అందులోని పొదలు, తరువులు పిండి
పిండి ఐపోయేట్లు నామరూపాలు లేకుండా చేస్తూ, శివుని గొంతులోని హాలాహలంతో మేలము
ఆడుతున్నట్లున్న, వేళాకోళం చేస్తున్నట్లున్న నల్లని పెను త్రిశూలాన్ని (మరొక చేతిలో) పట్టుకుని
వచ్చిపడ్డాడు.

నింగి నొరయు రాకాసి మన్నీని మేని
నీడఁ జీఁకటిగొనె నవనీతలంబు
చంద్రికలు గాంచె నట్టహాసముల వెడలు
నిశితదంష్ట్రలచే నవనీతలంబు

ఆకాశాన్ని తాకుతున్నట్లున్న పెను శరీరంతో వాడు వస్తుంటే వాడి నీడ పడినమేరా చీకట్లు క్రమ్మినట్లు
ఐపోయింది భూమి. వాడు అట్టహాసం చేస్తుంటే వాడి పదునైన కోరలు బయటపడినప్పుడు చంద్రకాంతి
సోకినట్లు తెల్లగా మెరిసిపోయింది భూమి. ఇక్కడ పంచచామర వృత్తం అనబడే ఒక ఛందో మార్గంలో
గమ్మత్తైన పద్యం చెప్పాడు పెద్దన'

పలాశి డాసి రాజుఁ జూచి పల్కె నోరి! నోరి కీ
పొలానఁ బెన్పొలాన లేకపోవ నీవు దోఁచి తౌ
బలా! బలాలితోడఁ బాలఁ బట్టి బిట్టు చుట్టి నిన్
హళాహళిన్ హలాహలాభ యౌ బుభుక్షఁ దీర్చెదన్

పలము అంటే మాంసము. పలాశి అంటే మాంసమును తినేవాడు. ఒక్క ఒత్తు, ఒక్క పొల్లు, ఒక్క
మహాప్రాణము పోతే పోయేదేముంది, కాలముతో మారకుంటే ఎట్టా? అనడం భాషమీద ప్రేమలేనివారికి,
అవగాహన లేనివారికి చేతకానివారికి ఒక ఫాషన్ ఐపోయింది. 'ప'.. 'ఫ' తేడాలతో పలము అంటే
మాంసము అనే అర్థము, ఫలము అంటే పండు అనే అర్థము. కనుక మూలాలకు బలమైన కారణాలు
ఉంటాయి. అది తెలుసుకోకుండా పాతది అంతా రోత అనుకోవడం, కొత్తది ప్రతిదీ గొప్ప అనుకోవడం
తెలివితక్కువతనం. అలాగే పాతది అంతా గొప్ప, కొత్తది చెత్తది అనుకోవడం కూడా. దేనినైనా అవసరం
మేరకు ఆహ్వానించాలి. అనవసరమైనదానిని తిరస్కరించాలి.

ఆ మాంస భక్షకుడు రాజును చూసి ఓరి! నోటికి ఈ పొలాన (పొలములో) దిట్టమైన పొల(మాంసము)
ఆన(తినడానికి) లేకుండా పోయింది. అంతటి దట్టమైన అడవి వాడికి పొలములా కనిపించింది. పొలము
అంటే కొద్దిపాటి భూమి అనే అర్థము, అడవి అనే అర్థము కూడా. నువ్వు కనిపించావురా! భళీ! భళీ!
అంటూ ( బలాబలాలితోడ) వెంటనే, భయపడేలా(బిట్టు అనే పదానికి ఈ రెండు అర్థాలు అని నిఘంటువు
చెప్తుంది) మిమ్మల్ని చుట్టేసి అంటే మడతపెట్టి కరకరలాడేట్టు, పెద్ద ధ్వనితో(హళాహళిన్) హాలాహలంలాగా
చెలరేగుతున్న నా ఆకలిని తీర్చుకుంటాను..(అని)

అని బాహా స్ఫోటరావా హత పతగకులం బవ్వనీశాఖి శాఖా
జనిత వ్యాకీర్ణ జీర్ణ ఛ్ఛదముల కరణిం జల్లనన్ రాల భూషా
ర్చినుదీర్ణాలాత చక్రాకృతిగ జిఱజిఱన్ ద్రిప్పి వైచెన్ గదన్ వై
చినఁ దేజిన్ రాజు గెంటించెఁ దొలఁగ నది యచ్చెంత కాంతార మేర్చెన్

చుట్టుప్రక్కల చెట్లమీది పక్షులు ఎండిపోయిన ఆకులలా రాలేట్లుగా పెద్ద ధ్వనితో బాహువులను చరుచుకుని,
మంటలు వెలువరించే చక్రాన్ని తిప్పినట్టు గిరగిరా తన గదను తిప్పి రాజుమీదికి విసిరివేశాడు. రాజు(స్వరోచి)
నేర్పుగా గుర్రాని పక్కకు దూకించి తప్పించుకున్నాడు. ఆ గద వెళ్లి తుప్పల్లోపడి పడినంతమేరా ఆ తుప్పలను,
అడవిని దహించివేసింది.

గదాహతికి నాత్మఁ గొంకక యెదిర్చి రాఁగా ని దౌఁ
గదా యనుచుఁ ద్రిప్పి రాక్షసుఁడు వైచె గాఢ భ్రమీ
నద త్కనక కింకిణీ నటన జాగ్ర దుగ్రార్భటీ
వదావద మహాగుహా వలభియైన శూలంబునున్

తన గదా ప్రహారానికి జంకక ఎదిరించి రావడంతో ఇదా సంగతి అంటూ మహా ప్రాసాదపు చూరుకమ్మీ లాంటి
శూలాన్ని దానికున్న గజ్జెలు మ్రోగుతుండగా, గిరగిర త్రిప్పి వేశాడు, పెద్దగా ధ్వనులను వెలువరిస్తూ అది
విసురుగా వచ్చి పడింది. 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి