ఒత్తిళ్ళు - భమిడిపాటి ఫణిబాబు

stress

ఈ రోజుల్లో ఎక్కడ విన్నా, ఏ వార్తాపత్రికల్లో చూసినా, ఒకటే మాట—జీవితంలో ఒత్తిళ్ళు తట్టుకోలేక ప్రాణం తీసికున్నారని.  ఇంకో చిత్రం ఏమిటంటే,  వయసులో చిన్నవారే వీటికి ఎక్కువగా బలైపోతూండడం. పైగా ఏమైనా అంటే, “ మీకేమిటండీ, మీరోజుల్లో ఏవైనా ఒత్తిళ్ళా ఏమిటీ, ఈరోజుల్లో అసలు జీవితం అంటేనే ఒత్తిళ్ళ పుట్ట ...”అంటూ జ్ఞానబోధ ఒకటీ , అక్కడికేదో ఇదివరకటి రోజుల్లో అందరికీ జీవితం అంటేనే వడ్డించిన విస్తరిలా ఉన్నట్టూ, ఏ చీకూ, చింతా అసలే లేనట్టూ, రికామీగా గడిపేసినట్టూ మాట్టాడడం అందరికీ ఓ ఫాషన యి పోయింది . అలాగని ఈ రోజుల్లో లేవనికావు, అప్పుడూ ఉండేవి, ఇప్పుడూ ఉంటున్నాయి, తేడా అల్లా ఎక్కడొచ్చిందంటే, ఆరోజుల్లో ఒత్తిళ్ళు ఎదుర్కోడానికి మనుష్యుల్లో ఒక “ ఓర్పు “ లాటిదుండేది, కానీ ఈ రోజుల్లో ప్రతీదీ క్షణంలో తీరిపోవాలనే , “ అసహనం “ కొంచం ఎక్కువ పాళ్ళలో కనిపిస్తూంటుంది. ఫలితం—ప్రపంచంలో , ఆత్మహత్య లకి మన దేశం, రెండో స్థానం లో ఉండడం ! అదీ ప్రస్థుత దురదృష్టకరమైన పరిస్థితి.

అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందిటా ? అంతా స్వయంకృతమే అనడంలో సందేహం లేదు. ఈరోజుల్లో ఎక్కడచూసినా పోటీప్రపంచం. మన దగ్గరెంతుందీ అనికాదు, అవతలివాడిదగ్గరెంతుందీ అనే ప్రశ్న ! ఇంక ఆ అవతలివాడిదగ్గరున్నది సాధించేవరకూ ఎక్కడలేని పోటీ, దేనికైనా తెగించేయడం. దానికి సాయం సినిమాలూ, టీవీల్లో సీరియళ్ళూ చూసేసి, మనం కూడా తమలో వాటిల్లోని హీరోలని ఊహించేసికుని, మనం మాత్రం ఏం తక్కువా, అనుకోడం.  మనవేమైనా సినిమాలూ, సీరియళ్ళా ఏమిటీ, జీవితాలండి బాబూ. ఆ విషయం మాత్రం ఛస్తే గుర్తుకు రాదు. తీరా గుర్తుకొచ్చేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోతుంది. బయట పడలేక, తెలిసిన ఒకే ఒక దారి— క్షణికావేశంలో  ఆత్మహత్య చేసికోడం. చేసికున్నవాడో, చేసికున్నదో, బాగానే ఉంటారు, వచ్చిన గొడవల్లా ,వారికి సంబంధించినవారికే.

ఈరోజుల్లోనే ఒత్తిళ్ళు ఎక్కువ అని అపోహ పడేవాళ్ళందరూ ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతారు. ఇదివరకటి రోజుల్లో దేనికైనా ఓ ప్రణాలిక లాటిదుండేది. తనకున్న దానిలో బతకడం, ఏదో అత్యవసరం అయితే తప్ప “ అప్పు “ చేయకపోవడమూనూ. కొడుక్కో, కూతురికో, ఆర్ధిక స్థోమత లేకపోతే, డిగ్రీ కాకుండా, ఏ డిప్లొమాలానో చేర్పించేసేవారు. అక్కడకి డిగ్రీయే గొప్పా, డిప్లొమా తక్కువా అనే భావం ఉండేది కాదు. అలా ఉండుండకపోతే, మరి అన్నేసి పోలిటెక్నిక్కు కాలేజీలు ఎందుకొచ్చేయంటారూ? కానీ , ఈ రోజుల్లో చూడండి, తల తాకట్టు పెట్టయినా సరే కొడుకో, కూతురో తప్పకుండా ఇంజనీరో, డాక్టరో అవాల్సిందే. దానికోసం ఎంత అప్పయినా సరే.  మనలోని ఈ బలహీనత నే, ఆయాకాలేజీల యాజమాన్యం సొమ్ముచేసికుంటోంది. లేకపోతే, పేమెంటు సీటుకి లక్షల్లో ఫీజులేమిటీ ?

 అలాగే ఉదాహరణకి, ఇదివరకటి రోజుల్లో, ఓ ఇల్లు కట్టాలంటే, కొన్ని సంవత్సరాలు పట్టేది. ఒక్కోప్పుడైతే, పునాదులు వేసేసి కూర్చునేవారు, చేతిలో ఎప్పుడు డబ్బుంటే అప్పుడే చూసుకోవచ్చులే అనుకుని. అందుకేనేమో ఆ రోజుల్లో పునాదులు ఎండకీ, వానకీ సంవత్సరాల తరబడి తట్టుకుని, కట్టిన ఇల్లు అంత గట్టిగా ఉండేది. అలాగే ఇంట్లోకి ఓ వస్తువు కొనాలన్నా,  డబ్బులు విడిగా దాచుకుని, కొనుక్కునేవారు. కానీ ఈ రోజుల్లో, మన మనస్సుల్లో ఓ ఇల్లూ, కారూ కొనుక్కోవాలని సంకల్పం చేసికోవడం తరవాయి, ఎలా తెలుస్తుందో ఏమిటో, ఏ బ్యాంకువాడో, ఫైనాన్సు వాడో తక్షణం ప్రత్యక్షం అయిపోతాడు. వాడు ఎక్కడ పెట్టమంటే అక్కడే ఓ పదిపదిహేను పేజీలమీదా సంతకాలు చేసేసి, మన “ మరణ శాసనం “ మనమే తయారుచేసేసికోడం ! ఒక్కళ్ళేనా, వాటిలో వ్రాసిన Terms and conditions  చదివిన పాపాన పోయారంటా రా?  అసలు ఆ అక్షరాలే కనిపించి చావవూ. పోనీ కనిపించినా, వాటిని చదివి అర్ధం చేసికునే ఓపికా, సహనమూ ఉండొద్దూ ?

ఈ రోజుల్లో “ అప్పు “ చేయాలనే సంకల్పం ఉండాలే కానీ, ఇవ్వడానికి కావాల్సినన్ని సంస్థలు ఉన్నాయి. కానీ ఆరోజుల్లో ఏ తాకట్టు వ్యాపారో, లేదా బాగా డబ్బున్న భూస్వామో మాత్రమే దిక్కు. పైగా అయినదానికీ, కానిదానికీ అప్పులు చేసేవారు కాదు. చేసినా చక్రవడ్డీ, బారువడ్డీ లాటివి, ప్రాణం మీదకొచ్చేవి. తండ్రి ఇచ్చే ఆస్థి మాటెలా ఉన్నా, “అప్పులు” వదిలివెళ్ళకపోతే అదే మహాభాగ్యం అనుకునే రోజులు. కానీ, ఈ రోజుల్లో ఎంత ఎక్కువగా అప్పు చేస్తే, సమాజంలో మన so called status  అంతగా పెరుగుతుంది. అప్పులైతే చేశారండీ, కానీ వాటిని తీర్చడానికి  ఓపి కోటి కూడా ఉండాలిగా. అదే కరువయిపోతోంది.  ఆరోజుల్లో అథవా ఏదైనా ఆర్ధిక బాధలు ఉన్నా కానీ, బంధువుల్లో ఎవరో ఒకరు సహాయం చేయడానికి ముందుకొచ్చేవారు, ఆనాటి సంబంధబాంధవ్యాల మూలంగా. కానీ ఈరోజుల్లో బంధువుల మాట దేముడె రుగు, కన్నవాళ్ళతోనే సంబంధాలు అంతంతా ! ఇంక బంధువులు అనే మాటే డిక్షనరీలో మాయం అయిపోయింది. మొగుడికి పెళ్ళామూ, పెళ్ళానికి మొగుడూ కే పరిమితం అయిపోయింది. ఏదైనా సమస్యొచ్చిందంటే, మరి వీళ్ళిద్దరేగా, ఇద్దరూ కలిసి ఏ పురుగు మందో త్రాగడం, లేదా ఏ బహుళ అంతస్థు లోంచో దూకేయడం.  ఒకలా చెప్పాలంటే, టెక్నాలజీ ధర్మమా అని కూడా, ఈరోజుల్లో ప్రతీ విషయమూ కూలం కషంగా తెలిసికోవడం అనేది కూడా ఓ కారణం. ఇదివరకటి రోజుల్లో ఏదైనా రోగం వచ్చిందంటే, ఆ ఊళ్ళో ఉండే డాక్టరుగారే దిక్కు. కానీ, ఇప్పుడో కొడుకో, కూతురో తుమ్మిందన్నా, దగ్గిందన్నా, వెంటనే అంతర్జాలం లోకి వెళ్ళి గూగులమ్మ ని అడగడం. ఆవిడేమో, ప్రపంచంలో దగ్గుకీ, తుమ్ముకీ సంబంధించిన కారణాలూ, వాటి ప్రభావాలూ వగైరా ఏకరువుపెట్టేస్తుంది. ఆవిడకి తెలిసినదేదో చెప్పింది, ఆవిడ మాత్రం ఏం చేస్తుందీ ? ఆ చూసేవాళ్ళకైనా బుధ్ధుండొద్దూ? మనమేమైనా డాక్టర్లా ఏమిటీ ,పోనీ వాటికేమైనా వైద్యం తెలుసునా అంటే అదీ లేదూ, నెత్తీ నోరూ బాదుకోడం. నిజమే ఇదివరకటిలా కాకుండా, ఈరోజుల్లో టెక్నాలజీ ధర్మమా అని అన్నీ తెలుస్తున్నాయి, మంచిదే. కానీ దేనికైనా ఓ లిమిట్ ఉండాలి. ఇంకో విచిత్రం, ఆరోజుల్లో ఓ బిడ్డ తల్లి గర్భంలోంచి రావాలంటే, ఊళ్ళో ఉండే ఏ మంత్రసానో చూసుకునేది. పండంటి బిడ్డని మనచేతిలో పెట్టేసి, ఇచ్చినదేదో సంతోషంగా తీసికెళ్ళేది. కానీ ఈ రోజుల్లో , ఎంత పెద్ద ఆసుపత్రిలో చేర్పిస్తే అంత గొప్ప. నూటికి కనీసం అరవై మందికి అదేదో “సిజేరియన్ “ చేసి బిడ్డల్ని బయటకి తీయడమే. పైగా అదో status symbol గా మారిపోయింది. వీటన్నిటికీ అయే ఖర్చు తడిపి మోపెడవడం. చెప్పొచ్చారులెండి, వాటికేమీ మనకు పైసా ఖర్చవదూ, అంతా ఇన్స్యూరెన్సు వాళ్ళే చూసుకుంటారూ, అనే వాళ్ళూ ఉన్నారు. కానీ నేను చెప్పేది అలాటి మహామహుల గురించి కాదు, వీళ్ళని చూసి అదే కార్పొరేట్ ఆసుపత్రిలో తన భార్యని చేర్పించే, అర్భకుడి  గురించి. చివరకి మిగిలిందేమిటంటే, బిడ్డ పుట్టడమే “ అప్పు “ తో. వాడి నాన్న చేసినా, వాడు  చేసినా అప్పు అప్పేగా ! అదృష్టం బాగోలేకపోతే వీడేగా తీర్చేదీ ?

ఈ రోజుల్లో “ఒత్తిళ్ళ “ కి ముఖ్యకారణం  communication gap. అసలు కమ్యూనికేషనే లేనప్పుడు, ఇంక గ్యాప్పు మాటేమిటీ? ఎవరైనా పెద్దవారిని సలహాఅడిగితే, ఆయన ఏదో చెప్పొచ్చు. కానీ, మనమే తెలివైనవారిమనీ, అవతలి వారు ఎంత పెద్దవారైనా, వాళ్ళకేం తెలుసూ, అంతా చాదస్థమూ అనుకుంటే ఎవరేం చేస్తారూ? ఉదాహరణకి ఉద్యోగంలో చేరీచేరగానే ఇల్లూ, కారూ అంత అత్యవసరాంలోకి రావు. ఇంట్లో ఉండే ఏ పెద్దవారినో అడిగారనుకోండి, “ ఓ రెండుమూడేళ్ళాగరా, లేదా అదేదో “ ఆన్ సైట్ “ కి వెళ్ళి నాలుగు డబ్బులు కూడబెట్టూ ..” అంటారే కానీ, ఏ తండ్రీ తన కొడుకు బాగుపడద్దని అనుకోరు. ఇలాటి సలహాలు మనకి నచ్చవాయె.

ఇన్నేసి గొడవలుండగా, మరి జీవితమంతా ఒత్తిళ్ళే అంటే, మరి ఉండవంటారా? అప్పటికీ, ఇప్పటికీ తేడా ఎక్కడ వచ్చిందయ్యా అంటే, వాటిని ఎదుర్కునే పధ్ధతిలోనే. ఆ సత్యం గుర్తించిన రోజు, ఈ తరం వారుకూడా హాయిగా ఉంటారు.

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి