అల్లసాని పెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము
(గత సంచిక తరువాయి)
మనోరమా స్వరోచుల వివాహ వేడుకలను వర్ణిస్తున్నాడు పెద్దన.
తదనంతరంబ హర్షము
పొదలు మదిన్ మెట్టుఁబ్రాల పుట్టికలయెడం
గదియం బట్టిన పెందెరఁ
గదియించిరి బంధుజనులు కన్యావరులన్.
అనంతరం సంతోషంగా తలంబ్రాలగంపలవద్ద వధూవరులను కూర్చుండబెట్టి సందులేకుండా, జారకుండా యిద్దరిమధ్యా తెరను గట్టిగా లాగిపట్టుకున్నారు బంధుజనులు.అప్పుడు తూర్యముల్ మొరయ నమ్మిథునమ్ము విలోకనస్పృహందెప్పలఁదేల వంపఁబడు తెల్లని చీరతెరం గ్రమంబునంగొప్పు మొగంబు నఱ్ఱుఁ జనుఁ గొండలుఁ దోఁప లతాంగిపోలెఁ జెల్వుప్పతిలన్ సుధారసపయోనిధి పెందెరఁ బుట్టు నిందిరన్. అప్పుడు మంగళవాయిద్యాలు మ్రోగాయి. మనోరమా స్వరోచుల జంటకు పరస్పరం చూసుకోవాలనే అభిలాషలు వీచికలైనాయి. వారిరువురి నడుమనా పట్టిన తెల్లని తెర పాలసముద్రం అయ్యింది. ఆ తెర నెమ్మది నెమ్మదిగా క్రిందికి జారుతుంటే క్రమక్రమంగా మనోరమ కొప్పు, ముఖము, మెడ, ‘చను’కొండలు కనిపిస్తూ, ప్రేమ కలిగిస్తూ, పాలసముద్రం అనే పెద్ద తెరనుండి నెమ్మది నెమ్మదిగా పైకి తేలిన శ్రీమహాలక్ష్మీ దేవిలా కనిపించింది మనోరమ. చిత్రకారుడు కుంచెతో వర్ణచిత్రాన్ని కండ్లకు చూపిస్తాడు. కవి అక్షరాల కుంచెతో మనోనేత్రం ముందు వివిధ భావనావర్ణచిత్రాలను ఆవిష్కరిస్తాడు. ఇరువురూ మనసుకు ఆనందాన్ని కలిగిస్తారు, తమ నిశ్చలన వర్ణచిత్రాలతో. అయితే ఈ పద్యంలో పెద్దన ‘చలన’వర్ణచిత్ర ఆవిష్కరణ చేశాడు. అంటే ఈ పద్యం ఒక కలర్ సినిమాటోగ్రఫి అన్నమాట. ఆంధ్ర సాహిత్యంలో క్రితం బమ్మెర పోతన మహానుభావుడు ఆంధ్రమహాభాగవతంలో ఈ అద్భుత ప్రక్రియను చూపెట్టాడు, యిక్కడ పెద్దన! పీటమీద కూర్చున్న మనోరమ నిశ్చలంగానే ఉంది. ఆవిడ ముందున్న తెర నెమ్మదిగా క్రిందికిజారుతుంటే తెరవెనుకనున్న మనోరమ పైకిలేస్తున్నభ్రాంతి కలుగుతున్నది ఎదురుగానున్న స్వరోచికి. అలా నెమ్మదిగా పైకిలేస్తున్న మనోరమ యొక్క కొప్పు, తర్వాత ముఖం, తర్వాత మెడ, ఆ తర్వాత కొండలవంటి వక్షోజములు కనిపించాయి అంటున్నాడు పెద్దన. ఆంధ్రమహాభాగవతంలో వామనావతారంలో ‘ఇంతింతై ఎదుగుతున్న వటుడు’ క్రమక్రమంగా ఎదుగుతూ పోతుంటే వెనుకనున్న సూర్యుడు క్రమక్రమంగా క్రిందికి జారుతున్న భ్రాంతి కలిగింది, అలా క్రిందికి జారి జారి, ఎక్కడో ఆకాశాన ఉన్నవాడు ‘గొడుగు’లా శిరస్సు వద్దకు, తర్వాత శిరస్సుకు ‘మణి’గా, చెవులకు ఆభరణంగా, కంఠానికి ఆభరణంగా, బాహువులకు సువర్ణ కేయూరముగా, ముంజేతులకు కంకణంగా, మొలత్రాడుకు ఘంటగా, పాదములకు గజ్జె అందియగా, చివరికి పద పీఠంగా, అంత క్రిందికి జారిపోయాడు సూర్యుడు, నిజానికి సూర్యుడు కదలలేదు, కానీ వామనుడు అంతగా ఎదుగుతుంటే నేపధ్యంలో ఉన్న సూర్యుడు జారిపోతున్న భ్రాంతి కలిగింది. పోతన మహానుభావుడు మరొక అద్భుతమైన ధ్వని చేశాడు ఈ పద్యంలో. శిరస్సున మణిగా, తర్వాత భుజములకు ఆభరణంగా చుట్టూతిరుగుతూ వచ్చి ముంజేతులకు ఆభరణంగా, కటిస్థలం మీద ఘంటగా, పాదములకు గజ్జెల అందెగా, చివరికి పదపీఠంగా స్థిరపడిపోయాడు, అంటే సూర్యుడు కూడా వామనునికి ప్రదక్షిణ చేశాడు, ఎందుకంటే శ్రవణాభరణం అంటే చెవికి అంటే రెండు చెవులకూ ఆభరణంగా, ‘కేయూరం’ బాహుభూషణం అంటే రెండు బాహువులకూ భూషణంగా, రెండు చేతులకూ కంకణంగా, రెండు పాదములకూ గజ్జెల అందియగా అలా చుట్టూ తిరుగుతూ, తాను క్రిందికి క్రిందికి జారిన భ్రాంతి కలిగించాడు సూర్యుడు, తాను నిశ్చలంగానే ఉన్నప్పటికీ, వామనుడు ఎదుగుతున్న కారణంగా. యిది కవిత్వంలో సినిమాటోగ్రఫి చూపించడం, అప్పుడు పోతన చేశాడు, యిప్పుడు పెద్దన చేశాడు, యిద్దరు మహాకవులకు వారసునిగా పుట్టడానికి ప్రతి తెలుగువాడూ ఎంతో పుణ్యం చేశాడు!
కటకరవంబు బోరుకలఁగన్ రమణుల్ తెరచీర వంచినం
దటుకున రాజుమో మెదుటఁ దారసమైన లతాంగి నేత్రముల్
చటులత లజ్జఁ దల్లడిలె జాలరిచే వలఁ బాసి ధాత్రిపై
నటు నిటు మిట్టిమిట్టి పడు నంబుచరంబులఁ బోలె నత్తఱిన్.
వాయిద్యాల ధ్వని ‘బోరు’న మ్రోగుతుండగా తెరను పట్టుకున్న రమణీమణులు చటుక్కున తెరచీర క్రిందికి వంచగానే తటుక్కున స్వరోచి ముఖం ఎదురుపడి, మనోరమకు లజ్జ కలిగి, కనులు అదురుపాటుతో టపటపా కొట్టుకుంటుంటే ఆ చేపకన్నులు జాలరి వలలోంచి నేలమీదికి పడి అటూ యిటూ కొట్టుకుంటూ ఎగిరెగిరి పడుతున్న నిజం చేపల్లానే కనిపించాయి.
అవనీశ త్రిదశేంద్రు చూపుబరి కన్యాగండపాళిద్వయీ
నవలావణ్యరసంబుఁ గొల్లగొని యంతం జెంత ఫాలంపురా
జు విలోకించి చలించి కై కొనిన యా సొమ్మెల్ల ఘర్మాంబుకై
తవ మొప్పన్ వెస డించి తూఱెఁ గబరీతాపింఛ కుంజాంతమున్.
త్రిదశేంద్రుడు అంటే దేవతలకు రాజైన ఇంద్రుడు. భూలోక రాజులలో దేవేంద్రునిలాంటి స్వరోచి చూపులు తనమీదికి ప్రసరించగానే మనోరమకు ప్రేమాతిశయంతో, సంభ్రమంతో, ముచ్చెమటలు పట్టాయి. అది ఎలా ఉందీ అంటే మనోరమ నవలావణ్యరసం అనే నిధిని కొల్లగొట్టడానికి వచ్చిన స్వరోచి చూపులు అనే దొంగలు మనోరమ ఫాలభాగం అనే రాజును చూసి భయపడి నీరుగారిపోతే, ఆ సొమ్మును అక్కడే పారేసి పారిపోతే జారిన చెమటబిందువులేమో అన్నట్లు ఉంది. ‘రాజు’ అంటే చంద్రుడు అని ఒక అర్ధం. నుదుటిని చంద్రవంకతో, ముఖమును చంద్రబింబంతో పోల్చడం కవి సంప్రదాయం, కనుక నుదురు అనే చంద్రుడు అనే రాజును చూసి భయపడిన దొంగలు నీరుగారిపోవడం మనోరమకు నుదుట చెమటలు పోసి, చెమట బిందువులు కారిపోవడంలా ఉంది అంటున్నాడు పెద్దన!
రాజుచూడ్కి కపుడు రాజీవముఖి
చూడ్కులెదురుకొనియె లజ్జఁ గొదికి కొదికి
జడిసి జడిసి జహ్ను సంభవాంభోవేణి
కెదురు లెక్కు మీల కొదమ లనఁగ.
అప్పుడు రాజుచూపులను మనోరమచూపులు ఎదుర్కొన్నాయి. నిరంతరంగా, నిర్నిమేషంగా గంగాప్రవాహంలా జాలువారుతున్న స్వరోచి చూపుల ప్రసార ప్రవాహం తనను ముంచెత్తుతుంటే, అప్పుడప్పుడు, మధ్యమధ్య, అదురుతూ అదురుతూ, చూసీ చూడనట్లు చూస్తున్న మనోరమ చూపులు గంగా ప్రవాహానికి ఎదురీదుతున్న చేపల్లా ఉన్నాయి, కండ్లు ఎలాగూ చేపల్లానే ఉన్నాయి!
తనుమధ్యత్రివళుల్ నటింప నిలమీఁదన్ మట్టియల్ మోవఁగాఁ
గనుపాపల్ పయిఱెప్పలం గదియ నుత్కంఠాగ్రయై నిక్కి నా
థునిమౌళిం దలఁబ్రాలు వోసె నవలా దోర్మూలకూలంకష
స్తనవిస్ఫూర్తికి సందిదండలధళల్ సాహోనినాదం బిడన్.
ఉండీ లేనట్టున్న నడుము మీద ముచ్చటగా’ఉన్న’ మూడు ముడుతలు ఊగిపోతుండగా, కాలివ్రేళ్ళ మెట్టెలు నేలమీద ఆనించి, కనుపాపలు పైరెప్పలకు తాకేలా మెడను నిక్కించి పైకి లేచి, నాథుని తలమీద తలంబ్రాలు పోసింది మనోరమ. అలా మెడ పైకి నిక్కించి, బాహువులు పైకెత్తి స్వరోచి శిరస్సుమీద తలంబ్రాలు పోసేప్పుడు బాహుమూలములను ఒరుసుకుంటూ తమ వైశాల్యాన్ని చాటుతున్న ఆమె స్తనముల సిరికి ఆమె సందిదండలకున్న ఆభరణాల తళతళలు ‘సాహో’నినాదాలు చేశాయి, మెచ్చుకోళ్ళు పలికాయి.
ముడివడుకంకణప్రభల ముత్తెపుసేసలు దోయిలించి యె
త్తెడుతఱి బాహుమూలకుచదీప్తులపైఁ బతిదృష్టి పర్వినం
బొడమిన లజ్జఁ బాణియుగమున్ వెస వంచియె మౌళిమీఁదికై
పొడవునఁ జల్లె లేనగవు పొల్తుక ఱెప్పల నప్పళించుచున్.
చేతి కంకణాల మెరుపులతో ముత్యాల తలంబ్రాలను దోసిలిలోకి తీసుకుని, చేతులు పైకెత్తి స్వరోచి తలమీద తలంబ్రాలు పోసేప్పుడు తన బాహుమూలములపై, తన వక్షోజములపై ప్రసరిస్తున్న స్వరోచి చూపులను గమనించి, లేతనవ్వులమొలకలను కంటి రెప్పల్లో అదిమిపెట్టి, నోటితో కాకుండా కళ్ళతోనే నవ్వులు, కామునికి స్వాగతపూర్వకంగా చూపుల పువ్వులు రువ్వుతూ, చేతులు పైకెత్తకుండానే తలంబ్రాలను పైకి, స్వరోచి తలమీదకు ఎగచిమ్మింది మనోరమ.
సకల క్ష్మాపతి యిడఁ గొ
మ్మ కచంబులనుండి రాలె మౌక్తికములు సా
త్త్విక జనిత గండ ఘర్మాం
బు కదం బాసార గరిమఁ బునరుక్తములై.
సకలధరణీనాథుడు ఐన స్వరోచి మనోరమ తలమీద తలంబ్రాలు పోసినప్పుడు ఆమె కురులమీద నుండి ఆ ముత్యాల తలంబ్రాలు క్రిందికి జారాయి. వాటితోపాటే మనోరమకు మన్మథ భావం, లజ్జ వలన కలిగిన చెమటబిందువులూ క్రిందికి జారాయి. ముత్యాలలాగా తళతళలాడుతున్న ఈ చెమటబిందువులు తాము కూడా క్రిందికి జారుతుంటే ముత్యాల తలంబ్రాలు మరలమరలా జారుతున్నాయి అన్నట్లుంది చూడడానికి.
పతి సతిపై నిడు ముక్తా
వితతి పడం దొడఁగె వడి భవిష్యత్పురుషా
యిత నిర్దయ రతి రభస
చ్యుత సిత కబరీ ప్రసూన సూచక మగుచున్.
పతి ఐన స్వరోచి తన సతి ఐన మనోరమ శిరస్సు మీద పోసిన ముత్యాల తలంబ్రాలు ఆమె శిరస్సు మీదినుండి వేగంగా క్రిందికి జారిపోతుంటే రాబోయే రోజుల్లో ‘నిర్దయగా’ ‘ఉపరతి’ చేస్తున్న మనోరమ కేశములనుండి ఆ ఉదుటుకు జారిపడనున్న తెల్లని పూలకు సూచనలలాగా ఉన్నాయి!
కట్టెన్ మంగళసూత్రమున్ శరధి శంఖ శ్రీలకున్ బొమ్మలం
గట్టం జాలెడు కంఠపీఠి నిఖిల క్ష్మాభర్త శోణద్యుతుల్
దట్టంబై నఖకోరకోత్కరము తద్గ్రైవేయ హైమ స్ఫుర
త్పట్ట స్థాపిత పద్మరాగముల పంతంబుల్ విడంబింపఁగాన్.
సముద్రపు శంఖాలను ధిక్కరించే మనోరమ కంఠమునకున్న సువర్ణ హారంలోని పద్మరాగ మణులను ధిక్కరించే ఎర్రని కాంతులను విరజిమ్ముతున్న నఖముల ప్రభలను వెలువరిస్తున్న చేతులతో, ఆ కంఠమునకు మంగళసూత్రాన్ని కట్టాడు ఈ స్వరోచి.
అట్టియెడఁ బెండ్లిపనులన్
దిట్ట లగు పురంధ్రు లచట నిలిపిరి వహ్నిం
బెట్టిరి మణిపీఠి సురీ
పట్టముపైఁ బఱచి రందుఁ బతియును సతియున్.
ఆ సమయంలో, పెళ్లి పనులలో దిట్టలైనవారు, వివాహతంతులో దేని తర్వాత దేనిని జరిపించాలో, ఎలా జరిపించాలో తెలిసిన పురంధ్రీమణులు, ముత్తైదువలు అక్కడ హోమగుండాన్ని ఏర్పాటు చేయించారు, మణులు పొదిగిన పీటలను వేశారు, ఆ పీటలమీద మంచి పట్టువస్త్రాన్ని పరిచారు, మనోరమా స్వరోచులను కూర్చుండబెట్టారు.
ఆశు ద్విజ హుత హరిత శ
మీ శాఖా శకల నినద మేదుర విశదా
భీశు జ్వాలా జాల హు
తాశ క్రోడమున వేల్చి రాహుతు లెలమిన్.
ఆ వెంటనే బ్రాహ్మణులు హోమగుండాన్ని అమర్చి, పచ్చని చివుళ్ళున్న శమీవృక్ష సమిధలను ఆహుతి చేయగా, ఆ సమిధలు చేస్తున్న చిటపటల ధ్వనులతో నిండి, ప్రకాశవంతంగా ప్రజ్వరిల్లుతున్న అగ్నిలో మనోరమా స్వరోచులు ఆహుతులు ఇచ్చారు. ‘ఆహుతులు’ అంటే అగ్నిలో వేసే పదార్థాలు, సమిధలు, నెయ్యి మొదలైనవి. ‘ఆహూతులు’ అంటే ఆహ్వానింపబడినవారు. నూటికి తొంభై తొమ్మిది సభలలో వక్తలు ‘ఆహుతులకు స్వాగతం’ అని అనడం వింటూనే ఉంటాము, తెలుగుభాషకు తెలుగువారు ఇస్తున్న శ్రద్ధ అలా ఉంది మరి!
తోయజామోద లాజలు దోయిలించి,
ప్రమదమున వేల్వ నొకకొన్ని చెమటనంట
వ్రేళ్ళు గనుపట్టెఁ గెంజాయ వీతిహోత్త్రు
నాలుకలు సాటిరాకున్న నవ్వెననఁగ.
తోయజము అంటే నీళ్ళలో పుట్టినది అంటే పద్మము, శంఖము, శ్రీమహాలక్ష్మి మొదలైనవి. తోయజామోద ఐన మనోరమ అంటే పద్మములచేత పరిమళములోనూ, శ్రీమహలక్ష్మిచేత అందములోనూ, మంగళగుణములలోనూ , శంఖములచేత కంఠము యొక్క ఆకృతిలోనూ మధురమైన ధ్వనిలోనూ ఒప్పుకొనబడిన మనోరమ లాజలు(పేలాలు) అగ్నిలో వేస్తున్నపుడు, ఆమె నిలువెల్లా శృంగార, మదన భావంతో చెమటలు పట్టి ఉన్నాయి కనుక, అరచేతిలో చెమటలతడి ఉన్న కారణంగా కొన్ని లాజలు ఆమె చేతులకే అతుక్కునిపోయాయి. ఆ అతుక్కున్న లాజలు నవ్వుతూ అగ్నిహోత్రుడితో ‘నీ ఎర్రదనం ఈ మనోరమ అరచేతుల ఎర్రదనానికి సాటి రావడంలేదు’ అని, మనోరమ అరచేతులకే అతుక్కుపోయి ఉన్నట్లు ఉన్నాయి! ఎన్నెన్ని భవ్యమైన భావనలు, ఎన్నెన్ని కమనీయమైన కల్పనలు, ఎన్నెన్ని వరనీయమైన వర్ణనలు!
స్తనగుళుచ్ఛ వధూ దేహదాడిమీ ల
తామతల్లికపై హోమ ధూమ మడరె
భర్త కభిమత రతిమహా ఫలవిపాక
మగుటఁ గోరి ఘటించుదోహద మనంగ.
హోమం చేస్తుంటే, గుత్తులవంటి స్తనములున్న మనోరమ దేహము అనే దానిమ్మ తీగకు ఆ హోమధూమము అలుముకుంటున్నది. ఆ మనోరమ దేహం అనే దానిమ్మ తీగకు ‘పొగతో’ దోహదక్రియ చేసి, ఫలించేట్లు, పుష్పించేట్లుచేసి, ఆమె భర్తకు ఇష్టమైన ‘రతిమహాఫలము’ను అంటే శృంగార క్రీడాపరంగా రతి పారవశ్యంలోని మహానందాన్ని, సంతృప్తిని, దంపతుల రతికి ఫలం ‘సత్సంతాన’ ఫలం కనుక, ఆమెతో సలిపే రతికి ఫలంగా భావి మనువైన మహానుభావుని ప్రసాదించడానికి చేస్తున్న దోహదక్రియలాగా ఉన్నది! ఆకాలంలో పుష్పించడానికి, ఫలించడానికి తీగలకు, వృక్షములకు చేసే ఉపచారములను దోహదక్రియలు అంటారు, దానిమ్మకు చేసే దోహద క్రియలలో పరిమళద్రవ్యముల ధూమం వేయడం ఒకటి.
జగతీనాథవతంస మానతశిరస్సమ్మేళనన్ నెయ్యపుం
జగడంబుల్ ప్రియమొప్ప మాన్పెడుతఱిం జంచత్కిరీటాగ్ర ర
త్నగణ స్పర్శసహంబు గావలసియో నాఁ గోర్కిదైవాఱ న
మ్మగువం బాదతలంబు వట్టి సనెకల్ మట్టించె మోదంబునన్.
ఆ తర్వాత సన్నెకల్లు త్రొక్కించారు. రాబోయే రోజుల్లో ఒకవేళ దంపతులమధ్య ప్రణయకలహం కలిగితే, ఆ కలహానికి ‘రాజీబాట’లో ఆమె పాదాలమీద తన శిరస్సును తాకించినపుడు ఆ శిరస్సుకున్న కఠినములైన రత్నాలు, మణులు రాసుకునిపోయి కోమలమైన ఆ పాదాలు కందిపోవడం, బాధపడడం జరుగుతుంది కనుక ఆ బాధను సహించి ఓర్చుకోవడాన్ని నేర్చుకోవడానికి యిలా సన్నెకల్లు తొక్కించడం అన్నట్లు స్వరోచి మనోరమ పాదమును పట్టుకుని కఠినంగా ఉన్న సన్నెకల్లు రాతిని త్రొక్కించాడు.
కడునవ్వించుచుఁ జెఱఁగులు
ముడివెట్టన్ బేరఁటాండ్రు ముదిత కనుబొమల్
ముడివెట్టె నాలిసిగ్గున
ముడివెట్టెన్ నారి చెఱకు మోసున మరుఁడున్.
ఇక పేరంటాళ్ళు పరిహాసాలాడుతూ, ఆటపట్టిస్తూ ఆ ఇద్దరి చెంగులు ముడిపెట్టారు, పైకి చిరుకోపాన్ని నటిస్తూ లోపలి సంతోషానికి ఆనందపు పులకలు ఘటిస్తూ మనోరమ ‘నాలి’సిగ్గుతో కనుబొమలు ముడిపెట్టింది, దొరికిందిరా మన ప్రతిభను చూపించే అవకాశం అని మన్మథుడు తన చెరకువింటినారిని ముడిపెట్టాడు అంటూ అల్లసాని పెద్దన ‘స్వారోచిష మనుసంభవం’లో తన అనన్యసాధ్యమైన చతురవచోనిధిమూటలను ముడిపెట్టాడు!
(కొనసాగింపు తరువాయి సంచికలో)
***వనం వేంకట వరప్రసాదరావు