నోరా వీపుకు తేకే - వి. రాజా

back will effect with mouth

అందరికీ తెలిసిన చందమామ కథలనాటి సంగతి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. సాధారణంగా మాటకారతనం బాగా వున్నావాళ్లు గతంలో రాజకీయ నాయకులుగా రాణించేవారు. ఇప్పుడు వారు పీఠాధిపతులు , మతాధిపతులు అయి కూర్చున్నారు. లాడ్జికన్నా ఆసుపత్రి పదిలం. ఎందుకంటే రెండింటికి ఇప్పుడు పెద్ద తేడా వుండడం లేదు. రూమ్ రెంట్లు, విలాసాలు,,వగైరా. ఎటొచ్చీ లాడ్జి అంటే మనం అందరికీ వంగి వంగి దండాలు పెట్టాలి. అదే ఆసుపత్రి పెట్టండి. అందరూ వచ్చి మీ దగ్గర వినయంగా వుంటారు. మా పేషెంట్ ను కాస్త స్పేషల్ గా చూడండి అంటూ.

ఇప్పుడు రాజకీయ నాయకుల కన్నా పీఠాధిపతులు, మతాధిపతులు మిన్నగా వున్నారు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ల కాళ్ల దగ్గరే వుంటారు కాబట్టి. అందువల్లే ఈ దేశంలో మతాధిపతులు, పీఠాధిపతులు దైవకార్యక్రమాల కన్నా రాజకీయ ప్రాపకాలు, రాజకీయ కార్యకలాపాలు ఎక్కువగా చేస్తున్నారు. తమ మఠాలకు ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి. మెడికల్ కాలేజీలు కావాలి. దేశం నలుమూలలా గుళ్లు గోపురాలు కట్టాలి. వాటిని తమ చిత్తానికి మేనేజ్ చేయాలి.  ఇలాంటి వాళ్లలో ఒకాయినకు ఇప్పుడు సాయిబాబా మందిరాలపై చిరాకు పుట్టింది. అవును మరి, తమ గుళ్లు గోపురాల్లా అవి హుండీలు నింపేసుకుని ఊరుకోవడం లేదు. ప్రతి మందిరంలోనూ ఉచిత అన్నదానాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తన్నాయి. పూజలకు ఫీజులు పెట్టడం లేదు. అందువల్ల బాబా మహిమలు ఆ నోటా ఈ నోటా పాకి, ప్రపంచం మొత్తం సాయితత్వంలో మనిగి తేలుతోంది. ఇది చాలా బాధగా వుంది పాపం ఈ పీఠాధిపతులకు.

అందుకే ఒకాయిన పాపం, నోరు పారేసుకున్నారు. బాబా అన్నదే అంతర్జాతీయ కుట్ర అని కనిపెట్టారు. ఆయన దైవం కాదు..అవతారం కాదు..గుళ్లు కట్టద్దన్నారు. పీఠాధిపతులు, పెద్దవాళ్లు, తమ వాక్కును వీలయినంత తక్కువ వాడాలి. రాజకీయ నాయకులతో సహవాసం చెేసి, ఈ పీఠాధిపతులు కూడా తమ చిత్తానికి మాట్లాడుతున్నారు. ఇలాంటి తక్కువ మాటలు మాట్లాడి పీఠాధిపతులు అచ్చమైన రాజకీయ నాయకుల్లా తయారవుతున్నారు. ఆర్నెల్లు సావాసం చేస్తే వీరు వారవుతారంటే ఇదేనేమో?

మనలో మాట ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు ఇప్పుడు ఎలా వున్నారో చూస్తున్నాం కదా..బెంజ్, ఆడి తరహా కారులు వుంటే తప్ప వీళ్లు కాళ్లు కిందపెడతారా? పరమపూజ్య చంద్రశేఖర సరస్వతి లాంటి వాళ్లా వీరు. శంకరాచార్యకు సిసలైన వారసులా వీరు? మాట అంటే కోపం వస్తుంది. మన రాష్ట్రంలోనే ఓ స్వామీజీ వున్నారు. ఏటా ఓ పత్రిక ఎడిటర్ ను పిలిచి యథాశక్తి బహుమతులిస్తుంటారు. ఆయన గారు ఈయన దగ్గినా, తుమ్మినా వార్త వేస్తుంటారు. ఈయన ప్రపంచంలో ఏ మూల కెళ్లినా ఇక్కడ వార్త రావాలి మరి. ఈ పీర్వో వ్యవహారాలు అవసరమా స్వాములకు.

ప్రభుత్వం మారగానే ఓ పీఠాధిపతికి సంబరం. తనకు అనుకూలం కాబట్టి, ఇక తనకు ఎక్కడ వెళ్లినా రాచమర్యాదలని. ఆ ప్రభుత్వం నుంచి ఈ పాఠశాల, ఆ ఆశ్రమం పేరుతో స్థలాలు తీసుకోవచ్చని. ఈ ప్రభుత్వం మారగానే మరో స్వామీజీకి ఆనందం. ఇక తన హవా ప్రారంభమవుతుందని. వీళ్లకు నచ్చితే తిరుపతిలో ఆచారాలు పదిలం. నచ్చకుంటే అంతా అనాచారం. నిజానికి అంతా రాజకీయం.

ఇప్పుడు సవాలక్ష లింగాల్లో బోడిలింగం అన్నట్లు, ఈ దేశంలో వున్న సవాలక్ష స్వామీజీలు, పీఠాధిపతుల్లో ఒకరు, షిర్డి సాయి బాబా మీద తన యథాశక్తి నోరు పారేసుకున్నారు. నిజానికి బాబా తాను దేవుడిని అని ఏ రోజూ చెప్పలేదు. అల్లా మాలిక్ అని మాత్రమే అన్నారు. అల్లా అచ్చా కరేగా అని అన్నారు. హిందువులైనా అది నచ్చినవారు నమ్మారు. నమ్ముతున్నారు. ఆయన ఏ నాడూ ఆస్తులు పోగేయలేదు. ఆయన సమాధి చెందేనాటికి వేల కోట్ల ఆస్తులు లేవు. వాటి కోసం కుమ్ములాటలు అంతకన్నా లేవు. పైగా తనను పూజించమని బాబా ఎన్నడూ చెప్పలేదు. ఈ స్వామీజీల మాదిరిగా పాదపూజలు, వాటి ధరవరలు అని కనిపించని బోర్డులైనా ఏర్పాటు చేసుకోలేదు. మీరు మీ నమ్మికను మీ చిత్తం వచ్చిన చోట పాదుకొలుపుకోమని మాత్రమే చెప్పారు. దైనందిన జీవితంలో చిక్కులు తొలకించుకుని, ముక్తిమార్గం అనుసరించేందుకు ఓ సద్గురువు అవసరం అని మాత్రమేచెప్పారు.

మరి ఏమిటి ఈ స్వామీజీ దుగ్ధ. బాబా ఆలయాలు పెరిగిపోతున్నాయి. అందువల్ల రామమందిర నిర్మాణం జరగడం లేదు. తుంటి మీద కొడితే పళ్లు రాలాయంటే ఇదే. గతంలో పూర్తి మెజారిటీ లేదని భాజపా ప్రభుత్వం రామమందిర నిర్మాణాన్ని అటకెక్కించింది.మరి ఈ సారి అఖండమైన మెజారిటీ వచ్చింది కదా. నిర్మించమనండి ఎవరు వద్దంటారు. ఆ దిశగా మోడీని ప్రశ్నించడం మానేసి, ప్రశ్నించ లేక, రామమందిరం ఎందుకు నిర్మించలేదని ఎక్కడ భక్త జనం అడుగుతారో అని భయపడుతూ, ఇలాంటి కుంటిసాకులు సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది.

హిందూమతం బాబావల్ల ఫాడవదు. ఇలాంటి కలియుగ మహరాజుల్లా భోగాలు అనుభవిస్తూ సుద్దులు చెప్పే స్వామీజీల వల్లే. ఇకనైనా అక్కర్లేని ప్రకటనలు మాని, పూజలు పురస్కారాలు చేసుకుంటూ, ప్రజలకు సరైన భక్తిమార్గం చూపితే మంచిది.

వి.రాజా

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి