వినాయక చవితి—చిన్నప్పటి మధుర గుర్తులు.. - భమిడిపాటి ఫణిబాబు

vinayaka chaviti

శ్రావణమాసం వెళ్ళి భాద్రపద మాసంవచ్చిందంటేనే చాలు ఆ బొజ్జ గణపతి వచ్చేసి కూర్చుంటాడు. పాపం ఆయనొకడూ, మనం దేనితో పూజచేసినా సంతృప్తి పడి, మన కోరికలు, ఎలాటివైనా తీర్చేస్తాడు.. చిన్నప్పుడు వినాయక చవితి వచ్చిందంటేనే చాలు, ఎంత హడావిడో. ముందురోజు నాన్నగారితో బజారుకి వెళ్ళి, ఓ బు( బొ) జ్జి గణపతి విగ్రహం తీసుకుని రావడం. స్నేహితులతో కలిసి ఓ గుడ్డ సంచీ తీసికుని వీలైనంత ఎక్కువగా పత్రి సంపాదించడం. రాత్రి, ఓ ఇత్తడిపళ్ళెం నిండా వాటిని అమర్చుకుని, ఎప్పుడు తెల్లారుతుందా, గణపతికి ఎప్పుడు పూజ చేస్తామా అనుకుంటూ నిద్రపోవడం.

ఆరోజుల్లో ఏ పండగొచ్చినా, పూజ చేయించడానికి ఇంటి పురోహితుడిగారినే పిలిచేవారం. ఆయనకు మన ఇల్లు ఒకటేనా ఏమిటీ.. వెయ్యిళ్ళ పూజారాయె. మనింట్లో పూజకి ఒక టైమిచ్చేవారు. ఆ టైముకల్లా మనం రెడీగా ఉంటే, అఘమేఘాలమీద వచ్చి పూజ చేయించేసి దక్షిణ తాంబూలం పుచ్చుకుని వెళ్ళిపోయేవారు. చిన్న పిల్లలకి పూజకి సంబంధించినంతవరకూ, గంధం చెక్కమీద గంధం తీయడం ఒప్పచెప్పేవారు. మిగిలినవన్నీ అమ్మే తయారుచేయడం. గణపతికి పాలవెల్లి  అలంకరించడం బలేగా ఉండేది. వివిధరకాలైన పళ్ళూ, వాటికి ముచిక ఉండడం ప్రధానం.వాటికి ఓ పురికొస కట్టి, పాలవెల్లికి వేళ్ళాడతీయడం. ఏ చెరువుగట్టుకో వెళ్ళి, కలువపువ్వులు కూడా తెచ్చికుని పాలవెల్లిని అలంకరించడం ఇంట్లో మగ పిల్లల డ్యూటీ. వినాయక చవితి పూజలో అన్నిటిలోకీ పిల్లలకి నచ్చే విషయం—వాళ్ళు చదువుకునే కనీసం రెండు పుస్తకాలైనా పూజకి పెట్టడం. గణపతిని ఉంచిన తొమ్మిదిరోజులూ, హాయిగా వాటిని అక్కడే ఉంచితే చదవాల్సిన అవసరం ఉండేది కాదు ! ఉండ్రాళ్ళూ, జిల్లేడికాయల ప్రసాదం తో భోజన కార్యక్రమం ముగిసేది.

కనీసం ఓ నాలుగైదు గణపతిలని చూసి దండం పెట్టుకోవాలనేవారు. మన స్నేహితుల ఇళ్ళకి వెళ్ళి, వాళ్ళు పూజ చేసిన గణపతికి దండం పెట్టుకుని, ఆ కోటా పూర్తిచేసేవాళ్ళం. అన్నిపనులూ, ఆకాశంలో చంద్రుడు వచ్చేలోపలే చేయాలనేవారు. ఆరోజు చంద్రుడిని చూస్తే మళ్ళీ అదో గొడవా.ఊరంతటికీ ఏ పెద్దబజారులోనో , దుకాణదారులందరూ కలిసి పెట్టిన గణపతి పందిరి మహా అయితే రెండో మూడో ఉండేవి.అక్కడే నాటకాలూ, తోలుబొమ్మలాటలూ, సింగిల్ ప్రొజెక్టరు మీద సినిమాలూ, బుర్రకథలూ... లాటి ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేవి. ఒక్కోక్కచోట బోగం మేళాలు కూడా ఉండేవండోయ్. కానీ అక్కడ చిన్నపిల్లలకి ప్రవేశం ఉండేది కాదు !! ఎలా తిరిగినా, ఎక్కడ తిరిగినా భోజనం టైముకి కొంపకి చేరాల్సిందేీంత హడావిడీ పూర్తయి, తొమ్మిదో రోజొచ్చేసేది. గణపతిని ఎత్తేసి, ఆ విగ్రహాన్ని, ఏ తోటలోనో,  గాదె లోనో భద్రంగా పెట్టేసి ఆ ఏటి వినాయకచవితి నవరాత్రులు పూర్తిచేసేవారు.

ఇంక ఈరోజుల్లో అంటారా,నగరాల్లో గణపతి నవరాత్రులంటే ఎక్కడచూసినా హడావిడే.  సందు సందుకీ గణపతే. ఓ నెలరోజులు ముందునుంచీ, చందాలు వసూళ్ళకి బయలుదేరతారు. చేతిలో ఓ రసీదు పుస్తకమూ, ఓ డజనుమంది ఆ ఇలాకాకి చెందిన జమాజెట్టీల్లాంటి వాళ్ళూనూ. మనకి వాళ్ళు చెప్పినంత చందా ఇవ్వగలమా లేదా అన్న ప్రశ్నే లేదు. ఆ వచ్చినవాళ్ళే ఓ అంకె వేసేసి, మన చేతిలో పెట్టేస్తారు. మన పనల్లా డబ్బు ఇవ్వడమే. ఏవడో ఒకడికి ఇస్తే సరిపోతుందా  పోనీ  అని అనుకోడానికి వీలులేదు. ఇంకో బృందం వస్తుంది. ఎవడికివ్వకపోతే కోపం వస్తుందో తెలియదు. ఎవడికివాడే ఓ పెద్ద హీరోలాయె. చందాలు ఇవ్వడానికి ఎవరెవరు కాదన్నారో వాళ్ళందరినీ గుర్తెట్టుకుని రేపెప్పుడైనా అల్లరి చేస్తారేమో అనో భయం. అందువలన చచ్చినట్టు ఎవడొచ్చినా నోరుమూసుకుని ఇచ్చేయడం ఉత్తమం. పైగా ఈ చందాలు వసూలు చేసేవాళ్ళు ఏదో ఒక రాజకీయపార్టీకి చెందినవాళ్ళే. మన దేశంలో వీటికేమీ తక్కువలేదుగా.

ఏ పందిరివాడు ఎంతంత దీపాలంకరణ చేశాడో అంత గొప్ప ! ఎంతంత సౌండు పెట్టి మాయదారి పాటలు పెట్టాడో అంత గొప్ప. ఈ తొమ్మిదిరోజులూ ఇళ్ళల్లో చదువుకునే పిల్లలుంటే అంతే సంగతి. ఇంకో విషయం, వీళ్ళ గణపతి పందిళ్ళు రోడ్డు మధ్యలోనే ఉంటాయి. దానితో ఆ యేరియాలో ఉండేవాళ్ళ తిప్పలు ఆ గణపతికే తెలియాలి. ఇదంతా సార్వజనిక్ గణపతి ఉత్సవాల విషయం.

ఎంత చెప్పినా మన “పాత” వాసనలు పోవుగా.   బాలగంగాధర తిలక్ గారు, స్వాతంత్రోద్యమసమరం రోజుల్లో, జనాల్ని ఒకేతాటిమీదకు తేవడానికి ప్రారంభించారు. కానీ  మనకంటూ ఓ సాంప్రదాయం ఒకటుందిగా, ఇంట్లోనే చేసికుందామని.మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పరవాలేదు, రాష్ట్రేతర నగరాల్లో ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన బొమ్మలే. వాటి ఖరీదుచూస్తే ఏడాదేడాదికీ చుక్కల్నంటేస్తోంది. ఏదో ఓ మన స్తోమతుకి తగ్గ ఓ బుజ్జి బొమ్మని కొనుక్కోవడం. ఇదివరకటి రోజుల్లోలాగ, ఎక్కడ పడితే అక్కడ చెట్ట్లు కనిపించే రోజులా ఇవీ?ఉన్నా కానీ, వాటి పత్రి పూజలకి పనికిరాదాయె. పోనీ ఏదో ఒకటిలే, కానిచ్చేద్దామా అంటే, ఆ చెట్లమీద చెయ్యి వేయకూడదూ, వేస్తే వాడెవడో వచ్చి నానా అల్లరీ చేస్తాడు.ఇంక మిగిలినదేమయ్యా అంటే, ఏవో నాలుగైదు రకాల ఆకులు ఓ పోగుపెట్టి వాటికో తాడు కట్టి అమ్ముతాడే వాడే దిక్కు. ఒక పోగు మాత్రమే కొంటే, మన గణపతిని మనసారా “పత్రి” తో పూజచేసిన తృప్తి ఉండదూ. దానితో ఓ రెండుమూడు “పోగులు” కొనుక్కోవడం.మామిడాకు రొబ్బ కావాలంటే అయిదు/పది రూపాయలంటాడు. పువ్వుల సంగతి అడగఖ్ఖర్లేదు. ఏదైనా పండగొచ్చిందంటే చాలు పువ్వుల ఖరీదు కొండెక్కేస్తుంది. ఏడాదికోసారొచ్చే ఈ వినాయకచవితి పూజకి , మరీ ఇంత కక్కూర్తెందుకులే అనుకుని, ఓ గుడ్డసంచీనిండా, “ పత్రి “ అనబడే ఆ ఆకులని కొనుక్కుని, మొత్తానికి పూజకి కూర్చుంటాం.మన తెలుగు రాష్ట్రాల్లో పాలవెల్లికి కట్టాల్సిన పళ్ళకి ముచికలేనా ఉంటాయి, కానీ బయటిప్రాంతాల్లో ముచిక ఉన్న పండు మచ్చుకైనా దొరకదు. వాటిని పాలవెల్లికి కట్టాలంటే, దానికో “ మేకు “ లాటిది గుచ్చి, వేళ్ళాడతీయడమే ! ఇదివరకటి రోజుల్లోలాగ పురోహితుడు కావాలంటే ఎక్కడ దొరుకుతాడు? ఈరోజుల్లో ఆ పురోహితులు కూడా ఏక్ దం హైటెక్ అయిపోయారు. ఎక్కడపడితే అక్కడే గణపతి పూజలే. వాళ్ళిచ్చే దక్షిణా తాంబూలాలు కూడా హైటెక్ లోనే ఉంటాయి. మనం ఇంట్లో ఇచ్చే పదీ, పాతికా దక్షిణ ఏ మూలకీ? దానితో ఓ సీడీయో.MP3 యో పక్కనే పెట్టుకుని పూజ కానిచ్చేయడమే మరి !!

మన రాష్ట్రంలో అయితే, కొన్ని వందల కేజీల బరువుండే “ లడ్డూ “ తయారుచేయడం, దానిని వేలం వేయడమూ గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఇంక గణపతి విగ్రహాలంటారా, ఒకరిమీద  పోటీగా ఇంకోరు.

నాలుగు గరికలు పూజ చేస్తే సంతోషించే గణపతి ని కూడా లేనిపోని ప్రలోభాలకి గురిచేసి, పూజ అంటే ఇలాగా అని ఆశ్చర్యపడేలా తయారయ్యాయి  గణపతి నవరాత్రులు, ఈ రోజుల్లో...

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao