భారత దేశపు అత్యున్నత సాహితీ పురస్కారం "జ్ఞానపీఠ అవార్డు” అందుకున్న మూడవ తెలుగు సాహిత్య దిగ్గజం డాక్టర్ రావూరి భరద్వాజ. ఆయన కలం నుండి జాలువారిన అద్భుత సంచలన నవల "పాకుడు రాళ్ళు" ఆయనకీ పురస్కారాన్ని వరింప చేసింది.
జ్ఞానపీఠ అవార్డు అందుకున్న తొలి తెలుగు సాహితీవేత్త డాక్టర్ విశ్వనాధ సత్యనారాయణ. ఆయన వ్రాసిన అద్భుత కావ్యం "రామాయణ కల్పవృక్షం" ఆయనకీ అవార్డును కట్ట బెట్టింది.జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న రెండవ తెలుగు జాతీయుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఆయన రచించిన అమూల్య పద్య కావ్యం "విశ్వంభర' 1988 లో ఈ పురస్కారానికి ఎంపిక చేయబడింది.మట్టిలో మాణిక్యం అన్న నానుడికి రావూరి భరద్వాజ గారు ఒక చక్కని ఉదాహరణ. ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. అది ఎన్నో ఆటు పోట్లను, ఒడు దుడుకులను తట్టుకుని నిలబడిన మహా గిరి, స్వయంకృషితో ఎదిగిన మహా సాహితీ వృక్షం.
రావూరి భరద్వాజ గారు 1927 జూలై నెల 5వ తేదీన కృష్ణా జిల్లా లోని మొగులూరు గ్రామంలో నిరుపేద కుటుంబంలో రావూరి కోటయ్య మల్లికాంబ దంపతుల తొలి సంతానంగా జన్మించారు. కుటుంబానికి పెద్ద కొడుకుగా కుటుంబ భారాన్ని మోసే దిశగా ఆయన విద్యాభ్యాసం అనేక ఇబ్బందుల మధ్య 8వ తరగతి వరకే సాగింది.15 సంవత్సరాల వయస్సు నుండే ఆయన చిన్న చితక పనులెన్నో చేసి కుటుంబానికి చేదోడు వాదోడుగా వుండడం మొదలు పెట్టారు. వ్యవసాయ కూలీ గాను, కర్మాగారాల్లో, ప్రింటింగ్ ప్రెస్సులలోను, అనాధ శరణాలయాల్లోను పనిచేసిన అనుభవం, ఆయనకు అనేక జీవిత సత్యాలను, రకరకాల మనుషులను, మనస్తత్వాలను, క్లిష్ట పరిస్థితులను అతి దగ్గరగా అవగాహన చేసుకో గలిగే అవకాశాలను కలిగించాయి. ఈ అనుభవాలే ఆయనను సాహిత్యం వైపు అడుగులు వేయడానికి గట్టి పునాదులను వేశాయి. తెలుగు జాతి గర్వించ దగ్గ రచయితగా నిలబెట్టాయి. 1946వ సంవత్సరంలో భరద్వాజ గారు నెల్లూరు నుండి వెలువడే ప్రముఖ ప్రాంతీయ పత్రిక "జమీన్ రైతు" లో సంపాదకీయ విభాగంలో పనిచేసి, ఆ పత్రిక అభివృద్దిలో కీలక పాత్ర పోషించారు. దొరికిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన చక్కటి సంపాదకుడిగా, రచయితగా ఎదిగారు.
బాల్యం నుండి ఆయనకు చలం రచనలంటే ఎంతో మక్కువ. ఆయనపై చలం రచనల ప్రభావం ఎంతో వుండేది. నెల్లూరు నుండే వెలువడే మరో ప్రముఖ వార పత్రిక "దీన బంధు" ఆయన ప్రతిభను గుర్తించి ఆయనకు సంపూర్ణ సంపాదకుని భాద్యతలను అప్పగించింది. ఈ అవకాశం ఆయన ప్రముఖ రచయితగా వెలగడానికి బాటలు వేసింది. ఇక అక్కడి నుండి ఆయన వెనుతిరిగి చూడ లేదు.
భరద్వాజ గారి వివాహం 1948 మే నెల 28వ తేదీన శ్రీమతి కాంతం గారితో జరిగింది. వీరికి ఐదుగురు సంతానం. రవీంద్రనాథ్, గోపీచంద్, బాలాజీ, కోటేశ్వరరావు మరియు పద్మావతి.
1949లొ భరద్వాజ గారు తెనాలి చేరి, ప్రసిద్ద మాస పత్రికలు జ్యోతి, రేరాణి, అభిసారిక, చిత్రసీమ, యువ లకు పనిచేసి ఆయా పత్రికల అభివృద్దికి తన వంతు కృషి చేసారు. తెనాలి నుండే వెలువడే మరో మాస పత్రిక " సమీక్ష" పురోగతికి తనదైన సేవలందించారు.1959 లో ఆయన ఆలిండియా రేడియోలో సహాయ రచయితగా చేరారు. అక్కడ ఆయన వ్యాఖ్యాతగా, ప్రాయోజిత కార్యక్రమాల నిర్మాతగా అంచెలంచెలుగా ఎదిగి చివరకు 1987లొ ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ గావించారు. 1986 ఆగస్ట్ 1వ తేదీన ఆయన ధర్మ పత్ని శ్రీమతి కాంతం ఆయనను ఒంటరి వాడిని చేసి వెళ్లి పోయింది. భార్యా వియోగం ఆయనను ఎంతో క్రుంగ దీసింది.
1950లొ ముద్రించబడిన రాగిణి అనే పుస్తకం భరద్వాజ గారి ప్రధమ రచన. అలనాటి ప్రముఖ రచయిత శ్రీ గుడిపాటి వెంకటా చలం ఈ పుస్తకానికి తన అమూల్యమైన అభిప్రాయాన్ని తొలి పలుకుగా అందించడం విశేషం. తన 2వ రచన కొత్త చిగుళ్ళు అనే కదా సంపుటిని భరద్వాజ గారు తన అభిమాన రచయిత చలం గారికి అంకితమిచ్చి, చలం గారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. భరద్వాజ గారి కలం నుండి 170 కి పైగా రచనలు వెలువడ్డాయి. అందులో కధలు, నవలలు, కధానికలు, నాటకాలు, పద్యాలు, ఆత్మ కధలు మొదలైనవెన్నో వున్నాయి.
పాకుడురాళ్ళు, జీవన సమరం, కాదంబరి వంటి రచనలు ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టాయి. చలనచిత్ర పరిశ్రమ కధా వస్తువుగా ఆయన కలం నుండి జాలువారిన పాకుడురాళ్ళు నవల విమర్శకుల ప్రశంసలతో బాటు జ్ఞానపీఠ అవార్డును కూడా తెచ్చి పెట్టింది. ఈ నవలలో భరద్వాజ గారు వెండి తెర వెలుగుల వెనుక ఉన్న చీకటి కోణాలను స్పృశించిన శైలి, వర్ణించిన విధానం ఒక గొప్ప సంచలనం, ఆలోచనాత్మకం.
భరద్వాజ గారు తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను ఆత్మ కధగా తన డైరీలో పొందు పరిచారు. ఆ అంశాలనన్నింటిని ఆయన ఆప్త మిత్రులు 5 సంపుటాలుగా పంచ మహా కావ్యాలు పేరుతో వెలుగులోనికి తీసుకు రావడం జరిగింది.
ఇక ఆయనను వరించిన పురస్కారాలు, బిరుదులూ, ప్రశంసలు, అభినందనలు, సన్మానాలు కోకొల్లలు. అందులో ఈ క్రింద తెలుప బడినవి ప్రముఖ మైనవి.
1980 లో కళాప్రపూర్ణ - ఆంధ్ర విశ్వవిద్యాలయం.
1983 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.
1985 లో సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం
1987 లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు
1987 లో తెలుగు కళాసమితి కె.వి.రావు, జ్యోతిరావు అవార్డు
2007 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు
2008 లో లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం
2011 లో కేంద్ర సాహిత్య అకాడమీ, వంగూరి ఫౌండేషన్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారాలు.
2012 లో జ్ఞానపీఠ అవార్డు (పాకుడురాళ్ళు నవలకు ఈ గౌరవం దక్కింది).
ఆయన రచనలపై పలు విశ్వవిద్యాలయాల్లో అనేక మంది విద్యార్ధులు పరిశోధనలు (Ph.D) చేస్తున్నారు. ఆయన సాహిత్య విలువలకు, విశిష్టతకు ఇది ఒక నిలువెత్తు ఉదాహరణ. 2013 ఏప్రిల్ నెల 17న, 2012 వ సంవత్సరపు 48 వ జ్ఞానపీఠాన్ని అందుకున్న భరద్వాజ గారు, 2013 అక్టోబర్ 18 న స్వర్గపీఠాన్ని అధిరోహించి అమరజీవిగా మిగిలారు. అస్తమించే ముందు ప్రభాత సూర్యుడిలా ఒక్క వెలుగు వెలిగి తెలుగు జాతికి, తన వంశానికి వన్నెను, కీర్తి ప్రతిష్టతలను, గుబాళింపు ను తెచ్చి పెట్టిన అరుదైన అసాధారణ వ్యక్తి శ్రీ రావూరి భరద్వాజ.
ఈ నెల 18 వ తేదీ ఆయన ప్రధమ వర్ధంతి. ఈ సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ, ఆయన సాహిత్య రంగానికి చేసిన సేవలను మరొక్క సారి గుర్తు చేసుకుందాం.