సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము

(గత సంచిక తరువాయి)

తండ్రీ నాకు ననుగ్రహింపఁగదె వైద్యం బంచుఁ బ్రార్థించినన్
గండ్రల్గా నటు లాడి ధిక్క్రుతులఁ బోకా ల్మంటివోహో! మదిం
దీన్డ్రల్ గల్గినవారి కేకరణినేనిన్ విద్య రాకుండునే?
గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికి జిక్కుం గష్ట ముష్టింపచా!

తండ్రీ! నాకు ఆయుర్వేద వైద్య విద్యను అనుగ్రహించి కృతార్థుడిని చేయవయ్యా అని  ప్రార్థిస్తే గాండ్రిస్తూ, కోపంతో చిందులు త్రొక్కి, ధిక్కరించి, ఇక్కడినుండి వెళ్ళిపో అన్నావే! మనసులో పట్టుదల, కోరిక ఉండాలే గానీ, ఏదో రకంగా విద్య రాకుండా పోతుందా? గుండ్రాయి దాచిపెడితే పెళ్లి ఆగిపోతుందా, నానా కష్టాలు పడుతూ ముష్టి ఎత్తుకుని పొట్టపోసుకునే ముష్టివాడా! అన్నాను ఆయనను నిందిస్తూ, హేళన చేస్తూ, తృణీకరించి.

అనినం గన్నులు జేవుఱింప నధరం బల్లాడ వేల్లత్పునః
పునరుద్య ద్భ్రుకుటీ భుజంగ యుగళీ ఫూత్కార ఘోరానిలం
బన నూర్పుల్‌ నిగుడన్‌ లలాటఫలకం బందంద ఘర్మాంబువుల్‌
చినుకం గంతుదిదృక్షు రూక్షనయన క్ష్వేళా కరాళ ధ్వనిన్‌.

నేనలా అనగానే కన్నులు జేవురించి, పెదవులు అదురుతుండగా, మాటిమాటికీ కనుబొమలు త్రాచుపాముల్లాగా ఎగసిపడుతుండగా, బుసకొడుతున్నట్లు శ్వాస వెలువరిస్తూ నుదుటిమీద చెమటలు చిందుతుండగా, మన్మధుడిని మసిచేసిన శివుని మూడో కన్నులాగా పెళ పెళార్భాటాలు చేసే కన్నులతో నన్ను కాల్చేసేట్లు చూస్తూ పటపట పండ్లు కొరికి, కటకటా కుటిలాత్మా, మాయతో విద్యనూ గ్రహించినదే కాక మాతోనే పరిహాసాలా? మమ్మల్నే నిందిస్తావా? అని హుంకరించి, ముక్కుపుటాలు అదురుతుండగా, తన జోలెలోనుండి విభూతిని తీసికొని, రాక్షస మాయతో విద్యను గ్రహించి, అపహసించావు కనుక రాక్షసుడవై, రక్తము, మాంసము ఆహారంగా తీసుకుంటూ నరమాంస భక్షకుడివై బతుకు పో! అని ఆ బూడిదను నా మీద చల్లాడు. అంతే! నేను భయముతో గడగడా వణకుతూ అయన పాదాలమీద పడిపోయాను.

నా యజ్ఞానము సైఁచి సంయమివరేణ్యా! కావవే రాక్షసుం
డై యే నెట్లు భజించువాఁడ దురితంబయ్యో! నృమాసంబు కూ
డై యే నెట్లు భరించువాఁడ నుదరం, బార్ద్రాంతరంగుండ వై
యోయయ్యా! దయసేయవే యవధి, యే నోపంగదే హింసకున్‌.

మునీశ్వరా! నా అజ్ఞానమును క్షమించి నన్ను కనికరించు. రాక్షసుడినై  నరమాంసముతో ఎలా పోట్టపోసుకోను? ఈ పాపకర్మకు నేనెలా ఒడిగట్టగలను? నేను హింస చేయడానికి పూనుకోలేను స్వామీ, దయతో మీ శాపానికి అవధిని, కాల పరిమితిని ఇవ్వండి, కొంతకాలానికైనా విముక్తిని పొందే మార్గాన్ని చూపించండి, అని ప్రార్థించాను.

అనినఁ బ్రసన్నుఁడై ముని కరాబ్జములన్‌ నను నెత్తి వత్స! మ
త్సునిశిత శాప శూల హతి స్రుక్కితిగా యిఁకఁ గొన్నినాళ్ళపైఁ
దనయను మ్రింగఁ బోయి యొక ధన్యుని దివ్యశరార్చిఁ బ్రేలి వే
కనియెదు భద్ర మన్నఁ దురగంబుపయిం బడి ప్రొద్దుగ్రుంకఁగన్‌.

నేను అలా అనగా ఆ ముని ప్రసన్నుడై, నన్ను తన చేతులతో పైకెత్తి, అయ్యో కుమారా! వాడి ఐన నా శాపము అనే శూలహతితో దెబ్బ తిన్నావే! కొన్ని రోజులకు నీ కుమార్తెనే మ్రింగడానికి ప్రయత్నించి, ఒక ధన్యుడి దివ్యమైన బాణాగ్నిలో దహింపబడి, వెనువెంటనే శుభాన్ని పొందుతావు, నీ పూర్వ రూపాన్ని పొందుతావు అని శాపవిమోచన ప్రసాదించగా, నా గుర్రాన్ని ఎక్కి, ప్రొద్దు వాలుతుండగా ఖిన్నుడినై  నా రాచనగరుకు చేరుకున్నాను. అందరినీ కసురుకుంటూ పంపించివేసి, నాకు మంగళ హారతులిచ్చి స్వాగతము పలికిన అంతఃపుర స్త్రీలను అందరినీ ఆ అర్ధరాత్రి చంపించాను అని తన కథను కొనసాగించాడు ఆ గంధర్వుడు.  ఏ విద్యను గ్రహించడానికి అయినా కొన్ని అర్హతలు, కొన్ని పరిమితులు ఉంటాయి. ఏ పదవిని పొందటానికి అయినా అలాగే. ఆధునిక ప్రజాస్వామ్యము లో కూడా ఎవరు పడితే వారు అలా యథాలాపంగా వైద్యులు, సైనికులు కాలేరు. కొన్ని పరిమితులు, పరీక్షలు, ప్రమాణాలు ఉంటాయి. వేదవిజ్ఞానములో అంతర్భాగమైన ఆయుర్వేదాన్ని నేర్చుకోడానికి నువ్వు పనికిరావు అని, ఆతని ఓర్పుకు, సహనానికి పరీక్ష పెట్టాడు ఆ మునీశ్వరుడు. ఆ పరీక్షలో ఓడిపోయి, అహంకారంతో విర్రవీగి, తన నిజ గుణాన్ని చూపించి రాక్షస మాయతో విద్యను గ్రహించి, అంతటితో వెళ్ళిపోయినా ఏ గొడవా ఉండేది కాదు, తన ధూర్తగుణాన్ని చూపించాడు. అతివినయం ధూర్త లక్షణం అన్నది అందుకే. అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు అనడం, ఈ క్షణంలోనే వినయంగా నమస్కరించి మరుక్షణంలోనే నిందించడం ధూర్తుడి లక్షణం.  మాయతోనే అయినా విద్యను ఆ మునినుండి గ్రహించాడు కనుక ఆయన తనకు గురువే అన్న సంగతిని మరిచి గురు నింద చేశాడు. అది గంధర్వుడి లక్షణం అయితే, ‘ఉత్తమస్య క్షణకోపాత్ మధ్యమే ఘటికా ద్వయం, అధమేస్యాదహోరాత్రం, పాపిష్టో మరణాంతకమన్న ఆర్షవాక్యం ప్రకారం, ఉత్తముడికి వచ్చిన కోపం క్షణకాలమే ఉంటుంది, మధ్యముడికి రెండు ఘడియలు అంటే ఒక గంట పాటు ఉంటుంది, అధముడికి వచ్చిన కోపం అహోరాత్రం అంటే ఒక రోజంతా ఉంటుంది, పాపిష్టి వాడికి వచ్చిన కోపం జీవితాంతం ఉంటుంది కనుక, ఉత్తముడైన ఆ మునీశ్వరుడికి వచ్చిన కోపం మరుక్షణమే చల్లారింది, అందుకే కుమారా అని లేవనెత్తి, జాలిపడి, శాప విమోచనాన్ని తెలియజేశాడు, అది మునీశ్వరుడి లక్షణం!

అభ్రమండలి మోచునందాఁక నూరక, పెరిఁగిన ట్లౌ మేను నరవరేణ్య!
యవధి భూధరసాను వందాఁక నూరక, పఱచినట్లౌ మేను పార్థివేంద్ర!
యబ్జభూ భువనంబు నందాఁక నూరక, యెగసినట్లౌ మేను జగదధీశ!
యహిలోకతలమంటునందాఁక నూరక, పడిన యట్లౌ మేను ప్రభువతంస!

మహారాజా! ఆకాశాన్ని తాకేట్లు శరీరం పెరుగుతున్నదా అనిపించింది. భూమి అంచులమీద ఉన్న పర్వతాల వరకూ  శరీరం పరుచుకున్నట్లు వ్యాపించినట్లు అనిపించింది. బ్రహ్మలోకం దాకా శరీరము ఎగిసినట్లు, పెరిగినట్లు అనిపించింది. పాతాళంలో నాగలోకం దాకా శరీరం లోతులకు పడిపోయినట్లు అనిపించింది.

యఖిలజగములు మ్రింగునం తాఁకలియును
నబ్ధు లేడును జెడఁ గ్రోలునంత తృషయు
నచలచాలనచణమైన యదటుఁ గలిగె
నసురభావంబు ననుఁ జెందు నవసరమున.

లోకాలన్నింటినీ మింగేసేంత ఆకలి, సప్తసముద్రాలను ఒక్క గుక్కలో తాగేసేంత దాహము, పర్వతాలను పెకిలించివేసే  శక్తి ఒక్క ఉదుటున కలిగినట్లు అనిపించింది నాకు రాక్షస రూపము వచ్చే సమయములో! అంతే, పూర్తిగా రాక్షసుడినై  పోయాను.

రక్కసుఁడ నై నెపం బిడి
యొక్కొక యపరాధమునకు నొక్కొక్కఁడు గా
బొక్కఁగ లోకము పురపురఁ
బొక్కఁగఁ బాడయ్యె నంతిపురముం బురమున్‌.

రాక్షసుడినై ఏదో వంకతో ఒక్కొక్క నేరానికి ఒక్కొక్కడిని బొక్కెయ్యడం మొదలెట్టాను. ప్రజలందరూ అల్లల్లాడిపోయారు. నా అంతఃపురము, నా పురము అన్నీ పాడైపోయాయి, ఖాళీ ఐపోయాయి.

ఊరు పా డైనఁ గెళవుల యూళ్ళ కుఱికి
మెసవ దొరఁకొంటిఁ బ్రజ మారి మసఁగినట్లు
తీఱెఁ గతిపయదినముల దేశమెల్ల
మల్లె వట్టిన చేని క్రమంబు గాఁగ.

నా పురము పాడైపోతే మిగిలిన దూర దూరపు ఊళ్ళమీద మహమ్మారి పడినట్లు పడి, దొరికినవాడిని దొరికినట్లు తినెయ్యడం మొదలెట్టాను. కొన్ని రోజులకే దేశమంతా నిర్మానుష్యం ఐపోయింది, చీడ పట్టిన చేనులాగా! భయంకరమైన ఆకారంతో ‘ జటి యనక వటు వనక యతి యనక వ్రతి యనక గృహి యనక సతి యనక శిశు వనక భక్షించి భక్షించి ‘ పొట్ట పోసుకోడమే లక్ష్యంగా బ్రతుకుతుండగా, చుక్కలను, వర్షపు చుక్కలను, ఇసుక రేణువులను లెక్కించడం సాధ్యమేమో గానీ, నా బారిన పడి, నా పొట్టన బడిన జీవకోటిని లెక్కించడం బ్రహ్మదేవుడికైనా వశము కాదు అన్నట్లు బ్రతుకుతుండగా, కైలాస శిఖరము మీద వనములో పూలు కోసుకుంటున్న ఈ బాలికను చూసి, కుమార్తె అన్న సంగతిని కూడా లెక్క చేయకుండా, చంపి తినడానికి తరుముతూ వచ్చి, నీ దయచేత శాపవిమోచనను పొందాను అని తన వృత్తాంతాన్ని కొనసాగించాడు ఆ గంధర్వుడు

(కొనసాగింపు వచ్చే వారం)

***వనం వేంకట వరప్రసాదరావు 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి