అల్లసాని పెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము
(గతసంచిక తరువాయి)
శ్రీకృష్ణరాయ మనుజేం
ద్రా! కాంతాపంచబాణ! నరసింహ ధరి
త్రీకాంత గర్భ వార్నిధి
రాకాహిమధామ! కర్పర దళ విరామా!
శ్రీకృష్ణరాయ చక్రవర్తీ! స్త్రీల(కనులకు) పాలిట మన్మథుని వంటివాడా, నరసింహరాయల పట్టపురాణి గర్భవార్నిధి సోమా! ధూర్తులైన తురకల సేనలను అంతం చేసినవాడా! (కర్పర దళ విరామా!) స్త్రీల మనసులను కొల్లగొట్టి వారికి మదనవికారాన్ని కలిగించే సుందరుడా, నరసింహరాయల ధర్మపత్ని కడుపుచల్లగా పుట్టిన వాడా, దుర్మార్గులైన శత్రువులైన తురకలసేనలను అంతం చేసినవాడా వినుమని పెద్దన ‘మనుచరిత్రము’లోని ఆఖరి, ఆరవ ఆశ్వాసాన్ని ప్రారంభం చేస్తున్నాడు.
పాండురప్రభఁ గ్రిందువడిన చీఁకటివోలె / జిగి నొప్పు నీలంపు జగతి మెఱసి
యౌన్నత్యమున మ్రింగినట్టి నింగులు గ్రక్కు / కరణి ధూపము గవాక్షముల వెడల
ధారుణీసతి సుగంధద్రవ్యములు దాఁచు / నరలపేటికవోలెఁ బరిమళముల
నెలవు లై చెలువారు నిలువుల విలసిల్లి / కొణిగఁ బారావత కులము వదరఁ
బసిఁడినీట లిఖించిన ప్రతిమ లమర
నీఁగ వాలిన నందంద యెలుఁగు లొసఁగు
నట్టి సకినలమంచము లాదిగాఁగ
మెఱయు పరికరముల నొప్పు మేడమీఁద.
తెల్లని పాలరాతి గచ్చుప్రభకు లొంగిపోయి, కుంగిపోయి క్రిందికిపడిన నల్లని కాంతిలా కనిపిస్తున్న నీలమణులు తాపడంచేసినది, తమ ఔన్నత్యముతో ఆకాశమును మింగి మరలా బయటికి కక్కుతున్నాయా అన్నట్లు నల్లగా వెలువడుతున్న అగరు ధూమపు పొగలను కక్కుతున్న గవాక్షములను కలిగినది, భూదేవి అనే స్త్రీ తన పరిమళ ద్రవ్యములను విలాస వస్తువులను దాచుకొనడానికి ఉపయోగించుకునే పెట్టె యేమో అన్నట్లు సువాసనలను వెలువరిస్తున్నది ఐన మేడమీద, బంగారు నీరుపోసిన బొమ్మలు చెక్కబడి, ఈగవాలినా ‘కుయ్యు’మని కూతలుచేసే, కిరకిరలాడే, కిలకిలలాడే, కళకళలాడే ‘కిర్రుపానుపు’(!) కృత్రిమ పక్షులు మొదలైన చెక్కడం కలిగిన పందిరిమంచములున్న మేడమీద, పావురాలు గుంపులు గుంపులుగా చేరి కువకువలాడుతున్న ముంగిలి కలిగిన మేడ మీద మనోరమా స్వరోచులకు ‘శోభనం’ ఏర్పాటు చేశారు!
రమణునికడ కనుప మనో
రమకున్ మజ్జనము దీర్చి రవరవ కచపిం
ఛమునకుఁ గాలాగురుధూ
పము వెట్టి జవాది నంటు వాపి నిపుణతన్.
‘రమించేవాడు’, ‘రమింప జేసేవాడు’ రమణుడు. ఆ రమణుని వద్దకు పంపడంకోసం మనోరమకు అభ్యంగనస్నానంచేయించి, నెమలిపింఛములోని ఈకల్లా నల్లగా నిగనిగలాడే కేశములకు నల్లని అగరు పొగలు వేసి, జవ్వాదితో చిక్కుతీసి చక్కగా కేశములను అలంకరించి శోభనానికి మనోరమను సిద్ధం చేశారు.
చెంగల్వపూదండ సేర్చి పెందుఱుముపై / ఘనసారమున సూసకము ఘటించి
పన్నీటితోఁ గదంబము సేసి మృగనాభిఁ / బూసి కుంకుమ సేసబొట్టు తీర్చి
విశదముక్తాదామ రశనఁ జందురకావి / వలిపపు వలువపై నలవరించి
యఱుత వెన్నెలగాయు హార మొక్కటివెట్టి / మణుల సొమ్ములు మేన మట్టుపఱిచి
కన్నుఁగవ గెల్చి డాకాలఁ గట్టె ననఁగ
ఘల్లుఘల్లునఁ బెండెంబు గండుమీలు
గదల నల్లన నడపించి పొదివి తెచ్చె
నెచ్చెలుల పిండు యువతి నా నృపతికడకు.
చెలికత్తెల గుంపు (నెచ్చెలుల పిండు) మనోరమకు తల దువ్వి, పెద్దగా చుట్టిన కొప్పుకు ఎర్రకలువల దండను చుట్టి, నొసట పచ్చకర్పూరము పెట్టి అందులో పాపటిబిళ్ళను పెట్టి, చంద్రకావి రంగు ఎఱ్ఱని జలతారు వస్త్రముపై ముత్యాల మొలనూలు చుట్టి, పన్నీటిలో రంగరించిన కస్తూరిని శరీరానికి పూసి, కుంకుమబొట్టును పెట్టి, తెల్లని ముత్యాల హారాన్ని అలంకరించి, రత్నాల నగలను కదలకుండా అలంకరించి, చేపలవంటి కన్నులున్న మనోరమ తన కన్నులసోయగంతో ఓడించిన చేపల ఆకారంలో ఉన్న కాలియందియలు ‘ఘల్లుఘల్లు’మంటుండగా స్వరోచివద్దకు తీసుకొచ్చారు.
తెచ్చుటయుఁ గేళిభవనముఁ
జొచ్చెనొ చొరదో యనంగ సుదతుల నీడం
జొచ్చి పయిఁ గొప్పు దోఁపఁగ
నచ్చేడియ తలుపుదండ నల్లన నిలిచెన్.
అలా చెలికత్తెలు తీసుకురాగా, మదనకేళీ గృహానికి వస్తుందో రాదో అన్నట్లు సిగ్గులమొగ్గై, మనసు పదపదమంటుంటే, పాదాలు కదలమంటుంటే వెళ్లి, వెళ్లిందో లేదో తెలియకుండా చెలికత్తెల నీడలో వెళ్లి, వారి మధ్యలో తన పైకొప్పుమాత్రమే కనిపించేట్లు అలా తలుపు ప్రక్కన, తలపుల ప్రక్కన మెల్లగా నిల్చుంది.
తదనంతరంబ బోటులు
చదురుల నగవులను బ్రొద్దు జరిగినఁ గేళీ
సదనము నొక్కొక్క పని నెప
మొదవఁగ వెడలుటయుఁ జిత్త మువ్విళ్ళూరన్.
ఆతర్వాత కొద్దిసేపు చెలికత్తెలు చతురోక్తులతో, సరసోక్తులతో, మర్మోక్తులతో, నవ్వులతో వెళ్ళబుచ్చి ‘నా కా పని ఉందమ్మా, ఈ పని ఉందమ్మా’ అని సాకులతో ఒక్కొక్కరే జారుకున్నారు. మనోరమా స్వరోచి యిరువురే మిగిలారు. స్వరోచిమనసు ఉవ్విళ్ళూరుతున్నది. నెమ్మదిగా సరసకు చేరుకున్నాడు.
దట్టంబు నీ కట్టినట్టి చెంగావికి / బాగు గా దని కేలఁ బయఁట నిమిరె
గోరంటొ? గోళ్ళనిక్కువపుఁగెంపో యని / చెయి పట్టి నయమున సెజ్జ సేర్చె
నగరుధూపముచేత నయ్యో తనూవల్లి / సెక సోఁకెనని యెదఁ జెయ్యివెట్టె
మృగనాభికా మకరికలఁ గప్రము మించె / నని మూరుకొనుచుఁ జుంబన మొనర్చె
హారమణు లిటు సూపు నా యఱుత నున్న
హారమణులకుఁ గాంతి నీ డౌనొ? కావొ?
యనుచు నక్కునఁ గదియించు నా నెపమునఁ
గంపమును బొందు సతిమేను గౌఁగిలించె.
నీ అంగదట్టం(పావడా)నువ్వు కట్టుకున్న చెంగావిరంగు చీరకు అంతగా నప్పినట్టులేదే అంటూ నెమ్మదిగా పైటమీద చెయ్యేసి నిమిరాడు. ఈ కెంపులసొంపు ఎర్రని రంగు గోరంటాకుదా, లేక నీగోళ్ళదా, ఏదీ చూద్దాం’ అంటూ నెమ్మదిగా చేయి పట్టుకుని పానుపుకు చేర్చాడు. అగరుధూపంతో నీ లేతతీగవంటి దేహానికి సెగ కొట్టినట్టుందిగా పాడుబడ్డది, అంటూ నెమ్మదిగా ఎదమీద చేయ్యశాడు. ముందు పైటమీద మాత్రమే చెయ్యేశాడు, ఆమె లజ్జ భయము తొలిగిపోవడానికి, ఆ రెండిటితోపాటు పులకరంతో పైట కూడా తొలిగిపోయింది కనుక, గుండెలమీద చెయ్యేశాడు. చెక్కిళ్ళకు పూసిన కస్తూరి పూతలలో కర్పూరంపాళ్ళు ఎక్కువైనట్టుంది కదా, ఏదీ చూద్దాం అంటూ పరిమళాన్నిచూసేనెపంతో చెంపకు చేరుతున్నట్టు చేరి చుంబనం చేశాడు. నీ హారమణులు యిటు చూపించు, నా హార మణులకాంతికి సరిపోతున్నాయో లేదో చూద్దాం అంటూ మెడలలోనున్న హారాలను దగ్గరికి చేర్చే నెపంతో దగ్గరికి చేర్చి సన్నగా కంపిస్తున్న సతి దేహాన్ని కౌగిలించుకున్నాడు. ఇంత సరసంగా, సున్నితంగా తొలి కలయిక ఉంటే, ఆ తర్వాత ప్రతి కలయికా తొలి కలయికే అన్నంత మధురంగా, సరసంగా, ఆనందంగా ఉంటుంది. దంపతులమధ్య సున్నితమైన శృంగారంతో మొదలైతేనే ‘కామం’ ఫలప్రదంగా, సంసారం రసప్రదంగా ఉంటుంది. వైవాహికజీవితం సవ్యంగా సాగడం అన్నది దంపతుల శృంగారజీవితంమీదనే ఆధారపడి ఉంటుంది, ఆ శృంగార జీవితం సున్నితంగా నిదానంగా మొదలైతే అంతం కావడం అనేది ఉండదు. ఈ విషయాన్ని చెప్పడానికి భారతీయులు సాహిత్యాన్ని ఆలంబనంగా తీసుకుని శృంగారకావ్య, ప్రబంధ నిర్మాణం చేశారు. దాని పరిచయం చేశాడు పెద్దన ఈ పద్యంలో. దాంపత్యజీవితంలో ఒడిదుడుకులు తొలిగించుకోవడానికి కౌన్సెలింగులకెళ్ళి వేలూ లక్షలు తగలేసుకునేబదులు కావ్య, ప్రబంధ పఠనం చేస్తే చాలు! అలా చేరువై ఏకమైపోవడానికి తహతహలాడుతున్న స్వరోచిని, ఆతని సరసపు పలుకులను గమనించి సంతసం కలిగినా న మనసులో మెదులుతున్న కలవరం ఆమెను కలతపెట్టింది. ఎప్పటినుండో తన మనసులో రగులుతున్న వేదనను తన నాథుడు తొలగించగలడు కనుక అతనితో ఆ విషయము చెబుదామనుకున్నా, కొత్త పెళ్ళికూతురు గనుక, అతను ఎలా స్పందిస్తాడో అనే భయంతో, అనుమానంతో, సిగ్గుతో చెప్పలేక, తన బాధను దిగమింగుకోలేక, స్త్రీసహజస్వభావంతో కన్నీరు పెట్టి, మౌనంగా తన అశ్రువులను గోటితో మీటిన మనోరమను చూసి తన మన్మథ భావాలను అణచుకుని, ఆశ్చర్యపడి, అనునయంగా ఆమె ముంగురులను సరిజేస్తూ, మృదువుగా చెంపలు స్పృశిస్తూ అనంతమైన ఆనందాన్ని అనుభవించాల్సిన ఈ తరుణంలో ‘బేలా! ఈ కన్నీరేలా? నావలన ఏమన్నా పొరపాటు జరిగిందా? ఎవరైనా నీకు అయిష్టమైన పని చేశారా? చెప్పు! వారిని దండిస్తాను. ఏం కావాలి చెప్పు, అది బ్రహ్మ చేతిలో ఉన్నా సాధించి తీసుకొస్తా నీకోసం. నా ధనము, ప్రాణము అన్నీ నీవేకదా’ అని అడిగాడు స్వరోచి. జీవితభాగస్వామి మానసిక స్థితిని (మూడ్) గమనించాల్సిన అవసరాన్ని చెప్తున్నాడు పెద్దన. మానసికంగా చేరువైనతర్వాత శారీరకంగా చేరువకావడంలో ఉన్న ఆనందం అసలైన ఆనందం, అది తెలిసినవాడు స్వరోచి అని అన్నీతెలిసిన పెద్దన చెప్తున్నాడు. అనునయంగా, మృదువుగా అడిగేప్పటికి తేటపడిన మనసుతో, గొంతు సవరించుకుని, తన వేదనకు కారణం చెప్పడం ప్రారంభించింది మనోరమ.
అక్కట! నా యెడన్ మిగుల నక్కఱ గల్గి చరించు నెచ్చెలుల్
చిక్కి మునీంద్ర శాపహతిఁ జెందిన దుర్దమ రోగబాధలం
బొక్కుచు నున్నవారు వన భూములఁ, దద్దశ మాన్పవేని నా
కెక్కడి సౌఖ్య? మన్నఁ దరళేక్షణఁ జూచి స్వరోచి యిట్లనున్.
అయ్యో! నాపట్ల మిక్కిలి ప్రేమ కోలిగిన నా నెచ్చెలులు ఆ మునీంద్రుడి శాపకారణంగా భరింపరాని రోగాబాధలతో అడవులలోబడి విలపిస్తుంటే, వారి దుర్దశ మాన్పకుంటే నాకెక్కడి సౌఖ్యం? అన్నది.
పరితాప మింక నేటికి?
హరిణాక్షి! మదీయ సంచితాయుర్వేద
స్ఫురణమునఁ బరిహరించెద
నరు దనఁగ భవత్సఖీజనామయ భరమున్.
అలా పలికిన మనోరమను చూసి ‘ఓస్! ఇంతేకదా! ఇంకా వేదన ఎందుకు? నాకు నువ్వు నేర్పిన ఆయుర్వేదవిద్యతో వారి రోగాన్ని ఆశ్చర్యకరంగా చిటికెలో నయంచేస్తాను! ఈ మాత్రానికే కన్నీళ్ళా!’ అని ఊరడించాడు స్వరోచి. నా వెనుక రమ్ము,
నీ సఖులే వనమున
నున్నవార? లిపుడ చికిత్సం
గావింతు ననుచు రయమున
నా వనితఁయు దాను నచటి కరిగి యొకయెడన్.
నాతోరా! నీ స్నేహితురాళ్ళు యే వనంలో ఉన్నారో చెప్పు! యిప్పుడే వారికి చికిత్స చేస్తాను అంటూ వెంటనే మనోరమను వెంటబెట్టుకుని ఆమె స్నేహితురాళ్ళు ఉన్నచోటికి వెళ్ళాడు స్వరోచి.ఆ
రజనీశబింబ రుచిరాస్యలఁ గాంచి తదామయవ్యథా
భారము మాన్పఁగాఁ దమి నృపాలుఁడు తత్కల ధౌత గోత్రకాం
తారపదంబునం దుపచితం బగు మందును దత్క్రియోచితా
హారము నెమ్మి నిచ్చుచు ననామయధన్యలఁ జేసి వన్నెగాన్
వెళ్లి ఒకచోట ఆ చంద్రముఖులను, విభావసీ కళావతులను, మనోరమ స్నేహితురాళ్ళను చూసి, వారి రోగబాధను నివారించే ఆరాటంతో ఆ వెండికొండ సానువులలో ఉన్న అడవులలో దొరికే మూలికలతో, తగిన పథ్యంతో వారి రోగబాధను నివారించి వన్నెతో మెరిసిపోయేట్టు చేశాడు.
ఆ దివ్యౌషధరాజిచేఁ దమమహా వ్యాధివ్యథల్ దీఱినన్
మోదంబంది లతాంగు లంబుజకులంబున్ నవ్వుకందోయితో
సౌదామి న్యభిరామ దేహరుచితో సంపూర్ణ చంద్రానన
శ్రీదర్పోన్నతితోఁ జెలంగి సురనారీసూనుఁ గీర్తించుచున్
స్వరోచి ఇచ్చిన ఆ దివ్యమైన ఔషధాలతో తమ వ్యదిబాధలు తీరి, సంతోషంతో, తామరపూలను ధిక్కరించే కన్నులతో, మెరుపుతీగలవంటి దేహకాంతులతో, పున్నమి చంద్రులవంటి శోభతో మెరిసిపోతూ స్వరోచికి కృతజ్ఞతలు తెలిపారు. ఆతనిని కీర్తించారు.
మా కుపకార మొనర్చితి
నీకుం బ్రతిసేయ నెట్లు నేరుతు? మైనన్
లోకోత్తర! మా వలనను
జేకొనుకార్యములు గలవు చెప్పెద మెలమిన్.
మాకు చెప్పనలవికాని ఉపకారమును చేశావు. నీకు ఎలా ప్రత్యుపకారం చేసి నీ ఋణం తీర్చుకొనగలం? అయినా, మావలన కూడా జరిగే పనులు, ఒనగూడే లాభాలు ఉన్నాయి, నీకు సంతోషంగా వాటిగురించి చెప్తాము అంటూ విభావసి, కళావతి చెప్పడం ప్రారంభించారు.
(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు