జగజ్జనని తుల్జాపూర్ భవాని - మౌద్గల్యస,

tulja bhavani

అష్టాదశ పీఠాలలో ఒకటయిన తుల్జాపూర్ భవానిని నవరాత్రుల  వేళల్లో  దర్శించి తరించవలసిందే.  ఈ సమయంలో ఆమెను  చూడటానికి రెండు కళ్లూ చాలవు.   కోట్లాదిరూపాయల విలువైన వజ్రవైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, మంచి ముత్యాలు పొదిగిన ఆభరణాలతో ఆమెను ముంచెత్తుతారు. ధగధగలాడే కిరీటం, వజ్రాలు పొదిగిన నెక్లెస్, పాదుకలు,  బంగారు కళ్లు  సమర్పిస్తారు. ఇవిగాక ఛత్రపతి శివాజీ సమర్పించిన 101 బంగారు నాణాల దండ ప్రత్యేకంగా  అలంకరిస్తారు.  ఈ అలంకారం చూడటానికే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారంటే అతిశయోక్తి కాదు. ఆ సమయంలో   ఇసుక వేస్తే రాలనంత జనంతో ఈ ఆలయం కిక్కిరిసిపోయి ఉంటుంది.

తుల్జాపూర్ చేరటం ఎలా?

ఈ ఆలయం మహారాష్ట్ర లోని ఉస్మానాబాద్ జిల్లాలో ... బాలఘూట్ పర్వత శ్రేణులపై కొలువై ఉంది. సముద్ర మట్టానికి 2150 అడుగుల ఎత్తుపైన తుల్జాపూర్ పట్టణం ఉంటుంది. ఉస్మానాబాద్ నుంచి సుమారు 23 కి.మీ దూరంలో ఆలయం నెలకొంది. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి బస్సుల ద్వారా నేరుగా ఇక్కడకు చేరుకోవచ్చు. బస్ స్టేషన్ నుంచి కాలినడకన పావుగంటలో ఆలయానికి చేరుకోవచ్చు. ఆటోల సౌకర్యం కూడా ఉంది.

ఆలయానికి సమీపంలోని అతి పెద్ద రైల్వేస్టేషన్  షోలాపూర్ జంక్షన్.  ప్రతి రైలూ ఇక్కడ ఆగుతుంది.  దూరప్రాంతాలవారు షోలాపూర్ వచ్చి ... అక్కడ్నుంచి బస్సు ద్వారా 45 కి.మీ. దూరంలో ఉన్న తుల్జాపూర్ చేరుకోవచ్చు. సుమారు గంట ప్రయాణం. ప్రస్తుత ఛార్జీల ప్రకారం బస్సుకి రూ. 50 వంతున వసూలు చేస్తారు.

దత్త క్షేత్రమయిన గాణ్గాపూర్ నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది. గురుచరిత్రలో తుల్జాపూర్ ప్రస్తావన ఉంటుంది.  (అధ్యాయం 45). తెల్లకుష్టు వ్యాధి పోగొట్టుకోటానికి నందిశర్మ అన్న భక్తుడు  తుల్జాపూర్ భవానిని మూడు సంవత్సరాలు ఉపాసించటం,  ఆమె దర్శనం కాక నిరాశకు గురైన అతనికి   స్వప్న దర్శనమై... గంధర్వపురం (గాణగాపూర్)లోని శ్రీ నృసింహసరస్వతి స్వామిని ఆశ్రయించమని చెప్పటం కధాంశం.   అనంతరం ఈ వ్యాధి పోగొట్టుకుని నందిశర్మ నృసింహ పరమ భక్తునిగా మారతాడు.  స్వామిని స్తుతిస్తూ ‘కవీశ్వరుని’గా ఖ్యాతి పొందుతాడు. గురుచరిత్రతో పరిచయమైన దత్త భక్తులు గాణ్గాపూర్ దర్శించిన అనంతరం అక్కడ నుంచి తుల్జాపూర్ వెళ్లటానికి ఆసక్తి చూపుతారు.

గాణ్గాపూర్ నుంచి ఔరంగాబాద్ వెళ్లే బస్సులు తుల్జాపూర్లో ఆగుతాయి. దాదాపు నాలుగున్నర గంటల సమయం పడుతుంది.  రోడ్డు మార్గం సరిగా లేకపోవటంవల్ల అరగంట సమయం అటూ ఇటూగా పట్టవచ్చు. బస్సు ఛార్జీ రూ. 175.

చారిత్రక నేపథ్యం

తుల్జాభవాని కొన్నియుగాలుగా భక్తులకు కులదేవతగా ఉంది. కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకూ ఎంతో మంది ఆమెను కొలుస్తున్నారు. కృతయుగంలో అనుభూతి, త్రేతాయుగంలో శ్రీ రామచంద్రమూర్తి, కలియుగంలో ఛత్రపతి శివాజీ  ఆమె ఆదరణకు పాత్రులైనట్టు   తరతరాలుగా చెప్పుకుంటున్నారు.

బాలఘూట్ కొండలపైన ఆలయం నెలకొంది. పురాతనమైన ‘హేమడ్ పంతి’ శైలిలో దీని నిర్మాణం సాగింది. ఎడెహెసివ్ మెటీరియల్ వాడకుండా పెద్ద పెద్ద నిర్మాణాలను శతాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా రమణీయంగా నిర్మించటం దీని విధానం.
చారిత్రక, పురావస్తు శాఖల అంచనా ప్రకారం .. ‘రాష్ట్రకూట్’లు లేదా ‘యాదవ్’ ల కాలం నాటిది ఈ ఆలయం అంటారు.  17, 18 శతాబ్దాల నాటిదని చెప్పే వాళ్లూ ఉన్నారు.

స్కంద పురాణంలో తుల్జాభవాని తొలి అవతారానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. కృతయుగంలో ముని కర్థమ  భార్య  అనుభూతి యమునాచల్ (బాలఘూట్)లో దీర్ఘతపస్సు చేయసాగింది. కుకర్ అనే రాక్షసుడు ఆమె తపస్సుకు అవరోధం కల్పించి ఆమెను అవమానపరిచాడు. దీనితో ముక్తికోసం అనుభూతి.. దేవీ భగవతిని ప్రార్థించటంతో , ఆమె ఆయుధాలు ధరించి వచ్చి యుద్ధంలో రాక్షసుడ్ని కడతేర్చింది. అనంతరం   భగవతిని ఇక్కడే ఉండిపొమ్మని అనుభూతి ప్రార్థించటంతో శాశ్వతంగా ఆమె ఇక్కడే కొలువైందని అంటారు.
భక్తుల కోరికను త్వరితగతిన తీరుస్తుంది గనుక.. త్వరిత,  తుర్జ, తుల్జగా కాలగమనంలో పేరొందిందని అంటారు.

ఆలయ విశేషాలు..

ఆలయం చూడగానే పారవశ్యానికి లోను కాని వారుండరు. ఎత్తయిన ప్రాకారాలతో, రాతి కట్టడాలతో   ఓ కోటలోకి అడుగుపెడుతున్న అనుభూతి కలుగుతుంది. ప్రధాన ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించగానే ముందుగా కనిపించేది గోముఖ్ తీర్థం.  మెట్లమార్గంలో దిగుతుంటే  ఈ కుండం కనిపిస్తుంది. అక్కడ పాదాలను తడుపుకుని, తలపైన జలం కొద్దిగా చిలకరించుకుని, పక్కనున్న శివలంగంపైన కొంత జలం అభిషేకించుకుని భక్తులు ముందుకి కదులుతారు. అనంతరం  ఎడమవైపున కనిపిస్తుంది సిద్ధివినాయకుని ఆలయం. ఇక్కడ పెద్ద ప్రమిదలో జ్వాల వెలుగుతూ కనిపిస్తుంది. భక్తులు తమ వెంట తెచ్చుకున్న నూనెలో కొంత భాగాన్ని ఈ ప్రమిదలో పోస్తారు.  తర్వాత కనిపించేది హోమకుండం.  పైన యజ్గకుండ్ అన్న అక్షరాలు కనిపిస్తాయి. ఇక్కడు పాదుకులకు నమస్కరించిన తర్వాత  కదిలితే...కుడివైపున ఆఫీసు కార్యాలయం...  ఎడమవైపుగా ధర్మదర్శనం క్యూ మార్గం ఉంటుంది. విశాలమైన ప్రాంగణంలో అనేక మలుపులతో ఈ క్యూ లైను సాగుతుంది. రద్దీ లేని వేళల్లో  ఈ క్యూ మార్గం గుండా వెళ్లటం మంచి ఉత్సాహాన్నిస్తుంది.  లోపలకి ప్రవేశించగానే... సభామండపంలో ..భవాని అమ్మవారికి అభిముఖంగా  భవానీశంకరుడు దర్శనమిస్తాడు. ఆయనకు నమస్కరించుకుని ముందుకు నడిస్తే  అమ్మవారు సాక్షాత్కరిస్తారు. శాంతమూర్తిగా ఆమె మనకి  కనిపిస్తారు.

సాధారణంగా శక్తిపీఠాలలో అమ్మవారు రౌద్రమూర్తి అన్న అభిప్రాయం ఉంది. శ్రీశైలం వంటి క్షేత్రాలలో అమ్మవారి ఉగ్రత్వాన్ని తగ్గించేందుకు జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి.  భవాని అమ్మవారి గురించి అలాంటి కథలేవీ ప్రచారంలో లేవు.  అమ్మవారి కుడివైపు పవళించే మందిరం కూడా కనిపిస్తుంది. ఆలయం వెలుపల అనేక అంతరాలయాలు ఉన్నాయి.  ఇందులో మాతంగి మందిర్, దత్త మందిర్, మార్కండేయ రుషి మందిర్, శంభాజీ ప్రజ్గాన్ మందిర్, శ్రీ చింతామణి మందిర్ ప్రధానమైనవి. గణేష్ చింతామణి మందిరంలో ఓ రాతి గుండు దర్శనమిస్తుంది. కోరికలుతీర్చే చింతామణి అని దీనికి పేరు. మనసులో ఓ కోరిక కోరుకుని గుండుపైన చేయివేస్తే ...అది కుడివైపుకి కదిలితే మనసులో కోరిక తీరినట్టు అని చెబుతారు.

భవాని  అమ్మవారి ఆలయాన్ని సందర్శించే భక్తులు వెదురుబుట్టల్లో  ప్రత్యేకంగా ఆటా (గోధుమపిండి)లేదా గోధుమ పిండితో చేసిన చపాతీలు, ఇతరమైనవి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయం వెలుపల  చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ లాంటి పూజా సామాగ్రి  సెట్ విక్రయిస్తారు. వంద, రెండు వందల ధరలతో ఉన్నవీటిలో భక్తులు తమ శక్త్యానుసారం సమర్పించవచ్చు. ప్రత్యేకంగా గాజులు కొని అమ్మవారికి సమర్పిస్తారు.  దీనితో పాటు ముత్తెదువ గాజుల పేరుతో ఆకుపచ్చ రంగు గాజుల్ని ఇక్కడ విక్రయిస్తున్నారు. అభిరుచిమేరకు వాటిని కొనుక్కునే భక్తులుంటారు. 

బంగారు, వెండి వంటి ఆభరణాలను ఇక్కడ మొక్కుబడులుగా  సమర్పించుకుంటారు.  గుప్తదానాలు సమర్పించేందుకు   ఆలయంలో అక్కడక్కడా హుండీలు ఏర్పాటు చేశారు. ఛత్రపతి శివాజీ చిత్రాలు, ద్వారబంధాలకు శివాజీ బంధువర్గాల పేర్లు మనకి కనిపిస్తాయి.
ఇవి గాక  ప్రధాన ఆలయానికి సమీపంలో ... కాలభైరవ ఆలయం, టోలు భైరవ ఆలయాలున్నాయి.

తుల్జాపూర్ సందర్శించే భక్తులు ఇదే పట్టణంలో ఉన్న మరికొన్ని దర్శనీయ స్థలాలను కూడా చూడవచ్చు.

ఘట్ శీల్ టెంపుల్, గార్డెన్, పాపనాష్ టెంపుల్, శ్రీ భారతిభౌవ మఠ్, శ్రీ అరణ్యభైవ మఠ్, శ్రీ దశావతార్ మఠ్, తుల్జాపూర్ ఖుర్ద్ మందిర్ ఇందులో చెప్పుకోదగ్గవి.

షోలాపూర్ హైవే మార్గంలో ఘట్ శీల్ టెంపుల్ నెలకొంది. తుల్జాపూర్ భవాని శిల మూర్తిగా ఉండటంతో .. ఘట్ శీల్ అని పేరు వచ్చిందంటారు. నవరాత్రులప్పుడు.. పౌర్ణమి వేళ...  లక్షలాది మంది భక్తులు కాలినడకన వచ్చి ముందుగా ఈ మందిరాన్ని సందర్శించి  ఆ తర్వాత ప్రధాన ఆలయానికి వెళతారు. 

నవరాత్రులు...  పర్వదినాలు

తుల్జాపూర్ భవానీ ఆలయంలో నవరాత్రుల సందర్భంగా చేపట్టే    శారదీయ నవరాత్ర... శాకంబరీ నవరాత్ర అనేవి విశేష కార్యక్రమాలుగా చెప్పబడుతున్నాయి. ఈ సందర్భంగా  ప్రత్యేక  పూజాదికాలు చేపడతారు. లక్షలాది మంది భక్తులు  తరలివచ్చి ఈ కార్యక్రమాలను వీక్షిస్తారు. 

శారదీయ నవరాత్ర-    అశ్వని ప్రతిపాద నుంచి అశ్వని పౌర్ణమి వరకూ ఈ కార్యక్రమాలు ఓ వరుసలో సాగుతాయి.

మంచ్కీ నిద్ర  - భాద్రపద వద్యా అష్టమి నాడు అమ్మవారు నిద్రకు ఉపక్రమిస్తారు. నవరాత్రుల ప్రారంభ సూచికగా ఈ కార్యక్రమం చేపడతారు.ఘటస్థాపన - అశ్వనీ శుద్ద ప్రతిపాద రోజున అమ్మవారు నిద్ర నుంచి మేల్కొని సింహాసనాన్ని అధిష్టిస్తారు. 12 గంటలకు ఘటస్థాపన కార్యక్రమం చేపడతారు.

లలిత పంచమి- ఐదో రోజున అమ్మవారికి రథ అలంకార పూజ

ఆరో రోజున అమ్మవారికి శేషసాయి మహాలంకార పూజ

ఏడోరోజున అమ్మవారికి భవాని తల్వార్ అలంకార మహాపూజ (కత్తి)

ఎనిమిదో రోజున మహిషాసురమర్దిని అలంకార మహాపూజ - ఇదే రోజున హోమకుండంలో నవచండీ హోమం చేపడతారు.

ఈ అలంకార వేళల్లో అమ్మవారిని చూడటానికి రెండు కళ్లూ చాలవు.  ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ ప్రదేశాన్ని చూడలేమని భక్తులు నమ్ముతారు.

తొమ్మిదో రోజయిన మహానవమి రోజున నిత్యపూజ,  మధ్యాహ్నం హోమకుండంలో ప్రత్యేక పూజలు చేపడతారు.   అహ్మద్ నగర్ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన  వెదురుపల్లకి అర్ధరాత్రి వేళకి ఆలయానికి చేరుతుంది.  

పదో రోజయిన దసరా రోజున బ్రాహ్మీముహుర్తం  ‘సింహలగ్నం’లో విశేషమైన మహోత్సవం నిర్వర్తిస్తారు. ఈ సమయంలో అమ్మవారిని సింహాసనం పైనుంచి అహ్మద్ నగర్ నుంచి తెప్పించే పల్లకి లో మారుస్తారు. ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తారు. ఈ కార్యక్రమం ముగిశాక  మిగిలిన ఐదు రోజులూ  పౌర్ణమి నాటి వరకూ అమ్మవారు  విశ్రాంతి తీసుకుంటారు (పలంగ్ సేవ).

అశ్వని పౌర్ణమి- ఇది అత్యంత విశిష్టమైన పర్వదినం. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే సందర్భం ఇది.  ఆ రోజ తెల్లవారుఝామున   ఒంటి గంటకు అమ్మవారు శయనమందిరం నుంచి సింహాసం మీదకు చేరతారు. అనంతరం అభిషేకాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. రాత్రికి చబీనా ఉత్సవం నిర్వహిస్తారు.

చబీనా ఉత్సవం -  భవాని అమ్మవారి వెండి ఉత్సవ మూర్తిని  ప్రత్యేకంగా అలంకరించి సింహ, నంది, నెమలి, గరుడ, ఏనుగు, గద్ద తదితర వాహనాలపై ఊరేగిస్తారు. ప్రతి మంగళవారం రాత్రి అభిషేకం అనంతరం ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతి పౌర్ణమికి మూడు రోజుల పాటు... అంటే పౌర్ణమి ముందురోజు, పౌర్ణమి రోజు, ఆ మరుసటి రోజు నిర్వహిస్తారు. నవరాత్రులప్పుడు ఒకటినుంచి ఎనిమిదిరోజుల వరకూ ప్రతి రోజూ చేపడతారు. ఉగాది, దీపావళి పర్వదినాల్లోనూ ఈ ఉత్సవం ఉంటుంది.

ఈ చబీనాను భక్తులు తమ భుజాలపైన మోయటానికి ఆసక్తి చూపుతారు. ఆ సమయంలో అమ్మవారి ప్రత్యేక వాయిద్యం .. శంబల్ (Sambal)మోగిస్తూ...స్తోత్తపాఠాలతో ప్రత్యేక గోంథాలీ గీతాలు పాడుతూ ముందుకు కదులుతారు. ఇదే సమయంలో మహాద్వారం దగ్గర నగారా, చౌగంధ వాయిద్యాలు కొనసాగుతాయి.

ఆలయంలో ప్రత్యేక పూజలు

ఈ ఆలయంలో వివిధ సేవలు అందుబాటులో ఉన్నాయి. సింహాసన పూజ, పంచామృత అభిషేకం (భోగి), ఓటి, సరి-చోళి, దండ్ వత్, గోంథాల్, మల్ పరాడీ ఇందులో కొన్ని. ఉదయం నుంచి సాయంత్రం వరకూ రోజులో నాలుగు సార్లు అమ్మవారికి విశేష   పూజలు చేస్తారు.

1. చరణ్ తీర్థ్-   ఉదయం ఐదు గంటలకు ఆలయం తెరవగానే చేసే మొదటి పూజ ఇది. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు.
2. అభిషేక్ - సాధారణంగా ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. అలాగే సాయంత్రం ఏడు గంటల    నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ కార్యక్రమం చేస్తారు. భక్తుల రద్దీని  బట్టి  మధ్యమధ్యలో  పంచామృత స్నానం ఉంటుంది.
3. ఆరతిధూప్ హారతి -  ఉదయం, రాత్రి కూడా అభిషేకం  ముగిసిన వెంటనే  అమ్మవారిని అలంకరిస్తారు (వస్త్రాలంకరణ). అనంతరం ఆరతిధూప్ హారతి ఉంటుంది.
4. ప్రక్షాళ్ పూజ - ప్రతిరోజూ చిట్ట చివరగా చేపట్టే పూజావిధి. అమ్మవారి సన్నిధిని పూర్తిగా శుభ్రం చేసి ఆరతి, నైవేద్యం సమర్పిస్తారు.

తుల్జా భవాని టెంపుల్ ట్రస్ట్

ట్రస్ట్ ఇక్కడ కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. రోజువారీ వ్యవహారాలను ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు పర్యవేక్షిస్తారు. కలెక్టర్ ఉస్మానాబాద్ ఎక్స్ అఫీషియో ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. దూరప్రాంత ప్రయాణికుల వసతి కోసం ఇక్కడ చౌల్ట్రీలు కూడా అందుబాటులో ఉన్నాయి.  ఇక్కడ ఆలయ గోడలపై చాలా చోట్ల తెలుగు భాషలో సూచికలు ఉన్నా...  వచ్చే భక్తలకు తెలుగులో సమాచారం అందించగల వేదికలు లేవు. స్థానిక  మరాఠీ భాషలోనే  కరపత్రాల ప్రచారం  లావాదేవీలు  సాగుతున్నాయి.   కనీసం ఇంగ్లిషు, హిందీల్లో నైనా సమాచారం ఉంటే ఎక్కువ మందికి  ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదిఏమైనా తుల్జాభవాని ఆలయాన్ని సందర్శించిన భక్తులు ఎవరికైనా అదో అందమైన అనుభూతిగా మిగులుతుందనటంలో సందేహం లేదు.

జై భవాని... జైజై భవాని .... జైజైజై భవాని

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి