సంసారం లో “ స రి గ మ..” లు - భమిడిపాటి ఫణిబాబు

samsaaramlo sarigamalu

సాధారణంగా, అంటే ఇదివరకటి రోజుల్లో అనుకోండి, భార్యలు తమ భర్తలని మరీ చిన్నచూపు చూస్తున్నారని ఎవరైనా భావిస్తారేమో అనే భయం అనండి, లేదా ఈయనగారితో తన భావిజీవితం అంతా ఎలాగూ గడపక తప్పదుకదా అనే ఉద్దేశ్యంతో అనండి,స్వతసిధ్ధంగా ఉండే శాంతస్వభావం అనండి, లేదా ఇంట్లో తల్లితండ్రుల పెంపకం అనండి, లేదా తన తల్లి, తన తండ్రిని సంబోధించే పధ్ధతనండి, కారణాలు ఏవైతేనేం, కనీసం అందరి ఎదురుగుండా, " ఏవండీ.." అనే సంబోధించేవారు. ఆ పిలుపు క్రమక్రమంగా " ఇదిగో.. మిమ్మల్నే.." లోకి, ఓ పదిపదిహేనేళ్ళకి మారింది.

ఇంక భర్తలంటారా, సామాన్యంగా " ఏమోయ్..", కొద్దిగా mcp ల తెగవారైతే " ఏమే.." "ఒసేయ్.." లకే పరిమితమయ్యేవారు. అయ్యేవారేమిటిలెండి, జరుగుబాటునిబట్టి ఇప్పటికీ అలాగే లాగించేసేవారిని ఇప్పటికీ చూడొచ్చు.అయినా మనకెందుకూ, పిలవడానికి ఆయనకీ, పిలిపించుకోడానికి ఆవిడకీ అభ్యంతరం లేనప్పుడు? ఊరికే సందర్భం వచ్చిందికదా అని చెప్పాను. అయినా పిలుపులో ఏముందిలెండి,అభిమానమూ, ఆపేక్షా ఉంటే చాలదా అంటారనుకోండి. వినేవారికి , చూసేవారికీ తెలుస్తూంటుంది  భర్త భార్యని ఎలా సంబోధిస్తాడో, దానిని బట్టి బేరీజు వేస్తూంటారు, ఆ ఇంట్లో పరిస్థితి, ఏమాత్రం లోకజ్ఞానం ఉన్నవారైనా.సంసారంలో ఉండే status ఊళ్ళోవాళ్ళందరికీ తెలియాలంటే ఇంతకంటె  ఇంకో మంచిమార్గం లేదు. అలాగే female domination ఉండే ఇళ్ళల్లో కూడా తెలిసిపోతుంది, భార్య భర్తని పిలిచే పధ్ధతి చూసి. ఏ పెళ్ళిసంబంధమో స్థిరపరుచుకోడానికి వస్తే, ఇట్టే తెలిసిపోతూంటుంది, ఇంట్లో ఎవరిప్రభావం ఎక్కువో అనేది.

అలాగని ఎవరి domination ఎక్కువో తెలిసికోడానికి, సంబోధించే పధ్ధతే yardstick అని కాదు, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, వాళ్ళు భోజనానికి ఉండకూడదా అని, మొగాళ్ళని ఇరుకులో పెట్టడానికో, లేదా మర్యాదకోసమనో ఈ భర్తలని అడుగుతారు.ఏమంటే ఏం తప్పో అనుకుని, గొడవలేకుండగా, “మా ఆవిణ్ణడగండి..” అని తప్పించేసికుంటారు. పైగా " నాదేముందండీ, ఈవేళ్టి భోజనం ఎక్కడ ప్రాప్తో తెలిస్తే చాలు.." అని ఓ చెత్త జోక్కులాటిది కూడా వేస్తారు, ఏడవలేక నవ్వడానికి. ఆమాత్రం చాలదూ, మాస్టారి పరిస్థితి ఏమిటో తెలియడానికీ? ఇదివరకటి రోజుల్లో వచ్చే సినిమాల్లో సూర్యకాంతమ్మగారు నటించిన ఎక్కువభాగం పాత్రలు ఇలాటివే. భర్త అనబడే ఆ బక్కప్రాణి కి నోరెత్తే ధైర్యం ఉండేది కాదు. ఏదో సినిమా కాబట్టి నవ్వుకునేవాళ్ళం. కానీ, నిజజీవితాల్లో కూడా అలాటివి చూస్తూనే ఉంటాము.

Ofcourse పైన చెప్పినవన్నీ "ఇదివరకటి" కాపురాలగురించనుకోండి. ఈరోజుల్లో అసలు ఆ గొడవే లేదు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు పేర్లతోనే పిలుచుకుంటున్నారు. ఎంత చెప్పినా " ఆధునిక యుగం" కదా !  పేర్లకీ, ముద్దుపేర్లకీ కొదవే లేదు. ఏదో ఇంకా అదృష్టం కొద్దీ పిల్లలు ఇంకా తల్లితండ్రుల్ని పేర్లతో సంబోధించడం లేదు.  పిలిస్తే మాత్రం తప్పేవిటీ అనొచ్చు. నిజమే కదా, మరి పిల్లలతో అంత intimacy కదా !

ఇన్నేళ్ళూ ఓ పధ్ధతికి అలవాటు పడిపోయిన ప్రాణులకి ఈమధ్యన, కొత్త పరిణామాలకి adjust అవడానికి కొద్దిగా టైము పడుతోంది. ఇదివరకటి రోజుల్లో అయితే,భార్య ఏదో పని చేస్తూ, భర్తతో "ఏవండీ కొద్దిగా మంచినీళ్ళు తెచ్చిపెడతారా." అంటే , వాళ్ళమధ్యఉండే సంబంధబాంధవ్యాల బట్టి తెస్తే తెస్తాడు, లేకపోతే మానేస్తాడు, ఆ భర్తప్రవృత్తిని బట్టి. కానీ అదే భార్య భర్తని  ఆ "ఏవండీ" తీసేసి,  “మంచినీళ్ళు తేరా.." అనేటప్పటికి షాక్కవుతాడు, ఈవిడకేమొచ్చిందీ ఇన్నాళ్ళూ లక్షణంగానే అడిగేదీ, ఇప్పుడేమిటీ "రా" లోకి దిగిపోయిందీ అనుకుని, " మరీ ఆ పిలుపేమిటీ.. రా.. ట.. రా.. మరీ అంత రోడ్డెక్కాయాలా, అఘాయిత్యం..." ఇంట్లో ఉండే పెద్దావిడో, పెద్దాయనో అనుకునే ఆస్కారం ఉంటుంది. కానీ బ్రహ్మశ్రీ చాగంటివారు చెప్పినట్టు, ప్రతీవిషయమూ లోపలికి వెళ్ళి దాని నిక్షిప్తార్ధం పట్టుకోవాలిట.

ఆ సందర్భంలో ధైర్యం చేసి, భర్త భార్యతో " మరీ అలా అడిగేశావేమిటీ, ఇంక నా గతి అంతేనా.." అని అడిగితే, ఆ భార్యగారు ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, "ఫరవాలేదే మాస్టారు లైనులోకి వస్తున్నారూ .." అనుకుని, " అదేమిటండీ మరీ నేను అంత బరితెగించినదానిలా  కనిపిస్తున్నానా ఏమిటీ, నేనడిగిందేమిటీ " మంచినీళ్ళు తేరా.." అంటే దానర్ధం మంచినీళ్ళు తేరా? ప్లీజ్.." అని. అలాగే fan ఆర్పరా, కిటికీ అద్దాలు తుడవ..రా.. వీటన్నిటికీ “ ? “ మార్కు పెట్టుకుంటే మీకే తెలుస్తుంది, నేనెంత సౌమ్యురాలినో అన్నా ఆశ్చర్యపడఖ్ఖర్లేదు

వ్రాసేటప్పుడు కాబట్టి "?" మార్కు అన్నాను. కానీ, ప్రత్యక్షంగా జరిగినప్పుడు "వాతావరణం", body language, లాటి ఇత్యాది పరిస్థితులకి అనుగుణంగా అర్ధాలు మారుతూంటాయి. మన అదృష్టం బాగోపోతే మన కర్మం అని ఓ దండం పెట్టడం !!

పైన చెప్పినవన్నీ ఇంట్లో ఉండేటప్పుడు జరిగే భాగోతాలు. ఎప్పుడైనా బయటకు వెళ్ళాల్సొచ్చినప్పుడు, భార్యాభర్తలు ఒక ఒడంబడిక చేసికుంటూంటారు. భర్తగారు, భార్యతో ఇంట్లోనే చెప్పుకుంటాడు... “ మనం వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, సరదాగా .. “ ఓ గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురావోయ్..” అంటాను, మరీ గయ్యిమనేసి వీధిన పెట్టేయకేం..”. ఆవిడ మాత్రం తక్కువ తిందా ఏమిటీ, “ సరే ..మీరడిగినట్టే తెస్తాను.. కానీ పై వారమంతా తెల్లవారుఝామున కుళాయిలో నీళ్ళు పట్టడానికీ,  శలవరోజుల్లో పాలవాడు వచ్చినప్పుడు, మీరే తీసికోవాలి..సరేనా..”. ఆ భర్తగారు పాపం చచ్చినట్టు ఆవిడ పెట్టిన కండిషన్లు ఒప్పుకుంటాడు..

అదండీ సంసారంలో “స రి గ మ “ లు...అంటే..

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి