సాహితీవనం - వనం వెంకటవరప్రసాద్

sahiteevanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము

(గత సంచిక తరువాయి) 
 

తన ప్రక్కన స్వరోచిని కూర్చుండబెట్టుకుని తన దివ్యరథం లో ఆకాశ వీథిలో ప్రయాణిస్తున్న ఇందీవరాక్షుడు మంధరగిరిని సమీపించాడు. అతని వెనుకనే మరొక రథంలో అతని కుమార్తె మనోరమ ప్రయాణిస్తున్నది. మంధరగిరిని సమీపించిన  ఇందీవరాక్షుడు తన రాచనగరిని తన స్వస్థలాన్ని చూసి పులకించిపోయాడు. తన రాచనగరి ఐన మంధరగిరిని మరొకసారి  ప్రస్తుతి చేయడం మొదలెట్టాడు.

జరఠ కచ్ఛపరాజు చరమాంగ గృహమేధి, భోగివేష్టన రేఖఁ బొలుచు జాణ
కులములోఁ దరితీపు గలిగి మించినమేటి, మైనాకు నొరసిన మావటీఁడు
తొలువేలుపుల వేలుపులపనుల్‌ గొనుఱేఁడు, కడలిరాయల లోఁతు గన్నగబ్బి
సురరాజునకుఁ బాండుకరిఁ జేర్చు మరకాఁడు, కల్పకంబుల పంట కమ్మతీఁడు

గంటె! మథిత సుధా ధౌత కటక జాత
చంపకవన ప్రకంపనాకంప విసర
దఖర ముఖరవ మధుకర ముఖర శిఖర
నందరస మందిరం బగు మందరంబు.

క్షీర సాగర మథనవేళలో వృద్ధ కూర్మరాజు వీపును, వెన్నుచివరను గృహముగా చేసుకున్నది ఈ మంధర పర్వతం,  ఆ సమయములో వాసుకి కవ్వముగా ఉండి చిలకడంకోసం చుట్టుకున్నప్పుడు ఒరుసుకున్న  గుర్తులు రేఖలలాగా వడ్డాణంలాగా మెరుస్తున్న జాణ ఈ మంధర పర్వతం, పాలసముద్రాన్ని మథించడం చేత కలిగిన తీయదనముతో, ఆ అతిశయముతో తన కులములో, పర్వతముల కులములో శ్రేష్ఠతను పొందినది ఈ పర్వతము, క్షీరసాగర మథనం  జరుగుతున్నపుడు సముద్రములో దాగియున్న మైనాకుడిని ఒరుసుకున్న, ఢీకొట్టిన మేటి జెట్టి ఈ పర్వతము, రాక్షసుల,  దేవతల పనులను నెరవేర్చే కర్తవ్యాన్ని స్వీకరించినవాడు, క్షీరసాగరపు లోతులను చూసిన ధీరుడు, సురరాజైన దేవేంద్రునికి  ‘తెల్ల ఏనుగును’ ఐరావతాన్ని తెచ్చి ఇచ్చిన ఓడసరంగు ఈ పర్వతము, కల్పవృక్షము వంటి దేవతా వృక్షములను పెంచి,  పండించే సేద్యగాడు, చూశావా మహారాజా! పాలసముద్రాన్ని చిలకడం వలన ఆ పాల జలధులతో కడగబడిన కొండమీద  జన్మించిన చంపక(సంపంగి)వనములనుండి వీస్తున్న గాలులకు, లలితముగా ధ్వనులు చేస్తున్న తుమ్మెదలకు, ప్రతి ధ్వనులుచేస్తున్న ఆనందరస మందిరమైన ఈ మంధర పర్వతాన్ని? నా రాచనగరిని? 

వైకుంఠాంగద హేమ మాతత వలద్వాతాశనాకృష్ట రే
ఖాకారంబులఁ జుట్టు నంటి మొలనూలై మేటియొడ్డాణమై
శ్రీకారప్రభఁ గంఠియై శిఖరిరాట్సింహోల్లసత్పట్టమై
యీ కొండం గనుఁ గొంటె! మాయ దిపుడున్‌ హేరాళపుం గాంతులన్‌.

పాలసముద్రాన్ని చిలుకుతున్నపుడు మంధర పర్వతము ఒరిగిపోకుండా శ్రీమహావిష్ణువు తన బాహువులను సాచి  పట్టుకున్నపుడు, వాసుకి సర్పము త్రాడులాగా చిలుకుతూ ఒరుసుకున్నపుడు పడిన రేఖలు, నొక్కుళ్ళు  మొలనూలులాగా, వడ్డాణములాగా, మెడ కంటెలాగా ఇప్పటికీ మాసిపోని  కాంతులను విరజిమ్మే, పర్వతరాజసింహమునకు పట్టాభిషేక సమయములో ధరింపజేసిన స్వర్ణ పట్టములాగా సహజమైన దివ్యమైన ఆభరనములుగా కలిగిన ఈ పర్వతపు గొప్పదనాన్ని చూస్తున్నావా మహారాజా?

వేదవేదాంతముల వేధ వెదికి కనని
పద్మలోచను శ్రీపాద పంకరుహము
లబ్జరేఖాంకితము లవే యచలవంశ
వల్లభుని మేఖలాసీమ నెల్ల మెఱయు.

వేదములయందు, వేదాంతములయందు (ఉపనిషత్తులయందు) వెదికినా ఆ బ్రహ్మకు (వేధకు)కూడా కనిపించని పద్మలోచనుడైన శ్రీ మహావిష్ణుని పాదాబ్జముల రేఖలు, శంఖ చక్రాది చిహ్నములు ఈ పర్వతవంశ వల్లభుని మధ్యభాగములో అంతటా మెరిసిపోతుంటాయి!నాలుకబంతి వ్రేలఁబడి నంజునఁ దోఁగి తమాలపల్లవ శ్రీల హసింప నుబ్బి కనుఁ గ్రేవల జేవుఱు పుక్కిలింపఁగా వాలిక మేనిపీఁ చెగయ వాడిన మాల్యమువోలె నాదిమ వ్యాళము దీనిపగ్గ మయినట్టి యవస్థఁ దలంతు నెప్పుడున్‌.రెండువేల నాలుకల వరుస (నాలుకబంతి) వ్రేలాడి, విషములో  తడిసి, చీకటి మ్రాను యొక్క చిగుళ్ళను పరిహసిస్తుండగా , కనులు ఉబ్బి ఎర్రబడి బయటికి వెళ్ళుకు వస్తుండగా, మహా  దీర్ఘమైన శరీరముమీది తోలు  పీచులేచి, వాడిపారేసిన పూమాలలాగా ఆది భుజంగమైన వాసుకి (సర్పము) ఈ మంధర పర్వతానికి పగ్గమై పడిన అవస్థను నేనెపుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను!  

బిలముఖ పంక్తి నీ ధరణిభృత్పతి వారిధి నిర్భరభ్రమిన్‌
దలముగ మున్ను ద్రావిన సుధారస ధార గుణంబునం జుమీ
పలితవికార దూర నిరపాయ సుఖస్థితిఁ గాంచె నాఁగఁ గో
మల విచలచ్ఛిరోరుహ తమాల వినీలిమ రేఖ యొప్పెడిన్‌.

మహారాజా! చూశావా! పాలసముద్రాన్ని మధిస్తున్నప్పుడు తన కొండమీద ఉన్న గుహలు అనే నోళ్ళతో అమృతాన్ని  తాగడంచేతనేమో అన్నట్లు, తెల్లగా నెరిసిపోయి వికారమైపోకుండా నల్లని కాంతులతో వెలిగిపోతున్న శిరోజముల రేఖవలె  ఈ పర్వతముమీద ఉన్న, చలిస్తున్న చీకటిచెట్ల (తమాల వృక్షముల) సమూహం ప్రకాశిస్తున్నది! 

జడధి మథింపఁ జిక్కి సుధ సౌరభ మానుటఁ జావు దక్కి
ఱాపడఁకులనుండి దుగ్ధభవ పాండిమ బొందుల నందమొంద నిం
దడవి మెకాలతోఁ గదుపులై చరియించును మేఁతకై బయ
ల్వెడలి ఢులీ కుళీర శకులీ మకరీముఖ వారి జంతువుల్‌.

పాలసంద్రాన్ని మధిస్తున్నపుడు పుట్టిన అమృతాన్ని వాసన చూసిన కారణము చేతనేమో అన్నట్లు, పాల సముద్రపు  తెల్లదనాన్ని పొందినట్లు, ఏ మరణభయము, సంకోచము లేకుండా యితర అడవి జంతువులతో కలిసి మందలు మందలుగా తెల్లని తాబేళ్లు, పీతలు, చాపలు, మొసళ్ళు సంచరిస్తాయి ఈ మంధరగిరిమీద! 

అనుచుం జందనపంక పంకిల తలంబై కేతు రుద్ధాతపా
ధ్వనిరుష్ణం బయి మంచకోపరి కుటీ వాటీ నట న్నర్తకీ
జన మై యౌవత సర్వతః కలిత వీక్షా తోరణ స్రఙ్నిబం
ధన మై యొప్పుపురంబు సొచ్చి భవనద్వార ప్రఘాణంబునన్‌.

అని వివిధ వర్ణనలతో తన రాచనగరిని, ఆ మంధరగిరిని ప్రశంశిస్తూ మంచిగంధపు నీటితో చిత్తడి ఐన భూమి కలిగినది, అసంఖ్యాకంగా ఎగురుతున్న జెండాలచేత నిరోధింపబడిన సూర్యుని వేడిమితో, చల్లని నీడ కలిగినది, ఎత్తుగా నిర్మించిన మంచెలమీద ఉన్న గుడిసెలలో నర్తిస్తున్న నర్తకీమణులతో కూడినది, యవ్వనవతుల వాలుచూపుల తోరణాలు అంతటా ప్రకాశిస్తున్న ఆ నగరాన్ని ప్రవేశించి, భవనద్వారము ముందున్న మొగసాల, చావిడీ వద్ద నిలిచాడు ఇందీవరాక్షుడు. 

మంతుల బాంధవభటసా
మంతుల నాశ్రితుల నిలిపి మహికాంతునిశా
కాంతమణి కాంతికందళ
కాంతం బగు నొక్క దొరనగర విడియించెన్‌.

మంత్రులను, బంధువులను, భటులను, సామంతులను, తన ఆశ్రితులను అక్కడే నిలిపి, స్వరోచి మహారాజుకు చంద్రకాంత మణుల కాంతులచే నిండుకున్న ఒక రాజగృహములో విడిది చేయించాడు ఇందీవరాక్షుడు.

పసువుల నలుఁగిడి రైదువ
బిసరుహలోచనలు పెండ్లి పెద్దల యాజ్ఞన్‌
వసుధాధ్యక్ష ఋభుక్షున
కసితాలకభరకుఁ బేరఁటాం డ్రొగిఁ బాడన్‌.

కమలములవంటి కన్నులున్న ముత్తైదువులు (ఐదువ బిసరుహలోచనలు) పెండ్లి పెద్దల ఆజ్ఞతో భూమీశులలో శ్రేష్ఠుడైనస్వరోచికి, నల్లని ముంగురులు కలిగిన సుందరి ఐన మనోరమకు  పసుపుతో నలుగుపెట్టారు, పేరంటాళ్ళు శ్రావ్యముగా  పాటలు పాడారు.

మజ్జన మాడె రాజు కృశమధ్యమ లింపున వంప గుంపులై
గొజ్జెఁగనీటి వెల్లువలు గోవ జవాజుల నిగ్గుఁ జూపఁ జం
చజ్జరఠాహి కంచుకము చాయ మడుంగుల నొత్తెఁ జెమ్మనీ
రుజ్జగిలన్‌ వహించె మెయి నూఁదినఁ బాఱు దుకూలచేలముల్‌.

సన్నసన్నని నడుములున్న అన్నులమిన్నలు సంతోషంగా ఒంపగా, పన్నీటి ప్రవాహాలు జవ్వాజి ద్రవ్యముల పరిమళము ఎగసిపడుతుండగా ఆ సుగంధ జలములతో స్నానము చేసి, చలిస్తున్న వృద్ధ ఆదిశేషుని కుబుసము వంటి తెల్లని, సున్నితమైన వస్త్రముతో చెమట నీటిని, స్నానపు చెమ్మను అద్దుకుని, ‘ఉఫ్ఫు’న ఊదితే ఎగిరిపోయేట్లున్న పల్చని, నాజూకైన, చలువ చేసిన వస్త్రములను ధరించాడు స్వరోచి.

గరువున కొత్తఁ జెంగలువ కచ్చు ఘటించినమౌళిఁ జుట్టెఁ జెం
దిరికచెఱంగునం బసిఁడితీఁగెలు నించిన జిల్గుపాగ బం
భరసభ వాసనాపవనపారణఁ దేల నలందెఁ గస్తురిన్‌
మరకతమౌక్తికాదిమణి మండనమండితుఁ డయ్యెనయ్యెడన్‌

ఎర్రని కలువపూబంతి కలిగిన సిగలో చంద్రకాంతిని కలిగిన, బంగారపు తీగలతో అల్లిన, మెరిసిపోతున్న తలపాగా అంచు ఒక చెంపకు జారి వ్రేలాడేట్లు చుట్టుకున్నాడు. సువాసనలలో తుమ్మెదల సమూహము (బంభర సభ) సంతసించేట్లు కస్తూరిని శరీరానికి పూసుకున్నాడు. మరకత(గరుడ)పచ్చలు, ముత్యాలు మొదలైన రత్నాలు పొదిగిన ఆభరణాలను ధరించాడు.

కదిసెన్‌ లగ్నమటంచు మంత్రులు దొరల్‌ గంధర్వరాజాజ్ఞ ను
న్మదవేదండ ఘటా భటాశ్వ రథ సేనా జైత్రవాదిత్ర సం
పద మీఱం జనుదెంచి కాంచిముదమొప్పం జేసి రారూఢుఁగాఁ
గదళీకాంచనకక్ష్యలన్‌ మెఱయు లేఖస్వామి చౌదంతిపైన్‌.

ఇంతలోనే లగ్నము సమీపించింది అంటూ మంత్రులు, దొరలూ, పెళ్ళిపెద్దలు గంధర్వరాజు ఆజ్ఞతో మదించిన ఏనుగులతో, గుఱ్ఱములతో , భటులతో, రథములతో, నానావిధ వాయిద్యసమన్వితులై వచ్చి, స్వరోచిని దర్శించుకుని, సంతోషంతో, బంగారు నడికట్టు వస్త్రము, పతాకములతో మెరిసిపోతున్న ఐరావతముపై, నాలుగు దంతములతో ప్రకాశిస్తున్న ఐరావతముపై, దేవేంద్రుని(లేఖస్వామి) పట్టపుటేనుగు ఐన ఐరావతముపై ఆశీనుడిని చేశారు తీసుకువెళ్ళడానికి.

  (కొనసాగింపు వచ్చే సంచికలో)

వనం వేంకట వరప్రసాదరావు 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి