మొహం చూస్తే చాలు.. తెలిసిపోతుంది... - భమిడిపాటి ఫణిబాబు

moham chooste chaalu telisipotumdi....

ఇదివరకటి రోజుల్లో, ఏదో బాగా చదువుకుని, పై చదువులకి మాత్రమే విదేశాలకి వెళ్ళేవారు. ఏదో నూటికీ, కోటికీ ఏ వందమందో ఉండేవారు. పైగా ఆ రోజుల్లో విదేశాలకి వెళ్తున్నారంటేనే ఎంతో హడావిడిగా ఉండేది. పేపర్లలో ప్రకటనలూ, ఆ వెళ్ళేవాళ్ళకి, వాళ్ళు తిరిగివచ్చేటప్పుడు తీసికునిరావాల్సిన సరుకుల లిస్టులూ, అక్కడకి వెళ్ళేటప్పుడు తీసికెళ్ళాల్సిన స్వంత సరుకులూ, ఊళ్ళోవాళ్ళ పిల్లలకి తీసికెళ్ళాల్సిన సరుకులూ, ఒ పెద్ద లిస్టు తయారయేది..ఎవరైనా బయటకెళ్ళొచ్చారంటే చాలు, వాళ్ళింట్లో ఓ టేప్ రికార్డరో, ఓ వాచీయో, ఓ కెమేరాయో వచ్చేసేవి. ఆర్ధిక సంస్కరణల తరువాత, ఆ సరుకులన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. ఈ రోజుల్లో “చాకొలేట్ల “ తో సరిపోతోంది.

ఈ రోజుల్లో విదేశాలకి వెళ్ళాలంటే, పేద్ద చదువులే అఖ్ఖర్లేదు. చేతిలో ఏదో ఒక “కళ” ఉంటే చాలు, ఈ “కళ” ల్లో రకరకాలు. ఈ “ కళాకారుల” తో పాటే, ఇంకో క్యాటిగరీ ఒకటుంది. తమ కూతురో, కొడుకో విదేశాల్లో ఉండే తల్లితండ్రులు.అవసరార్ధం వెళ్ళొచ్చేవారు కొంతమందీ.అసలు అవసరం అంతా తల్లితోనే. కానీ added liability  గా తండ్రిగారుకూడా వెళ్తూంటారు.

ఎవరినైనా చూస్తే చాలు తెలిసిపోతుంది... మాస్టారు ఈ మధ్యనే విదేశాలకి వెళ్ళొచ్చారూ అని. అలాగే కొంతమందుంటారు, కంపెనీ వాళ్ళు ఏదో ప్రాజెక్టువిషయంలో ఒకసారి అదేదో “ఆన్ సైటు “ కి పంపబడ్డవాళ్ళు, అలాగే ఏ కూతురికో, కోడలికో పురుడుకి వెళ్ళి ఓ ఆరునెలలు ఉండొచ్చినవాళ్ళు... వీళ్ళందరికీ ఓ “కామన్ “ విషయం ఉంటుంది, చూశారో లేదో.. వారి వేషభాషలూ, మాట పధ్ధతీ, రాత్రికి రాత్రి మారిపోతాయి. వాళ్ళంతటవాళ్ళు చెప్పనవసరంలేకపోయినా, “చెప్పకుండానే తెలిసిపోయే “ కొన్ని లక్షణాలు ఉంటాయి. చెప్పినా ఒప్పుకోరనుకోండి, కానీ ఉండడం మాత్రం పచ్చి నిజం.

అప్పటిదాకా ఏదో సాదాసీదా గా ఓ ప్యాంటూ, బుష్ షర్టూ వేసికున్నవాడల్లా, పువ్వుల చొక్కాలూ, మోకాళ్ళ దాకా ఉండే అవేవో క్యాప్రీలూ, కాదూ కూడదంటే నిక్కర్లలోకీ దిగిపోతాడు. పంచా, లాల్చీ వేసికున్నవాళ్ళకి కూడా ఈ మార్పొస్తుంది, అదేం చిత్రమో.

అప్పటిదాకా “అమ్మా, నాన్నా” అని పిలుస్తూ పెరిగిపెద్దవాడైనా సరే, ఓసారి బయటకి వెళ్ళొచ్చాడంటే  “ హాయ్ మాం, హాయ్ డాడ్ ..” లోకి దిగిపోతాడు.   ఏదో కొత్తవారిని చూసినప్పుడు “ ఎవరీయనా..” అని అడిగినవాడు కాస్తా “ Who is this guy ? “  అంటాడు. Guy అన్నాడంటే తప్పకుండా బయటకెళ్ళొచ్చిన వాడనడంలో సందేహం లేదు.

తోటి తెలుగువాడిని, “ మనవాడు “ అనడం కంటే అదేదో “ గుల్టీ “ అంటాడు. తెలుగులో మాట్టాడాలంటే, అదేదో “తప్పు “ చేసినట్టు అనుకుంటాడు.

ఇంక తిండివిషయాలకొస్తే , సాధారణంగా కిరాణా కొట్లలో దొరికేవి, ఛస్తే కొనడు. ఏదో ఒక “ మాల్ “ కి వెళ్ళి, అవేవో  organic వే కొంటాడు. ఇంకో విషయం, ఏ మాల్ కైనా వెళ్ళినప్పుడు, నిక్కర్లలోనే వెళ్ళడం.  చివరకి  ఇంట్లో ఉండే నూతినీళ్ళో, చెఱువు నీళ్ళో  తాగి పెరిగిపెద్దయినవాడు కాస్తా, “ మినరల్ వాటర్ “ తప్ప ఇంకోటి ముట్టుకోడు.

ఇళ్ళల్లో చేసే పిండివంటలైతే, వాటి మొహమే చూడ్డానికి ఇష్టపడడు. అవేవో బర్గర్లూ, శాండ్ విచ్చిలూ, సబ్ వేలూ, సింగినాదాలే కనిపిస్తాయి.  పైగా ఇళ్ళల్లో చేసినవాటిలో అదేదో “ కొలస్ట్రాలో..” ఏదో ఉందంటాడు. హాయిగా ప్రతీ రోజూ ఉదయమే లేచి, ఓ నాలుగైదు కిలోమీటర్లు నడవడ మో, పరిగెత్తడమో చేసేదానికి, ఇళ్ళల్లో అవేవో ట్రెడ్ మిల్లులో అవేవో కొని, వాటిమీద ప్రతీరోజూ  ఎక్సర్సైజు చేసికోవడం, ప్రతీరోజూ ఎన్నెన్ని “ క్యాలరీలు” అంటించాడో, ఫేస్ బుక్కులోనూ, ట్విట్టరు లోనూ చెప్పుకోవడం. కాదూ కూడదంటే ఏదో “జిం “ లో చేరిపోవడం. అన్నిటిలోకీ ముఖ్యమైనది చూసిన ప్రతీ దానినీ, తాను విదేశాల్లో చూసిన ప్రతీ దానితోనూ పోల్చి, “ అబ్బ .. అక్కడ సింగపూర్లో అయితేనా... “ లేదా “ అమెరికాలో అయితే అసలు ఇలా ఉండదండీ..” అని అడిగినవాడికీ, అడగనివాడికీ చెప్పడం. అసలు వీడినెవడడిగేడుట? సాధారణంగా ఈ మహనీయులు రైళ్ళలో వెళ్ళడానికి అంతగా ఇష్టపడరు, మరి స్పీడుకీ, punctuality కీ అలవాటుపడిపోయారుగా, కానీ మనదేశంలో వాటికి అసలు ప్రాధాన్యతే లేదాయె. కాలం కర్మం కలిసిరాక అధవా వెళ్ళాల్సొచ్చిందంటే చాలు, మనరైల్వే స్టేషన్లనీ, రైళ్ళనీ ఎడా పెడా తిట్టేయడం. తిరిగి వచ్చేక పోనీ, విదేశాల్లో వారు చూసిన క్రమశిక్షణా, పధ్ధతులూ ఆచరిస్తారా అంటే అదీ లేదూ. ఉదాహరణకి కుక్కలతో ఏదో టైములో వాటి “అవసరాలకి” బయటకి తెచ్చినప్పుడు చూస్తూంటాము, వాటి దారిన అవి, రోడ్డుపక్కనుండే ఏ కారు చక్రానికో కాలడ్డం పెట్టి, వాటి పని అవిచూసుకుంటాయి. అలాగే ఏ పక్కనో ఆగి, మిగిలినపనులు చూసుకుంటాయి. ఈ కుక్క యజమాని, వాటిగురించే పట్టించుకోకుండా, ఎవడితోనో కబుర్లు పెట్టుకుంటాడు, కానీ విదేశాల్లో ఆ కుక్క వెంబడి, ఓ ప్లాస్టిక్కు సంచీ పెట్టుకునే వెడతారని చదివేను. అలా ఇక్కడచేయడానికి ఏం రోగం ? ఫరవాలేదూ.. చల్తాహై.. అనుకునా ?

విదేశాలకి రెగ్యులర్ గా వేళ్ళేవారూ, అక్కడే స్థిరపడ్డ తెలుగువారూ, పైనచెప్పినవిధంగా ఉంటారనికాదు నేను వ్రాసింది. వాళ్ళెప్పుడూ తెలుగుసంస్కృతిని కాపాడడంలోనే ముందుంటారు. వారెప్పుడూ “నిండుకుండ” లే. అక్కడే స్థిరపడ్డారనికానీ, నెలకోసారి వెళ్ళొస్తూంటారనీ కూడా తెలియనీయరు. వచ్చిన గొడవల్లా , “మిడి..మిడి..” వారితోనే. ఊరికే వెళ్ళొచ్చేసి, ప్రతీదాన్నీ విమర్శించడం కాదు, మనదేశ వాతావరణానికి adapt అవడంకూడా ముఖ్యం, ఎంతైనా వారి “ మూలాలు “ మనదేశంలోనే..  మీరేమంటారు ?

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి