గిడుగు వెంకట రామమూర్తి - సుశీలారాం

gidugu venkata ramurti

ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు,బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది గిడుగు వెంకట రామమూర్తి . గ్రాంధిక భాష సాధారణ జనులకు కష్టమని గ్రహించి దానిని సరళీకరించి అందరికీ తెలుగును   అందుబాటులో కితెచ్చిన మహనీయుడు మన గిడుగు వెంకటరామమూర్తి. ఆందుకే ఈమహా మహుని’ తెలుగుభాషకు గొడుగు ‘అని అభివర్ణించారు. శిష్టజన వ్యవహారిక భాషను అంటే తేలిక తెనుగును గ్రంథ రచన కు ఉపయోగించను అందరినీ పురికొల్పిన మహనీయుడు. దీనికై  చిత్తశుద్ధితో కృషిచేసిన  అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల చాలామందికి  అందుబాటులోలేని తెలుగుభాష, చదువు వ్యావహారిక భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. దాంతో తెలుగులో వాడుకభాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి అనే పేరు ఆయన్ని వరించింది.

గ్రాంధికభాషలో ఉన్న ‘తెలుగు వచనాన్ని’ ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్నఅందాన్నీ, వీలు నూ తెలియ జెప్పిన మహనీయుడు. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతిఒక్కరికీ దక్కింది.గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు29 ని “వ్యావహారిక భాషాదినోత్సవం [తెలుగు భాషా దినోత్సవం]గా జరుపుకుంటున్నాం. ఇదిమన తెలు గు  జాతికే గర్వకారణం. చిటారుకొమ్మనున్న మిఠాయి పొట్లాన్ని లేదా తేనెవంటి వాడుక తెలుగును , చెట్టుఎక్కనురాని క్రింద ఉన్న సామాన్య మానవులకు నోటి కందించిన సాహితీ ఉద్యమకారుడు మనగిడుగు.

గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగష్టు 29 వ తేదీ శ్రీకాకుళం జిల్లా లోని'ముఖలింగక్షేత్ర' సమీపపు పర్వతాల పేట గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో రివెన్యూ అధికారి గా పనిచేస్తుండేవాడు.రామమూర్తి  ప్రాథమిక విద్య1877వరకూ ఆ ఊరిలోనే సాగింది. తండ్రికి చోడవరంబదిలీయై అక్కడే విషజ్వరంతో 1875 లోనే చనిపోయాడు.

విజయ నగరంలో మేనమామ సంరక్షణలో ఉంటూ రామమూర్తి ,మహారాజావారి విజయనగరం ఇంగ్లీషు బళ్ళోచది వాడు. 1879 లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు రామమూర్తికి సహా ధ్యాయి. ఆ సంవత్సరమే రామమూర్తి కి వివాహమైంది. 1880లో 30రూ. జీతంతో ‘పర్లాకిమిడి రాజా’వారి స్కూల్లో ఫస్టుఫారం,అంటే ఆరోక్లాసు విద్యార్ధులకు చరిత్ర బోధించే ఉపాధ్యాయుడైనాడు. తల్లి,ఇద్దరు చెల్లెళ్ళ తో సంసారబాధ్యత రామమూర్తి పైపడింది.ఆబాధ్యత నిర్వహిస్తూనే ప్రైవేటుగా చదివి 1886 లో ఎఫ్.ఏ.,1894 - 1896 లో బి.ఏ. ప్యాసైపట్టాపుచ్చుకున్నాడు.ఇంగ్లీషు, సంస్కృత భాషలు గాక, ప్రధాన పాఠ్యాంశంగా చరిత్ర తీసు కుని రాష్ట్రంలో మొదటి తరగతిలో, రెండోర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు. రాజావారి ఉన్నత పాఠశాల కళాశాలగా మారింది. అప్పుడు అతని కి కళాశాల తరగతులకు పాఠాలు చెప్పే అర్హత వచ్చింది. 

ఆ రోజుల్లోరామమూర్తి తనకు సమీపపు అడవుల్లో నివసించే ’సవర’ ల భాష నేర్చుకుని వారికి చదువు నేర్పిం చాలని సంకల్పించాడు. తెలుగు, సవర భాషలు రెండూ వచ్చిన ఒక ద్విభాషీని ఇంట్లోఉంచుకుని ‘సవర భాష ‘కొన్నేళ్ళు నేర్చుకున్నాడు. సవరభాషలో పుస్త కాలు వ్రాసి స్వంత డబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకులకుజీతాలు ఇస్తూ సవరలకు వాళ్ళ భాషలోనే చదువుచెప్పే ఏర్పాట్లు చేశాడు. ఎంతగొప్ప కార్యం!  దీన్నిమించిన దేశభక్తి ఎక్కడుంది. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ -అనేమాట ఈయన ఆచ రించి నిరూపించారు. మద్రాసు ప్రభుత్వంవారు ఈకృషికి మెచ్చి 1913 లో "రావు బహదూర్" బిరుదు ఇచ్చారు.ఆకాలంలో సేవలను అలా గుర్తించి స్పందించేవారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణనిర్మాణ విధానం నేర్చుకొన్నాడు. 35 ఏళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషావ్యాకరణాన్ని,1936 లో సవర-ఇంగ్లీషు నిఘంటువునూ తయారు చేశాడు. 

మద్రాసు ప్రభుత్వంవారు గిడుగు ఇంగ్లీషులో రూపొందించిన ‘సవరభాషా వ్యాకరణాన్ని’1931 లోను, సవర ఇంగ్లీషు కోశాన్ని 1938 లోను ముద్రించారు. 1934 లో ప్రభుత్వం అతనికి 'కైజర్-ఇ-హింద్ ' అనే స్వర్ణ పతకాన్నిచ్చి గౌర వించింది.1911 లో గిడుగు 30 ఏళ్ళ సర్వీసు పూర్తై అధ్యాపకపదవి నుంచి స్వచ్ఛందంగా విశ్రమించాడు.దానికికొద్ది సం. ముందునుంచే  ఆ యన దృష్టి ‘ ఆధునిక ఆంధ్రభాషా సంస్కరణ’ వైపు మళ్ళింది.

రామమూర్తికి చిన్నప్పటినుంచి విద్యాసక్తి, కార్యదీక్ష, సత్యాన్వేషణం ప్రధాన లక్షణాలు. సవరలు, హరిజనులు అంటరాని జనాలని అప్పటి సంఘం భావనను ఎదిరించి ఆ కాలంలోనే, ఆయన సవర విద్యార్థులకు తన ఇంట్లోనే బస ఏర్పరచి, భోజనం పెట్టి చదువు నేర్పించినహమనీయుడు.1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ళ ఇన్స్పెక్ట రైన జే.ఎ.యాట్స్ అనే ఇంగ్లీషుదొర చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పేతీరు నచ్చలేదు. ప్రజలు సాధారణంగా మాట్లాడే భాషకు  పుస్తకాల్లోని  భాషకు మధ్య ఉన్న తేడా అసలు సమస్య అని ఆయనకు అర్ధమైంది. విశాఖపట్నంలో ఏ.వీ.ఎన్ కాలేజీ ప్రిన్సిపాలైన పి.టి. శ్రీనివాసయ్యం గారిని అడిగితేఆయన గురజాడ, గిడుగులు దీనిని సరిచేయ గలరనిచెప్తాడు. అలా గిడుగు జీవితంఉద్యోగ విరమణానంతరం తెలుగు విద్యావిధానంలో జరుగు తున్నఇబ్బందిని గుర్తించి, దాని నివారణ గురించి ఆలోచించసాగాడు.గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యం గారు, యేట్సు — ఈ నల్గురి ఆలోచనల వల్ల ‘వ్యావహారిక భాషోద్యమం’ ఆరంభమైంది. అప్పటికే ఇంగ్లీషులో ఎన్నో  భాషాశాస్త్ర గ్రంథాలు చదివిన గిడుగు ప్రతి యేడూ జరిగే అధ్యాపక సదస్సుల్లో జీవద్భాష ప్రాధాన్యతను గురించి చర్చించాడు.1906 నుండి 1940 వరకు గిడుగురామమూర్తి కృషి అంతా తెలుగు భాషా సేవకే. యేట్స్ ప్రోత్సాహంతో శిష్టజన వ్యావహారిక తెలుగు భాషను గ్రంథరచనకు ఉపయోగించేలా చేయను ఎంతో కృషి చేసి కృత కృత్యుడయ్యాడు. వీరేశలింగంపంతులు సాయంకూడా గిడుకుకులభించింది.1919-20 ల మధ్య వ్యావహారికభాషోద్యమ ప్రచారం కొరకు 'తెలుగు' అనేమాసపత్రిక నడిపాడు.1925, తణుకులో జరిగిన వ్యావహారిక భాషను ప్రతిఘటిం చిన ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో ‘ నాల్గు  గంటలు  ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా ఆ సమితి సభ్యులచే  తీర్మానం చేయించాడు "గిడుగు". సాహితీ సమితి,నవ్యసాహిత్య  పరిషత్తు మొదలైన సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బల పరచాయి.  స్కూలు కాలేజీ పుస్తకాల్లో గ్రాంథికభాషే ఉండేది. వీరేశలింగం ప్రతిపాదించిన సరళ గ్రాంథికంకూడాకొన్నిపుస్తకాల్లోవచ్చింది. గిడుగు రామమూర్తి  ఊరూరూ తిరిగి  ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా వ్రాయ లేడని నిరూపించాడు. 1919 లో గిడుగు "తెలుగు" అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయవ్యాసాలతో, ఉపన్యా స పాఠాలతో నిరంతరపోరాటం సాగించాడు.చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి ,వీరేశలింగం ,పంచాగ్ను ల  ఆదినారాయణశాస్త్రి, వజ్ఝల చినసీతా రామశాస్త్రి మొదలైన కవులు, పండితు లు వ్యావహారిక భాషావాదం వైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28 న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షుడుగా, గిడుగు కార్య దర్శిగా "వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం" స్థాపించారు. 1933 లో గిడుగు రామమూర్తి ‘సప్తతి ‘మహోత్సవం [70 వసంతాల వయస్సు పూత్రైనసం దర్భంగా చేసే వేడుక]ఆయన అభిమానులు,శిష్యులు రాజమహేంద్రవరంలో  బ్రహ్మాండంగా జరిపారు.  తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 46 పరిశోధకవ్యాసాలతో 'వ్యాస సంగ్రహం' అనే గ్రంధాన్ని ఆయనకు సమర్పించారు.1924 లో కాకినాడలోని ఆంధ్ర సాహి త్య పరిషత్తు ఆధికారికంగా వ్యావహారిక భాషా నిషేధాన్ని ఎత్తివేసింది.1936 లో నవ్యసాహిత్య పరిషత్తు అనే సంస్థ ను ఆధునికులు స్థాపించి సృజనాత్మకరచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్స హించే "ప్రతిభ" అనే సాహిత్య పత్రికను ప్రచురించారు. 1937లో తాపీ ధర్మారావు సంపాదకుడుగా "జనవాణి" అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణ భాష లోనే వార్తలు, సంపాదకీయాలు వ్రాయటం మొదలుపెట్టింది. గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజా మిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారికభాషావ్యాప్తికి చాలా సంతృప్తి పొందాడు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాల యాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటాని కి బాధపడ్డాడు. ఆయన ఆనాటి ఉపన్యాసం లోని మాటలు  -‘దేశభాషద్వారా విద్యబోధిస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుంది. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది.అదిజీవంతో కళకళలాడుతుంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని,వినబడేది కాదు. ప్రతిమవంటిది. ప్రసంగాలలో గ్రాంథిక భాష ప్రయోగిస్తూ తిట్టు కొన్నా, సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో కదా!గ్రాంథికభాషంటే నాకు అభిమానం ఉంది.ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆభాషలో నేడు రచన సాగించడానికి పూను కోవడం వృథా అని నాఉద్దేశ్యం. గ్రాధికభాషలో వ్రాసేవారు భావాన్ని తమవాడుక భాషలో రచించుకొని గ్రంధాలువ్రాస్తున్నారు.అదిచదివే వారు, వినేవారు తమ సొంత వాడుక మాటలలోకి మార్చుకొని అర్థంచేసు కొంటు న్నారు. ఎందుకింత వృథాప్రయాస? ఎవరికోసం? స్వరాజ్యం కోసం పాటుపడుతున్నాం, ప్రత్యేకాంధ్రరాష్ట్రం కోరుకుంటున్నాం.ప్రజాస్వామిక పరిపాలన కావాలంటున్నాం. ఇలాంటిపరిస్థితు ల్లో మన ప్రజలకు, మనసామాన్య తెలుగుజనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించ వలసి ఉందో ఆలోచించి,మీచేతులలో ఉన్నపత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”. అని గొంతెత్తి చెప్పారు.  

గిడుగు రామమూర్తి , జనవరి 22, 1940 న కన్ను మూశాడు.పంతులుగారి పుట్టిన రోజును’వ్యావహారిక భాషా దినోత్సవం' ['తెలుగు భాషా దినోత్సవము' గా ]ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది.గిడుగు గారికి 1934 లో ప్రభుత్వం కైజర్ ఎ హింద్ బిరుదు ఇచ్చి గౌరవించింది,1913 లో ప్రభుత్వం రావు సాహెబ్ బిరుదు ఇచ్చింది,1938 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణతో గౌరవించింది. రామ్మూర్తి పంతులు గురించి కొందరు ప్రసిద్ధులు చెప్పిన మాటలు -చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి"ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏపండి తుడైనా, కవియైనా తన బిరుదాలూ పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులు గారికి దోసిలొగ్గి సమర్పించుకొని మళ్ళీ ఆయన అనుగ్ర హించి ఇస్తే పుచ్చుకో వలసిందే".. విశ్వనాథ సత్యనారాయణ-"రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట" "రామ్మూర్తిపంతుల వాదాన్ని అర్థం చేసుకోక,అపార్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు". పులిదిండి మహేశ్వర్-"గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు/వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు,   తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు/కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు"అని కమ్మని పద్యరూపంగా చెప్పారు.   ఈ రోజు  "వ్యావహారిక భాషా దినోత్సవం"  కానీ "తెలుగు భాషా దినోత్సవం" కాదు,ఫిభ్రవరి-21 నాడు తెలుగు భాషా దినోత్సవం అని కొందరి భావన.ఏది ఏమైనా గిడుగుగారి పుట్టినరోజు ను ఒక ఉత్సవంగా జరుపుకోడం ఆనందదాయకం, మనకర్తవ్యంకూడా. మనం ఈనాడిలా తేట వ్యావహారిక తెలుగులో వ్రాసుకుంటున్నామంటే అదంతా ఆమహనీయుని కృషి ఫలితమేకదా!      

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao