‘బాపు’ మరణించడు! - వనం వేంకట వరప్రసాదరావు

bapu maranimchadu

‘తెలుగునాడి’ని మీటి సరసపు సప్తస్వరాలను పలికించినవాడు, నవనవోన్మేషమైన నవరసాలను ఒలికించినవాడు బాపు. ఈ రోజు  భూమి మీద  ఉన్న ప్రతితెలుగువాడికీ నవ్వడం నవ్వించడం నేర్పినవాడు బాపు. తన ఆధ్యాత్మిక వర్ణచిత్రాలతో తెలుగుదనం వుట్టిపడే భారత ఆధ్యాత్మిక అంతరాత్మను అందంగా అలంకరించి ఆవిష్కరించినవాడు బాపు.

తన సామాజిక రేఖాచిత్రాలతో తెలుగు గ్రామీణ జీవన సౌందర్యాన్ని, తెలుగమ్మాయిల కట్టు బొట్టు బెట్టుల గుట్టుమట్టులను రసవంతంగా రట్టు చేసినవాడు బాపు. ‘బాపు’లాగా తెలుగువారి  నిత్య జీవితంలోకి దారిచేసుకుని చొచ్చుకుపోయి, తిష్ఠవేసుకుని కూర్చుని, గుండెల్లో నిలిచిపోయిన కళాకారుడు మరొకడు లేడు! కొద్దిగా సరసం, హాస్యం, చమత్కారం, శృంగారం తెలిసిన ప్రతి తెలుగువాడు రోజుకొక్కసారైనా బాపును గుర్తుచేసుకోకుండా ఉండలేడు, రెండు జడలేసుకున్న ప్రతి అమ్మాయీ రెండు జెళ్ళ సీతే, తెలుగు లోగిళ్ళలో అల్లరి గడుసు గడుగ్గాయిలందరూ ‘బుడు’గ్గాయిలే, ముచ్చటగా ముద్దులొలికే ప్రతి పసిపిల్లా సీగానపెసూనాంబే, ఈ పాత్రలకు ప్రాణం పోసి ‘నిలబెట్టిన’ కేశవుడు బాపు, వీటిని పుట్టించినవాడు ముళ్ళపూడి ‘బ్రహ్మ’, ముళ్ళపూడి ఆత్మ, బాపు అంతరాత్మ! అందంగా ఉన్న ప్రతి తెలుగమ్మాయి బాపు బొమ్మ, తానున్నా లేకున్నా తన పేరు వింటేనే ప్రతి తెలుగు గుండెలో ఆనందపు చెమ్మ! 

బాపు రేఖాచిత్రాలలో, వర్ణచిత్రాలలో, చలనచిత్రాలలో దుర్మార్గుడు కూడా ముద్దొస్తాడు, మురిపిస్తాడు, ‘అవున్లే, అందరూ దేవుడు చేసిన బొమ్మలేగా’ అనిపిస్తాడు! చేతికర్ర లేని జాతిపిత ‘బాపు’ని, ముగ్గుకర్ర లేని ‘బాపు’ తెలుగు బొమ్మని ఊహించుకోలేము! తెలుగువాడికి రాముడు ఎలాఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో, సీత ఎలా వుంటుందో, హనుమంతుడి భక్తి పారవశ్యం ఎలా ఉంటుందో కళ్ళకు ‘కట్టి’ చూపించినవాడు బాపు! కొన్ని ‘ఛెళ్ళు’మనే చురకలు, కొన్ని ‘భళ్లు’మనే జీవన సత్యాలు, కొన్ని ‘పకపక’లు, కొన్ని ‘కితకిత’లు, కొన్ని ముసిముసి నవ్వులు, కొన్ని ‘కిసుక్కులు’, కొన్నిటికి తియ్యని  తిమ్మిరి ‘కసె’క్కులు, కొన్ని సరసపు నవ్వులు, కొన్ని శృంగారపు నవ్వులు, వెరసి ‘బాపు’ కార్టూన్ తోటలో నవరసాల నవ్వులపువ్వులు! 

కార్టూనిస్టుగా వంకలు, వంకరలు లేని తిన్నని సన్నని గీతలతో వంకరటింకర మనుషులను, వింత మనస్తత్వాలను సున్నితంగా విమర్శించి నవ్వించినా, చిత్రకారుడిగా సుందర మూర్తులతో రంజింపజేసినా, చలనచిత్రకారుడిగా తక్కువ మాటలతో ఎక్కువ భావాలను పలికించి, ఆలోచింపజేసినా, బాపు ప్రధాన వస్తువు వ్యక్తి, కుటుంబం, గృహజీవన నేపధ్యం, వాటిలోనుండి పుట్టిన సున్నితమైన సంఘర్షణలు, అంతర్లీనంగా సరసంగా బలహీనతల సంస్కరణలు! 

మౌనంగా పరిశీలించే తాత్త్విక దృష్టి బాపు ప్రతి సృజనలోను కనిపిస్తుంది, ఏ రంగంలోనైనా సరే! బాపు చలనచిత్రాలలో పాత్రలు చాలా తక్కువగా  మాట్లాడతాయి, మాట్లాడిన కొన్ని మాటలూ క్లుప్తంగానే మాట్లాడతాయి, కళ్ళతోనే మాటలు కూడా పలికించలేని అనంతమైన భావాలను అందంగా ఒలికిస్తాయి. బాపు వర్ణచిత్రాలు రేఖాచిత్రాలు కార్టూన్ చిత్రాలు కూడా కనులతో ప్రధానంగా, శరీర భంగిమ, ముఖ కవళికలద్వారా గ్రంధాలకొద్దీ సరిపోయే భావాలను కురిపిస్తాయి, కలిగిస్తాయి. బాపు కార్టూన్లలో కూడా కాప్షన్ తీసేసినా హాస్యరసంలో ఒక్క బొట్టుకూడా తగ్గదు. మౌనంగా మాట్లాడే భాష మనసును కదిలిస్తుంది, కనుకనే బాపు ప్రతిప్రక్రియా మనసులో నిలుస్తుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది.

రాముడినీ, కృష్ణుడినీ కొలిచేవాళ్ళున్నంత కాలం, రసికులు ఉన్నంతకాలం, నవ్వడం తెలిసినవాళ్ళు ఉన్నంత కాలం, నవ్వులున్నంత కాలం బాపు బ్రతికే ఉంటాడు, సత్తిరాజు లక్ష్మీనారాయణగా భౌతిక శరీరాన్ని త్యజించినా, మహోన్నత కళాకారుడు  ‘బాపు’ మరణించడు!   

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి