సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము

(గతసంచిక తరువాయి )

శర సంధానముతోనె కొన్ని యడుగుల్ జౌజవ్వనన్ బారి యె

ద్ధరణిం గాల్కొని ద్రోణముల్ దవియు దోర్దండంబులం జేఁది యే

సిరి బోయల్ దిను మంచు నార్చి పరఁగం జిట్టాసలన్ డాయుచున్

గొరవంకల్ మొఱవెట్టినట్లు గుణముల్ ఘోషింప రోషింపుచున్ 

బాణములను సంధిస్తూనే కొన్ని అడుగులు రివ్వున ముందుకు పరిగెత్తి ' ఈ బాణాలను తిను తిను' అంటూ 

గోరొంకల లాగా కూతలు పెడుతూ ధ్వనులు చేస్తున్న వింటి త్రాళ్ళతో బాణాలను వేశారు.

ఆశరావళి నమ్మనుజాశనుండు

లీల మృగదంశకము మశకాలి నొడిసి

చప్పరించు విధమున శాతదీర్ఘ

దంష్ట్రికలఁ జప్పరించి రౌద్రమునఁ గెరలి

అశనము అంటే ఆహారము అని అర్ధం. మనుజాశనుండు అంటే మనుషులను ఆహారంగా తీసుకునేవాడు అని 

అర్ధం. తరచుగా తెలుగుభాషలో దాదాపు అందరూ చేస్తున్న పొరపాట్లలో ‘నిరసన వ్రతం’ అని ‘హంగర్ స్ట్రైక్’ 

అనేదానికి వాడడం చూస్తుంటాము. నిరసన అంటే విముఖత, అయిష్టం మొదలైన అర్ధాలు, కనుక హంగర్ స్ట్రైక్ 

అనడానికి ‘నిరశన’ అని మాత్రమే అనాలి! ‘నిరశనవ్రతం’ అంటేనే ఆహారం తీసుకొనకుండా పంతం పట్టడం అని 

అర్ధం. ఆ బాణ పరంపరను ఆ నరమాంసభక్షకుడు ఎలుగ్గొడ్డు కీటకములను ఒడిసిపట్టి చప్పరించినట్టు పదునైన 

పెద్దపెద్ద కోరలతో ఒడిసిపట్టుకుని నమిలి చప్పరించిపారేశాడు! కోపంతో ఎగసిపడుతూ, ఊగిపోతూ..

గళితశృంఖలమైన గంధనాగమువోలెఁ / బ్రజలపైఁ బేరెముల్ వాఱి పాఱి

కలశాబ్ధి మథియించు కైటభాంతకులీల / జవ మొప్పఁ జేతులు సాఁచిసాఁచి

కన లూను కీనాశ కాసరమ్మునుబోలెఁ / గమిచి తట్టువగుంపుఁ జమరి చమరి

యమృతాపహరణార్థ మరుగు పక్షిస్వామి / గతిఁ బుళిందశ్రేణిఁ గమిచి కమిచి

సెలవులు బిగించి నేత్రదంష్ట్రికలు మెఱయు

నిడుదమొగమెత్తి మీసాల నెత్తురొలుకఁ

బటపటఁ గపాలపంక్తులఁ బగులఁ గొఱికి

బలమునెల్లను గడియలోపలన మ్రింగె

సంకెళ్ళు త్రెంచుకున్న మదపుటేనుగులాగా వారి మీదికి గంతులు వేస్తూ పరుగులెత్తి, సముద్రాన్ని మథించే 

కైటభాంతకుడైన శ్రీహరిలా వేగంగా చేతులు సాచి ( చిలికేప్పుడు రెండుచేతులూ వేగంగా ఒకదాని తర్వాత 

మరొకటి సాచినట్లు సాచి!) కోపించిన యముని దున్నపోతులాగా తరిమి తరిమి మట్టగించి, అమృతంకోసం 

వెళ్ళే గరుత్మంతునిలా కరిచి కరిచి పట్టుకుని, పెదాలు బిగించి, కళ్ళు పళ్ళు మెరుస్తున్న పెద్ద మొహాన్ని 

పైకెత్తి మీసాల అంచుల నుండి నెత్తురు కారిపోతుండగా పటపట పుర్రెలు నమిలి ఆ బలగాన్నంతా ఘడియలో 

మింగిపారేశాడు!

ఆ సమయంబున గీర్వా

ణీసుతుఁ డ య్యింతినొక్క నికట నికుంజా

వాసమ్మున నిడి క్రమ్మఱి

వె సురరిపుఁ దాఁకెఁ దురగ వేగము మెరయన్

ఈలోపు అదే సమయంలో ఆ అప్సరాతనయుడు ఆ మనోరమను ఒక పూపొదరింటిలో దాచి తన గుఱ్ఱపు వేగాన్ని 

ప్రకటం చేస్తూ వెనుదిరిగివచ్చి ఆ రాక్షసుడిని ఎదుర్కొన్నాడు. ఇక్కడ ఒక దివ్యమైన సమాసభూయిష్టమైన 

వచనంలో వారిద్దరి మధ్యన జరిగిన యుద్ధాన్ని అత్యద్భుతంగా ప్రత్యక్ష వ్యాఖ్యానంలా కనులకు కట్టాడు పెద్దన. 

స్వయంగా చదివి అర్ధంచేసుకుంటేనే ఆ రుచి, ఆ ఆనందం తెలుస్తుంది

తమ తమ ప్రతాపం వెల్లడిచేస్తూ ఇద్దరూ పోరాడారు. వీడి పని ఇలా కాదు అని, వజ్రాయుధం కూడా 

చిన్నబుచ్చుకునేట్లున్న బంగారు ద్రవంలో ముంచెత్తినట్లు మెరుస్తున్న ఖడ్గాన్ని, సూర్యకిరణములలాగా మెరుస్తున్న 

ఖడ్గాన్ని దూశాడు వజ్రాయుధుడు సిగ్గిల్లేలా. బరిశతో పొడిచిన మదపుటేనుగులా నెత్తురోడుతూ భూమి కంపించేలా 

వాడు కుడివైపునుండి దాడి చేస్తే ఎడమవైపు, ఎడమవైపు నుండి వస్తే కుడివైపు గుర్రాన్ని దూకిస్తూ, బాణాలు వేస్తూ 

లాఘవంగా తిరుగుతుంటే వాడు కూడా వెనక్కూ ముందుకూ అడ్డదిడ్డంగా అడుగులేస్తూ వచ్చి పట్టుకునేంతలో 

వాడి చేతి వ్రేళ్ళను నరికేశాడు. అలిసి తూలి నిలదొక్కుకుంటున్న తన గుర్రాన్ని తట్టి, సెబాసని మెచ్చుకుని, వాడు 

ఒక పెద్ద వృక్షాన్ని పెళ్ళగించి తన మీదికి విసిరివేయడానికి ప్రయత్నిస్తుంటే చెంగున గుఱ్ఱాన్ని అటు దూకించి రెండు 

మూడు బాణాలతో ఆ చెట్టును దూరంగా కొట్టేశాడు. వాడు పెద్ద పెద్ద బండరాళ్ళను ఎత్తి విసిరేయడానికి ప్రయత్నం 

చేస్తుంటే చెంగున అటు దూకి వాడు బండలను ఎత్తడానికి వంగినపుడల్లా పదునైన బాణాలతో రాళ్ళను దూరంగా 

కొట్టేసి ‘ బంతి లేదు’ అన్నట్లు ఆటాడినట్టు లీలగా ఉత్సాహంతో యుద్ధం చేస్తూ, ముందరి కాళ్ళను ఎత్తి దూకుతున్న 

గుఱ్ఱపు అందెల చప్పుడు, మెడలోని ఘంటల చప్పుడు ఒక వాయిద్యంలా, తుమ్మెదల రొదలా వినబడుతుంటే, 

ఎటు చూస్తే అటు తానే కనిపిస్తూ, నీడ నేలమీద పడకుండా, ఆ రాక్షసుడు అనే కొండచిలువను పట్టుకోడానికి 

నేలబారుగా ఎగురుతున్న గరుడునిలా సమీపించి, వెనక్కు వెళ్లి, దూరంగా మెరిసి, దగ్గరగా ఎగసి,  దగ్గరనే 

ఉన్నాడు అని పట్టుకోడానికి ప్రయత్నించినపుడు దూరంగా కనిపించి దూరమా? దగ్గరా? అనే సంగతి 

తెలియకుండా వేగంగా తన గుఱ్ఱాన్ని పరుగులు పెట్టిస్తూ, దూకిస్తూ, బాణాలతో వేసీ వేసీ, పొడిచీ పొడిచీ వాడు 

అలా అంతకంతకూ రెచ్చిపోతూనే ఉంటే, తీవ్రమైన కోపంతో, రోషంతో..

భూపతి పావకబాణం

బేపున సంధించి తివిచి యేసిన మెయిఁ గీ

లాపటలి పొడువ నతఁ డా

రూపం బెడఁబాసి ఖేచరులు వెఱఁగందన్

స్వరోచి పావకాస్త్రాన్ని( ఆగ్నేయాస్త్రాన్ని ) సంధించి, లాగిపెట్టి కొట్టాడు. ఆ బాణము తగిలి మంటల్లో ఆ రాక్షసుడి 

దేహం భస్మీపటలమై పోయి, ఆ రక్కసుడు ఆ రూపాన్ని కోల్పోయి, బంగారు శరీరవర్ణం ధగధగా మెరుస్తుండగా, 

చిరునవ్వులు చిందిస్తూ, నల్లని కేశములు పొగరుగా మెరుస్తుండగా, తామరలను ధిక్కరిస్తున్న కన్నులతో, 

కస్తూరి పరిమళం గుప్పుమంటుండగా సువాసనలు చిమ్ముతూ, శిరోమణి మిక్కిలి ప్రకాశిస్తూ మిగిలిన హారాలు 

వెలుగులు చిమ్ముతుండగా, ఒక గంధర్వుడిలా మారిపోయాడు!

నవనవ సౌరభముల నె

క్కువ కువలయవర్ష మపుడు కురిసెన్ మొరసెన్

రవరవ మురజ రవంబులు

దివి దివిష జ్జలజముఖులు తెలిసి నటింపన్

పరిమళాలు విరజిమ్ముతూ పూల వాన కురిసింది. మురజ మొదలైన దివ్య వాయిద్యాలు మారుమ్రోగాయి. 

ఆకాశంలో పద్మముఖులైన దేవతాకాంతలు యిది తెలిసి, యిది చూసి ఆనంద తాండవం చేశారు. స్వారోచిష 

మను కథను మైమరచి వింటున్న శ్రీకృష్ణదేవరాయలు కుతూహలంతో కథను చెప్తున్న పెద్దనను, జైమిని 

మహర్షి  గరుడ పక్షులను తర్వాత ఏమైంది అని అడగడంతో తన స్వారోచిష మనుసంభవములో నాలుగవ 

ఆశ్వాసాన్ని హృద్యమైన ఆశ్వాసాంత పద్యాలతో ముగించాడు పెద్దన!

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి