సాహితీవనం - వనం వెంకటవరప్రసాద్

sahiteevanam

అల్లసాని పెద్దన విరచిత మనుచరిత్రము

(గతసంచిక తరువాయి)

ఆవిధముగా ద్రవించిన మనస్సులు గల పౌరకాంతల క్రీగంటి నల్లని, చంచలములైన, శృంగార రస భరితములైన చూపులు అనే కెరటాలు క్రమ్ముతుండగా, మదనభావంతో నల్లనైన వారిక్రీగంటి కాంతులచే స్వరోచికిపట్టిన తెల్లని గొడుగులు(శ్వేతఛ్ఛత్రములు)పట్టువస్త్రముచేత కప్ప బడి, రత్నముల మాలికలు వ్రేలాడుతున్న శ్వేతఛ్ఛత్రములు నల్లబడి మెరుస్తున్నాయి. శృంగార, కామ భావాలను నలుపు నీలి రంగుల తో పోల్చిచెప్పడం సంప్రదాయం. నీలిరంగు భావుకత్వానికి, శృంగారానికి, ఆకర్షణకు, మమతానురాగాలకు ప్రతీక, కనుకనే శ్రీకృష్ణుడు నీల మేఘశ్యాముడు, భువనమోహనుడు, అందరినీ ఆకర్షించి ‘మాయ’చేశాడు అనడం. తమ తమ వాహనాలను దిగి ‘మే’మంటే ‘మే’మని పోటీ లుపడుతూ దుర్గాధిపతులైన రాజులు వీస్తున్న వింజామరలు తెల్లని వెన్నెల గుత్తులవలె ప్రకాశిస్తున్నాయి. ఊరేగింపులోనున్న అంద మైన యువతుల ముంగురులు జెండాల చిరుగాలికి కదలుతూ ఊరేగింపులో రెండు ప్రక్కల నడుస్తున్న ఏనుగులచెక్కిళ్ళపై కారుతున్న మద జల పరిమళానికి ఆకర్షింపబడి వ్రాలిన తుమ్మెదలను ఆకర్షించి ఆహ్వానిస్తున్నాయి.

ఊరేగింపులో నడుస్తున్నవారు పూసుకున్న గంధపుపూతల ధూళి పైకెగసి నలుదిక్కులకూ వ్యాపించి చాందినీ కట్టినట్లుగా, చమ్కీలు కట్టిన దండలాగా  ప్రకాశిస్తున్నది. ఊరేగింపులో నడుస్తున్న పౌరుల ఎడతెరపిలేని పలుకులధ్వనులు, వందిమాగధుల స్తుతులధ్వనులు, ఒక దానివెంట ఒకటిగా మ్రోగుతున్న శంఖ, భేరి, తప్పెట, బాకా, వేణు, వీణాధ్వనులు, అవ్యక్త మాధుర్యములైన కిన్నెరస్త్రీల వీణా ధ్వనులు , వీటన్నిటినీ  మరుగుపరుస్తున్న నృత్యబృందములవారి ‘తళాంగు తకధిమి తత్తై’ ధ్వనులు, అప్సరలు పాడుతున్న శ్రీలక్ష్మీ నారాయణుల  కళ్యాణ గాథల గీతముల ధ్వనులు ఏకమై, త్రోసుకుని త్రోసుకుని వస్తున్న జనుల కలకలధ్వనులు, ‘ఎడంగా ఉండండి..ఎడంగా ఉండండి’ అంటూ బెత్తములను ధరించి పౌరులను ప్రక్కకు త్రోస్తున్న భటుల కంఠముల కరకు ధ్వనులు, ‘సాహో..’నినాదాలు చేస్తున్న రక్షకభటుల హెచ్చరికధ్వనులు కలగలసిపోయిన ధ్వనులతో రోదసీ మండలం అంతా నిండిపోయింది. ‘క్రంత’ అనబడే  సంప్రదాయంలో భాగంగా ‘ఆడపె ళ్ళివారికి మగపెళ్ళివారు ఇచ్చుకునే ప్రధాన పరిమళ శుభద్రవ్యముల’ను ధరించిన వారు నడుస్తుండగా, ఊరేగింపులో నడుస్తున్న ‘స్వరోచి సామంతరాజుల కిరీటములలోని పగడములకాంతులు’ పగటి దివిటీల కాంతులై ప్రకాశిస్తుండగా, మందగమనముతో నడుస్తున్న దేవ తాగజ మైన ఐరావతముమీద కూర్చున్న స్వరోచిదేహము ఆతను ధరించిన బంగారు ఆభరణముల కాంతులతో బంగారమునకు జన్మస్థానమైన ‘జంబూ నది’ బురద చిత్తడితోనేమో అన్నట్లు మెరుస్తున్నది. జంబూనది బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది అని సంప్రదాయం, కనుకనే బంగా రాన్ని  ‘జాంబూనదం’ అని పిలుస్తారు. ‘జంబూవృక్షం’ అంటే నేరేడు చెట్టు. నేరేడు చెట్లు ఎక్కువగా ఉన్న ద్వీపం కనుక జంబూద్వీపం అని పేరున్న ద్వీపంలో భరతవర్షం, భరత ఖండము ఉన్నాయని సంకల్పంలో చెప్పుకుంటున్నాము, పూజా కార్యక్రమాలలో. జంబూ, ప్లక్ష, శాల్మలి , కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపములు అని ఏడు ద్వీపములతో భూమండలం ఉన్నది అని భారతీయుల ఉవాచ.

లక్షలాది  సంవత్సరాల  క్రితమే ఈనాడు ఏడు ఖండములు అని చెప్పబడుతున్నవాటికి ఆనాడు భారతీయులు పెట్టిన పేర్లు ఇవి. ఆ జంబూ వృక్షాన్ని, నేరేడుచెట్టును తనకు రక్షణ కవచముగా అడ్డుపెట్టుకుని, అలహాబాదులోని ‘ఆల్ఫ్రెడ్ పార్క్’లో, తన పిస్టల్ లోని నాలుగు గుం డ్లతో   నలభై నిముషాల పాటు , తనను చుట్టుముట్టిన ఆంగ్లేయ సిపాయీలతో వీరపోరాటం చేసి, ఐదవ గుండుతో తనను తాను కాల్చుకుని ఆత్మ త్యాగం చేశాడు చంద్రశేఖర ఆజాద్! జంబూద్వీపంలో భరతవర్షపు ఉనికిని సార్ధకం చేశాడు.     ఊరేగింపులోని వివిధ ధ్వనుల కోలా హలము హంసలు మొదలైన జలపక్షుల మనోహరమైన ధ్వనులలా వినిపిస్తుండగా, ‘క్రంత’ను తీసుకుని నడుస్తున్నవారి చేతులలోని కలశ ములలోని, పళ్ళెరములలోని వివిధ పరిమళ మంగళ ద్రవ్యాలు ప్రకాశమును, పరిమళమును వెదజల్లుతుండగా, వారు ధరించిన చెరకుగడలకున్న పచ్చని ఆకులు నాచువలె మెరుస్తుండగా, ఊరేగింపులో పట్టిన పగటి దివిటీలు ఎర్ర కలువలవలె ప్రకాశిస్తుండగా, ఊరేగింపుకు రెండువైపులా ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉన్న ఎత్తైన రత్నమణిమయ సౌధముల దారులతో, నల్లని ఏనుగులనే నల్లని వర్షమేఘములకాంతిని కలిగిన లోతైన నల్లని యమునానదీ ప్రవాహము వంటి ఊరేగింపు ఆకాశవీధులలో జరుగుతుంటే యమునానది ఆకాశగంగతో సంగమించడానికి పొంగి పొర్లుతున్నదా అన్నట్లు ఆ ఊరేగింపు ఒక ప్రవాహంలాగా, యమునాప్రవాహంలా జరిగింది.

భూలోక ప్రవాహమైన యమునానదికి భూమీశుడైన స్వరోచి ప్రతీక, దేవనది ఐన ఆకాశగంగకు దేవతాస్త్రీ ఐన మనోరమ ప్రతీక, కనుక వీరిద్దరి సంగమాన్ని సూచించడానికి మనోరమ అనే గంగా సంగమంకోసం దరులను తాకుతూ ఉవ్వెత్తున ఎగిసిన స్వరోచి అనే యమునా ప్రవాహంలా ఉన్నది ఆ ఊరేగింపులోని జనప్రవాహం అంటున్నాడు పెద్దన!    మేరుపర్వత శిఖరములను ధిక్కరించే తన భుజాలమీదుగా తను ధరించిన ముత్యాల దండలు, ఊరేగింపువలన అస్తవ్యస్తముగా భుజాలమీద ప్రకాశిస్తుండగా, ఐదుపేటల ముత్యాల సరాలు, మెడనుండి ఉదరమువరకు వ్రేలాడుతున్న రత్నహారములు, భుజకీర్తులు, కెంపులు పొదిగిన చేతికంకణములు, నడుముకున్న బంగారు మొలత్రాడుకు అమర్చిన పచ్చలపిడిబాకు వెలువరిస్తున్న కాంతులను బయటకు వెలువరిస్తున్న, అర’పడుగు’ నేత నేసిన, సన్నని ప్రకాశవంతమైన పట్టు అంగరఖా(చొక్కా)ధరించిన స్వరోచి మంచు కమ్మిన రోహణ పర్వతంలాగా ఇందీవరాక్షుని సౌధాన్ని, రాజభవనప్రాంగణాన్ని చేరుకున్నాడు. పడుగు పేక అని రెండు రకాల అల్లికతో వస్త్రాన్ని నేత చేస్తారు సాలెవాళ్ళు. పడుగు తక్కువతో నేయడంవలన పల్చగా, నాజూగ్గా , పారదర్శ కంగా  ఉంటుంది వస్త్రం. ఆతను ధరించిన వివిధ సువర్ణ మణిమయ రత్నాభరణములకాంతి పలుచని చొక్కానుండి బయటకు  చిమ్ముతుంటే మంచుక్రమ్మిన ‘రోహణ’పర్వతములాగా ఉన్నాడు స్వరోచి. రోహణ పర్వతము శ్రేష్ఠమైన రత్నములను ఉత్పత్తి చేస్తుంది అని సంప్రదాయం. స్వరోచి కూడా రత్నమువంటి ఉత్తముడైన ‘భావి’మనువును ఉత్పత్తిచేయబోతున్నాడు అని ధ్వనిస్తూ ఈ ఉపమానం వాడాడు పెద్దన! ఇక మనోరమ ముస్తాబైనతీరును వర్ణిస్తున్నాడు.

కాంతా కదంబకిసలయ
కాంత కరావర్జ్యమాన కనక ఘటీని
ర్వాంత సుగంధి జలంబుల
నింతి జలకమాడి జిలుఁగు లిడి తడి యొత్తెన్‌.

స్త్రీల సమూహం చిగుళ్ళవంటి చేతులతో వంచిన బంగారు కలశములలోని సుగంధ జలము నిరంతరంగా ప్రవహిస్తుండగా స్నానమాడి, సన్నని మేలిమిపట్టు వస్త్రాలతో స్నానపు తడిని ఒత్తుకున్నది మనోరమ.

తళుకు దుకూలశాటిఁ గటిఁ దాల్చి పటీర మలంది
హారకుండల మణిపారిహార్య రశనా కటకాంగుళిముద్రి కాదిభూ
షలు తొడి పారిజాతవికసత్ప్రసవావళిఁ బూని యొయ్య న
వ్వెలఁది వివాహవేది కలివేణులు దేఁ జనుదెంచె సిగ్గునన్‌.

ఆ వెలది మనోరమ తళతళలాడే తెల్లని పట్టుచీరను నడుముకు చుట్టుకుని, మంచిగంధమును పూసుకుని, మనోహరమైన హారములను, కుండలములను, మణులు పొదిగిన గాజులను (మణి పారిహార్యములు)పదహారు పేటల మొలనూలు (వడ్డాణము) చేతులకు కంకణములను (కటకములు) ఉంగరములు మొదలైన భూషనములను ధరించి, దేవతావృక్షమైన పారిజాతపు వికసించిన పుష్పములను ధరించి, నల్లని తుమ్మెదల బారులవంటి జడలున్న సుందరీమణులు తీసుకునిరాగా, సిగ్గులుపోతూ మెల్లగా వివాహవేదికకు నడచివచ్చింది.      

ఇట గృహద్వారసీమకు నేఁగుదెంచు
నా కుమారున కిందీవరాక్షుఁ డెదురు
సని మరుత్కరి డిగ్గి వందన మొనర్చు
నతని దీవించి హితమంత్రియుతము గాఁగ.

ఇక్కడ, ఇందీవరాక్షుడు తన భవనద్వారమువద్దకు వచ్చిన స్వరోచికి ఎదురేగి, దేవతాగజమైన ఐరావతాన్ని దిగి తనకు నమస్కరించిన స్వరోచిని దీవించి, హితులు మంత్రులు కలిసిరాగా, బ్రాహ్మణుల ఆశీర్వాదములు రోదసీమండలంలో నిండిపోతుండగా లోపలి తీసుకు వెళ్తుండగా మధ్య మధ్య పుణ్యస్త్రీలు తనకు మంగళహారతులు మొదలైన ఉపచారములు చేస్తుండగా వారిని మన్నిస్తూ, అనేక స్వాగత ద్వారములను వీక్షిస్తూ, మధ్య మధ్య మంగళ సూచకములుగా అమర్చిన పూర్ణ కలశములను, దర్పణములను వీక్షిస్తూ, పూల తోరణాలు కట్టిన అరటి స్తంభములకున్న ఆకులనే చివుళ్ళవంటి వింజామరలు వీస్తున్న గాలులకు తన ముంగురులు కదులుతుండగా, ఇందీవరాక్షుడికి ఆప్తుడైన ఒక కింపురుషుడు చేయి అందించి నడిపిస్తుండగా స్వరోచి నెమ్మదిగా నడుస్తూవెళ్లి పురోహితులు, బ్రాహ్మణులు, బంధువులు, ముత్తైదువలతో సందులేకుండా క్రిక్కిరిసి, పెళ్ళికి కావలసిన వివిధసంబారములను చేరవేస్తూ అటూ యిటూ తిరుగుతున్న రంభోరువులైన రంభ మొదలైన అప్సరాకాంతలు చేస్తున్న మనోహరములైన మృదువైన పలుకులతో గలగలలాడుతున్న, మిల మిల లాడు తున్న, కళకళలాడుతున్న, వివాహ వేదికను సమీపించాడు.

ప్రభలు నభోవిటంకమున భానుమరీచులఁ బ్రోదిసేయఁ గౌ
స్తుభనిభ నూత్నరత్న పరిశోభిత మై గరుడాశ్మ వేది రు
గ్విభవము పొల్పగుంజవిక విద్రుమపాదసువర్ణపీఠిపైఁ
బ్రభుత దలిర్ప మామ పనుపన్‌ వసియించె నుదంచితస్థితిన్‌.     

తన కాంతులతో సూర్యుని కాంతులను కూడా కాంతిమంతం చేస్తున్న వేదికపై, శ్రీమహావిష్ణువు యొక్క కౌస్తుభమణి కాంతులవంటి కాంతులు చిమ్ముతున్న రత్నములతో ప్రకాశిస్తున్న, పచ్చలు పొదిగిన వేదికపై, పగడములు పొదిగిన కాళ్ళున్న బంగారుపీటపై కాబోయే మామగారు కూర్చుండబెట్టగా ఠీవిగా కూర్చున్నాడు స్వరోచి.

 విధియుతముగ ఖచరుఁ డవ
న్యధినాథున కొసఁగెఁ బసిఁడిహరివాణమునన్‌
మధుర మఖభు గ్గవీ దధి
మధురస సంపర్క మయిన మధుపర్కంబున్‌.

గంధర్వరాజైన ఇందీవరాక్షుడు విధ్యుక్తంగా అవనీనాథుడైన స్వరోచికి బంగారు పళ్ళెరంలో దేవతా ధేనువైన కామధేనువుయొక్క తియ్యని పెరుగు, తేనె కలిపిన మధుపర్కాన్ని సమర్పించాడు. మధుపర్కం అనేది పెరుగు, నేయి, నీరు, తేనె, పంచదార అనే ఐదు పదార్ధాలతో కలిపి చేయబడుతుంది. ఈ ఐదూకలిపి తయారుచేస్తే నీరు అన్నిటికన్నా తక్కువగా, నీరుకన్న ఎక్కువ మోతాదులో సమానమైన పాళ్ళల్లో చక్కర పెరుగు నెయ్యి కలిపి, వీటన్నిటికన్నా ఎక్కువ మోతాదులో తేనెను కలిపి తయారు చెయ్యాలి, కంచు/బంగారు/వెండి పాత్రలో మాత్రమే ఇవ్వాలి, ఇలా ఇచ్చిన మధుపర్కం దేవతలకు ప్రీతికరమైనది, మానవులకు ఆయుష్షును, తేజస్సును, యశస్సును తుష్టిని, పుష్టిని, సుఖాన్ని, భోగాన్ని ఇస్తుంది, ధర్మార్థకామమోక్షములను ప్రసాదిస్తుంది అని భారతీయ సంప్రదాయం. ఇక్కడ ఇందీవరాక్షుడు కామధేనువు పాల పెరుగును, తేనెను రెండిటిని మాత్రమే కలిపి ఇచ్చాడు. పెరుగు, తేనె, నెయ్యి ఈ మూడిటిని కలిపి కూడా మధుపర్కంగా ఇవ్వ వచ్చు, దేవతాపూజలో షోడశోపచార పూజలో (పదహారుఉపచారములతో చేసే పూజ) ఆరవదైన ఉపచారము మధుపర్కం సమర్పిం చడం. వీలైతే అన్ని పదార్దాలతోను, కాకుంటే కనీసం నెయ్యి, పెరుగు, తేనెలతో మధుపర్కాన్ని తయారుచేసి సమర్పిం చాలని  సంప్రదాయ వచనం.

అంచితాకృతి సాక్షాత్కరించినట్టిరమకుఁ బ్రతివచ్చు సుర మనోరమ మనోరమ యనుదాని ననుంగు జామాతఁ గైట భారి సరిఁగాగ నర్చించి దారవోసె. మనోహరమైన రూపముతో దేవతల మనసులలో ధ్యానింపబడే లక్ష్మీదేవికి సాటివచ్చే మనోరమను, కైటభాంతకుడైన శ్రీ మహా విష్ణువును పోలిన స్వరోచికి ఉదకపూర్వకంగా ధారపోశాడు ఇందీవరాక్షుడు. ‘కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్యుతాం, దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా’ అనే హైందవ వివాహమంత్ర ప్రకారం అమ్మాయి లక్ష్మీదేవి, అల్లుడు విష్ణుమూర్తి, అలా భావించి, గౌరవించి చేసిన కన్యాదానం బ్రహ్మలోకాన్ని ప్రసాదిస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టికి, ‘ప్రజలను ‘ప్ర’జననము చేసే యాగక్రియకు అధిపతి, యజమాని. అందుకు పవిత్రమైన వివాహబంధముతో దగ్గరైన వధూవరులు ప్రధాన ఉపకరణములు. పురుషుడు యాగకర్త. స్త్రీ దేహం యజ్ఞవేదిక, హోమగుండం. పురుషుని రేతస్సు హవిస్సు. వారి సత్సంతానకామనలు సమిథలు. అలా సత్సంతానమును పొందడానికే గృహ స్థాశ్రమము. తద్వారా పితృదేవతల ఋణమును తీర్చే సంతానం కలుగుతుంది. అలాంటి పవిత్రమైన దేవకార్యానికి స్త్రీపురుషులను కూర్చి, కన్యాదానం చేసిన కారణంగా బ్రహ్మలోకం లభిస్తుంది కన్యదాతకు అని భావం! కనుకనే సంతానాన్ని పొందినతర్వాత గృహస్థాశ్రమముతో విడివడి, తర్వాతి ఆశ్రమ స్వీకారము చేయాలని బోధిస్తుంది భారతీయ ఆలోచనావిధానం! మహానుభావులైన దధీచి, ఆస్తీకుడు అదే బోధించి, ఆచరించారు!

(కొనసాగింపు వచ్చేసంచికలో)

వనం వేంకట వరప్రసాదరావు      

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి