మనం బాగుంటే చాలు - భమిడిపాటి ఫణిబాబు

enough our safety

 మనం బాగుంటే చాలు.. అవతలివాడు ఏ గంగలో దిగితేనేమిటీ... అనే భావం ఈరోజుల్లో చాలా సందర్భాల్లో చూస్తూంటాము.   ఎవరో వస్తారు, వాళ్ళే చూస్తారు అని చూడడం కంటే, ఎవరి బాగు వారు చూసుకోవడమే శ్రేయస్కరమని చాలా మంది అభిప్రాయం. నిజమే, కానీ just క్షణికంగా నైనా, మనం చేసేది అవతలివారికి అసౌకర్యంగా ఉందేమో అని ఆలోచిస్తారా ఈ రోజుల్లో ? ఇలాటివాటి ఉదాహరణలకి ఎక్కడికో వెళ్ళఖ్ఖర్లేదు. ఇంటినుండి బయటకు వచ్చి చూస్తే కోకొల్లలు.బస్సుల్లో చూస్తూంటాము, ఆఫీసులకి వెళ్ళేవారు, స్కూళ్ళకీ, కాలేజీలకీ వెళ్ళే


విద్యార్ధులూ, వారి వీపులమీద అవేవో back pack లుట. వాటిని చిన్నప్పుడు చూసిన బియ్యం బస్తాల్లాగ మోసుకుంటూ కనిపిస్తారు. సరే, అన్ని సరుకులూ వాటిల్లో అమర్చుకుని వాళ్ళే మోస్తూంటే, మీకేమిటీ అనొచ్చు.వాళ్ళకి సౌకర్యంగానే ఉంటుంది, కానీ ఈ బస్తాల ధర్మమా అని, బస్సుల్లో నుంచునేవారి సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది. ఎందుకంటే, ఆ బ్యాగ్గు మోసేవాడూ, వాడి వెనక్కాల ఆ బ్యాగ్గు ఆక్రమించే స్థలమూ కలిపితే, ఇంకొకడు నుంచోడానికి స్థలం ఎక్కడా ? పోనీ అదృష్టవశాత్తూ, ఆ మోసేవాడికి సీటు దొరికినా, అందులో ఈ బ్యాగ్గు ఆక్రమించే స్థలం పోగా, మిగిలిన దానిలో కూర్చోడానికి కూడా వీలుపడదు. ఏదో పోనీ దారికి అడ్డంగా ఉన్నాడూ అని ,తడుదామా అంటే, స్పర్శ ఉండదూ, నోటితో చెప్తే వింటాడా/ వింటుందా అనుకుంటే ఆ చెవుల్లో అవేవో పెట్టుకుని తన్మయం చెందిపోతూ తన సంగతే చూసుకునే నిర్వికార్, నిరాకార్, నిర్లజ్ పక్షులే వాళ్ళు.  ప్రతీదానికీ రిజర్వేషన్ ఉన్న ఈరోజుల్లో, హాయిగా ఈ  back pack గాళ్ళకి కూడా ఓ ప్రత్యేక బస్సు వేస్తే బాగుండును. అందరూ సుఖపడతారు.ఇంకో విషయమేమంటే, వాడు బస్సు దిగేటప్పుడు, వాడి వీపుమీద ఉన్న బస్తా ఇవతల కూర్చున్నవాడి కళ్ళజోడు కి తగిలినా ఏమీ అనకూడదు !

ఇంకో రకం ప్రాణులు ఉన్నారు. కార్లు నడిపేవారు.ఏదో ట్రాఫిక్ రూల్స్ ప్రకారం, పార్కింగు స్థలాలు ఉంటే నోరుమూసుకుని, అక్కడ పెట్టిన బోర్డుల ప్రకారం పార్కింగు చేస్తారు . వాటిక్కూడా ఏవేవో వారాలూ, వర్జ్యాలూనూ, దానికి విరుధ్ధంగా పార్కింగు చేస్తే, ఆ వాహనాన్ని కాస్తా పోలీసులు తీసుకుని చక్కాపోతారు. అలాటి ప్రత్యేక పార్కింగులు లేకపోయేయా, అయిపోయిందే మన పని. ఏ సందులోనో, వాళ్ళిష్టం వచ్చినట్టు పార్కింగు చేసేయడం.అవతలివాళ్ళు ఏ గంగలో దిగినా పరవాలేదు, తనూ తనకారూ క్షేమంగా ఉంటే చాలు !

ఇంకొంతమందుంటారు, రోడ్డు పక్కన ఉండే ఏ కూరలో, పళ్ళో కొనుక్కోవాలంటే, అక్కడే పక్కనే ఆ కారునీ, స్కూటరునో పార్క్ చేసేయడం. ఇంకోరకం వాళ్ళు , ఏ పానీ పూరీయో, ఇంకో సింగినాదమో తింటూ, కార్పొరేషన్ వాళ్ళు వేసిన foot path అంతా తమ స్వంతమే అనుకోవడం.

విడిగా ఇళ్ళు కట్టుకునే వాళ్ళని చూశారా, వాళ్ళ ఇళ్ళల్లోంచి వచ్చే మురుగునీరు, ఎప్పుడూ పక్కవాడింటి ముందరకే పారుతూంటుంది. తనూ తన పరిసరాలూ శుభ్రంగా ఉంటే చాలు. ఏదో గేటేడ్ కమ్యూనిటీ అయితే ఫరవాలేదు కానీ, మిగిలిన చోట్లలో ఇదే పరిస్థితి.ఏదో చెట్టో చేమో వేయడం, ఆ మొక్క వృక్షంగా పెరిగి, ఆకులన్నీ పక్కవాడి కాంపౌండులో పడడం.


ఇంక పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఉండే సొసైటీల్లో ఉంటారు కొంతమంది.  ఆ రోజో, ముందరి రోజో పేపర్లో చదువుతాడు, ఫలానా రోజున నీళ్ళ సప్లై తక్కువగా ఉంటుందీ అని. ఛస్తే ఇంకోడితో చెప్పడు, వాళ్ళు బాగుపడిపోతే.. వామ్మోయ్.. ఇంట్లో ఉండే అన్ని పాత్రలలోనూ, చివరకి గ్లాసూ, ఉధ్ధరిణిలతో సహా అన్నిటిలోనూ ఆ నీళ్ళు వచ్చినప్పుడు నింపేసికోవడం. పోనీ ఊరుకుంటాడా అబ్బే, సొసైటీలో ఉండే మిగిలినవాళ్ళు ఇంకా నీళ్ళు రాలేదేమిటీ అని జుట్టుపీక్కుంటూంటే, తీరిగ్గా వచ్చి.. “ ఇంకా నీళ్ళేమిటీ.. ప్రొద్దుటే వచ్చేశాయి, మళ్ళీ రెండూరోజులు రావుట, పేపర్లో ప్రకటించారు చూడలేదా .. అంటూ ముసిముసి నవ్వులతో చెప్పడం. అదో పైశాచికానందం.


కొత్తగా ఏ ఎపార్టుమెంటో కొనుక్కున్నాడనుకోండి, వాటికి ఫర్నిష్ చేయడానికి ఏ వడ్రంగి వాడినో పిలిచి పని అప్పచెబుతాడు, ఆ వడ్రంగివాళ్ళు, రాత్రనకా పగలనకా, చప్పుళ్ళు చేసికుంటూ, సొసైటీలో ఉండే మిగతావారి నిద్రలు చెడగొట్టడం. అసలు పని చెప్పిన యజమానికేంపోయిందీ, వాడేమైనా ఈ పనిజరిగేటప్పుడు ఇక్కడ ఉండడుగా..తమ ఎపార్టుమెంటు ఎదుట శుభ్రంగా ఉంటే చాలు, మన చెత్తంతా అవతలివాడి గుమ్మంలోకి తుడిచేయడం.

ఇంకో రకం... రైళ్ళలో వేళ్ళేటప్పుడు, ఈ వెడుతూన్నవారికి వీడ్కోలు చెప్పడానికి వచ్చేవాళ్లు, ప్లాట్ఫారం మీదా,ఆ వెళ్ళేవాళ్ళూ కంపార్టుమెంటు ద్వారం దగ్గరా నుంచుని కబుర్లు చెప్పుకోవడం. ఆ అవతలివాళ్ళు పైకీ రారూ, ఈ లోపలవాళ్ళు బయటకీ వెళ్ళరు, ఇద్దరికీ భయమే రైలు కదిలిపోతుందేమో అని ! వచ్చేపోయేవాళ్ళు ఏ గంగలో దూకితేనేమిటీ ? కాలక్షేపానికి ఏ వేరుశనక్కాయలో , పళ్ళో  ఏవో కొనడం, ఆ ఒలిచిన తొక్కలన్నీ అక్కడే క్రింద పడేయడం. ఇంక ఏ మొట్టమొదటి స్టేషన్ లోనో ఎక్కేడనుకోండి,  బెర్తు కింద వాడి సామానంతా కుక్కేసి, మొత్తం స్థలం ఆక్రమించేయడం, పైగా వాటికో చైనూ, దానికో తాళమూనూ...

ఇలా చెప్పుకుంటూ పోతే కావాల్సినన్ని కనిపిస్తాయి. నిజమే మన సుఖం చూసుకోవాలి, కానీ పనిలో పనిగా అవతలివారి సౌకర్యం కూడా చూస్తే బాగుంటుందేమో...

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి