సాహితీవనం - వేంకట వరప్రసాదరావు

sahiteevanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిషమనుసంభవము

(గతసంచిక తరువాయి)

రాక్షసునికి స్వరోచికి భీకర యుద్ధం ప్రారంభం అయ్యింది. ఆ రాక్షసుడు విసిరిన గదను నేర్పుగా

తప్పించుకున్నాడు స్వరోచి. కోపంతో తన మహా శూలాన్ని ప్రయోగించాడు వాడు స్వరోచి మీదికి.

ఆ శూలంబవనీశమౌలి కులిశాహంకార హుంకార క్రు
న్నైశిత్యం బభినుత్య మై నెగడు బాణశ్రేణిఁ జెండాడి వే

కాశ శ్వేత గరుత్పరంపరల నాకాశంబు దుగ్ధాబ్ధి సం
కాశం బై వెలుఁగన్ శరావళులచేఁ గప్పెం గకుప్పంక్తులన్

ఆ శూలాన్ని ఆ రాజశేఖరుడు ఒక్క హుంకారంతో, వజ్రాయుధపు అహంకారాన్ని ధిక్కరించే వాడి ఐన 
బాణ పరంపరలతో ఖండించాడు. వెనువెంటనే రెల్లువంటి తెల్లని రెక్కలున్న(ఈకలున్న) బాణాలను
వేగముగా ప్రయోగించి ఆ తెల్లని కాంతులతో వినీలాకాశం తెల్లగా పాలసముద్రంలా వెలుగులు చిమ్మేలా  
దిక్కులను నింపేశాడు.

అవి యాతని పైతోలును 
నవియింపఁగ లేక మిడిసి యల్లటు వడఁ జూ
చి వనేచరు లేచిన వెఱఁ 
దవిలిన మతి నద్దిరయ్య దయ్యం బనుచున్

అంత సునిశితమైన బాణములను పరంపరగా స్వరోచి ప్రయోగించగా ఆ బాణాలు ఆ రాక్షసుడి పై తోలును 
కూడా ఛేదించలేదు, వాడిని ఇసుమంతైనా బాధపెట్టలేదు. అది చూసి ఆ అడవుల్లో తిరిగే గిరిజనులు
(స్వరోచిని అనుసరించి వచ్చిన ఆటవికజాతుల వీరులు) భయంతో 'అది దయ్యంరో నాయనా!' అంటూ..  

పక్కుపక్కున నంఘ్రి పాశముల్ వెసఁ ద్రెంచి / డేగ తండముల మింటికిని విడిచి 
గళగళ ధ్వనులతోఁ గంఠశృంఖల లూడ్చి / సుడివడఁ గుక్కల నడవి గలిపి 
గుప్పు గుప్పున మోచికొనియున్న వలలతోఁ / బలలంపు బొత్తరల్ పాఱవైచి
కంగుకంగున నేలఁ గై దప్పుగాఁ బడు / వేఁటమ్ము లేఱక దాఁటిదాఁటి

తిరిగి చూచుచు ద ట్లెగఁదీసికొనుచు
దగలు దొట్టి యథాయథ లగుచు విఱిగి
యొకఁడు వోయినత్రోవ వే ఱొకఁడు వోక
చె ట్టొకఁడు గాఁగఁ బఱచిరి చెంచులపుడు

వేట డేగలను భుజాన మోసుకొస్తున్నవాళ్ళు ఆ డేగల కాళ్ళకు కట్టిన బంధనాలను పక్కుపక్కున తెంచి 
వాటిని గాలిలోకి వదిలిపెట్టారు. వేటజాగిలాలను తీసుకొచ్చినవాళ్ళు ఆ కుక్కల మెడలకున్న గొలుసులను 
గలగల ధ్వనులతో విప్పదీసి తత్తర పెట్టి వాటిని అడవిలోకి తోలారు. వలలను మూటలు మూటలుగా 
గూడలమీద మోసుకొస్తున్నవాళ్ళు ఆ వలలను కుప్పలుగా పారేశారు. విల్లంబులు పట్టుకున్నవాళ్ళు 
ఖంగు ఖంగుమంటూ నేలకు రాలిన బాణాలను ఏరి తీసుకోకుండా గంతులు పెడుతూ పారిపోయారు.
వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ, పంచెలను ఎగబట్టుకుని ఎక్కడివాళ్ళు అక్కడే చెట్టుకొకడుగా, ఒకడు 
వెళ్ళినవైపు ఇంకొకడు వెళ్ళకుండా తలొక దారినా పారిపోయారు ఆ చెంచులు. 

ప్రోపుఁ దలపోసి నిలువక 
పాపాత్మకమై కిరాత బల మటు పారన్
భూపతి యయ్యింతి హయ  
స్థాపితఁగాఁ జేసి పలికెఁ దన్ముఖ్యులకున్

ప్రోపు అంటే రక్షణ. తమ ప్రభువుయొక్క రక్షణ బాధ్యతను కూడా ఆలోచించే స్థితి లేక పాపాత్మకంగా ఆ 
కిరాతులు అలా పారిపోగా స్వరోచి మనోరమను గుర్రం మీదికి ఎక్కించి ఆ పారిపోయిన ముఖ్యులను 
చూసి 'ఇలా పలికాడు..' అని కొనసాగిస్తున్నాడు పెద్దన.

' పాపాత్మకమై కిరాతక సైన్యం పారిపోయింది' అని ఇక్కడ అద్భుతమైన విశేషణాన్ని వేశాడు పెద్దన. 
ఆ తర్వాత దాదాపు ఐదువందల సంవత్సరాలకు స్వామి వివేకానంద అవే పలుకులను పలికాడు! 
బలమే జీవనము, బలహీనతయే మరణము అన్న పలుకులు అవి. ధైర్యము అంటే జీవనమే, పిరికితనము 
అంటే చావడమే. ధైర్యవంతుడు ఒకేసారి మరణిస్తాడు, పిరికివాడు క్షణక్షణం అనుక్షణం చస్తాడు 
'Cowards die many times before their deaths. The valiant never taste of 
death but once' అని షేక్స్పియర్ కూడా అవే పలుకులను పలికాడు జూలియస్ సీజర్ నాటకంలో!

'' పాపము అంటే అజ్ఞానము వలన, అవిద్య వలన కలిగే భయము, బంధము. పుణ్యము అంటే జ్ఞానము వలన, 
విద్య వలన కలిగే ధైర్యము, బంధవిమోచనము, అంటే ముక్తి. ఎందుకంటే ఆ అజ్ఞానము వలన అనేకత్వభావన 
అంటే జీవుడు వేరు దేవుడు వేరు అనే భ్రమ కలుగుతుంది తను అనే ఊహ వలన తను లేకుండా పోతే? అనే 
మరణ భయం కలుగుతుంది కనుక అది పాపము. జ్ఞానము వలన తను దేవుడు ఒకటే అంటే జీవుడు దేవుడు 
ఒకటే కనుక జీవాత్మకు స్థానం మారడమే తప్ప స్థానం కోల్పోవడం ఉండదు, జీవాత్మ ఇప్పటిదాకా ఇక్కడ 
ఉన్నది, తరువాత నాశ రహితమైన, మరణములేని పరమాత్మునిలో కలిసిపోతుంది అనే ఎరుక కలుగుతుంది, 
కనుక జీవబ్రహ్మైక్యభావన అనే పరమోత్కృష్ట జ్ఞానము కలుగుతుంది కనుక అది పుణ్యము '' అని చెప్తుంది 
బృహదారణ్యక ఉపనిషత్. కనుక భయము, పిరికితనము పాపం. ధైర్యం అంటే పుణ్యం!

రాజుకు రక్షగా నిలవడం అనే బాధ్యతను కూడా మరిచిపోయి పిరికితనంతో పారిపోవడం అనే పాపకర్మను 
చేసినవారు కనుక కూడా ఆ కిరాతులు పాపాత్మకంగా పారిపోయారు అని ఉపనిషత్తు సారభూతమైన సత్యాన్ని, 
సేవక ధర్మ మర్మాన్ని చెప్పాడు పెద్దన. పెద్దన అంతటి మహానుభావుడు కనుకనే ఆయనను ' హితుడవు, 
చతుర వచోనిధివి, సాటిలేని పురాణ ఆగమ యితిహాస కథార్థ స్మృతి యుతుడవు, ఆంధ్ర కవితా 
పితామహుడవు నీకు సాటి ఎవరు?' అని పొగిడాడు శ్రీకృష్ణదేవరాయలు!

( కొనసాగింపు వచ్చే సంచికలో )

***వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి