ఎక్కడున్నావూ - కర్రా నాగలక్ష్మి

where are you

కలియుగ వైకుంఠమ్, పిలచిన పలికేదైవం, ఆపద మొక్కుల వాడు, వడ్డికాసులవాడు అని పిలువ బడే వేంకటేశ్వరుని సన్నిధి లో జరిగే మోసాలు, అన్యాయాల గురించి ఇప్పటికే  చాలామంది రాసేరు . అయినా నేను రాయకుండా ఉండలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఎవరైనా భాద్యత గల ఆఫీసర్లు ఈ వ్యాసం చదవి చర్య తీసుకుంటారనే ఆశే .

రూము, కళ్యాణం టిక్కెట్లు  నెట్ లో బుక్ చేసుకొని తిరుమల చేరేం. అక్కడ నుంచి మాకు చెయ్యి జాపి అడుక్కొనే బిచ్చగాళ్ళు  ఎదురవ్వటం మొదలయ్యింది. ఈ చెయ్యి జాపుడు గాళ్ళు దానికి పెట్టిన పేరు " మీ సంతోషం ". మరి మనము అలాగే అందాం.

i-d చూసి రూము అలాట్ చేసే ఉద్యోగులకి పాపం ఏ సంతోషం లేదు.  కాని తాళాలు ఇచ్చే ఉద్యోగి, స్వీపర్లు, కళ్యాణ మండపంలో ఉండే అటెండర్, ఉత్తరీయం జాకెట్ బట్ట ఇచ్చే ఉద్యోగి ,కల్యాణ మండపంలోని అర్చకులు, స్వామి కి ఎదురుగా క్యూ ని నియంత్రించే ఉద్యోగులు, పూజారులు, బయట తీర్థ , శఠగోపం పెట్టే పూజారులు, అందరికి చెయ్య జాపుడు "సంతోషం" అలవాటు. మరి ఇన్ని కెమేరాల కళ్ళు వీళ్ళు  కప్పు తున్నారా? సంబంధిత అధికారులు నిద్ర పోతున్నారా?

కళ్యాణం జరుగుతున్నప్పుడు మా అజాగర్త వల్ల కళ్యాణం రశీదు పోగొట్టు కోవటం జరిగింది. అక్కడ అంతా వెతికేము. ఇటు అటు ఉన్నవారిని కుడా అడిగేము ఎవ్వరు చూడలేదుట, కాని మేము ప్రసాదాల కౌంటర్ చేరకముందే మా రసీదు అక్కడకి వెళ్లి పోయింది. మా ప్రసాదం ఇవ్వబడింది. అంటే భక్తులు స్వామి దర్శనంతో పాపాల అకౌంట్ నిల్ అయ్యిందే అని భయపడి కొత్త అకౌంట్ బోణి చేసేరేమో ? మీకు కూడా అలాగే అనిపిస్తోందా? మా మీద దయ తలచిన అధికారి మాకు ప్రసాదం మా రూము కి అందజేస్తామని  చెప్పి టంచనుగా చెప్పిన సమయానికి రెండు పెద్ద లడ్లు, ఒక వడ, ఒక తీర్ధం బాటిల్ ఇచ్చి రు. 200/- ....సంతోషం పొందేరు

ఇంతటితో ఈ సంతోషం పూర్తి కాలేదు .

జోళ్ళ స్టాండులో ఒక చోట జోళ్ళు పెట్టుకొని మరో చోట తీసుకోవాలి .ఆ జోళ్ళు తీసుకొనే జాగా ఎక్కడ ఉందో ఏడాదికి ఒకమారు వెళ్ళే వాళ్లకి ఎలా తెలుస్తుందనుకుంటారో రోజుకో మార్పు చేసే అధికారులే చెప్పాలి. కల్యాణం చేయించుకొని దర్శనం అయి, బయట పడ్డ భక్తులకి జోళ్ల కౌంటర్లు ఎక్కడ ఉన్నాయో వెతుక్కొని వెళ్ళిన తరవాత అక్కడి ఉద్యోగి "సంతోషం " అడిగితె తన్న బుద్ది వేస్తుంది కాని మనకి ఏ సంతోషం వెయ్యదు .అయినా భక్తుల సంతోషం ఎవరికి కావాలి?

అప్పటికి సాయంత్రం 4గం..అయింది ఇంక ఓపిక లేక ప్రైవేటు టాక్సీ ఎక్కితే తిరుమలలో ఎక్కడి కైనా రు.100/-. సరే మా అవసరం అలాగే ఎక్కేం .టి.టి.డి  ట్రాఫిక్  పోలీసు టాక్సీ ని పక్కన పెట్టించి .....బూతులు తిట్టి టాక్సీ అతని దగ్గర డబ్బు తీసుకొని 'ఒరే అటుపక్క పోకు పెద్దాయన డ్యుటీ లో ఉన్నాడు మాకివ్వడానికే ఏడుస్తున్నారు ఆయన చేతి లో పడితే వైకుంఠపాళిలో పెద్ద పాము నోట్లో  పడ్డట్టే "  అనే ఉచిత సలహా ఇచ్చేడు.

ఆ టాక్సీ అతను " మరి ఈ మామ్ముళ్ళు  మేము మీ దగ్గరే తీసుకుంటాము కదా సారు "అన్నాడు

అంటే యిండైరేక్ట్  గా మళ్ళా భక్తుడిదే ఈ "సంతోషం "కుడా. మళ్లా రూము ఖాళీ చేసేటప్పుడు కింద నుంచి పై ఉద్యోగి వరకు అందరూ "సంతోషం" అడుక్కున్నారు. అన్నిటికన్నా హైలైట్ రూము కోసం కట్టిన కాషన్ మనీ తిరిగి మనకి ఇవ్వడానికి టి.టి.డి వారు ఒక బ్యాంకుకి ఈ బాద్యత ఇచ్చేరు (బ్యాంకు పేరు చెప్పాలా? అక్కరలేదు, అందరికి తెలుసండి ).ఆ ఉద్యోగి తెలివిగా మన డబ్బుని వంద నోట్ల లో యిచ్చి చెయ్యి జాచుతాడు  .అంటే అతని "సంతోషం " వందలో ఉంటుందన్నమాట.వీళ్ళు తమ "సంతోషం" కోసం కంప్యుటర్లని కూడా వేళ్ళ మీద నడపించ గలరు.

ఆకాశగంగ నుంచి తిరుమలకి వెళ్ళేదారిలో టోల్ బోత్ లో రు30/- కట్టాలి . అక్కడి ఉద్యోగులు రసీదు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు. అడిగితే రసీదు ఇస్తున్నారు. హడావుడి  ఉండే యాత్రికులు  రసీదు తీసుకొని హమ్మయ్య "సంతోషం" అరికట్టేం అని అసలు సంతోషం అనుభవిస్తారు. అసలు "సంతోషం" ఆ రసీదు లో ఉంది ఆ రసీదు లో "రిసీవ్డ్ మనీ " లో "0" అని ఉంటింది ఇదేమిటి రసీదు లో "0" అని ఉంది అని అడిగితే "కంప్యుటరు అలానే ప్రింట్ చేస్తావుంది కంప్లైంట్ చేసినాము సారు" అనే సమాధానం వస్తుంది.

దొంగలు .....దొంగలు .......దొంగలు ......

ఈ అన్యాయాలని అరికట్టడానికి భాద్యత గల అధికారులు పూనుకొని ఈ చీడ పురుగుల్ని ఏరిపారేస్తేనే భక్తులకుకూడా నిజమైన  సంతోషం " కలుగుతుంది.

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి