సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

అల్లసాని పెద్దన విరచిత ‘స్వారోచిష మనుసంభవము’

(గతసంచిక తరువాయి)
 

మనోరమ వద్ద తను నేర్చుకున్న ఆయుర్వేదవిద్య సహాయంతో తమ వ్యాధిని దూరముచేసి, తమకు 
పూర్వపు మనోజ్ఞమైన సౌందర్యాన్ని ప్రసాదించిన ‘స్వరోచి’కి కృతజ్ఞతాపూర్వక వందనములు చేసి, తమ గాధను తెలియజేస్తున్నారుమనోరమ స్నేహితురాళ్ళు. మొదటి సుందరి విభావసి తర్వాత రెండవయామె తన కథను చెప్తున్నది. 
 
అనువగు సుళ్ళ నొప్పు మలయానిలవాహము నెక్కి తేంట్ల న
ల్లిన నిడువాగెఁ బూని లవలీ నవవల్లిక లెమ్మెసొమ్ములై 
పనుపడఁ జెట్లు వట్టి మను ప్రాఁతదళమ్ములతోడఁ దోలె నా
మనిదొర మంచురాజు మడిమంచగఁ  గోయిలగంట మ్రోయఁగన్‌. 
 
అనువైన సుడులు కలిగిన మలయపవనము అనే గుఱ్ఱమునెక్కి, తుమ్మెదలతో అల్లిన నారి కలిగిన ధనుస్సును ధరించి, వెన్నెల తీగలు మొదలైనవాటిని ఆభరణములుగా ధరించి, చెట్లను పట్టుకుని వ్రేలాడుతున్న పాత పండుటాకులను పాతసేనలుగా జేసుకుని, మంచుకురిసే కాలము అనే శత్రు రాజుయొక్క శక్తి సన్నగిల్లిపోగా, 
కోకిల అనే విజయఘంట మ్రోగగా  వసంతుడు అనే రాజు (ఆమనిదొర) దాడి చేశాడు. 

  భారతీయులకు వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతువులుఅనే ఆరు ఋతువులు. వసంతముతో ప్రారంభమై, శిశిర ఋతువుతో అంతమయ్యే సంవత్సర కాలములో వసంతముకొత్త జీవితానికి, ఆశలకు, వూసులకు చిహ్నం, శిశిరము శిథిలమై పోవడానికి చిహ్నం. ఆ వసంత కాలానికి ప్రభువువసంతుడు అంటే మన్మథుడు. ఆ మన్మథుడు తన ఐదు బాణాలు ఐన ఐదు పూలతో, మలయపవనాన్ని మంచిసుడులున్న వాహనముగా అశ్వముగా జేసుకుని తన విజయ యాత్రను కొనసాగించాడు. పశువులకు శరీరసాముద్రికాశాస్త్రము చెప్పిన శుభలక్షణాలలో మంచి సుడులు ఒక అంశం అయితే, ఋతు పరంగా సుడులు సుడులుగావీచే శుభ మలయ పవనాలు అని ఒక చమత్కారం చేస్తున్నాడు పెద్దన. పండిపోయిన ఆకులు చెట్లను పట్టుకుని రాలకుండా ఉండడాన్ని పురాతన సైనికులుగా చెప్తూ అవి రాలిపోవడం, కొత్త చివుళ్ళు తొడగడం వసంత ఋతువులో జరుగుతుందికనుక ఆ కొత్త చివుళ్ళు కొత్త సైనికులు అని ధ్వనిస్తున్నాడు. మంచుకురిసే కాలం కనుమరుగైపోతుంది వసంత ఋతుప్రారంభంతో కనుక మంచుకురిసేకాలాన్ని శక్తి ఉడిగిపోయిన శత్రు రాజు అంటున్నాడు. వసంత ఋతు ఆగమనానికికోకిలల ధ్వనులు ఒక చిహ్నం కనుక కోకిలల ధ్వనులను వసంతుడి విజయధ్వనులుగా పోల్చాడు.

న దేఱి పొటమరించి నెఱెవాసినయట్టి-యాకురాలుపు గండ్లయందుఁ దొఱఁగి
యతిబాల కీరచ్ఛదాంకురాకృతిఁ బొల్చి-కరవీర కోరక గతిఁ గ్రమమున
నరుణంపు మొగ్గలై యర విచ్చి పికిలి యీఁ-కల దండలట్లు గుంపు లయి పిదప
రేఖ లేర్పడఁగ వర్ధిలి వెడల్పయి రెమ్మ-పసరువాఱుచు నిక్కఁ బసరు కప్పు

పూఁటపూఁటకు నెక్కఁ గప్పునకుఁ దగిన
మెఱుఁగు నానాఁటికిని మీఁద గిఱిగొనంగ
సోగయై యాకు వాలంగ జొంప మగుచుఁ
జిగురు దళుకొత్తెఁ దరులతా శ్రేణులందు.

చెట్లకు, తీగలకు ఉన్న పండుటాకులు రాలిపోయాయి. ఆ ఆకులు అంతవరకూ ఉన్న ప్రదేశం గండ్లు పడి, ఆ గండ్లలో సొన కారి, మొదలు పిల్ల చిలుకల పసిరెక్కలరంగు వంటి లేత ఆకుపచ్చ రంగుతో చివుళ్ళు మొలిచాయి. ఆ తర్వాతఎర్ర గన్నేరు మొగ్గల ఎర్రని రంగువంటి రంగును పొందాయి ఆ చివుళ్ళు. ఆ తర్వాత పికిలిపిట్టల ఈకల్లా గుంపులుగుంపులుగా మొదలై, తర్వాత ఈనెలు అనే రేఖలు ఏర్పడి, వర్ధిల్లి, వెడల్పై, పచ్చని పసరు కాంతి పెరిగి, నల్లనై,తళతళలాడుతూ, సంపూర్ణంగా పెరిగి వాలిపోతూ చివుళ్ళు తొడిగి ఆకులు విచ్చుకుని, చెట్లు లతలు పచ్చని ఆకుల గుంపులతో కళకళ లాడాయి.    

హిందోళంబునఁ బాడిరి
బృందారకసతులు విరహి బృందార్తిగఁ ద్రేఁ
చెం దేఁటులు వాసంతిక
విందునఁ బికశిశువు దాది వెడలం దోలెన్‌.

దేవతాస్త్రీలు హిందోళ రాగంలో పాడారు. ‘శిశిరస్య వసంతస్య సంధౌ హిందోళరాగకః’ అని సంగీత శాస్త్రం చెప్తుంది, శిశిరవసంత ఋతువులను సంధించేది , ఆ కాలంలో పాడేది హిందోళం అని, వసంత ఋతువు పూర్తిగా వచ్చిన తర్వాతవసంత రాగం! విరహులకు ఆర్తి కలిగేట్లు ‘బండి గురివింద పూల’(వాసంతిక) తేనె తాగి విందులు చేసుకుని తుమ్మెదలుగానం చేశాయి. పిల్ల కోకిలను (పీక శిశువు) పెంపుడు తల్లి (దాది)ఐన కాకి గూటిలోనుండి  వెళ్ళగొట్టింది.  కాకః కృష్ణఃపికః కృష్ణః కో భేదః పిక కాకయోః వసంత కాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః అని ఒక రసవంతమైన చాటువు ఉంది.అంటే కాకి నల్లగా ఉంటుంది, కోకిలా నల్లగానే ఉంటుంది, రెండిటికి ఏమిటి భేదం అనేది వసంతకాలం వస్తే తెలుస్తుంది,వసంత కాలంలో కాకి కాకే అవుతుంది ‘కావుకావు’మంటుంది, కోకిల మాత్రం మధురంగా కూస్తుంది. కనుక వసంతఋతువు రాగానే కోకిల కూన కూడా కూస్తుంది, దాంతో అంతవరకూ అదీ తన శిశువే అనే భ్రమతో సాకిన కాకి అదికాకిపిల్ల కాదు అని తెలుసుకుని గూటిలోనుండి వెళ్ళగొడుతుంది అని పెద్దన రసవాహిని!

చలిగాలి బొండు మల్లెల పరాగము రేఁచి-నిబిడంబు సేసె వెన్నెలరసంబు
వెన్నెలరస ముబ్బి వెడలించె దీర్ఘికా-మంద సౌగంధిక మధునదంబు
మధునదం బెగఁబోసె మాకందమాలికా-క్రీడానుషంగి భృంగీరవంబు
భృంగీరవం బహంకృతిఁ దీఁగె సాగించెఁ-బ్రోషిత భర్తృకా రోదనముల

విపినవీథుల వీతెంచెఁ గుపిత మదన
సమదభుజ నత సుమ ధనుష్టాంకృతములు
సరస మధుపాన నిధువనోత్సవ విలీన
యువతి యువకోటి కోరికల్‌ చివురు లొత్త.

ఆ వసంత ఋతువులో వీస్తున్న చల్లనిగాలి బొండుమల్లెల పరాగాన్ని రేపింది, ఆ తెల్లని బొండుమల్లెల పరాగంకురుస్తున్న తెల్లని వెన్నెలను మరీ తెల్లగా చేసింది, ఆ తెల్లని వెన్నెల ప్రవాహం దిగుడు బావులలోని ఎర్రకలువలతేనెల ప్రవాహాన్ని ఉధృతం చేసింది, ఆ తేనెల ప్రవాహం మంచి మామిడి తోటల్లోని ఆడు తుమ్మెదల గానాన్ని,నాదాన్ని ఎగదోసింది, ఆ ఆడుతుమ్మెదల నాదం భర్తలు ఊళ్లకు వెళ్లి ఇంకా ఇళ్ళకు తిరిగి రాకపోవడంతో విరహంతోవిలపించే ‘ప్రోషిత భర్తృకల’ రోదనలను తీగ సాగించింది! ఇదీ పెద్దన పెద్దరికం, ఇంత అద్భుతమైన ఋతు వర్ణన ఇంతసరళంగా, సహజంగా, వివరంగా, మధురంగా ఇతరులు ఎవరూ చేయలేదు, కనుకనే కవులు ఎందరున్నా ‘ఆంధ్ర కవితాపితామహుడు’ అని పెద్దననే అన్నారు కుపితుడైన మన్మథుని విశాలమైన భుజానికున్న చెరకువింటి ధ్వనులు .అడవులలో, తోటల్లో,‘వనం’లో వినిపించాయి! సరసంగా మధురస పానాన్ని, సుమధుర గానాన్ని, సురత క్రీడను చేస్తున్నయువతీ యువకుల మనసులలో కొత్త కొత్త కోరికలు చివుళ్ళు తొడిగాయి, ఆశలు మోసులెత్తాయి, నెరవేరాయి!

అత్తఱి మురిపపునడఁ జెలి
కత్తియగమి గొలువ మృదుల కలభాషలఁ ద
ళ్కొత్తెడు వెడనగవులతోఁ
జిత్తభవుం డార్వ ననలు చిదుము నెపమునన్‌.

ఆ సమయంలో మురిపెపు నడకలతో, చెలికత్తెల గుంపు వెంట సేవిస్తుండగా, మృదువైన, కోకిలకూతలవంటి పలుకులతో,కులుకులతో, నవ్వుల తళుకులతో పూలు కోసుకునే నెపంతో మన్మథుడు ‘పెడబొబ్బలు’ పెడుతుండగా పుంజికస్థలకానవచ్చింది. 

అలకని జీబులోఁ గుసుమ మద్దినపావడ దోఁపఁ గొప్పు చెం
గలువలవల్పుఁ జన్నుఁగవ కస్తూరితావియుఁ ద్రస్తరింప నం
దెలరొద మీఱఁ బెన్నిధిగతిన్‌ వ్రతికిం బొడకట్టె వేల్పుఁ దొ
య్యలి చిఱుసానఁ బట్టిన యనంగుని మోహనబాణమో యనన్‌.
|
పల్చని చీరలోనుండి ఎఱ్ఱని అద్దకం చేసిన లోపటి పావడా కనిపిస్తుండగా, కొప్పులోని ఎఱ్ఱ కలువల పరిమళము, వక్షోజాలకు పూసుకున్న కస్తూరి పరిమళము అంతటా వ్యాపిస్తుండగా,  ఆ పరిమళానికి  పరవశించిన తుమ్మెదల రొదచెలరేగుతుండగా, చిరుసానపట్టిన మన్మథుని మోహనాస్త్రమో, ఒక పెన్నిధి అన్నట్లో ఆ అప్సర మునికళ్ళకు కనిపించింది.

అత్తెఱంగున నదిరిపా టారజంపు
వన్నెఁ బొడకట్టి తాఁ బాడు సన్నరవళి
పాట లళిఝంకృతిశ్రుతిఁ బాదుకొనఁగఁ
జూడకయ చూచు చూపుతో సుడియుటయును.

అలా హఠాత్తుగా  సొగసైన రూపంతో కనిపించి, సన్నగా తుమ్మెదల గానంతో శృతి సరిపోయేట్లు చిరు పాటలు పాడుతూచూసీ చూడనట్లు మునిని హొయలతో, లయలతో, మాయలతో నిండిన చూపులు చూసింది, మన్మథ బాణాలనుదూసింది, ముగ్దుడిని చేసింది.

తలకొని దాని తమ్ములపుఁ దావియు మోవియుఁ గౌను మేను న
గ్గలపుమెఱంగు లీను తెలిగన్నులుఁ జన్నులు భృంగమాలిక
న్గెలిచిన యారుతీరుఁ దగు నెన్నడలుం దొడలున్‌ వివేకముం
గలఁపఁగఁ గాంచి పంచశర కాండ విఖండిత ధైర్యసారుఁడై.

ఆమె సేవిస్తున్న తామ్బూలపు పరిమళానికి, ముఖపు సొగసుకు, నడుము నాజూకుదనమునకు, దేహ లావణ్యానికి,మెరుస్తున్న తెలికన్నులకు, విపులమైన గుండ్రని చన్నులకు, పూలమాలికను గెలిచే నూగారు సొగసుకు, ఆ ఊరువులశోభకు తన వివేకము చెదిరి, పంచబాణుడి(మన్మథుని) బాణాలకు తన స్థైర్యం(స్థిరత్వము) సడలి, అడలి, వడలి,

కదిలిపోయాడు ఆ ఋషి! 
మేను గరుపాఱఁ దమి న
మ్మౌని జపముఁ దపముఁ దన్ను మఱచి యనంగ
గ్లానిఁ బడి కదిసి వడఁకుచు
హీనస్వర మెసఁగఁ బ్రోవవే న న్ననుచున్‌.

శరీరము గగుర్పొడిచి, జపము, తపము చివరికి  తనను తానే మరచి, మన్మథ బాధకు వశుడు అయిపోయి, శరీరము కంపించిపోతుండగా, సన్నని స్వరంతో నన్ను కరుణించవే! అన్నాడు.

చెయ్యి పట్టినమాత్రాన శిరసు వంచి
|యవశచందానఁ బైవ్రాలు నవ్వధూటిఁ|
బర్ణశాలాంతరముఁ జేర్చి బ్రాహ్మణుండు
కెరలు కోర్కులఁ గందర్ప కేళిఁ దేలె.
|
చేతిని పట్టుకోగానే వశం తప్పినట్టు శిరసు వంచి మీద వ్రాలిపోతున్న ఆ సుందరిని పుంజికస్థలను తన స్థలానికి చేర్చి,తన పర్ణశాలలో, తనలో చెలరేగుతున్న కోరికలతో, మదనక్రీడలో తేలియాడడం మొదలెట్టాడు ఆ ముని!  

(కొనసాగింపు వచ్చేవారం)

వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి