చిలకమర్తి కవితా వైభవం: పుస్తక సమీక్ష - సిరాశ్రీ

chilakamarthi kavitha vaibhavam book review
పుస్తకం: చిలకమర్తి కవితా వైభవం
రచన: డాక్టర్ ముక్తేవి భారతి
వెల: 2.70/- (అక్షరాలా రెండు రూపాయల డెబ్బై పైసలు)
ప్రతులకు: http://kinige.com/book/Chilakamarti+Kavitha+Vybhavam

చిలకమర్తి అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది "భరత ఖండమ్ము చక్కని పాడియావు..." పద్యం. ఇంకాస్త సాహిత్యాభినివేశం ఉంటే "ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్.." పద్యం గుర్తు రావొచ్చు. దేశభక్తి, అభ్యుదయభావాలు గల 20 వ శతాబ్దపు కవిగా చిలకమర్తి తెలుగు భాషాప్రియులు చాలామందికి తెలుసు.  మరి విక్టోరియా మహారాణిని, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ని గురించి వీరు చెప్పిన పద్యాలు విన్నారా? వింటే గుర్తున్నాయా? టంగుటూరి ప్రకాశం గురించి మొల్ల రాముడిని వర్ణించిన స్థాయిలో వీరు చెప్పిన పద్యం ఒకటుంది, తెలుసా? నేను మాత్రం ఈ వారమే తెలుసుకున్నాను.

నిజానికి ఆయన గురించి తెలియజెప్పే అనేక పుస్తకాలు పుస్తకాలయాల్లో లభిస్తూనే ఉన్నాయి. అయితే పావుగంటలో చిలకమర్తి పద్యాల గురించి, ఆశు ధార గురించి, ప్రకాశం పంతులు గారితో వారి స్నేహం గురించి, హాస్య చతురత గురించి తెలుసుకోవడం కుదురుతుందా? ఒక చాక్లెట్ చప్పరించేంత టైములో, గ్లాసుడు కాఫీ తాగేంత సమయంలో ఇది సాధ్యమా? డాక్టర్ ముక్తేవి భారతి సాధ్యం చేసారు. 39 పేజీల్లో ఉన్న ఈ సుదీర్ఘ వ్యాసం పాఠకుల కళ్లను, మెదడుతో, హృదయంతో పెనవేసి పరుగులెత్తిస్తుంది. ఎక్కడా ఉపోద్ఘాతాలు, విస్త్రుత వ్యాఖ్యానాలు లేకుండా నేరుగా విషయం చెప్తూ, అవసరమైన మేరకు మాత్రమే వివరణలిస్తూ చిలకమర్తిలోని విభిన్న కవితాకోణాలను ఆవిష్కరిస్తుంది ఈ చిరు పొత్తం. ఇందులో భారతిగారు ఉదహరించిన, ఉటంకించిన పద్యాలన్నీ కంఠోపాఠం చేయదగ్గవి. పద్య ప్రియులకు ఈ పుస్తకం కరదీపిక అవుతుందనడంలో సందేహం లేదు. క్లుప్తంగా చెప్తూనే మొత్తంగా చెప్తున్నట్టుంటుంది ఈ పుస్తకం.

ఇక ఇందులో ఉన్న పద్యాలు మచ్చుకు కొన్ని:-

భరతఖండమ్మె ఒక గొప్ప బందిఖాన
అందులోనున్న ఖైదీలు హిందు జనులు
ఒక్క గదినుంచి మార్చి వేరొక్క గదిని
బెట్టుటేగాక చెరయందు వేరెగలదె

కోడిని తినుటకు సెలవున్
వేడిరి మున్ను బ్రాహ్మణులు వేధనంతడున్
కోడి వలదా బదులు ప
కోడిందినుమనుచు జెప్పె కూర్మి పకోడీ!

ఈ పద్యాలను వీరు ఆశువుగా చెప్పారట. ఇలాంటి పద్యాలు ఒకెత్తైతే, ఇది చూడండి.

జలమందుండుట తిండిమానుటయు నిస్సంగత్వముంబొందు టా
కలమున్ మెక్కుట మోక్ష సాధనములా! యట్లైన చేపలౌ దరి
ద్రులు షండున్ మరి వానరంబులును సద్యోమోక్షముంగాంచవే
తెలియంజాలని వారి త్రోవలివియే దేవా! సత్కృపాంభోనిధీ!

నీళ్లలో మునగడం, తిండి మానడం, సన్యాసం స్వీకరించడం వల్లే మోక్షం వచ్చేట్టైతే మరి ఎప్పుడూ నీళ్లలో ఉండే చేపలకి, తిండి లేని దరిద్రులకి, షండులకి మోక్షం కచ్చితంగా రావాలిగా!! ఏమో..చెప్పడానికి మనం కాస్త ఆలోచించాలి.

ఇంకా 'వారెవ్వా..' అనిపించే "గయోపాఖ్యానం" నాటక పద్యాలు ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ఉన్నాయి. అవి ఇక్కడ ప్రస్తావించను. పుస్తకం కొని చదవండి.

-సిరాశ్రీ. 

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి