తెలుగు చదవడం, కనీసం మాట్టాడడమైనా వచ్చిన ప్రతీవాడూ, నవ్వడం మర్చిపోయి నాలుగు రోజులైందంటే ఆశ్చర్యం లేదు కదూ... ఎన్ని గొడవలున్నా, ఎన్నెన్ని పోట్లాటలున్నా, ఏదో ఒకటైములో నవ్వాలీ అంటే, “గురువు “ గారు శ్రీ బాపు గారు వేసిన ఓ కార్టూన్ చూస్తే, అప్పటిదాకా ఉన్న విసిగూ, అలసటా,కోపం, కసీ.. లాటివన్నీ హూష్ కాకీ అయిపోయేవి. దెబ్బలాడినవాడి పీక పిసికేయాలనే కసి కూడా, అదేమిటో కానీ ఆయన కార్టూన్ చూసేసరికి, “పోనిద్దూ, వాడి పాపాన వాడే పోతాడూ... మనకెందుకొచ్చిన కంఠశోషా..” అనిపించేటంతగా చల్లబడిపోయేది. కోపానికి శ్రీ బాపుగారి కార్టూన్ ఓ “సంజీవినీ టానిక్కు“ లా పనిచేసేది.
దేశానికి స్వాతంత్రం రాని పూర్వం, శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావుగారు, ఆంధ్రపత్రిక స్థాపించి, బ్రిటిష్ వారికి “తలనొప్పి“ తెప్పించేవారుట! దానికి విరుగుడుగా, “అమృతాంజనం“ కనిపెట్టి, వాళ్ళకి తలనొప్పినుండి విముక్తి ప్రసాదించేవారుట. అలాగే శ్రీ బాపుగారు కూడా, ఈ శతాబ్దానికి, తన కార్టూన్లతో కోపాలూ, వైషమ్యాలూ, కక్షలూ పోగొట్టే “యాంటీ బయాటిక్“ కనిపెట్టేశారు.
చిన్నప్పటినుండీ, శ్రీ బాపుగారు అలవోకగా గీసిన “గీత” లతో పెరిగిపెద్దయాము. అసలు ఈయన ఎవరో, ఓసారి చూస్తే బాగుండునూ, అని కలలు కనడంతోనే గడిచిపోయింది. అయినా దేవుడిని చూడాలంటే మనం కూడా పెట్టిపుట్టాలిగా.. అలాగే కలలు కంటూ.. కంటూ.. కంటూ షష్ఠిపూర్తి కూడా పూర్తయింది, ఆయనని కలిసే అదృష్టం మాత్రం రాలేదు. ఎన్నో సార్లు మెడ్రాసు (చెన్నై) కూడా వెళ్ళాను. దేనికైనా “ఘటన“ అనేది కూడా ఉండాలికదా. ఎలాగైతేనేం, గ్రహాలన్నీ కలవ్వలసినచోట కలిసి, మొత్తానికి ఆ సుముహూర్తం, 2010 లో వచ్చింది. మా అబ్బాయి అదేదో క్విజ్ కి వెళ్తూంటే, మమ్మల్ని కూడా రమ్మన్నాడు. అప్పటికి మా మనవడు ఇంకా నెలల పిల్లాడు, సహాయంగా ఉంటుంది కదా అని, నానమ్మని (అంటే మా ఇంటావిడ) తీసికెళ్తూ, buy one get one స్కీం లో నేను కూడా వెళ్ళాను. ఛాన్సు దొరికితే నా ఇష్టదైవాలు శ్రీ బాపురమణ గార్లని కలిసి, ఓ దండం పెట్టుకుందామని.
శ్రీ బాపుగారి ఫోనునెంబరు ఎలాగోలా సంపాదించి, వారి కుమారుడికి ఫోనుచేసి, ఇలా నేను పూణె నుంచి వస్తున్నానూ, మీనాన్నగారిని కలవడానికి వీలుంటుందా అని అడిగాను. ఏదో అంత దూరం నుండి వస్తున్నారూ, పోనీ వీలుంటుందీ అంటారులే అనుకుని ! ఆయనేమో, “ నాన్నగారు సినిమా షూటింగులో బిజీగా ఉన్నారూ, వీలుండకపోవచ్చునేమో..” అన్నారు. చూద్దాం, మన అదృష్టం ఎలా ఉందో.. అనుకుని, చెన్నై వెళ్ళగానే, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారికి ఫోను చేశాను—“ అయ్యా నేను ఫలానా.. పూణె నుండి వచ్చాను సతీసమేతంగా, మీ ఇద్దరి భక్తుడినీ, మీదర్శనం చేసికోకుండా, తిరిగివెళ్ళే ప్రశ్నే లేదు.. మీరు కాదంటే, నా “ఆత్మ” మీ ఇంటిచుట్టూ తిరుగుతూంటుంది, ఆ “పాపం“ మీకే చుట్టుకుంటుందీ.. అంటూ బెదిరించేశాను. ఆయనేమనుకున్నారో ఏమో కానీ, “నేనైతే ఖాళీగానే ఉన్నానూ, బాపు షూటింగు లో బిజీగా ఉన్నారూ.. ఒంటిగంటకి ఫోనుచేయండీ.. అన్నారు. “స్వాతిముత్యం“ సినిమాలో కమల్ హాసన్, ఉద్యోగంకోసం సోమయాజులు గారి వెంటబడ్డట్టుగా, ఠంచనుగా ఒంటీగంటకల్లా మళ్ళీ ఫోనుచేశాను. వీడెవడో వదిలేట్టుగా లేడూ, అనుకున్నారో ఏమో, “సరే వచ్చేయండీ.. నాతో మాట్టాడేసరికి బాపు గారు కూడా వచ్చేయొచ్చూ.. “ అన్నారు.
నరనారాయణుల్లో ఒకరి దర్శనమైనా చేసికోవచ్చులే అనే సదుద్దేశ్యంతో, శ్రీ బాపు గారూ, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారూ నివసిస్తూన్న “ఏకాండీ” రెండంతస్థుల భవనానికి వెళ్ళి, ఓ మూడు గంటలు, శ్రీ వెంకటరమణ గారితో గడిపి, వారుచేసిన అతిథిసత్కారాలు పొంది, వారు ఎంతో అభిమానంతో బహుమతిగా ఇచ్చిన ఓ పాతిక అచ్చతెలుగు పుస్తకాలు, “ప్రసాదం“గా కళ్ళకద్దుకుని, స్వీకరించి, క్రిందికి వచ్చి, శ్రీ బాపుగారి ఇంటి కిటికీలోంచి తొంగి చూశాను. లేచినవేళ బాగుంటే, నారాయణుడి దర్శనం కూడా అవుతుందేమో అనుకుంటూ.. వీడెవడా తొంగిచూస్తున్నాడూ అనుకుంటూ, వారి అబ్బాయి తలుపు తీశారు. “నేను ఫలానా ఫణిబాబూ..“ అనగానే “పూణే నుండి కదూ..” అని ఆయన అనడంతో, “నాన్నగారు ఇంకా రాలేదూ.. “ అని అంటారేమో అని భయపడిన మేము, “నాన్నగారు ఇప్పుడే వచ్చేరండీ.. డ్రెస్ మార్చుకుని వచ్చేస్తారూ, కూర్చోండీ..” అనగానే, మా ఆనందానికి అంతులేదు. “ఏమి భాగ్యం.. ఏమిభాగ్యం.. నా ఇష్టదైవాలిద్దరినీ ఒకే రోజు దర్శనం చేసికునే అదృష్టం కలిగిందీ..” అనుకుంటూ, లోపలకి వెళ్ళాము. ఇంతట్లో మెట్లమీదనుండి, తన “ శంకు“ మార్కు, గళ్ళ లుంగీలో, నా ప్రత్యక్షదైవం శ్రీ బాపు గారు దర్శనమిచ్చారు! ఓసారి ఆయన కాళ్ళకి దండం పెట్టేసికుని, కబుర్లలోకి దిగిపోయాము. ఎన్నెన్ని కబుర్లో... మాటల్లో ఆయనతో చెప్పేను.. “సార్ .. మీరు పుట్టిన డిశంబరు 15, నా పుట్టినరోజుకూడానండి” అని. ఎంతో అభిమానంతో, తన స్వంత కుటుంబంలోని వారితో మాట్టాడినట్టు ఓ గంటన్నరసేపు కబుర్లు చెప్పేరు. నాలో ఊపిరున్నంతసేపూ గుర్తుంచుకోవాల్సిన మధుర క్షణాలు అవి !
ఆ తరువాత రెండు మూడు సందర్భాల్లో ఆయనతో ఫోనులో మాట్టాడే అవకాశం కలిగింది. ఎప్పుడు మాట్టాడినా, ఎంతో కాలం నుండీ పరిచయం ఉన్నట్టుగానే మాట్టాడేవారు. అలా మాట్టాడడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. గత నాలుగు సంవత్సరాలుగా, ఆయన జన్మదినం రోజున శుభాకాంక్షలు తెలియచేయడానికి ఫోను చేయగానే, ఆయన వెంటనే చెప్పేది “Same to you ..” అని. ఏదో యాధాలాపంగా నేను చెప్పినది గుర్తుంచుకుని, నన్ను వారికే స్వంతమైన శైలిలో, నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం.
ఈ ఏడాది అలాటి అవకాశం కలగదూ అనుకుంటూంటేనే ఏడుపొచ్చేస్తోంది. వెంటనే నా దగ్గర ఉన్న శ్రీ బాపుగారి “గీతలు“ ఓసారి చూడ్డంతోనే, “పోనిద్దూ.. ఆయన మాత్రం ఎక్కడికెళ్ళారూ, తన ప్రియ సఖుడిని“ కలవడానికే కదా.. ఎప్పుడో ఒకప్పుడు, మనమూ వెళ్ళొచ్చులే...” అని సద్దుకుంటున్నాను... LONG LIVE BAPU RAMANA !!!