మనిషి పుట్టినప్పుడు ఏడుస్తాడు. ప్రజలు ఆనందంతో నవ్వుతారు. అదే మనిషి మరణించినప్పుడు ప్రజలు ఏడవాలి. అప్పుడే ఆ మనిషి జీవితానికికో అర్ధం... పరమార్ధం!
మనలో చాలామంది 'బిజీ' గా జీవిస్తున్నామనే భ్రమలో బ్రతికేస్తుంటారు. ఉదాహరణకి ఆదివారం లంచ్, సినిమాకి ఫ్యామిలీ తో వెళ్దామని బైట కెళ్తారు. పదండి... పదండి అంటూ రెస్టారెంట్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, 'బాబూ త్వరగా తెచ్చెయ్... సినిమా టైమవుతుంది' అంటారు. 'త్వరగా తినేయండి... సినిమా టైమైపోతుంది' అంటారు. పోనీ సినిమా అన్నా తిన్నగా చూస్తారా? ఫోన్ తీసి 'నేను సినిమాలో వున్నాను' అంటూ ముందు 'వాట్సాప్' లోనూ, ఫేస్ బుక్' లోనూ అప్ డేట్ చేసుకుంటాడు. దానికెవడో పన్లే నోడు రిప్లై చెయ్యటం... వాడికి వీడు ఫోన్ చేసి 'ఏదో ఉందిలే సినిమా... అంటూ ఓ కథ చెప్పడం'. ఇలా... ఆనందంగా తృప్తిగా వుండాల్సిన కాలాన్ని అనవసరంగా బిజీగా మార్చుకుంటున్నారు.
నేను, నా వాళ్ళూ అంటూ జీవించెయ్యకుండా ఓ పదిమందిని ఆనందపెట్టే పనులు చేసి... నలుగురికి సాయం చేసేవాడి జీవితానికో అర్ధం ఉంటుంది! అని నా అభిప్రాయం - నా ఈ వ్యాసం చదవగానే మీకు 'నేను పుట్టాను... ఈ లోకం మెచ్చిందీ...' అనే పాట మీకు గుర్తొస్తే... మీరూ నాలా ఆలోచిస్తున్నారనుకుంటాను!