సహనం, ఓర్పూ ... - భమిడిపాటి ఫణిబాబు

patients

చిన్నప్పుడు, ఇంట్లో ఏదైనా అల్లరి చేసినా, ఏ ఆటవస్తువో పాడిచేసినా, చివరాఖరికి ఏ సైకిలో నేర్చుకుంటూ దెబ్బ తగుల్చుకున్నా, ఇలా రాసుకుంటూ పోతే, మగ జన్మెత్తినందుకు, తండ్రి చేతిలో దెబ్బలు తినని వాడెవ్వడూ ఉండడు. చదువుల్లో మార్కులు తక్కువరావడం అన్నది ఓ evergreen  बहाना ! అందులో నాలాటివాళ్ళకైతే ఓ అలవాటైపోయింది. అలాగని ఆ తండ్రి అనబడే ఆయన రాక్షసుడేం కాదు. ఏదో పిల్లాణ్ణి నాలుగు తగిలిస్తే బాగుపడి, ప్రయోజకుడౌతాడని ఓ అపోహ! మళ్ళీ ఆడపిల్లలకి అలాటి పనిష్మెంట్లుండేవి కావు. పైగా మా ఇంటి మహలక్ష్మీ అంటూ, ఇంట్లోవాళ్ళూ, ఊళ్ళోవాళ్ళూ  నీరాంజనాలు పట్టేవాళ్ళు." అదేమిటయ్యా, ఆడపిల్లమీద అలాగ ఎవరైనా చెయ్యిచేసికుంటారా .." అనేవాళ్ళు!. వాళ్ళు చేసే అల్లరి, ఈ మగపిల్లాడి అల్లరికంటే ఎక్కువగా ఉండేది, అయినాసరే వాళ్ళకి మాత్రం clemency గ్రాంటయేది. ఈ వ్యాసంలో ఏదో ఆడ మగ పిల్లల మధ్య వివక్షతని గురించి కాదు వ్రాసేది. ఏదో సందర్భం వచ్చిందికదా అని ఆమాటన్నాను. అలాగని ప్రతీ మగపిల్లాడూ తండ్రి చేతుల్లో దెబ్బలు తిన్నాడనీ కాదూ, ఏదో స్వానుభవం గుర్తొచ్చింది. పాపం వాళ్ళుమాత్రం ఏం చేస్తారులెండి, పొట్టకోస్తే అక్షరంముక్కుండేది కాదు, పోనీ ఈ రోజుల్లోలాగ ఇంకోటేదైనా ఫీల్డ్ లో ప్రావీణ్యం ఉందా అంటే అదీ లేదూ.

అదేం కర్మమో, నాకూ వంశపారంపర్యంగా అదే అలవాటొచ్చింది, పిల్లాణ్ణి అల్లరి చేసినప్పుడల్లా నాలుగు దెబ్బలేయడం.దానికి సాయం తన మొండితనమూ అలాగే ఉండేది. నాదా బక్కకోపం. ఏం చేస్తాను, తేరగా దొరికేది పాపం ఆ poor & innocent కొడుకేకదా! మా ఇంటావిడకైతే, " ఈ రోజు గడిస్తే చాలు భగవంతుడా.." అని అనుకోని రోజు లేదు. పోనీ అలాగని నేనేమైనా intellectual, ideal నాన్ననా  అంటే అదీ కాదూ. మరి అలాటప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా పిల్లాడిని అలా  బాదడం ఎందుకూ అంటే, కారణం నేనూ చెప్పలేను. పోనీ అన్నేసి దెబ్బలు తింటున్నాడూ, నేనంటే ఏమైనా కోపమా, ఉక్రోషమా అంటే అదీ లేదూ. సాయంత్రం ఇంటికి వచ్చినప్పటినుండీ నాతోనే ఉండేవాడు. గొర్రె కసాయివాడినే నమ్ముతుందన్నట్లు.

నా ఉద్దేశ్యంలో, ఆనాటి తల్లితండ్రుల ఆర్ధిక పరిస్థితి ఓ కారణం అయుండొచ్చు. ఏదో పిల్లలు ఆడుకుంటారుకదా అని అప్పో సొప్పో చేసి, ఓ toy లాటిది తెచ్చామనుకోండి, తెచ్చినంతసేపు పట్టేది కాదు, ఏ కీలుకాకీలు విప్పేసి పెట్టడానికి. మరి కోపం వచ్చిందంటే రాదు మరీ. మళ్ళీ ఇంకోటి కొని తెచ్చే తాహతుండేది కాదు,పాపం ఆ విరిగినవాటినే జాయిన్ చేసి ఆడుకునేవాడు!

ఈ రోజుల్లో తల్లితండ్రులు, వారి పిల్లల్ని పెంచే పధ్ధతి చూస్తూంటే, ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది.  ఎంత అల్లరి చేయనీయండి, డెసిబిల్ లెవెల్ పెంచకుండా,వాళ్ళని కంట్రోల్ చేయడం. అసలు వీళ్ళకి మాలాగ కోపం అనేది వస్తుందా అనిపించేటట్లుగా! ఆ సహనం, ఓపికా ఎక్కడినుంచొస్తుందో? పైగా ఈ రోజుల్లో పిల్లలు చాలా హైపర్,ఐక్యూ చాలా ఎక్కువ. ఏ పని చేయాలన్నా,  they dont think twice.कर्ना है तॉ कर्नॅका,  बस .  To hell with consequences. అవేవో డాడ్డే  చూసుకుంటాడులే అనే ఓ భరోసా! వీటన్నిటికీ ముఖ్యకారణం నా ఉద్దేశ్యంలోaffordability. ఓ వస్తువు తగలడితే ఏం పోయిందీ, ఇంకోటి తెస్తారూ అనే ఓ guarantee! ఇప్పటి సంపాదనలూ అలాగే ఉన్నాయి మరి.

ఈ సందర్భంలో నాకు ఇంకో కారణం కూడా తట్టింది. బహుశా అందరూ ఒప్పుకోపోవచ్చు.  Insecurity--  ఓ వయస్సొచ్చిన తరువాత కొడుకునో, కూతుర్నో వాళ్ళు ఎలాటి తప్పు(తల్లితండ్రుల దృష్టిలో) చేసినా, ఏమైనా కోప్పడితే, ఏ అఘాయిత్యం చేస్తాడో  అని ఓ భయం! ప్రతీ ఇంట్లోనూ పిల్లలు అలా ఉంటారని కాదు, చాలా కుటుంబాల్లో చూస్తూంటాము.ఎక్కడో అక్కడక్కడ తప్పించి, ఏ తండ్రీ ,పిల్లల మాట వినకపోవడమనేది కనిపించదు ఈ రోజుల్లో. పోనీ అలాగ వాళ్ళకి కావలిసినవన్నీ చేశారూ అని గుర్తుంచుకుంటారా అంటే అదీ లేదు. తమ పిల్లల టైమొచ్చేసరికి, అక్కడికేదో తమ చిన్నతనంలో అన్నీ అనుభవించలేదో అని ఏడవడమే. తరం తరానికీ ఈ ఈతిబాధలు తప్పవనుకుంటాను.

ఇంక ఆ పిల్లలూ తల్లితండ్రుల  weakness తో ఓ ఆట ఆడేసికుంటారు. ఇదివరకటి రోజుల్లో, ఎప్పుడైనా తండ్రి నాలుగు దెబ్బలేస్తే, మహ అయితే, ఇంట్లోంచి పారిపోయి, ఏ హొటల్లోనో క్లీనర్ గా  చేరేవాడు. కాకపోతే, ఏ పరీక్షలోనో ఫెయిల్ అయితే, ఏ రైలుకట్టో పట్టుకుని పారిపోయేవాడు. మా చుట్టం ఒకడిలాగే, తణుకునుంచి నడుచుకుంటూ పోయి, నిడదవోలు స్టేషన్ లో కనిపించాడు!ఇప్పుడలా కాదే, ఏ టెలిఫోన్ టవరో ఎక్కేసి, మీడియావాళ్ళని కూడా పిలిచేటంత ఘనులు ఇప్పటి తరం వారు!మన మీడియా వారు కూడా, ఏదో ఒక న్యూసు దొరికిందే చాలనుకుని, చిలవలూ పలవలూ చేసి చూపించడం. మళ్ళీ ఈ అప్రతిష్టోటా అని, తల్లి తండ్రులూ, పరిస్థితులకి reconcile అయిపోతున్నారు!

వీటివల్లే ఈమధ్యన పోలీసు స్టేషన్లలో పెళ్ళిళ్ళూ, ఆత్మహత్యలూ, హత్యలూ, ఎక్కువైపోయాయి. ఓర్పూ సహనం చూపించడం కొంతవరకూ మంచిదే. కానీ దానికీ ఓ హద్దనేదుండాలి. దేనికది తగుమోతాదుల్లో ఉంటే ఆరోగ్యం! కానీ సహనానికి లిమిట్ ఏమిటీ అని చెప్పడం కూడా కష్టమే.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి