పుస్తక సమీక్ష - సిరాశ్రీ

Telugu Chatuvu Book Review
పుస్తకం: తెలుగు చాటువు
రచన: బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, బాలాంత్రపు నళినీకాంతరావు 
ముద్రణ: 2006
వెల: 60/-
ప్రతులకు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

తెలుగు సాహిత్యంలో పద్యానికి ఎంత విశిష్ట స్థానం ఉందో, పద్యాల్లో చాటువులకి అంతటి స్థానం ఉంది. ఇది "చాటు" అనే సంస్కృత పదం నుంచి వచ్చిన పదం. చాటుః అంటే సంస్కృత నిఘంటువు ప్రకారం "ప్రియవాక్యం" అని కనిపిస్తుంది. కవులు రాజులను ఇష్టం కొద్దీ పొగిడే పొగడ్తలన్నమాట. అయితే చాటువులన్నీ ప్రియవాక్యాలు కావు. తిట్ల చాటువులు, బాధతోనో, కోపంతోనో, చిరాకుతోనో పొంగుకొచ్చిన చాటువులు అనేకం ఉన్నాయి. అయితే రసం ఏదైనా, పద్యప్రియులకి అవన్నీ ప్రియమైనవే కాబట్టి, వాటిని కూడా ప్రియవాక్యాల కోవలోకి చేర్చొచ్చేమో.

ఇక ఉపోద్ఘాతం చాలించి విద్యుద్ఘాతం లాంటి ఈ పుస్తకం గురించి చెప్పుకుందాం. విద్యుద్ఘాతమని ఎందుకన్నానంటే పాఠకులను షాక్ కి గురిచేసే అనేకమైన భాషాద్భుతాలు ఇందులో ఉన్నాయి. గతంలో చాటు పద్య మణిమంజరి, చాటు పద్య రత్నాకరం, చాటు పద్య రత్నావళి వంటివి చదివిన అనుభవంతో ఇది కూడా అలాంటి సంకలనమే అనుకున్నాను. కానీ ఇందులో సంకలన పద్యాలతో పాటు వాటి పూర్వాపరాలు కూడా చర్చించారు. పైగా చారిత్రిక నేపధ్యంతో కాలానుక్రమంగా చాటు పద్యాలను అమర్చారు. ఒక భాషా చరిత్ర పాఠం చదువుతున్న అనుభూతిని ఇస్తూనే మరుగునబడ్డ అనేక పద్యాలు మురిపిస్తూ నన్ను మరిపించాయి. మునుపు చదివిన చాటు సంకలనాల్లో ఉన్న పద్యాలు కొన్ని ఇందులో కనిపించినా పునరుక్తి దోషం కనపడలేదు. కారణం చెప్పానుగా...ప్రతి పద్యానికి నేపధ్యం హృద్యంగా చెప్పబడి ఉంది.

భాషాభిమానులకు, ఛందశ్శాస్త్ర ప్రియులకు, కవితారక్తులకు ఈ పుస్తకంలో ప్రతి పుట పులకింపజేస్తుంది. ఉదాహరణకి పాదానికి 8 అక్షరాలతో ఉండే అనుష్టుప్ ఛందస్సు భగవద్గీత శ్లోకాలతో అందరికీ సుపరిచితం. ఆ అనుష్టుప్పును తెలుగులో ఎవ్వరూ పెద్దగా వాడలేదు. అయితే పద్యాల ప్యారడీలతో ప్రఖ్యాతి గాంచిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి (జరుక్ శాస్త్రి) ఒక తెలుగు అనుష్టుప్పును చెప్పారు. ఆ పద్యం ఇందులో ఉంది. అది ఇది:

ఒక కాని ఒకే కాని 
రెండు కానులు అర్థణా
మూడు కానులు ముక్కాని
నాలుగు కానులొకణా

అణాలు, కానుల లెక్కలు తెలిసిన వారిని ఈ పద్యం మెప్పిస్తే, తెలియని ఈ తరం వారికి ఆ లెక్కలు తెలియపరిచి మరీ మెప్పించి ఒప్పిస్తుంది. అలాగే "పాషాణ పాక ప్రభూ" అంటూ ఈయనే విశ్వనాథ సత్యనారాయణ గారి పద్య శైలిని అనుకరిస్తూ వారినే అధిక్షేపించిన పద్యం కూడా ఉంది.

కించిత్ తిక్త కషాయ బాడబ రస క్షేపాతిరేకాతి వా
క్సంచార ప్రచయావకాశములలో కవ్యుద్ఘ! గండాశ్మముల్ 
చంచల్లీల నుదాత్త వాగ్గరిమతో సాధించి వేధించుమా!
పంచారించి ప్రవహ్లికావృతి కృతిన్ పాషాణ పాకప్రభూ

ప్రతిపదార్ధం కావాలంటే శబ్దరత్నాకరాన్ని ఆశ్రయించడమే.

అలాగే శ్రీశ్రీ సిరిసిరిమువ్వా శతకంలో చెప్పిన సరదా పద్యాల్లోని చాటుత్వం కూడా ప్రస్తావించారు. ఆ వంకన ఆ పద్యాలు కొన్ని చదువుకుని నవ్వుకునే అవకాశం కల్పించారు.

ఎప్పుడు పడితే అప్పుడు 
కప్పుడు కాఫీనొసంగ కలిగిన సుజనుల్ 
చొప్పడిన ఊరనుండుము
చొప్పడకున్నట్టి ఊరు చొరకుము మువ్వా!

ఈ రోజులలో ఎవడికి
నోరుంటే వాడె రాజు, నూరుచు మిరియాల్
కారాలు, తెగ బుకాయి-
స్తే రాజ్యాలేలవచ్చు సిరిసిరి మువ్వా!!

ఇలా అన్నమాట.

ఇంకా ఎన్నో ప్రబంధ పద్యాలు, అష్టదిగ్గజాల నుంచి జాలువారిన చాటులక్షణాలున్న పద్యాలు కూడ ఇందులో పలకరిస్తాయి.

తెనాలి రామలింగ కవి ఒక్క "న" అక్షరంతో చెప్పిన ఏకాక్షర చాటు పద్యం చూడండి:

నాని నీనాను నేనును నాని నాను
నాన నేనును నిన్నూని నున్ననన్ను
నెన్న నున్నను నిన్నెన్న నున్ననాన
నిన్ననే నన్ననున్న నన్నెన్ను నన్ని

అర్థం నన్నడక్కండి. ఏ జొన్నవిత్తుల రామాలింగేశ్వర రావు గారి లాంటి వారో, రాళ్లబండి కవితా ప్రసాద్ గారో చెప్పాలి.

ఇక శ్రీనాధుడు చెప్పిన చాటువులు సరే సరి.

"చిన్న చిన్న రాళ్లు", "సిరిగలవానికి.." మొదలైన చాటువులతో పాటు నేటి తరం భావకవుల శైలిలో ఉండే ఒక అరుదైన శ్రీనాధుని పద్యం ఇదిగో:

శ్రీమదసత్య మధ్యకును, చిన్ని వయారికి, ముద్దులాడికిన్
సామజయానకున్, మిగుల చక్కని ఇంతికి మేలు కావలెన్
మేమిట క్షేమమీవరకు; మీ శుభవార్తలు వ్రాసి పంపుమీ
నా మది నీదు మోహము క్షణంబును తీరదు స్నేహ బాంధవీ!

చివరి రెండు పాదాలు వ్రాసింది శ్రీనాధుడేనా అనిపించట్లేదూ!!?
శ్రీనాధుడే!

ఇలా ఉదహరిస్తూ పోతే ఇందులో ఉన్న ప్రతి పద్యం ఉదహరించాల్సిందే. దేనికదే సాటి. ఇంత గొప్ప పుస్తకాన్ని అందించిన బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, బాలాంత్రపు నళినీకాంతరావు గార్లు ప్రశంసనీయులు. తెలుగు సాహిత్యంలో నేటి వరకు గ్రంథస్థం అయిన చాటువులు రమారమి 2000 దాకా ఉండొచ్చు. తెలుగు భాషాభిమానులు అందులో కనీసం ఒక 100, కవిత్వాభిమానులు ఒక 200 కంఠస్థం చేసినా తెలుగు చాటువులు చాటుకు పోకుండా సజీవంగా నిలుచుంటాయి. ఆ పని చేయడానికి ఇలాంటి పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయి.

-సిరాశ్రీ 

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి