దీపావళి మధుర జ్ఞాపకాలు - : భమిడిపాటి ఫణిబాబు.

diwali memories

ఈ రోజుల్లో ఏదైనా పండగొచ్చేసరికి, అప్పటికీ, ఇప్పటికీ వచ్చిన మార్పులు గుర్తొచ్చేస్తూంటాయి. ఇప్పుడు వచ్చేది “దిబ్బూ..దిబ్బూ..దీపావళి..” కదా! దీపావళి ముందురోజు “నరక చతుర్దశి” రోజున రేడియోలో తెల్లవారుఝామునే ఓ “ నాదస్వరం “ కార్యక్రమం ఉండేది.అంత చలిలోనూ నిద్రనుండి లేపేసి తలంట్లు కార్యక్రమం ఉండేది.పైగా తలంట్లు పోసుకోకపోతే , బాణాసంచా పెట్టిన చేట ముట్టుకోనీయమని బెదిరింపోటీ. అందుకోసం ఎంత చలైనా, సణుక్కుంటూనో, విసుక్కుంటూనో, ఏడుస్తూనో మొత్తానికి ఆ కార్యక్రమం పూర్తిచేసేయడం.

అసలు దీపావళంటేనే, పదిహేనురోజుల ముందునుండీ ప్రిపరేషన్లు మొదలయ్యేవి. ఏదో తాటాకు టపాకాయలూ, ఎలెట్రీ టపాకాయలూ తప్పించి, మిగిలిన బాణాసంచా అంతా ఇళ్ళల్లోనే తయారీ. మతాబాలు, సిసింద్రీలూ,జువ్వలూ. వీటికి కావాల్సిన సూరేకారం, గంధకం, బీడు, బజారుకెళ్ళి తెచ్చుకుని, ఓ నాలుగురోజులు ఎండబెట్టడం.మతాబాల గొట్టాలు తయారుచేసికోడానికి, పాత న్యూసుపేపర్లు, లైపిండీ, అది పెట్టడానికి ఓ మూకుడూ. సామాన్లన్నీ ఎండబెట్టడం ఓ ఎత్తైతే, సిసింద్రీలకి పాళ్ళు ఇంకో ఎత్తు. ఎవరి పాళ్ళు వాళ్ళవే. ఇంకోరికి ఛస్తే చెప్పేవారు కాదు.

ఈ సిసింద్రీలు తయారుచేసికోడం కంటే హాయిగా ఎవరిదగ్గరో వందకింతా అని కొనుక్కోడమే హాయిగా ఉండేది. వీటిల్లో మళ్ళీ పోటీలూ. ఇంక మతాబా తయారీయే ఒక పెద్ద హడావిడి.  న్యూసుపేపరు తో చిన్న చిన్న గొట్టాలు తయారుచేసి, వాటిని ఎండబెట్టడంతో ప్రారంభం అయేది. ఓ నాలుగురోజులముందు, ఆ గొట్టాల్లో ఒకవైపు ( అంటే ఆ గొట్టం మూసేసినవైపు) ఇసుక ఓ రెండు అంగుళాలదాక నింపడం చిన్న పిల్లల వంతు. పెద్దాళ్ళు, ఓ చేటలో మతాబా బాగా పువ్వులొచ్చేటట్టుగా ( కాల్చినప్పుడు) పాళ్ళు తయారుచేసికుని, ఆ ఇసుకవేసిన గొట్టాలలో నింపడం.  కొంత మందు చిచ్చుబుడ్లకోసం విడిగా పెట్టేవారు. ఓ పాతిక చిచ్చుబుడ్లూ, ఓ వంద దాకా మతాబాలూ, ఓ అయిదువందలదాకా సిసింద్రీలూ అన్నమాట. ఇంక జువ్వలంటారా, పెద్దవారికి మాత్రమే. మళ్ళీ అదో ప్రకరణం. పాత పేక ముక్కల్ని గొట్టాలగా తయారుచేసికుని, దాంట్లో సిసింద్రీ మందు కూరి, మడతపెట్టి మూసేయడం, దాన్నిని ఓ చీపురుపుల్లకి , సుతారంగా దారంతో కట్టడం. రాత్రి అందరూ బాణసంచా కాల్చేసిన తరువాత , ఏ గ్రౌండుకో వెళ్ళి పోటీలుండేవి.

పండక్కి ఓ మూడురోజులముందు, నాన్నగారితో బజారుకెళ్ళి, కాకరపువ్వొత్తులూ, తాటాకు టపాకాయలూ, ఎర్రగా వత్తి ఉండే సీమ టపాకాయలూ, పాము మందూ, అన్నిటిలోకీ ముఖ్యమైన తుపాకీ, వాటిలో పెట్టి కాల్చుకోడానికి ఎర్రటి “కేప్పులూ” . మొత్తానికి ఓ రెండు చేటల్లో వీటన్నిటినీ ఎండలో పెట్టడం, ఎప్పుడు కాలుస్తామా అనుకుంటూ ఎదురు చూడ్డం.

ఇంక దీపావళి రోజునైతే ఇంకో కార్యక్రమం ఉండేది. తాటి పువ్వుని బొగ్గుగా కాల్చి, ఓ పాత గుడ్డలో పెట్టి, ఆ పొట్లాన్ని, మూడు తాటి మట్టల్లో పెట్టి, దానికి ఓ గట్టి తాడు కట్టి వేల్లాడతీసి ఎండబెట్టడం. బాణాసంచా కాల్చేలోపు ఈ “తిప్పుడు పొట్లం” మీద కొద్దిగా మండుతూన్న బొగ్గులు వేసి, ఆ పొట్లాన్ని, గొరగిరా తిప్పుతూంటే నిప్పు రవ్వలు రాలేవి. అదో సరదా..ఓ గంట కాలక్షేపం అయ్యేది.

మట్టి ప్రమిదలు తెచ్చి, ప్రొద్దుటే వాటిని నీళ్ళల్లో పెట్టేవారు. సాయంత్రం వాటిలో నూనె, వత్తి వేసి, అంటించి ఆ దీపాలు ఇంటి ప్రహారీ గోడ చుట్టూ పెట్టడం. సాయంత్రంకాగానే,గోగు కాడలకి, నూలు గుడ్డతో చేసిన వత్తులు నూనెలో ముంచి కట్టి, వాటిని వెలిగించి, చిన్న పిల్లలందరూ, ఇంటిబయటకెళ్ళి, “దిబ్బూ..దిబ్బూ..దీపావళీ.. మళ్ళీ వచ్చే నాగుల చవితీ..” అంటూ పాటపాడి,  ఆ గోగుకాళ్ళ వెలుగుతూన్న వత్తులు,నేలకేసి కొట్టి ఆర్పేయడం. కాళ్ళు కడుక్కుని, అమ్మ పెట్టిన స్వీట్స్ తినేసి, కొత్త బట్టలు మార్చేసికుని, ఏ నిక్కరో వేసికుని, లోపలెక్కడో ఎండబెట్టి దాచుకున్న చేట , బయటకు తెచ్చి, వాటిలో వంతులేసికుని, ఒక్కోరికీ ఇన్నేసి మతాబాలూ అంటూ కాల్చుకోవడం.

ఇంత హడావిడీ చేసి తీరా ఓ గంటలో మొత్తం అన్నీ అయిపోయేవి. మళ్ళీ ఇందులో అమ్మ, “ కార్తీక పౌర్ణమి కొద్దిగా దాచుకోండిరా..” అంటూ, మళ్ళీ రేషనింగోటీ.. ఆ చిన్నప్పటి దీపావళి మధుర జ్ఞాపకాలు ఎన్నో.. ఎన్నెన్నో..

మరి ఈ రోజుల్లో అలనాటి ప్రహారీ గోడలున్న ఇళ్ళున్నాయా దీపాలు పెట్టుకోడానికి? ప్రమిదలు అనేవి ఏదో గుమ్మం దగ్గర పెట్టుకోడానికి మాత్రమే పరిమితమైపోయాయి. ఎక్కడ చూసినా ఎలెట్రీ దీపాలే. ఇంటిముందు బాణాసంచా కాల్చుకోడమనే concept మాయం అయిపోయింది. అగ్గిపెట్టెల్లాటి అంతస్థుకీ నాలుగైదు ఫ్లాట్లూ, అందరూ కట్టకట్టుకుని సొసైటీ బేస్మెంటులోకి వెళ్ళి కాల్చుకోడం. మార్కెట్ క వెళ్తే, కావాల్సినన్ని దుకాణాలు, అక్కడ దొరికే బాణాసంచా, ఇంటికెళ్ళిన తరువాత ఎన్ని కాలుతాయో, ఎన్ని తుస్సుమంటాయో ఆ భగవంతుడికే తెలియాలి. ఇంట్లో ఓ ఇద్దరు పిల్లలున్నారంటే కనీసం ఓ వెయ్యీ, పదిహేనువందలు ఖర్చుపెట్టినా , మహా అయితే ఓ అరగంట కాల్చుకోవచ్చు, అదీ అన్నీ సరీగ్గా కాలితేనే. దీనికి సాయం, ఊళ్ళోవాళ్ళమీదే బ్రతికే పెద్దమనుష్యులు కొంతమందీ. తన పిల్లల్ని తీసికుని, ఠంచనుగా బేస్మెంటులోకి వచ్చేస్తాడు. అంకుల్ వాళ్ళ పిల్లలతో కాల్చుకోండిరా, మేం కబుర్లు చెప్పుకుంటూ ఉంటామూ..అనేసి తన పిల్లల్ని ఆ కాల్చుకుంటున్న పిల్లల  మీదకి వదిలేస్తాడు. దానితో ఏమౌతుందంటే, ఇద్దరు పిల్లలు కాల్చుకోవాల్సిన బాణాసంచా ఇంకో ఇద్దరు ఫుకట్ గెస్టులతో పంచుకోవడం,గంటసేపు కాల్చుకోవాల్సినవి అరగంటలోనే ఖతం అవడమూనూ. ఇంకో చిత్రం ఏమిటంటే, మధ్యమధ్యలో ఏదైనా సరీగ్గా కాలకపోతే, ఆ పెద్దమనిషి ఉచిత సలహాలోటీ.. నాణ్యం చూసుకుమరీ కొనాలి మాస్టారూ.. ధరకోసం చూడకూడదూ మరి.. ఈయనచేసిందేమిటో మరి, ఒక్క పైసా ఖర్చుపెట్టకుండా,ఓ నలుగైరుదురు కుటుంబాల ధర్మమా అని, తన పిల్లలకి దీపావళి బాణసంచా కొనఖ్ఖర్లేకుండా లాగించేశాడు.

ఇంకో విషయం మర్చిపోయాను—ఇదివరకటి రోజుల్లో దీపావళి వచ్చిందంటే, మన వార, మాస పత్రికల వాళ్ళందరూ “దీపావళి ప్రత్యేక సంచికలు” ప్రచురించేవారు. కొద్దిగా ఖరీదు ఎక్కువైనా, “ కునేగా మరికొళుందు” సెంటుతో ఘుమఘుమలాడుతూ ఉండేవి. ఇప్పటికీ అలనాటి ‘యువ’, ‘జ్యోతి’, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ లలో వచ్చిన కథలూ, వ్యాసాలూ ఇప్పటికీ గుర్తు.ఈ రోజుల్లో తెలుగు పత్రికలే తక్కువయ్యాయి ఇంక ప్రత్యేక సంచికలెక్కడా? అధవా వేసినా, “పోనిద్దూ తెలుగు పత్రిక కి అంతంత డబ్బులు పెట్టి కొనడమెందుకూ, చదివేమా పెట్టేమా..” అనడం.  అలా క్రమక్రమంగా దీపావళి సంబరాలు అన్నీ ఏదో యాంత్రికంగా మారిపోయాయి. స్వంతంగా తయారు చేసికుంటే ఉండే ఆనందం, ఏదో బజారుకెళ్ళి కొనుక్కుంటే వస్తుందా?  ఏదైనా సరే personal involvement ఉంటేనే కదా, అసలు సిసలు ఆనందం అనుభవించేదీ? ఈ రోజుల్లో ప్రతీదీ, డబ్బు పారేస్తే వచ్చేస్తుందనేకానీ, సంతోషం అనేది మాత్రం రమ్మంటే రాదు.అప్పుడప్పుడు అనిపిస్తూంటుంది—ఇంతంత డబ్బు పెట్టేమే, ఓ గంటకూడా రాలేదూ అని! కానీ దీపావళి ప్రతీరోజూ రమ్మంటే వస్తుందా? ఏడాదికోసారేగా...దేని సంతోషం దానిదే..

దీపావళి శుభాకాంక్షలతో...

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి