ఉండ్రాళ్ల తదియలాగా అట్ల తదియ కూడా హిందువులకు , ముఖ్యంగా ఆంధ్రులు ఆచరించే ఒక పండుగ. అట్లతదియ లేక అట్లతద్ది పల్లెప్రాతాల తెలుగు వారి పండుగ.ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు చేసుకుంటాం. పల్లెప్రాంతాల్లో తెలుగింటి ఆడపడుచులంతా తెల్లవారుఝామున లేచి శుభ్రంగా తల స్నానంచేసి ఉపవాసంతో ఇంటిలో తూర్పున మంటపాన్నీఏర్పరచి గౌరీదేవిని ప్రతిష్టిస్తారు.ముందుగా వినాయకునిపూజించి ,ఆయనతల్లి ఐన గౌరీదేవిని స్తుంతించి, పాటలు పాడు తారు. సాయంత్రంవరకూ ఉపవాసం ఉండి,ఆకాశంలో చంద్రోదయమయ్యాక మరలా గౌరీమాతను పూజించి,’ త్రిదశ పరివృతాం సేవితాం సిద్దికామైః’ - అంటూ స్త్రీలంతా అట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రార్థిస్తారు . పదిమంది ముత్తైదువులకు బొట్టు, కాటుక ఇచ్చి, పాదాలకు పసుపురాచి, ఒక్కోరికీ 10 అట్లు, 10 పండ్లు వాయనంగా ఇస్తారు."ఇస్తినమ్మవాయనం, అంటూ చీరకొంగుతో పళ్ళెంపట్టుకుని ముత్తైదువుకు ఇస్తూ అంటారు, ముత్తైరువ " పుచ్చుకుంటినమ్మవాయనం" అంటుంది. ఇలామూడు మార్లు అన్నాక " నావాయనం పుచ్చుకునే దెవరూ" అని అంటే ఆ ముత్తైదువ " నేనే గౌరీదేవిని, కోరినకోరికలన్నీ తీరుస్తాను " అంటుండగా ఆమెకు నమస్కరించి , అక్షింతలు శిరస్సున వేయించుకుని , అట్లతద్ది నోము కధ చెప్పుకుంటారు .పది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇహ చిన్న అమ్మాయిలు, కన్నెపిల్లలంతా సూర్యోదయా నికిముందే స్నానాలు చేసి చద్దన్నం, గోంగూర పచ్చడి, నువ్వులపొడి, గడ్డ పెరుగుతో కడుపునిండాతిని తాంబూలం వేసుకుని చేతులూ, కాళ్ల మాదిరిగానే నోరును కూడా ఎర్ర గా పండించుకుంటారు. ఆ తరువాత తిన్నది జీర్ణమయ్యేదాకా ఆటలాడుతూ, తోటల్లో చెట్లకు వేసుకున్న ఊయ్యాలలు ఊగుతూ' 'అట్లతద్దోయ్ ఆరట్లోయ్- ముద్దపప్పోయ్ మూడ ట్లోయ్' అంటూ పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతారు.దీని వలన స్త్రీల నడుం గట్టిపడు తుందట.
ఇంకా కొందరు అవకాశాన్నిబట్టిముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణతాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టిన తర్వాత తామూ భోజనము చేస్తారు.ఈపండుగలో విశేషమేమంటే 10 రకాల ఫండ్లు తినడం, 10 సార్లు తాంబూలం వేసుకోడం, 10 సార్లు ఉయ్యాల ఊగడం, గోరింటాకుపెట్టు కోవడం, ముఖ్యఘట్టాలు. దీన్ని 'ఉయ్యాలపండగ' అనీ, ' గోరింటాకుపండగ' అనీ కూడా అంటారు..ఈ పండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహం తో పెళ్ళి కాని అమ్మాయిలకు మంచి సుగుణాలు కలిగిన వ్యక్తి భర్తగా వస్తాడనీ, పెళ్ళైనవారికి పిల్లలు కలుగుతారని,ముత్తైదుతనం జీవితాంతం ఉంటుందనీ, పుణ్యం వస్తుందనీ నమ్మిక. కన్నెపిల్లలంతా పొడవాటి జడలు వేసుకుని , ఆడ పడుచులకు బంధు వులకు ఇరుగు పొరుగులకు వాయినాలిస్తారు. సాయ కాలం గోపూజచేస్తారు. చెరువులోకానీ కాలువలలోకానీ నదుల్లోకానీ దీపాలను వదుల్తారు..ముందు రోజురాత్రే అరచేతులకు గోరింటాకు పెట్టుకుని, ఉద యాన్నే బాగాపండిందాని చూసుకుంటారు. ముందు రోజు నుంచేపండుగ హడావిడి మొదలవుతుంది.ఒక్క గోరింటచెట్టుకూఆకులు మిగలకుండా కోసేసుకుని రోట్లో వేసి రుబ్బుకుంటారు. అన్నిట్లోనూ పోటీలే. ఇలా గోరింటాకు పెట్టుకోడంలో ఒక ఆరోగ్య సూత్రం ఇమిడిఉంది.పూర్వం మహిళలు పనిచేసేప్పుడు ఎక్కువగా నీటిలో చేతులు, కాళ్ళు తడిసేవి. ఇలాగోరింటాకు పెట్టుకోడం వలన గోరింటలోని వ్యాధినిరోధక శక్తివలన శరీరం చల్లబడి వివిద రకాల క్రిముల వలన వేళ్ళ కు, గోళ్ళకు, అరికాళ్ళకు కలిగే సమస్యల నుండిరక్షణ లభిస్తుంది. గోళ్ళు పుచ్చవు.
ఈ వ్రతానికి సంబంధించిక కధ ఇలాచెపుకుంటారు. పార్వతీదేవి[గౌరీ]శివుని భర్తగా పొందాలని భావించి ఉండగా, నారదముని ఈవిషయం తెల్సుకుని,వచ్చి ఆమె కోరిక ఫలించను ' అట్లతద్ది వ్రతం ' చేయ మని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి ఈ అట్లతద్ది వ్రతం చేసి మహాదేవుని భర్తగాపొందుతుంది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసు కునే వ్రతంగా చెప్తారు. వివాహంకాని అమ్మాయిలి పూర్వంగ్రామాల్లో తప్పనిసరిగా మంచి భర్తకోసం ఈవ్రతాన్ని చేసేవారు. ఈవ్రతంలో చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖ శాంతులు స్థిరంగా ఉంటాయి. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతర్ధాంకూడా ఉంది. నవగ్రహాలలోనికుజునికి అట్లంటే మహాప్రీతిట! అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావన్న విశ్వాసం. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భదారణలోఎటువంటిసమస్యలు ఎదురవ్వవు. మిన ప్పిండి, బియ్యప్పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు ఇష్టమైన ధాన్యాలు.గర్భదోషాలు తొలగి పోవా లంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావమురాకుండా, సుఖప్రసవం అయ్యేందుకుకూడా ఈ అట్లదానం దోహదపడుతుందని అంటారు.ముత్తైదు వులకు అట్లను వాయనముగా ఇవ్వటం, వారిపాదాలుపట్టుకునిపసుపురాయటం, గౌరవించడం వంటి పనులవలన దానగుణం పెంచడంతోపాటుగా సమానత్వం , స్వార్ధ రాహిత్యం కూడా పెరుగుతాయి. అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి వైద్యవిజ్ఞానం నిక్షిప్తం చేయబడివుంది.అట్లతద్ది పండుగను ఉత్తరభారత దేశంలో 'కర్వా ఛౌత్' అనే పేరుతో జరుపుకుంటారు. మనభారతీయ సంస్కృతిలోని ఆచారాలన్నీ గొప్ప సంస్కారంతోకూడినవే!