సాహితీవనం - - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము

(గతసంచిక తరువాయి) 

తన భార్య మనసులో నెలకొన్న దిగులును నివారించడం కోసం, ఆవిడ స్నేహితురాళ్లకు మునిశాపకారణంగా  కలిగిన భయంకర వ్యాధిని నివారించడం కోసం హిమవత్పర్వత సానువులలో గాలించి అక్కడ లభించే  వనమూలికలను సంపాదించి, వారి వ్యాధికి చికిత్సను చేసి వారిని మునుపటిలా సుందరీమణులను చేశాడు స్వరోచి. వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి, ఆయనకు తమ వృత్తాంతమును వినిపిస్తున్నారు.

మును మాదగు వృత్తాంతము
వినిపింపఁగ వలయు నీకు విశ్రుతముగ భూ
వినుత! విను మనుచు నం దొక
వనజేక్షణ పలికె మధుర వాగ్జితశుకియై.

ప్రథమంగా మా చరితమును నీకు వివరముగా వినిపిస్తాము ప్రభూ, విశ్వవినుతా! అని వారిద్దరిలో ఒక పద్మాక్షి మాధుర్యంలో ఎలకోకిలను ధిక్కరించే స్వరంతో చెప్పసాగింది, క్లుప్తంగా!

అనఘ! మందార విద్యాధరాత్మభవను
నను విభావసి యండ్రు గంధర్వవరులు
తెలిసియుండుదు నిమ్మహీతలమునందుఁ
బరఁగు మృగపక్షిజాతుల భాషలెల్ల.

నిష్కళంక చరిత్రుడా! నేను మందాధరుడనే గంధర్వుని గంధర్వుని కుమార్తెను. నన్ను విభావసి అని పిలుస్తారు. ఈ భూమిమీద ఉన్న సమస్త మృగాల, పక్షుల జాతుల భాషలన్నీ నాకు తెలుసును.

అమ్మేటివిద్య నాచే
నిమ్ముగ నంతయు నెఱింగి నృప! నన్ను వివా
హ మ్మగు మనవుడు రెండవ
కొమ్మ మదిం బ్రేమ గడలుకొన నిట్లనియెన్‌.

దివ్యమైన ఆ విద్యనూ నావద్ద నేర్చుకుని, నన్ను వివాహం చేసుకుని అక్కున చేర్చుకుని ధన్యను చేయవయ్యా అన్నది.  ప్రేమ నిండిన హృదయముతో రెండవ సుందరి మాట్లాడ్డం మొదలెట్టింది.

పారుఁ దనఁగ బరఁగు బ్రహ్మర్షి మా తండ్రి
యతఁడు విద్య లెల్ల నభ్యసించి
తపము నిచ్చఁ జేయఁ దలపోసి కీర భృం
గాళి రమ్యమైన యాశ్రమమున.

పారుడనే బ్రహ్మర్షి నా తండ్రి. ఆతడు సమస్త విద్యలనూ నేర్చుకుని, తపస్సు చేయాలనే తలంపుతో చిలుకలు, తుమ్మెదలు మొదలైన నానా విధ పక్షులతో కీటకములతో నిండిన  రమ్యమైన ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు.

ఫలమూలచ్ఛదనాంబు భుక్తిఁ బవనాభ్యాసక్రియాయుక్తి ని
ర్దళితాంతర్గత శాత్రవ ప్రకర జాగ్రద్గర్వ సర్వస్వుఁడై
చలికిన్‌ వానకు నెండకున్‌ మన మనుత్సాహంబు గానీక కం
దళితానందమునన్‌ ముకుంద చరణ ధ్యానావధానంబునన్‌.

ఫలములను, కందమూలములను భక్షిస్తూ, ఉచ్చ్వాస నిశ్వాసములను నియంత్రిస్తూ, అభ్యాసం కొనసాగిస్తూ, అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను  జయించి, చలికి, వానకు, ఎండకు మనసులో  ఉత్సాహం చనిపోకుండా అనంతానంద మానసుడై  ముకుందుని చరణధ్యానముపై లగ్నంచేసినమనసుతో తన తపస్సును కొనసాగించాడు.

అంగుష్ఠము నిల మోపి ప
తంగునిపైఁ జూపు సాఁచి ధగధగ లర్చి
స్తుంగత నింగులు నాకెడు
నింగలములు నాల్గుదెసల నిడుకొని కడఁకన్‌.

కాలి బొటనవేలును నేలమీద మోపి,  బొటన వేలి మీదనే నిలుచుని, సూర్యునిపై తన దృష్టిని కేంద్రీకరించి, తన తపస్సుయొక్క అరుణ ప్రభలు నలుదిక్కులకు, గగనానికి వ్యాపిస్తుండగా తపస్సు కొనసాగించాడు.

సుర గరుడ యక్ష రాక్షస
నర కిన్నర సిద్ధ సాధ్య నాగోత్కర మి
ట్లరు దనఁగఁ దపమొనర్చెం
బురుహూతుఁడు దాననాత్మఁ బొడమిన భీతిన్‌.

ఆహా! ఈ తపస్సు అత్యద్భుతం! అరుదైన తపోదీక్ష అని దేవతలు, గరుడులు, యక్షులు, రాక్షసులు, నరులు, కిన్నరులు, సిద్ధులు, సాధ్యులు, నాగులు పొగడుతుండగా తపస్సును కొనసాగించడంతో దేవేంద్రునికి భయం కలిగింది, ఆ తపోఫలంతో తన పదవికి ఎసరు పెడతాడేమో అని!

తనయొద్దఁ బుంజికస్థల
యను నచ్చర లేమ యున్న నమ్మునికడకుం
జనుమని యనిపినఁ బతి శా
సనమున వని కేఁగుదెంచె సంభ్రమలీలన్‌.

తన దగ్గర ఉన్న పుంజికస్థల అనే అప్సరను ఆ ముని వద్దకు వెళ్లి, ఆతనిని నీ రూపలావణ్యం ఆకర్షించి, మన్మధ బాధకు గురిచేసి, ఆతని తపస్సును భంగం చేసి రా, వెళ్ళు! అని పంపించాడు.

చిలుకలు ముద్దుఁ బల్కులకుఁ జేరఁగ రా నెఱివేణి కాంతికిన్‌
మలయుచుఁ బై పయిన్‌ మధుపమాలిక వాయక సంచరింపఁగా
నలస విలాస యానమున నమ్మునిపాలికి వచ్చె వేల్పుఁదొ
య్యలి నునుసానఁ బట్టిన యనంగుని మోహనబాణమో యనన్‌.

తన ముద్దు పలుకులకు చిలుకలు సాటి అన్నట్లుగా, తన నల్లని కుంతలముల ప్రభకు భ్రమసి తుమ్మెదలు గుమి కూడి పైపైన వాలి సంచరిస్తుండగా, విలాసంగా, ఒకింత నిర్లక్ష్యంగా అన్నట్లు కనిపిస్తున్న మందగమనముతో, నున్నగా, వాడిగా సానబట్టిన మన్మథుని బాణమా! అన్నట్లు ఆ దేవకాంత పుంజికస్థల ఆ మునివద్దకు వచ్చింది అని  గాథను కొనసాగించింది ఆ రెండవ సుందరి.

(కొనసాగింపు వచ్చేవారం)

వనం వేంకట వరప్రసాదరావు.  

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి