అబ్బ .. ఇంకా టైముంది లెద్దూ... - భమిడిపాటి ఫణిబాబు

abba inkaa time vundi leddoo

 మన చిన్నతనంలో చూసేవారం—ఇంట్లోని పెద్దలు తెల్లవారుఝామునే లేచి, కాలకృత్యాలు చేసికోవడమూ, అలాగే పిల్లలని నిద్రలేపి చదివించడమూనూ. అలాటి అలవాట్లతోనే పెరిగి పెద్దయాము. దానికి సాయం, ఉద్యోగాలకి కూడా, ఓ టైమూ వగైరాలుండేవి. దానితో టైముకి లేవడం, భోజనం చేసి ఆఫీసులకెళ్ళడం లాటివి అలవాటయ్యాయి. కానీ ఈ రోజుల్లో ఐటీ ఉద్యోగాల విషయం వేరు. కొంతమందైతే  Work from Home వాళ్ళు, ఇంకొంతమందికి, టైముతో పని లేకుండా, ఇచ్చిన ప్రాజెక్టు పూర్తిచేయడం. వీటితో మన lifestyle  కూడా మారిపోయింది.ప్రతీ దానికీ “ అబ్బ ఇంకా టైముందిలెద్దూ..” అనడం పరిపాటైపోయింది.

ఉదాహరణకి ఈ పిల్లల తల్లితండ్రులు ఊరినుంచి వచ్చేరనుకోండి, తిరిగి వెళ్ళేటప్పుడు చూడాలి వీళ్ళ తిప్పలు. వాళ్ళు వెళ్ళే రైలు సాయంత్రం ఏ అయిదుగంటలకో అనుకోండి, బాబూ, ఓ గంట ముందైనా బయలుదేరుదామురా అని తండ్రి చెప్తే, “ అఖ్ఖర్లేదు నాన్నా  నాలుగున్నరకి బయలుదేరినా టైముకి వెళ్ళొచ్చులే..” అంటాడే కానీ, పాపం ఆ పెద్దాయన పోనీ ఏ ట్రాఫిక్కులోనో చిక్కుకుంటే, ఆలశ్యం అవుతుందనీ, తీరా స్టేషనుకి వెళ్ళిన తరువాత, రైలు వచ్చిన హడావిడిలో సామాన్లతో  పరుగులెత్తాల్సొస్తుందేమో అనే ఆదుర్దాతో చెప్పేడేమో అని మాత్రం ఆలోచించడు. వాళ్ళు మాత్రం ఏ flight కేనా వెళ్ళాల్సొస్తే మాత్రం, మూడు గంటల ముందే వెళ్ళి కూర్చోవడం. అది మాత్రం ఫరవాలేదు

!ఈరోజుల్లో ప్రతీదానికీ  EMI  లేకదా. అవి లేనప్పుడు  ప్రతీ దానికీ, ఫలానా తేదీలోగా డబ్బులు కట్టాలనేవారు.టైముకి కట్టలేకపోతే, వాటికి ఫైనులూ, సింగినాదాలూ ఉండేవి. ప్రత్యేకంగా , గాడీల ఇన్స్యూరెన్సు పాలసీలు. వాటికి  టైముకి కట్టకపోతే, ఆ పాలసీ కాస్తా expire అయిపోయి, కర్మకాలి ఆ బండి ఎవడైనా కొట్టేస్తే, claims ఇచ్చేవారుకాదు. అవేవో ECS  వచ్చేయి కాబట్టి ఆ గొడవలు తగ్గాయి.

ఇదివరకటి రోజుల్లో,ప్రతీ పనీ ఓ ప్లాన్ చేసికుని చేసేవారు, ఒక్క పిల్లల్ని పుట్టించడం తప్పించి ! దానికి ఓ ప్లానూ వ్యవహారం ఉండేవి కావు! ఇంట్లో ఎంతమందుంటే అంత ఆనందం, సంతోషమూనూ! అలాగని ఆ పిల్లలు ఏదో గాలివాటానికి పెరిగినవాళ్ళు కాదు.పిల్లలంటూ ఉండాలే కానీ, ఓసారి వచ్చిన తరువాత, ఓ పధ్ధతి లోనే పెరిగారు.ఈమాట మాత్రం ఎవరూ కాదనలేరనుకుంటాను.

ఇప్పుడు వ్రాసేది,ఈ రోజుల్లో చూస్తున్న last minute rush గురించి.ఎవరు చూసినా, పోనిస్తూ ఇంకా టైముందిగా అనేవాడే . ఉదాహరణకి, స్కూలుకెళ్ళే పిల్లల పుస్తకాలకీ, షూస్ కీ, స్కూళ్ళు తెరవడానికి, ఓ పది పదిహేను రోజుల ముందునుంచీ, కొనడానికి ప్లాన్ చేసికుంటే వచ్చిన నష్టమేమిటో, నాకైతే అర్ధం అవదు.సోమవారం స్కూళ్ళు తెరుస్తారంటే, ఆ ముందరి శనివారమే టైము దొరుకుతుంది, ప్రతీ వాడికీనూ.దాంతో ఏమౌతుందీ, అందరూ ఒక్కసారే ఊరిమీదకి పడేటప్పటికి, ఆ మాల్స్ లోనూ, పుస్తకాలూ, యూనిఫారాలూ, షూసూ కొనుక్కునే చోట ఓ పేద్ద రష్షూ! పార్కింగ్ కి ప్లేస్ దొరకదు. పైగా హైదరాబాద్ లాటి చోట్ల ఆదివారాలు కొట్లకి శలవుకూడానూ. ఇక్కడ (పూణె) లో, ఇంకా ఆ పరిస్థితి రాలేదనుకోండి, సోమవారాలు శలవు కొట్లకి.

ఓ పదిహేను రోజుల ముందు ప్లాన్ చేసికుని కొనుక్కోవచ్చు కదా,షూస్సూ, యూనిఫారాల సైజులూ ఈ పదిహేను రోజుల్లోనూ ఏమీ తక్కువా ఎక్కువా అయిపోవు.ఇదేమైనా కాంప్లాన్ వాడి యాడ్డా ఏమిటీ? జస్ట్ జరుగుబాటు అంతే!అక్కడికి, ముందునుంచీ ప్లాన్ చేసికునేవాళ్ళు, తెలివితక్కువ దద్దమ్మలూ,పాత చింతకాయ పచ్చళ్ళ గాళ్ళూ, పల్లెటూరి బైతులూనూ, వీళ్ళేమో చాలా స్మార్టూ! ఆ స్కూలు తెరిచే ముందు శనాదివారాలు, ఏ ధర్నా మూలంగానో కొట్లు తెరవకపోతే ఉంటుంది, వీళ్ళ సంగతి! తూర్పుకి తిరిగి దండం పెట్టడమే!

అలాగే పిల్లలకి శలవల్లో ఇచ్చే అవేవో ప్రాజెక్టులు—మర్నాడు స్కూలు తెరుస్తారనగా హడావిడి చేయడం.

అలాగే ప్రయాణాల విషయంలోనూ అంతే, ఏదో ఫలానా టైముకి ఫలానా చోటకి ఏదో కార్యక్రమానికి వెళ్ళాలీ అని ముందుగా తెలిసినా సరే, ఆన్ లైన్ లో టిక్కెట్లు రిజర్వ్ చేసికోడానికి సిగ్గూ, మొహమ్మాటమూనూ. ఈ రోజుల్లో, ఓక్లిక్కు ద్వారా ఏ టిక్కెట్టైనా రెండు నెలలముందరే చేసికునే సదుపాయం ఉండనే ఉంది, అయినా సరే, చివరి నిముషందాకా ఆగడం, ఏ తత్కాల్ కో ప్రయత్నించడం, లేదా, ఏ ఏజంటుకో ఇవ్వడం, అదీ కాదంటే బస్సులుండనే ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ శలవల సీజన్ లో ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేస్తూంటారు. ఇదే ముందుగా రిజర్వేషన్ చేయించుకునుంటే, వెళ్ళకపోయినా, ఆ టిక్కెట్లు క్యాన్సిల్ చేసికోడానికి మహ అయితే, ఎంతయుండేది?

నాకు ఆ విమాన ప్రయాణాల సంగతి తెలియదు. అయినా వాటిల్లోనూ అదేదో block చేయించుకుంటారుట కదా? అలా చేయించుకున్నా, బాగానే ఉంటుంది. చెప్పానుగా ప్రతీ వాడికీ, ఆఖరి నిముషం దాకా వెయిట్ చేయడం లో అదో అలౌకికానందమనుకుంటాను. రైలు ప్రయాణాల్లో చూస్తూంటాము, స్టేషనొచ్చినప్పుడల్లా ప్లాట్ఫారం మీదకి దిగి ఓ పోజు పెట్టుకుని నుంచోడం, ట్రైను కదులుతూండగా ఎక్కడం, అందులోనూ, ఏ.సి.ల్లో ప్రయాణం చేసేవాళ్ళైతే మరీనూ! ప్రతీ వాడికీ తెలియొద్దూ, తను ఏ.సీ. లో ప్రయాణం చేస్తున్నాననీ, పైగా ఈ ఏ.సీ.బోగీల్లో, బయటివాళ్ళకి మనం కనిపించం కూడానూ! ఇదో స్టేటస్ సింబలూ!

ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, “ పోనిద్దూ.. ఇంకా టైముందిగా .. “ అనేవాడే. చివరకి పిల్లల పెళ్ళిళ్ళ విషయంలోనూ అంతే, ఏ తండ్రికీ తన పిల్లో/ పిల్లాడో పెళ్ళివయసుకొచ్చేరని తట్టదు. తీరా, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటే మాత్రం నానా అల్లరీ చేయడం ! టైములో పని చేసికోవడం అదేదో “ తప్పు “ లా అనుకోనఖ్ఖర్లేదు.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి