సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము

(గతసంచిక తరువాయి)

శ్రీనందన సౌందర్య!సు

ధీనందన!వితరణావధీరిత బలిరా

డ్భానుజ! పరరాజస్వ

ర్భాను భుజాహీంద్ర! కృష్ణరాయ నరేంద్రా!

శ్రీలక్ష్మికి ఆనందాన్ని కలిగించే సౌందర్యమును కలవాడా, సంపత్కరమైన నందనవనమును బోలిన సౌందర్యాన్ని కలిగినవాడా! ధీరులకు 

ఆనందాన్ని కలిగించే ధీరుడా! దానగుణంలో బలిచక్రవర్తిని, సూర్యపుత్రుడైన కర్ణుడిని మించినవాడా! (వితరణావధీరిత బలిరాడ్భానుజ!) 

పరరాజుల కీర్తిని, సంపదను రాహువులా కబళించేవాడా! కృష్ణరాయ నరేంద్రా, వినుము అని స్వారోచిష మనుసంభవములో ఐదవ ఆశ్వాసాన్ని 

ప్రారంభిస్తున్నాడు పెద్దన!

అపుడు గంధర్వపతి మహికవతరించి

రాజు విస్మయమున హయరాజు డిగ్గ

నక్కు సేర్చి ముదంబుతో ననియె దంత

కిరణములు హారకాంతులు సరసమాడ

అపుడా గంధర్వపతి ఐన ఇందీవరాక్షుడు భూమి మీదికి దిగి స్వరోచి విస్మయముతో గుఱ్ఱాన్ని దిగి చూస్తుండగా, ఆతడిని ఆనందంగా 

కౌగిలించుకుని, తన దంతముల తెల్లని కాంతులతో తన ఆభరణ కాంతులు సరసాలాడుతుండగా యిలా అన్నాడు. ఇక్కడా ఒక చిన్న 

చమత్కారం ఉంది. గంధర్వులు సహజంగా ఆకాశంలో విహరించేవారు, ప్రత్యేకంగా అనుకుంటే తప్ప నేలకు దిగరు కనుక తన సహజరూపాన్ని 

పొందినవెంటనే గగనచరుడు అయినాడు, అనంతరం స్వరోచిని అభినందించడానికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి నేలకు ‘దిగివచ్చాడు’.

భద్రమా నీకు నీ బాహాభ్రుతక్షితిఁ / బ్రజలకు? లెస్సలా రాచవారు?

ధన్యుండ నైతి నీ దర్శనంబునఁ జేసి / నా దుష్క్రుతములెల్ల నాశమొందె,

నీ జగత్త్రయి నన్ను నిందీవరాక్షాఖ్యఁ / గీర్తించు నప్సరో గీతసరణి,

గారాపు మీతల్లి కడవాఁడఁ గాని నే / గణుతింపఁ గడవాఁడఁ గాఁ జుమయ్య

పెండ్లి కొడుకవు మాకు, నీ బిసరుహాక్షి

కూర్మినందన, యొక మౌని ఘోర శాప

వికృతి మానిసిదిండి నై యకట! దీని

ప్రాణముల కల్గఁ దలఁచితి బాపబుద్ధి

నీకు నీ బాహువులచేత భరింపబడుతున్న భూమి ప్రజలకు క్షేమమా?రాచకులం వారు, నీ బంధువులు అందరూ క్షేమమా? నీ దర్శనముతో 

నేను ధన్యుడిని అయినాను. నా పాపాలన్నీ పటాపంచలైనాయి. ఈ మూడు లోకాలూ, దేవజాతివారు నన్ను ఇందీవరాక్షుడు అని కీర్తిస్తారు. 

నీ తల్లికి చివరి సోదరుడిని గానీ, నేను ఎవరో దూరపువాడిగా లెక్కించాల్సిన వాడిని కాను సుమా! నువ్వు మా పెండ్లికొడుకువి! ఈ పద్మపత్రనేత్ర 

మనోరమ నా గారాబు పుత్రిక. ఒక మునియొక్క శాప వికృతిచేత ఈ వికృతరూపం పొంది, నరమాంస భక్షకుడినై, దీని ప్రాణాలను, చివరికి నా 

కూతురు ప్రాణాలను కూడా తీద్దామనుకున్నాను పాపబుద్ధితో! అని ఆత్రుతతో, ప్రేమతో, కృతజ్ఞతతో నిండిన పలుకులను పలికాడు ఆ గంధర్వుడు, 

ఇందీవరాక్షుడు!

అనునెడ వచ్చి మనోరమ

జనకుని పాదముల కెఱఁగ సస్నేహమతిం

గనుఁగవ నీరొలుకఁగ నం

దన మూర్ధ ఘ్రాణ మతఁడు దయఁ గావించెన్

ఇందీవరాక్షుడు యిలా అంటుండగానే మనోరమ వచ్చి తండ్రి పాదాలమీద వాలింది. ప్రేమతో, నీరు నిండిన కనులతో

కుమార్తెను ఎత్తి, ఆమె మూర్ధమును అంటే మాడును ఆఘ్రాణించాదు తండ్రి, ఇందీవరాక్షుడు. సంతానాన్ని దగ్గరికి తీసుకున్నప్పుడు వారి 

మాడును, వారి శిరస్సును ఆఘ్రాణించడం వలన సంతానం యొక్క ఆయుష్షు పెరుగుతుంది అని భారతీయుల సంప్రదాయం. రామాయణ, 

భారతాది ఇతిహాసాలలో శ్రీరాముడిని దశరథుడు, అభిమాన్యుకుమరుడిని ధర్మరాజాదులు, పురాణాలలో కూడా అనేక సందర్భాలలో 

తరచూ పెద్దలు తమ పిల్లల మూర్ధములను(శిరసులను) ఆఘ్రాణించడం అనే పదం కనిపించడానికి యిదే కారణం!

అపుడు విస్మితాత్ముఁ డై వరూథిని సుతుఁ

డేమి కారణమున నే తపస్వి

ఇట్టి శాప మిచ్చె నెఱిఁగింపు విన వేడు

కయ్యె ననఘ! యనిన నాతఁ డనియె

అప్పుడు ఆశ్చర్య చకితుడైన స్వరోచి ఏ తపస్వి, ఎందుకు మిమ్మల్ని ఇలా శపించాడో వినాలని కుతూహలంగా ఉన్నది మహానుభావా! ఆ 

వృత్తాంతాన్ని తెలియజెప్పవయ్యా అని అడిగాడు . ఇందీవరాక్షుడు తన కథను చెప్పడం ప్రారంభించాడు.    

(కొనసాగింపు వచ్చే సంచికలో)

-వనం వేంకట వరప్రసాదరావు 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి