సాహితీవనం - వేంకట వరప్రసాదరావు

sahiteevanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము

(గత సంచిక తరువాయి)

పిరికితనం అనే పాపానికి ఒడిగట్టి, రాజును రక్షించుకోవాలి అనే తలంపు కూడా లేకుండా చెట్టుకొకరు
పుట్టకొకరుగా పారిపోతున్న వనచరవీరులను ఎలుగెత్తి పిలిచాడు స్వరోచి.

కైదువు సున్న, పూజ్యములు కంకటఖేట శిరస్తలత్రముల్,
లేదరదంబు, తత్తడి హుళిక్కి, సహాయము సర్వమంగళం
బీదనుజుండు చిక్కె భయమేటికి? లుబ్ధకులార! యాత్మకుం
బేదతనంబు మేలె? మరి మృత్యువు డాఁగెడిచోట లేదొకో?

ఈ భయంకరుడికి, మన శత్రువుకు ఖడ్గం లేదు, కవచము, శిరస్త్రాణము మొదలైనవి లేవు, రథం లేదు,
తత్తడి అంటే వాహనము కూడా లేదు, వాడికి సహాయము సర్వమంగళం, అంటే శూన్యము. సహాయము 

సర్వమంగళం అంటే మనకు సహాయము ఆ సర్వమంగళ, ఆ జగజ్జనని అని కూడా ధ్వని! వీడు మనచేతికి 
చిక్కాడు. ఇంకా మనకు భయమెందుకు? ఓరి పిచ్చివాళ్ళల్లారా! ఆత్మకు పేదతనము మేలు చేస్తుందా?
అని ప్రశ్నించాడు స్వరోచి. మళ్ళీ ఇక్కడా ఒక మెరుపు మెరిపించాడు పెద్దన. పిరికితనమే పేదతనము, 
ధైర్యమే ధనము! కనుక ఏమి లేకున్నా ఆత్మ స్థిరంగా నిశ్చలంగా ఉంటే మేలు చేకూరుతుంది కానీ,
పారిపోయినంతమాత్రాన మరణము మనం దాక్కున్నచోటికి రాకుండా ఉంటుందా ఆ సమయమంటూ వస్తే?

చావుఁ దలపోసి మానవుఁ 
డేవగ దుష్కీర్తి వొరయకే దినములు పొం
దై వెడలునట్లు నడవఁగఁ 
దైవం బటమీఁద మేలు తాన ఘటించున్

చావును తలచుకుని మానవుడు ఏ దుఃఖము అపకీర్తికి లోనుకాకుండా ప్రతిదినమూ సంతృప్తితో, ధైర్యంతో,
స్థిరత్వంతో గడిపితే దైవం తానే మేలు చేస్తుంది కదా!

బుద్ధీంద్రియ క్షోభములకుఁ బెట్టని కోట / విప దంబురాశి దుర్వికృతి కోడ
ఖల దురాలాప మార్గణ వజ్రకవచంబు / రణ మహీస్థలికి శ్రీరామ రక్ష 
శాత్రవ దుర్గర్వ సంస్తంభ నౌషధి /మొనయు చింతాశ్రేణి మూకఁవిప్పు 
యోగాదిసంసిద్ధు లొనగూర్చు పెన్నిధి / తూలు నేకాకుల తోడునీడ

సకల సుగుణ ప్రధానంబు సకల కార్య 
జాల సాఫల్యకరణైక సాధనంబు 
ధైర్యగుణ, మట్టి ధైర్యంబు దక్కి పోరఁ 
దత్తఱింతురె! యకట! మీ తరమువారు?

పెద్దన అద్భుతమైన ఉపదేశాన్ని పలికిస్తున్నాడు స్వరోచి నోటివెంట! ధైర్యము అంటే మానసిక స్థిరత్వము,
అచంచలమైన ఆత్మ విశ్వాసము ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు, అన్న సత్యాన్ని తెలియజేస్తున్నాడు.
నా సర్వస్వాన్ని కోల్పోయినా పర్వాలేదు, కోల్పోయిన సర్వాన్ని సాధించగలను అనే ఆత్మవిశ్వాసాన్ని 
కోల్పోకుంటే చాలు అన్నాడు స్వామి వివేకానంద. అదే భావాన్ని ఇక్కడ పెద్దన స్ఫురింపజేస్తున్నాడు.

మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగు రూపాల విభజన స్పష్టంగా భారతీయ ఆలోచనావిధానంలోనే 
ఉన్నది, వేరే వారికీ ఇవి తెలియవు! వీటినే మనోవ్యాపారాలు, చిత్తవృత్తులు అన్నారు. ఐదు కర్మేంద్రియాలు,
ఐదు జ్ఞానేంద్రియాలు, చిత్త వృత్తులకు క్షోభ కలుగకుండా పెట్టని కోటలా రక్షణగా ఉంటుంది ధైర్యము.

ఆపదలు అనే మహాసముద్రాన్ని దాటడానికి ఓడ వంటిది ధైర్యము. ఖలులు, వెధవలు అసూయాపరులు చేసే 
దాడినుండి కాపాడే వజ్రకవచము ధైర్యము. యుద్ధంలో, నిత్యజీవనయుద్ధంలో శ్రీరామరక్షగా కాపాడుతుంది 
ధైర్యము. శత్రువుల చెడ్డ గర్వాన్ని స్తంభింప జేసే ఔషధం వంటిది ధైర్యము. చింతల పరంపరలను తొలిగిస్తుంది 
ధైర్యము. యోగము మొదలైన సిద్ధులను ప్రసాదించే పెన్నిధి ధైర్యము. బేజారై, నిస్పృహతో తూలే ఒంటరిగాళ్ళకు 
తోడునీడ గా వెన్నంటివచ్చే స్నేహితుడు ధైర్యము.

ధైర్యమే సకల సుగుణాలలో ప్రధానమైనది. ధైర్యమొక్కటే సకలకార్యములను సఫలీకృతం చేసే సాధనము.
అటువంటి ధైర్యాన్ని విడనాడి, పోరాటము చేయడానికి మీలాంటివారు తత్తర పడుతారా! పిరికితనాన్ని 
విడనాడండి, ధైర్యపు ధనాన్ని పొందండి, ఒక గెలుపు, ఒక మలుపు వలపుతో మనకోసం ఎదురుచూస్తున్నాయి,
రండి, వీడి అంతు చూద్దాము అని ఉత్తేజాన్ని నింపే పిలుపును యిచ్చాడు స్వరోచి. అదీ ధీరనాయక లక్షణం!

అని తెలిపి తిరుగుఁ డనుటయు
మనమున లజ్జించి ఎఱుకు మన్నీ లిఁక నీ
జనపతితోడిద లోకం 
బని తమతమ మొనలు ద్రిప్పి రవియును దిరిగెన్

స్వరోచి ఆవిధంగా ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగించే ప్రేరణ కలిగించి, పోరాడడంకోసం వెనుదిరగండి అని 
పిలుపు యివ్వగానే అంతవరకూ తాము చూపించిన పిరికితనాన్ని తలుచుకుని మనసులో సిగ్గుపడ్డారు 
ఆ ఎరుకల వీరులు. ఇక ఈ రాజుతోనే మన లోకం, ఉంటె ఆయనతో ఉండడం లేకుంటే ఆయనకోసం 
మరణించడం అని నిశ్చయించుకున్నారు, అలా తన అనుచరులను సంసిద్ధులను చేసేవాడే అసలైన 
నాయకుడు. అలా నిశ్చయించుకుని తమ తమ వీరులను, ఆయుధాలను త్రిప్పి యిక ఆ రాక్షసుడి 
భారతం పట్టడానికి, పోరాడడానికి సంసిద్ధులయ్యారు వారు.

(కొనసాగింపు వచ్చేసంచికలో)

***వనం వేంకట వరప్రసాదరావు  

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి