అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి

annamayya pada seva

 005. నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు

నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు –
సత్యాత్ము డై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం-
స్తుత్యు డీతిరువేంకటాద్రివిభుడు

1.ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాత- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాత-
డేమూర్తి నిజమోక్షమియ్యజాలెడునాత- డేమూర్తి లోకైకహితుడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుగాడు - యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాతఁ-
డేమూర్తి సర్వాత్ము డేమూర్తి పరమాత్ము- డామూర్తి తిరువేంకటాద్రివిభుడు

2.యేదేవుదేహమున నిన్నియును జన్మించె - నేదేవుదేహమున నిన్నియును నణగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును - యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవుడీజీవులిన్నింటిలో నుండు - నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవుడవ్యక్తుడేదేవుడద్వంద్వుం- డాదేవుడీవేంకటాద్రివిభుఁడు

3.యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు - యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము - యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుడేవేల్పు పరమేశు- డేవేల్పు భువనైకహితమనోభావకుడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము - ఆవేల్పు తిరువేంకటాద్రివిభుడు(01-75)

ముఖ్యమైన అర్థాలు
నిత్యాత్మ=ఎల్లపుడూ జ్ఞానస్వరూపం కలవాడు; నిత్యుడు=ఎల్లప్పుడును ఉండువాడు;అద్వంద్వుడు =తత్త్వజ్ఞుడు, నిస్సంగుడు;

తాత్పర్యము
వేంకటేశుడు నిత్య స్వరూపుడు. సత్య స్వరూపుడు.అయన మన కళ్ల ఎదురుగా  పరబ్రహ్మ మూర్తిగా ఉండి తనను ఆరాధించే భక్తుల పొగడ్తలందుకొంటున్నాడు.

  1. ఈ వేంకటేశ్వరుడు లోకాలను పాలించేవాడు. బ్రహ్మ మొదలైన దేవతలచేత వెతుకదగినవాడు.తనను శరణన్నవారికి మోక్షము ఇచ్చేవాడు. లోకానికి మేలు చేసేవాడు. ఒక ఆకారంగా కనబడుతున్నప్పటికీ, ఆకారం లేనివాడు. త్రిమూర్తులు ఒకటైన మూర్తి. అంతటా వ్యాపించి యున్నవాడు. పరమాత్మ.
     
  2. ఈ వేంకట దేవుని శరీరములో ఈ సమస్త లోకాలు పుట్టాయి. ఈ లోకాలన్నీ అతనిలో లయమౌతున్నాయి. ఈ కనబడే సకల సృష్టి అతని శరీరము. సూర్య చంద్రులు నేత్రాలుగా కలిగిన వాడు. అందరియందు ఉండే పరమాత్మ. ఆ స్వామి చైతన్యమే ఈ కదిలే వాటన్నింటికి ఆధారము. అతడు విశారదుడు. తత్వము తెలిసినవాడు.
     
  3. వేంకటేశుని పాదాలు భూమి, ఆకాశము. ఆయన పాదాలకు , కేశాలకు చివర లేదు. ఆయన నిట్టూర్పు మహావాయువు. ఆయన నిజమైన దాసులు పరమ భక్తులు. అతనే అందరికీ ప్రభువు. పరమేశుడు. లోకానికి మంచి చేయాలని అతను ఎప్పుడూ భావిస్తుంటాడు. సూక్ష్మము అతడే. స్థూలము అతడే.

ఆంతర్యము

నిత్యాత్ముడై యుండి
అన్ని జీవుల హృదయదేశంలో ఈశ్వరుడున్నాడని భగవద్గీత. (18-61)   నిత్యమూ    ఆత్మ రూపంలో ఉండే దేవుడు నిత్యాత్ముడు.     నిత్యాత్ముడై ఉండి కూడా , కేవలం ఒక జీవికి , ఒక కాలానికి ఆయన పరిమితం కాడు.మూడు కాలాలలో  ఎప్పుడూ   ప్రకాశించే  నిత్యుడు. పరిమిత కాలము ఆయుస్సున్న  జీవి హృదయంలో  ఉంటూ కూడా , నిత్యుడిగా ఉండటం ఆయనకే సాధ్యం.

సత్యాత్ముడై
పరమాత్మ సత్యము. శివము. సుందరము. మంచివారియందు పుట్టేదాన్ని  సత్యమంటారు.సత్యంలో దేవుడు ఉన్నాడని మహాభారతం చెబుతోంది. (69-13) ఆ పరమాత్మ  సత్యస్వరూపుడు.(=సత్యాత్ముడు)   సత్యాత్ముడై ఉండి , సత్య స్వరూపంగా తాను ఉన్నాడు. లక్షణము, ఉదాహరణ రెండూ   అతడే . సత్యము లక్షణము . సత్యాత్ముడు ఉదాహరణము. రెండూ అతడే అని కవి మాట.

ప్రత్యక్షమై యుండి
బ్రహ్మ సాక్షాత్కారము అంత తేలికైన విషయం కాదు. కాని మన అదృష్టం కొద్దీ శ్రేష్ఠమైన బ్రహ్మ   తిరుపతిలో మన కళ్లెదురుగా కనబడుతూ మనలిని ఆశీర్వదిస్తున్నాడు.ప్రత్యక్షంగా కనబడుతూ బ్రహ్మంగా తాను ఉన్నాడని అన్నమయ్య మాట.

ఏవేల్పునిజదాసు లీపుణ్యులు
పరమ పుణ్యాత్ములు విష్ణు మూర్తి దాసులని అర్థం. ఇందులో దాస శబ్దం (= సేవకుడు) పై పండిత లోకంలో ఒక చమత్కార కథ ఉంది.

ఒక అద్వైతి తన ఇంటి గోడ మీద ‘ సో2హం’ (= ఆ దేవుడే నేను)    అని రాసాడు.

ఒక  విశిష్టాద్వైతి  ‘సో2హం’ కు ముందు ‘దా’ అనే అక్షరాన్ని చేర్చాడు. ‘దాసో2హం’ (నేను భగవంతుని సేవకుడను) అయింది.

అద్వైతి ‘దాసోహం’ కు ముందు ‘స’ అనే అక్షరాన్ని చేర్చాడు. ‘సదా సో2హం ‘( =ఎప్పుడూ అతడు నేనే )అయింది.

విశిష్టాద్వైతి ‘సదా సో2హం’కు ముందు ‘దా’  చేర్చాడు. ‘దాస దాసో2హం’( = భగవంతుని సేవకుడి సేవకుడిని)  అయింది.

ఈ రకంగా దేవుని సేవకుడి సేవకుడిని అనేవారు నిజదాసులు.

యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాతడు
ఒక పాదంలో ‘త్రిమూర్తులు ముగ్గురూ నారాయణుడే’ అని అని చెబుతూ, ఇంకొక పాదంలో   బ్రహ్మ అతనికోసం వెతుకుతాడు అని చెప్పటంలో కొంచెం  తికమక అనిపిస్తుంది. త్రిమూర్తులలోని బ్రహ్మ కాక ఇంకో బ్రహ్మ ఉన్నాడా అనే సందేహం  వస్తుంది.ఇందులో తిక మక ఏమీ లేదు. వెతికేవాడు అతడే. వెతకబడేవాడు అతడే. అంతా ఆయన వినోదం.    ఇలా అనుకొంటే గందరగోళం అదృశ్యమవుతుంది.

ఈ ‘నిత్యాత్ముడై’  పాటలోని మొదటి చరణమైన  ‘ఏమూర్తి లోకంబులెల్ల నేలెడు’  ప్రభావంతో రామదాసు చలన చిత్రంలో  ‘శుభకరుడు’  అను పాట   తయారయింది. పదాలు మారాయి కాని ఎత్తుగడ , ముగింపులలో  అన్నమయ్య ఫక్కి ఆ పాటలో కనిపిస్తుంది.. అన్నమయ్య పాటల మీద అత్యంతాసక్తి ఉన్న  రాఘవేంద్రరావు గారు,  కీరవాణిగారు ‘ఇంటింటా అన్నమయ్య’ చిత్రంలో ‘నిత్యాత్ముడై ఉండి’ కీర్తనలో ‘ఏ దేవు దేహమున ...’అను రెండవ చరణం స్వీకరించారు. ఇది అభినందించదగిన అంశం.

యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
ఆ పరమాత్మ యొక్క ఆదిని, మధ్యాన్ని , అంతాన్ని చూడలేకపోతున్నానని నారాయణుని   విశ్వరూపాన్ని చూసి అర్జునుడు పలికిన   మాటలు మనందరకు తెలిసినవే . (గీత11-16) అన్నమయ్య గీతను స్ఫురింపచేస్తూ విశ్వరూప ప్రతీకలుగా పాదాంత , కేశాంత పదాలు వాడాడు

ఆవేల్పు తిరువేంకటాద్రివిభుడు
‘ఏకమేవ అద్వితీయం  బ్రహ్మ’ అన్నది ఛాందోగ్యోపనిషత్తు. (3-14)
ఉన్నది ఒక్కటే. రెండవవాడు లేడు అని ఉపనిషత్తులు , వేదాలు ఘోషిస్తున్నాయి. ఈ భావమే  ‘నిత్యాత్ముడై’  కీర్తనలో అన్నమయ్య  చెప్పాడు. ‘మమకారాన్ని వదిలిపెట్టాలి. అది సాధ్యం కాకపోతే ఆ మమకారాన్ని ఏ ఒక్క దాన్ని వదిలిపెట్టకుండా  అన్నిటియందు చూపించాలి’ అని పెద్దలు చెప్పారు.  ఆ మమకారంతో అన్నిచోట్లా భగవంతుని  దర్శించాలి  .అన్నింటిలో ఉన్నది ఒకటే అను జ్ఞానాన్ని పెంచుకోవటానికి కృషి చేయాలి. ఇదే ఈ కీర్తన పరమార్థం. స్వస్తి.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు